ఆస్తికులు-నాస్తికులు మధ్యలో కరోనా!!

సినిమాల ప్రభావం జనాల మీద అస్సలుండదని కొందరు వాదిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు.

మిగతా సినిమాలేమోగానీ, పాతాళ భైరవి, అమ్మోరు, అరుంధతీ, దయామయుడు, బిస్మిల్లాకీ బర్కత్ , వంటి సినిమాల ప్రభావం మాత్రం అటు నాస్తికులు, ఇటు ఆస్తికులూ.. ఇద్దరి మీదా ఉంది.

ఈ సినిమాలన్నిట్లోనూ ఉన్న కామన్ స్టోరీలైన్ ఏమంటే – దేవున్ని నమ్మే ఓ క్యారెక్టర్/క్యారెక్టర్లు ఉంటారు. వారికి సినిమా మొదట్లో విపరీతమైన కష్టాలొస్తాయి. ఓ రెండు గంటలు గడిచి, సినిమా క్లైమాక్సుకొచ్చేసరికి – దేవుడు ప్రత్యక్షమై, వీరి కష్టాలన్నీ పోగొడతాడు. హ్యాపీ ఎండింగ్ తో శుభం కార్డు పడుతుంది.

వీటితో ప్రభావితమైన ఆస్తికులు, తమ దేవుడు కూడా అలాగే అద్భుతాలు చేసి తమను కాపాడతాడని భావిస్తుంటారు. అలా వేరే ఎవరినైనా కాపాడాడనే విషయాన్ని, మరో ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మేస్తారు. ఉదాహరణకు – గత కొన్ని రోజులనుండీ కొందరు ముస్లింలు “ఐదుపూటలా నమాజు చేసే ముస్లింలకు కరోనా రాదు” అనే మెసేజ్ ని, ఫేస్ బుక్కూ, వాట్సప్పుల్లో తెగ షేర్ చేసేస్తున్నారు. నమాజుకు ముందు కాల్లూ, చేతులూ, ముఖమూ శుభ్రంగా కడుక్కుంటారు కాబట్టి, వైరస్ సోకే అవకాశం తక్కువని చెప్తే అదో పద్దతి. కానీ, ఈ మెసేజ్ అలా లేదు. ఇలాంటిదే మరో మెసేజ్ – చైనా లో ఉయ్గర్ ముస్లింలను చంపుతున్నారు కాబట్టి, అల్లా అక్కడ కరోనా వైరస్ ని పుట్టించాడనే మెసేజ్ కొన్నాల్లు బాగా సర్కులేట్ అయింది. ఇప్పుడు కరోనా అనేక ముస్లిం దేశాలకు కూడా పాకడంతో, అలాంటి మెసేజ్లు ఆగిపోయాయి. సినిమాల్లో చూపించే మిరకిల్స్ చూసి నిజజీవితంలో ఇలాంటివి జరుగుతాయనీ, జరగాలనీ ఆశించే అమాయక ఆస్తికులే ఇలాంటి వాటిని నమ్ముతుంటారు.

ఆస్తిక సినీ భక్తుల బాధ ఇలా ఉంటే, నాస్తిక భక్తుల ఆనందం మరోలా ఉంటుంది.

ఆ సినిమాల్లో చూపించినట్లు దేవుడు అక్కడికక్కడ ప్రత్యక్షమై తన భక్తుల్ని కాపాడలేదు కాబట్టి, ఇక దేవుడే లేదనేది వీరి తెహల్కా కన్‌క్లూజన్. మక్కాలో ప్రార్థనల్ని నిలిపేయడమన్నది – వీరిపాలిట ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటిది. వీరి ఆనందాల్ని, కిక్కుల్నీ దూరం చేసే ఉద్దేశ్యం నాకు లేదుగానీ, అలాంటి సినిమాల్లోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చూపించని ఈ కింది పాయింట్లు ఓ సారి చూడండి.

“నేను విశ్వాసిని అని చెప్పగానే, ఇక మీకు ఎలాంటి పరీక్షలూ ఉండవని భావిస్తున్నారా?( అట్టాంటి ఆశలేమీ పెట్టుకోబాకండి)” -ఖురాన్ 29:2
“భయం,పేదరికం,ఆకలి,ప్రాణాలు,సంపద – అన్నీ పరీక్షించబడతాయి. సహనంతో ఉన్నోల్లకు మంచి జరుగుతుంది” – 2:155
“ప్రతి ఆత్మా, మరణాన్ని చవిచూడవలసిందే” -3:185
“ప్రతి వ్యక్తికీ చావూ, చచ్చే సమయమూ అల్లాహ్ ఎరుకలోనిదే” -3:145
“ఎంత కట్టుదిట్టమైన, బధ్రమైన భవంతుల్లో నివసిస్తున్నప్పటికీ, చావునుండి ఎవ్వరూ తప్పించుకోలేరు” – 4:78.

ఇలాంటి వాక్యాలు అనేకం ఖురాన్ లో కనిపిస్తాయి.
మొత్తానికి – ప్రతి వ్యక్తికీ చావు వస్తుందనీ, ఆ చావు ఏ క్షణమైనా, ఎలా ఐనా రావొచ్చనేది – ఇస్లామిక్ కోర్ బిలీఫ్స్ లో ఒకటి. అందుకే, నన్ను ఎక్కువరోజులు బతికించమని కాకుండా, బతికినన్నాల్లూ, అల్లా చెప్పినట్లు నడుచుకుంటూ, సాధ్యమైనంత ఎక్కువ పుణ్యాన్ని సంపాదించే అవకాశం కల్పించమనే మహమ్మద్ ప్రవక్త దువా చేసేవారు. విశ్వాసులైన ముస్లింలందరికీ ఇదే దువా వర్తిస్తుంది.

కరోనా రావచ్చు, రాకపోవచ్చు.
ఢిల్లీ తరహా అల్లర్లు జరగొచ్చు,జరగకపోవచ్చు.
యుద్ధం రావొచ్చు,రాకపోవచ్చు.
వరదలు,భూకంపాలూ,సునామీలూ రావొచ్చు,రాకపోవచ్చు –
చావు మాత్రం తప్పక వస్తుంది, సృష్టికర్త వైపుకే తిరుగుప్రయాణమవ్వాల్సి ఉంటుంది.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని, కామ,క్రోధ,లోభ,మోహ, మదమాశ్చర్యాలని అదుపులో పెట్టుకుని బతకమనే ఇస్లాం చెప్తుంది.

సృష్టికర్తను ప్రసన్నం చేసుకోవడానికి జీవితకాలమంతా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుందే తప్ప, షార్ట్ కట్ లూ, మిరకిల్ లకు ఇస్లాం లో స్థానం లేదు.

One Reply to “ఆస్తికులు-నాస్తికులు మధ్యలో కరోనా!!”

Leave a Reply

Your email address will not be published.