ఇస్లాం – తెలివి – ఫత్వా!!

ప్రముఖ హదీసుల్లో ఒకటైన – అబీ దావూద్ లో, 3562వ హదీస్ ఇలా ఉంది.
(హదీస్ అంటే, ప్రవక్త చేసిన పనులు,చేసిన వ్యాఖ్యల కలెక్షన్)

యెమెన్ రాజ్యానికి రాజుగా ఎవరిని నియమించాలా అని ఆలోచిస్తున్న సమయంలో, ఆయన అనుచరుల్లో ఒకరైన – మువాద్ ఇబ్నే జబాల్ అనే ఆయన్ను పిలిచి – “ఓ మువాద్! ఏదైనా ఓ వివాదాన్ని గానీ, సమస్యను గానీ పరిష్కరించడంలో మీరు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారని” – అడిగారు.

దానికి మువాద్ ఇబ్నే జబాల్ ఇచ్చిన సమాధానం – “నేను దైవ గ్రంధమైన ఖురాన్లో చెప్పినట్లుగానే నడుచుకుంటాను”.

అప్పుడు ప్రవక్త మళ్ళీ ఇలా ప్రశ్నించారు -“ఒకవేళ, ఆ అంశానికి సంబంధించి ఖురాన్ లో ఎలాంటి సూచనలూ లేకపోతే..?
దానికి మువాద్ ఇబ్నే జబాల్ సమాధానం -” అప్పుడు మీరు ఇచ్చిన సూచనలు,చేసిన వ్యాఖ్యల ఆధారంగానే పరిష్కరిస్తాను.”

దానికి ప్రవక్త మళ్ళీ -” నేను కూడా ఆ అంశం గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా ఉంటే” -అని అడిగారు.

అప్పుడు మువాబ్ ఇబ్నే జబాల్ ఇచ్చిన సమాధానం -” నేను నా తెలివిని ఉపయోగించి, అన్ని రకాలుగా ఆలోచించి – నాకు సరైనదనిపించిన విధంగా నడుచుకుంటాను”

ఈ సమాధానానికి సంతోషించిన ప్రవక్త – మెచ్చుకోలుగా మువాబ్ ఇబ్నే జబాల్ భుజం చరిచి – ఆయన్ను యెమెన్ రాజుగా నియమించారు.

ఈ హదీసును జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి.

1. ఖురాన్, ప్రవక్త బోధనల్లో ప్రతి అంశం గురించి చెప్పబడిఉంటుందని ఏమీ లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రవక్తే నిర్ధారించారు.
2. ఖురాన్, ప్రవక్త బోధనల్లో ఓ అంశం గురించి గైడెన్స్ దొరకనప్పుడు – మనిషి తన తెలివిని ఉపయోగించాలి.

మరి – మతపెద్దలు, మత నాయకులు, ఫత్వాలు – ఇవి ఎప్పుడు పిక్చర్ లో కొస్తాయి..?

ఖురాన్లో.. ఏ సూరాలో ఏముంది.. ప్రవక్త ఏ సంధర్భంలో, ఏ అంశం గురించి ఎలాంటి కామెంట్ చేశారు – ఇవన్నీ తెలుసుకోవాలంటే – కొన్ని సంవత్సరాల పాటు వీటిని సీరియస్ గా స్టడీ చేయాలి. అలా స్టడీ చేసిన వారినే ముఫ్తీ,మౌలానా వంటి పేర్లతో పిలుస్తారు. ప్రొఫెసర్, డాక్టరేట్ లాగా అన్నట్లు.
ఖురాన్,ప్రవక్త బోధనల్లో డైరెక్ట్ గా చెప్పబడని ఓ అంశం గురించి, ఈ రెండింటి లాజిక్ ని అప్లయ్ చేసి – ఏం చేస్తే బాగుంటుందో చెప్పే అభిప్రాయం/సలహానే – “ఫత్వా” అంటారు.

1.మనుషులందరూ సమానమే.
2. దైవత్వంలో ఎవరికీ ఎలాంటి వాటాలూ లేవు(చివరికి ప్రవక్తలకు కూడా) – అనే రెండు విషయాల్ని ఖురాన్ అనేక సార్లు, ఎలాంటి అణుమానాలకూ తావు లేకుండా స్పష్టంగా చెప్పి ఉంది.

కాబట్టి, మతపెద్దలు.. వారెంత గొప్పోల్లు/సెలెబ్రిటీలుగా వెలుగొందినా.. వారు ఇచ్చే ఫత్వాలకు ముస్లింలు కట్టుబడి ఉండాల్సిందేనని రూలేం లేదు. వారు చెప్పిన విషయానికి, మన తెలివిని కూడా జోడించి, ఆలోచించి -వారు చెప్పింది సరైనదనిపిస్తేనే దానిని ఫాలో అవ్వొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. కొన్ని దేశాల్లో, ఆ మత నాయకులే జడ్జీలుగా అధికారికంగా నియమించబడి ఉంటారు. అలాంటి చోట్ల వారిచ్చే ఫత్వాలు ఆటోమేటిక్ గా రూల్స్ గా మారి, అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన దేశంలో – సుప్రీం కోర్టు జడ్జీలు ఇచ్చే తీర్పులే ఆటోమేటిక్ గా చట్టాలుగా గుర్తింపబడినట్లు.

మొత్తం మీద, ముస్లింల ‘అన్‌కండిషనల్ లవ్’, ;’అన్‌కండిషనల్ ఒబీడియన్స్’ లాంటివి – ఖురాన్,ప్రవక్త లకే పరిమితం తప్ప, మత పెద్దలకు కాదు. ఖురాన్+ప్రవక్త బోధనల్ని వివరించడం, విడమర్చి చెప్పడం వరకే మతపెద్దల పాత్ర పరిమితం, అంతకు మించి, వారు చెప్పే ఇతర విషయాల్ని, తమ తెలివితో అనలైజ్ చేసి, మంచిది,ఉపయోగకరమైంది అనిపిస్తేనే ఫాలో అవ్వాలి.

Leave a Reply

Your email address will not be published.