ఐతే ఏంటి..?

ఐతే ఏంటి..?
=========
వాడెవడో పంది కలేబరాన్ని తెచ్చి మసీదులోపల పడేశాడంట. ఐతే ఎంటి? నేనిప్పుడు ఆవేశంతో ఊగిపోవాలా? కోపంతో దిక్కులు పిక్కటించేలా నినాదాలివ్వాలా? అందరినీ పోగేసి ర్యాలీలు, ధర్నాలూ గట్రా చేయాలా?

నేను ఇలా రియాక్ట్ అవుతాననీ, అవ్వాలనీ ఆశించే కదా అతను ఆ కళేబరాన్ని తెచ్చి పడేసింది. నేను సరిగ్గా అలాగే స్పందించి, అతను ఆడే వికృత క్రీడను ముందుకు తీసుకెల్లాలా?

పందిని తినొద్దనే కదా నియమం. అది అణుబాంబులా ప్రమాదకరమైనదనో, దానిని చూడగానే ఆమడదూరం పారిపోమనో కాదు కదా.

మరేం చేద్దాం?
ముందుగా వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి.
తర్వాత, మసీదులో పైనుండి బల్లి పడి చస్తే, పావురం రెట్టలేస్తే ఎలా తీసిపడేస్తామో, అలాగే దానినీ తీసిపడేయాలి. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి, కాస్తంత అత్తరు చల్లితే సరిపోతుంది.

ఇంకొకడెవడో ఖురాన్ ప్రతుల్ని చించి పడేస్తాడంట. అది చూసి నేను బాధపడాలా? దానిని ఖురాన్ని అవమానించడంలా భావించాలా? ఐనా, మద్యపానం, వడ్డీ ఆధారిత లావాదేవీలు, పెళ్ళిల్లలో కట్నకానుకలు వంటివి తీసుకోవద్దని ఖురాన్ అత్యంత స్పష్టంగా చెప్తున్నా, ముస్లింలు వీటిని ఇంకా ఆచరిస్తున్నారంటే, ఇది కదా ఖురాన్ కి అసలుసిసలు అవమానం?

ఖురాన్ని చించితే చించనీ, కాల్చితే కాల్చనీ. దానివల్ల ఇసుమంత కూడా నష్టం లేదు. ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంధానికీ లేని ప్రత్యేకత ఖురాన్ కి ఉంది. అది – దానిని మొదటి అక్షరం నుండి, చివరి అక్షరం వరకూ కంఠతా పట్టిన వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఉంటారు. ప్రపంచంలోని అన్ని ఖురాన్ ప్రతుల్ని రాత్రికి రాత్రి కాల్చేసినా, ఓ ఇండియన్, ఓ ఆఫ్రికన్, ఓ చైనీయుడు, ఓ అమెరికన్, ఓ అరబ్.. ఖురాన్ కంటతా పట్టిన ఈ హఫీజ్ లందరూ కలిసి కూర్చుని అరగంటలో ఓ కొత్త ఖురాన్ ప్రతిని ఏకగ్రీవంగా రాసి ఇవ్వగలరు.

ఇస్లాం/ముస్లిం అనేవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలకు ముడిసరుకుగా ఉన్నాయి. వీటిని సాకుగా చూపి కొందరు, బూచిగా చూపి కొందరు తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దురదృష్టవశాత్తూ చాలా వరకూ సఫలీకృతం అవుతున్నారు కూడా. ఇస్లామిక్ తౌహీద్ని అర్థం చేసుకుని ఆచరించడం, చుట్టూ జరుగుతున్న రాజకీయాల్ని గమనిస్తూ , ప్రతి స్పందనా, ప్రతి అడుగూ ఆచితూచి వేయడమే ఇప్పుడు ముస్లింలు చేయవలసింది.
-మహమ్మద్ హనీఫ్.
6/27/2017.

Leave a Reply

Your email address will not be published.