ఓ పాపా !! ఏ నేరం చేసావని నిన్ను చంపారు?

ఖురాన్ లో చాఫ్టర్ 81 జడ్జిమెంట్ డే ( అంతిమ దినం ) గురించి చెప్తుంది. దానిలో 8 , 9 వ వాక్యాలు – ” సజీవంగా పాతి పెట్టబడ్డ పసికందు బాలికను -నీవేమి నేరం చేసావని అడగబడుతుంది” .

అనేక సమాజాల్లో లాగానే, ఇస్లాం కి పూర్వపు అరేబియా సమాజంలో కూడా , అమ్మాయి పుట్టడాన్ని అవమానంగా భావించేవారు. కొన్ని సందర్భాల్లో పుట్టిన అమ్మాయిల్ని పుట్టినట్లే ఇసుకలో సజీవంగా పాతిపెట్టేవారు. పై ఖురాన్ వాక్యం ఈ దురాచారం గురించే. ఇస్లాం రాక వల్ల ఈ దురాచారం, అరేబియా సమాజం నుండి అనతికాలంలోనే పూర్తిగా నిర్ములించబడింది. ఇప్పుడు కూడా, అక్కడ గర్భవతులు నెలవారీ స్కానింగ్ కి వెళ్ళినప్పుడు – ” ఏఁ పర్లేదు.. మీ కడుపులో ఆడబిడ్డ ఆరోగ్యాంగా పెరుగుతుంది” – అని క్యాజువల్గా చెప్పేస్తారు. ఎందుకంటే , కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే – అబార్షన్ చేయించడం అనే కాన్స్పెప్ట్ ఒకటుందని కూడా వారికి తెలీదు కాబట్టి.

కానీ, పై ఖురాన్ వాక్యంలో , నేరుగా కనిపించే అర్థమే కాకుండా, ఓ నిగూడార్థం ఉంది.

ఖురాన్ లో సృష్టికర్త కు ఆపాదించబడిన అనేక పేర్లు/గుణగణాలలో ఒకటి – అల్-అమిన్ . అంటే, సర్వ జ్ఞాని, అన్నీ తెలిసినవారు అని అర్థం. మరి అన్నీ తెలిసిన వారికి, ఆ పసి పాప ఏ నేరం చేయలేదని, ఆమెను సాక్షాత్తు తల్లిదండ్రులే సజీవంగా పాతిపెట్టారనీ తెలీదా. మరి తెలిసిన వారు , డైరెక్ట్ గా ఆ తల్లిదండ్రుల్ని శిక్షించకుండా, మళ్ళీ ఆ పాపను అడగడం ఎందుకు?

మన చుట్టూ సమాజంలో నిత్యం చాలా నేరాలు, ఘోరాలు, హత్యలూ జరుగుతున్నాయి. వీటికి పాల్పడేవారు చాలా సార్లు ఎలాంటి శిక్షలు లేకుండా తప్పించుకుంటుంటారు. ఎందుకంటే, మానవ నిర్మిత న్యాయవ్యవస్థలో , నేరస్తులకు శిక్షపడాలంటే , సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యాన్ని న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్నవారు నమ్మాలి. ఇది అన్ని వేళలా అయ్యేపని కాదు. నేరస్థుడు పోలీసులకంటే తెలివిగా ఆలోచించి సాక్ష్యాలు మిగలకుండా చేయొచ్చు. తన ధనబలం, రాజకీయ బలం, అంగబలాలను ఉపయోగించి జడ్జీల్ని ప్రభావితం చేయొచ్చు. చనిపోయిన వ్యక్తి ఎలాగూ జడ్జి ముందు నిలబడి తనకు జరిగింది చెప్పుకోలేడు. భయపెట్టో, ప్రలోభపెట్టో అతని కుటుంబ సభ్యుల్ని ఆపగలిగితే అసలు కేసనేదే లేకుండా చేయొచ్చు. ఇది నిత్యం జరిగేదే.

ఈ రకంగా చూస్తే, అప్పుడే పుట్టిన పసిపాపను చంపడం అనేది ఏ మాత్రం రిస్క్ లేని వ్యవహారం. ఆపాపకు ఇంకా పేరు కూడా పెట్టలేదు కాబట్టి, జనాభాలెక్కల్లో ఎంట్రీ కూడా ఉండదు. తనను చంపొద్దని ప్రతిఘటించడం కాదు కదా, ఆ పసిపాప కనీసం వేడుకోనుకూడా వేసుకోలేదు. గర్భం ఏమైందని కొన్నాళ్ళతర్వాత ఎవరైనా దగ్గరిబంధువులు అడిగినా, పుట్టుకతోనే పాప చనిపోయిందని చెప్తే చాలు. ఖేల్ ఖతం.

ఈ రకమైన సేఫెస్ట్ క్రైమ్ గురించే సృష్టికర్త, పై చాఫ్టర్ లో హెచ్చరించారు. అంతిమ దినంనాడు , తనకు జరిగిన అన్యాయం గురించి ఆ పసికందే స్వయంగా చెప్పుకునే అవకాశం కల్పించబడుతుంది. అది వింటూ ఆ నేరం చేసినవ్యక్తి , పాపభీతితో నిలువెల్లా కంపించిపోవడం తప్ప చెయగలిగేదేమీ ఉండదు. అందుకే, ప్రతి వ్యక్తీ, తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, తాను చేసే ప్రతిపనికి సృష్టికర్తకు జవాబు చెప్పుకోవలసి ఉంటుందనే స్పృహతో జీవించవలసి ఉంటుంది. మానవ నిర్మిత న్యాయవ్యవస్థల్ని ఏమార్చవచ్చు గాని, సృష్టికర్తను ఏమార్చడం అయ్యేపనికాదు. ఈ నమ్మకమే, తమపై జరిగే దారుణమైన అణచివేతల్ని, అరాచకాల్ని కూడా ముస్లింలు సహనంతో భరించేలా చేస్తుంది.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.