టీచర్లు – ఎగ్జామినర్లు!!

“అతను తిట్టాడు కాబట్టి – నేనూ తిట్టాను”

“ఈ రోజుల్లో మనల్ని ఒక మాటంటే – మనం నాలుగు మాటలనాలి, అప్పుడే బతకగలుగుతాం.”
“పనోళ్లతో కఠినంగా ఉంటేనే వారు మాటింటారు, కాస్తా సాఫ్ట్ గా ఉంటె నెత్తికెక్కుతారు.”
“ఎవర్ని ఎక్కడుంచాలో అక్కడుంచాలి.”

ఇలాంటి మాటలు తరచుగా వింటుంటాం. ఓ రకమైన అప్రకటిత గైడ్లైన్స్ లాగా , సమాజంలో చాలా మంది వీటిని ఫాలో అయిపోతుంటారు. అలా ఫాలో అవ్వడమే సరైనదని కూడా బలంగా నమ్ముతుంటారు. అందరూ ఇలాగే ఉన్నారు అనే కారణంతో, ఇది సరైనదేనని నమ్ముతుంటారు. ఆ రకంగా చాలా మందికి , చుట్టూ ఉన్న సమాజమే టీచర్.

మరి కొన్ని సందర్భాల్లో, సమాజంలో కొంత హై పొజిషన్లో ఉన్నవారు టీచర్ల పాత్రను నిర్వహిస్తుంటారు. సుప్రీం కోర్టు జడ్జీలు, యం.యల్.ఏ లు, యం.పీ లు… వీరు చట్ట సభల్లో కూర్చుని జనాలకు ఏది మంచో, ఏది చెడో డిసైడ్ చేస్తుంటారు. ఉదాహరణకు – పెళ్లి కాకుండా ఇద్దరు కలిసి ఉండొచ్చా లేదా, స్వలింగ సంపర్కాలు కరెక్టా, కాదా, ఇలాంటివి వీరు డిసైడ్ చేస్తుంటారు. మెజారిటీ సభ్యుల ఒపీనియన్స్ ని బట్టి ఏది మంచో ఏది చెడో డిసైడై పోతుంటుంది. ఈ రోజు చెడు అనేది, రేపు కొత్త యం.పీ లు వచ్చాక , మంచిదై పోవచ్చు. మొన్నటివరకు గంజాయి తీసుకోవడం అనేది, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓ చెడు పనిగా ఉండేది. కానీ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, గత నెలలో కెనడా పార్లమెంటు ,దానిని ‘చెడు పనుల ‘ క్యాటగిరి నుండి తీసేసారు.(Canada becomes second country to legalize Cannabis) అంటే ఇప్పుడు అక్కడ చట్ట ప్రకారమే గంజాయి కొనొచ్చు , అమ్మొచ్చు, చక్కగా ఆస్వాదించొచ్చు.గంజాయి మొక్కలు ఇంటి పెరట్లో కూడా నాటుకోవచ్చు.  బహుశా, మరో పదేళ్ల తర్వాత అన్ని దేశాల్లో ఇది అమలులోకొచ్చినా ఏ మాత్రం ఆశ్చర్యపడాల్సింది లేదు.

ఇక ఎగ్జామినర్ అంటే – ఓ వ్యక్తి చేసింది సరైనదో కాదో డిసైడ్ చేసే వారు. క్రైం సంబంధ విషయాల్లో కోర్టుల్లోని జడ్జీలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా ఈ పని చేస్తుంటారు. ఇవి కాక, అనేక సివిల్( పౌర ) అంశాల్లో, సమాజమూ, చుట్టూ ఉన్న వ్యక్తులే వివిధ అంశాలపై ధారాళంగా జడ్జిమెంట్లు ఇస్తుంటారు. ఫలానా వ్యక్తి ఇలాంటోడు, అలాంటోడు, అతను అలా అనాల్సింది కాదు, ఇతను ఇలా అనాల్సింది కాదు. ఇలాంటి స్టేట్మెంట్లు క్యాజువల్ గా ఇస్తుంటారు. ఇలాంటి జడ్జిమెంట్లతో, అవి ఇచ్ఛేటోళ్లకు గాని, తీసుకునే టోళ్లకు గాని, ఎలాంటి ఫరక్ పడదు. కానీ, ఇతరులు ‘తప్పు’ అని డిక్లేరు చేయడం వల్ల, అంతర్లీనంగా, ‘నేనైతే అలా చేయను’ అని ప్రకటించుకున్నట్లుగా ఫీల్ అవుతారు కాబట్టి చాలా మంది ఇలాంటి జడ్జిమెంట్లు ఇచ్ఛే పనుల్లో బిజీగా ఉంటారు. అట్లే, ఇతరులతో ‘మంచి’, ‘గొప్ప’ అనిపించుకోవాలనే తాపత్రయం వల్ల, ఇలాంటి జడ్జిమెంట్లు కొందరికి ఆనందాన్ని, బాధను కలిగిస్తుంటాయి.

మన భారత దేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నట్లే, 19 ,20 శతాబ్దాల్లో, లిబియాను ఇటలీ దళాలు ఆక్రమించుకున్నారు. ఇటలీ వారికి వ్యతిరేకంగా, లిబియన్లు అనేక దశాబ్దాల పాటు సాయుధ తిరుగుబాటు చేశారు. ఆ సాయుధ తిరుగుబాటును ముందుండి నడిపించింది – ఒమర్ ముక్తార్. ఇతని వీరోచిత పోరాటానికి ముగ్దులైన ఇటాలియన్లు – ఇతన్ని లయన్ ఆఫ్ డెజర్ట్ గా పిలుస్తుంటారు. ఒకానొక సందర్భంలో, ఒమర్ ముక్తార్ దళం కొందరు ఇటాలియన్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నారు. ఇటాలియన్లు, తమకు దొరికిన లిబియా సైనికులందర్నీ కిరాతకంగా చంపేస్తారని, ఇప్పుడు తాము కూడా అదే చేసి ప్రతీకారం తీర్చుకుందామని ఒమర్ ముక్తార్ అనుచరులు బలవంత పెట్టారు. అప్పుడు ఒమర్ చెప్పిన మాట – ” దే ఆర్ నాట్ అవర్ టీచర్స్. వారు మన గురువులు కాదు. మన టీచర్ మహమ్మద్ ప్రవక్త. యుద్ధంలో పట్టుబడిన బందీలని, స్త్రీలని, పిల్లల్ని , మత గురువుల్ని చంపొద్దని చెప్పిన ప్రవక్త మాటలే నాకు శిరోధార్యం.”

ఇస్లాం పై నమ్మకముంచి జీవిస్తున్న ముస్లిం లకు, మహమ్మద్ ప్రవక్తే అసలైన టీచర్. అంతిమ దినం నాడు సృష్టికర్త ఇచ్ఛేదే అసలైన జడ్జిమెంట్. ఇవి తప్ప, చుట్టూ ఉన్న సమాజమో, సమాజంలోని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల్లో కాదు. మొన్న ఓ గల్లీ నాయకుడు ముస్లింలను ఎదో అన్నాడని, అతన్ని కొన్ని తిట్టు మాటలతో తిడుతూ చాలా మంది ముస్లింలు పోస్ట్లు రాశారు. తిట్టు పదాలన్నీ మహిళల్ని కించపరిచేవే ఉంటాయి. ప్రవక్త విధానం ఇది కాదు. ఒకరినొకరు నిందించుకోవడం, కించపరచుకోవడం, నేనిది, నువ్విదీ.. ఇవన్నీ వృధా ప్రయాసలు తప్ప, ఇసుమంతైనా ఉపయోగపడేవి కావు. ప్రవక్తను టీచర్గా డిక్లెర్ చేసుకున్నాక కూడా, ఇలాంటివి వాడటమంటే, అవి ఆ టీచర్ని అవమానించడమే.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.