ప్రవక్త గురించి ఆయేషా గారు చెప్పిన విషయం#1

యాండ్ర్యు టటె(Andrew Tate) – అమెరికన్ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు. కిక్ బాక్సింగ్ లో మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇతని నెట్ వర్త్: 100 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో దాదాపు 750కోట్లు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఇస్లాం గురించి,ముస్లిం దేశాల గురించి ఇతను చెప్పిన విషయాలు మీడియాలో వైరల్ అయ్యాయి. Link –

దాన్లో అతను చెప్పిన అనేక పాయింట్స్ లో ఒకటి: “నేను ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగాను. కానీ, ఖతార్,సౌదీ అరేబియా,యూఏఈ,కువైట్ లాంటి ముస్లిం దేశాల్లో ఉన్నంత భద్రత వేరే ఎక్కడా ఉండదు. మీరు రోడ్డుమీద, నోట్ల కట్టలతో నిండిన బ్యాగ్ ని పక్కన పెట్టుకుని రాత్రంతా పడిఉన్నా, తెల్లారేకల్లా, ఆ బ్యాగ్ నుండీ ఒక్క నోట్ కూడా ఎవరూ దొంగిలించరు. ప్రపంచంలో వేరే ఎక్కడా ఇలా ఉండదు” – ఇదీ అతను చెప్పిన మాట.

ఇది నిజమో,కాదో అరబ్ దేశాల్లో తిరిగొచ్చిన వారిని అడిగి క్రాస్-చెక్ చేసుకోవచ్చు.

సరే, ఇప్పుడు అసలు విషయం – అక్కడ ఈ భద్రతకు కారణం ఏమిటి? దీనికి జవాబు: పక్షపాతంలేని,కఠినమైన శిక్షలు.

కఠినమైన శిక్షలంటే, అక్కడ ఎక్కడ చూసినా రోడ్డుమీద ఒక చెయ్యి,కాలు లేని వారు రోడ్డుమీద అడుగడుగునా కనిపిస్తారని కాదు. దొంగతనం చేస్తే అలా కాలూ,చెయ్యీ తీసేసే అవకాశం ఉందని అందరికీ తెలుసుకాబట్టి, దొంగతనం అనే ఆలోచన కూడా ఎవరికీ మనసులోకి రాదు.

ఇలా దొంగతనానికి చేతులు నరికేయడం అనేది అనాగరిక చర్య అనీ, దొంగల్ని పట్టుకుని వారికి కౌన్సిలింగ్ గట్రా ఇవ్వాలి తప్ప, వారిని శిక్షించకూడదని, అలా కౌన్సిలింగ్ ల ద్వారా ఉన్నత సమాజం నిర్మించొచ్చని కొందరు ఆదర్శవాదులు చెప్తుంటారు. తీరిక సమయాల్లో, పాప్ కార్న్ తింటూ అలాంటి చర్చల్ని ఎంజాయ్ చేయొచ్చు. అదంతా వేరే డిస్కషన్.

సరే, మహమ్మద్ ప్రవక్త బోధనల్లో,మరియు ఆయన చేతల్లో, ఇలాంటి భద్రత గల సమాజానికి బీజాలు పడిన విషయం హదీస్ లను ఏ కాస్త స్టడీ చేసినా ఇట్టే తెలిసిపోతుంది.

ఉదాహరణకు- ఆయేషా గారు న్యారేట్ చేసిన ఈ దృష్టాంతాన్ని చూడండి. దీనిని, ముస్లిం(హదీస్ కలెక్ట్ చేసిన ఆరుగురు ప్రముఖ చరిత్రకారుల్లో ఈయన ఒకరు), మరియు ఇబ్న్-మాజహ్ అనే ఇద్దరు చరిత్రకారులూ విడి,విడిగా కలెక్ట్ చేశారు. కాబట్టి, దీనిని విశ్వసనీయమైనదిగానే భావించవచ్చు.

ప్రవక్త కాలం నాటి మక్కాలో, “బనూ మఖ్జూం” తెగ ఒకానొక ప్రముఖ తెగల్లో ఒకటి. మక్కా నగరం ముస్లింల వశమై, అక్కడ ఇస్లామిక్ రాజ్య స్థాపన జరిగిన తర్వాత, అంటే 630-632 మధ్య, ఈ తెగకు చెందిన ఫాతిమా బింట్ అల్-అస్వాద్(అల్-అస్వాద్ కూతురు ఫాతిమా) అనే మహిళ, మక్కా యాత్రికుల నుండీ ఒకానొక విలువైన వస్తువును దొంగిలిస్తుండగా పక్కా ఆధారాలతో పట్టుబడింది. దానికి కొన్ని రోజుల ముందే, సమాజంలో దోపిడీలు,దొంగతనాలు చేసేవారికి కఠిన శిక్షల గురించిన ఖురాన్ వాక్యాలు అవతరించి ఉండటంతో, ఈమె కు ఎలాంటి శిక్ష విధించబడుతుందోననీ, దానికి మఖ్జూం తెగవారు ఎలా రియాక్ట్ అవుతారోననే ఉత్కంఠ,ఆందోళన ప్రవక్త సన్నిహితుల్లో నెలకొంది. ఆమె పవర్ఫుల్ తెగకు చెందిన వ్యక్తి కాబట్టి, ఈ సారికి వదిలేస్తే, ఎలాంటి గొడవా ఉండనేది వారి భావన. కానీ ఈ విషయం, ప్రవక్తకు ఎవరు చెప్పాలి..? అందరూ కలిసి చర్చించుకుని, ప్రవక్త గారాబంలో పెరిగిన ఆయన మనువడు, మరియు ప్రవక్త దత్తపుత్రుడు జైద్ యొక్క కొడుకు-ఉసామా అయితే మేలని భావించి, ఆయన్ని ప్రవక్త దగ్గరికి పంపిస్తారు.

ఉసామా ఈ విషయం చెప్పగానే, “అల్లాహ్ ఇచ్చిన ఆదేశాల్ని బేఖాతరు చేయమని నన్ను అడుగుతున్నారా అని” ప్రవక్త కోపగించుకున్నారు. తరువాతి నమాజులో, అందరినీ సమావేశపరిచి ఈ రకంగా ప్రసంగించారు – “ఓ ప్రజలారా, మీ ముందు తరాల వారు ఎందుకు నాశనమయ్యారో ఒక్కసారి పునరాలోచించుకోండి. వారు, తమ సమాజంలోని సంపన్నులు,ఉన్నత వర్గాల ప్రజలు తప్పులు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు లేకుండా వదిలేసేవారు, అదే తప్పు తక్కువ స్థాయి గల వ్యక్తులు చేస్తే మాత్రం వారిని తీవ్రంగా దండించేవారు. అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, నా కూతురు ఫాతిమా దొంగతనం చేసినా కూడా, ఆమెకు కూడా ఖురాన్ ప్రకారమే శిక్ష విధించబడుతుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ లేవు.” – అని ప్రవక్త తీర్పు నిచ్చారు.

ఈ దృష్టాంతం – ఆయేషా గారు చెప్పగా, లైత్ బిన్ సాద్ గారు విన్నారని, ఆయన ద్వారా మహమ్మద్ బిన్ రూమ్హ్ గారు తెలుసుకున్నారనీ, ఇబ్న్-ఎ-మాజాహ్ గారు గ్రంధస్థం చేశారు.
Muslim hadith number: 1688a
Book Reference : Book 29, Hadith 13

Ibn Majah Hadith number: 2547
Book Reference : Book 20, Hadith 15,

Leave a Reply

Your email address will not be published.