ముస్లిం గా ఉండటం అంటే ఇదే..(అంత వీజీ కాదు)

ముహమ్మద్ రిజ్వాన్ – విజయవంతమైన పాకిస్తాన్ క్రికెట్ ఓపెనర్ గా అందరికీ పరిచయమే.
చాలా మందికి తెలియని విషయం- అతను కేవలం నామమాత్రపు ముస్లిం కాకుండా, ఇస్లామిక్ జీవన విధానాన్ని చాలా నిష్ఠగా ఆచరించే వ్యక్తి.ఈ విషయానికి సంబంధించిన ఓ వీడియో, నెట్లో గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అయ్యింది.

ఓ భారత యూటూబర్ మరియు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన ఓ మహిళ, తనతో సెల్ఫీ దిగాలని రిజ్వాన్ ని పదే,పదే కోరగా- రిజ్వాన్ బెరుకు,బెరుకుగా చాలా దూరంగా నిలబడి ఆమెతో సెల్ఫీ దిగాడు. అతను పాకిస్తాన్ కి చెందిన మహిళా జర్నలిస్టులు,మహిళా ఫ్యాన్స్ లతో కూడా ఇలాగే చాలా దూరం పాటిస్తాడనీ, కరచాలనాలూ,హగ్గింగ్ లాంటివి అస్సలు చేయడనీ, తన మతాచారానికి ఇవి విరుద్ధం కాబట్టి వీటిని అవైడ్ చేస్తుంటాడనీ – ఆ యూటూబర్ వీడియోలో చెప్పింది.

ఎన్ని కోట్ల కొద్దీ డబ్బులిచ్చినా, చివరికి ఆటనుండీ బహిష్కరించినా- ఆల్కహాల్ కంపెనీల్ని ప్రమోట్ చేసే వాటి లోగోల్ని ధరించమనీ, ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్టులతో కరచాలనాలు చేయమనీ తెగేసి చెప్పిన ముస్లిం క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు, అథ్లెట్లు చాలా మంది ఉన్నారు. యూటూబ్లో దీనికి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను. –

https://www.youtube.com/watch?v=7MG9a6i4nU0

ఇప్పుడు అసలు విషయం –
అల్కహాల్ లోగోల్ని ధరించిన ప్లేయర్లు, లేడీ జర్నలిస్టుల్ని,లేడీ ఫ్యాన్స్ ని షేక్ హ్యాండ్లు, హగ్గింగ్ లు చేసిన ప్లేయర్లందరూ చెడ్డోల్లనో, వారు తప్పు చేశారనో చెప్పడం నా ఉద్దేశ్యం ఏ మాత్రం కాదు. అవన్నీ ప్రస్తుత కాలంలో చాలా సహజమైన విషయాలైపోయాయి. నిజానికి, అలా చేయక పోవడమే మహిళల్ని అవమానించినట్లుగా, వారిని దూరంపెట్టేసినట్లుగా ఇంటర్ప్రెట్ చేసే అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి, మెజారిటీ ముస్లిం లు కూడా చాలా వరకూ ముస్లిమేతర పురుషులనే ఫాలో అవుతున్నారు. అలా గుంపులో ఒకడిగా ఉండటమే ఈజీ కదా.

కానీ, ఇస్లాం కొన్ని విషయాల్ని కరాఖండీగా చెప్పేస్తుంది. దీన్లో ఇంటర్ప్రెటేషన్లకూ, మినహాయింపులకూ ఆస్కారం లేదు. ఉదాహరణకు, పూర్తి సమ్రక్షణా బాధ్యతల్ని భరిస్తానని నలుగురి ముందు నిఖా చేసుకున్న భార్యవైపు తప్ప, వేరే ఏ పరస్త్రీ వైపుకూడా కన్నెత్తి చూడటానికి పురుషులకు అనుమతి లేదు.
కానీ, ప్రస్తుత సమాజ స్టాండర్డ్స్ ప్రకారం, పరస్త్రీని శారీరకంగా బలవంత పెడితేనే తప్పు, బలవంతం చేయనంతవరకూ ఎలాగైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. “స్త్రీల ఒంపుసొంపుల్ని అందంగా చూపించడం” ఆధారంగానే లక్షల కోట్ల రూపాయల విలువచేసే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలు, బ్యూటీ ఇండస్ట్రీలు, మార్కెటింగ్ ఇండస్ట్రీలూ నడుస్తున్నాయి.

ఇస్లాం ప్రకారం ఇవన్నీ తప్పుడు పనులే.
కానీ, ఇస్లామిక్ స్టాండర్డ్స్ ని కాకుండా, మిగతా సమాజపు స్టాండర్డ్స్ నే చాలా మంది ముస్లిం పురుషులు ఫాలో అవుతుండటంతో, ఇస్లాం స్టాండర్డ్స్ ఏమిటనే విషయం చాలా మంది ముస్లిమేతరులకు తెలియని పరిస్థితి ఉంది.
ఇతర చాలా విషయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదాహరణకు, ఇస్లాం ప్రకారం – వివాహ సమయంలో స్త్రీగానీ, ఆమె తల్లిదండ్రులు గానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయి కోరినంత డబ్బు/బహుమతులు ఇచ్చి, ఆమెతో “కుబూల్ హై” అనిపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ముస్లిం పురుషుడిపైనే ఉంది. కానీ, ప్రస్తుత సమాజ స్టాండర్డ్స్ ప్రకారం, ముస్లిం పురుషులు కూడా ముస్లిమేతరుల్లాగే అమ్మాయి తల్లిదండ్రుల నుండీ కట్నకానుకలు, పట్టెమంచానికనీ, బైక్, కార్ల కనీ, డబ్బులు వసూలు చేస్తున్నారు. “బలవంతం చేస్తే తప్పుకానీ, వారికై వారు ఇస్తే తప్పేముందని చాలా మంది సమర్థించుకుంటుంటారుగనీ, నిజానికి ఇది ఖురాన్,హదీస్లకు పూర్తి వ్యతిరేకంగా చేయడమే.


మొత్తానికి, సమాజం నిర్దేశించిన స్టాండర్డ్స్ ని ఫాలో అవడం.. సమాజంలో మెజారిటీ వ్యక్తులు చేసే పనుల్ని గుడ్డిగా చేసేయడం చాలా ఈజీ..
కానీ, ఇస్లాం, ప్రవక్తబోధనల్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, అవి సమాజ స్టాండర్డ్స్ కంటే చాలా ఎత్తులోఉన్నా, వాటిని ఆచరించడం లో కొన్ని అసౌకర్యాలూ నష్టాలూ ఉన్నాసరే, “సృష్టికర్తను ప్రసన్నం చేసుకోవడమే అంతిమ లక్ష్యం” -అనే భావనతో వాటిని ఫాలోకావడమే ముస్లింలు చేయాల్సింది.
ఈ పని చేసి చూపిస్తున్న రిజ్వాన్, ఖబీబ్(మార్షల్ ఆర్ట్స్),మొహమ్మద్ సలాహ్(ఫుట్బాల్) లాంటి క్రీడాకారులందరికీ సలామ్.

మహమ్మద్ హనీఫ్
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.