ముస్లిం నాయకత్వం#1

ముస్లిం నాయకత్వం#1
=================
“మన మతం/కులం/ప్రాంతం చాలా ప్రమాదంలో ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనల్ని తొక్కేస్తారు. మన మతం/కులం/వర్గం అంతరించిపోవడం ఖాయం. మనం దీనిని ఎదుర్కోవాలి. నేను మీ అందరి తరుపున పోరాడతాను. మిమ్మల్ని కాపాడతాను. మీకోసం ఆత్మబలిదానమైనా చేసుకుంటాను. ”

ఈ టైపు ఎమోషనల్,పవర్ ప్యాక్డ్ పంచు డైలాగులు పదే,పదే చెబితే, ఏ వ్యక్తి అయినా ఆ కులానికి/మతానికి/వర్గానికి నాయకుడిగా ఎదిగే అవకాశం, ఎదిగి గెలిచే అవకాశం చాలా వరకూ ఉన్నట్టే. ఇది ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది కూడా.

కానీ ఇస్లాం/ముస్లిం ల విషయంలో మాత్రం ఈ ఫార్ములా వర్కవుట్ అవ్వదు.

“మన మతం ప్రమాదంలో ఉంది, నేను మీ అందరి తరపునా పోరాడతాను, మిమ్మల్ని కాపాడతాను”
వంటి డైలాగులు ఎవరైనా ముస్లింలకు చెబితే, వారు ఎమోషనల్ కావడం అటుంచి, పుసుక్కున నవ్వుతారు.
ఆ స్పీచ్ మధ్యలో ఉన్నప్పుడు, ఓ పెద్దాయన వచ్చి, -” ఇగో బిడ్డా, నమాజు టైం అయింది. నమాజు ఐపోయాక, నీ కామెడీ కంటిన్యూ చేద్దువుగాని” -అని కూడా అనేయగలరు.
ఇక అందరూ అక్కడికక్కడే నమాజుకు వరుసగా లైన్లో నిలబడతారు. ఇంతసేపూ కష్టపడి, ఆవేశంగా స్పీచు దంచినందుకు ఈ భావినాయకున్ని, స్పెషల్గా రెడ్ కార్పెట్ మీద నమాజు చదువుకోనిస్తారా అంటే అదీ ఉండదు. సచ్చినట్లు అందరితో పాటూ సమానంగా భుజం,భుజం కలిపి నమాజుకు నిలబడవలసిందే.

ఎందుకంటే – దట్ ఈజ్ ఇస్లాం.

ఇది సృష్టికర్త మతమని ముస్లింలందరూ మనసావాచా నమ్ముతారు. కాబట్టి, నేను మతాన్ని ఉద్దరిస్తానని ఏ ఒక్కరు చెప్పినా, ముస్లింలు దానిని పట్టించుకోరు. సృష్టికర్త మతాన్ని ఎవరో ఉద్దరించాల్సిన అవసరం లేదు కదా.
అట్లే, ఇక్కడ ‘సర్వమానవ సమానత్వం’ అనే కాన్సెప్టు, థియరీలోనే కాదు, ప్రాక్టికల్ గా కూడా అడుగడూక్కీ కనిపిస్తుంటుంది. ఆ సమానత్వాన్ని కాదని, ముస్లింలందరి చేతా ‘మా నాయకుడు ‘ అనిపించుకోవాలంటే అదంత సులువైన అంశం కాదు. దీనికి “దీన్-దునియా” రెండింటిలోనూ అతను మిగతా ముస్లింలకంటే మెరుగైన పరిస్థితిలో ఉన్నాడనే నమ్మకాన్ని ముస్లింలకు కల్పించాల్సి ఉంటుంది. అంటే, ఖురాన్, హదీస్ లపై అవగాహనతో పాటు, వాటి ఆధారంగానే జీవిస్తుండాలి(రోజూ నటించడం అయ్యేపని కాదు), అట్లే, మంచి చదువు, సమకాలీన సామాజిక, రాజకీయాంశాలపై పట్టుందని, ముస్లింలకు నమ్మకం కలగాలి.

ఇవి రెండూ(దీన్-దునియా ) ఉన్నోల్లనే ముస్లింలు తమ నాయకునిగా ఒప్పుకుంటారు.

కానీ, ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.

ఈ రెండూ ఉన్నోల్లను ముస్లిమేతర సమాజం – “మంచి ముస్లిం” గా గుర్తించదు. ముస్లిమేతర సమాజం దృష్టిలో, మంచి ముస్లిం అంటే – గడ్డం,టోపీ ఉండకూడదు. మతానికి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకూడదు. వీలైతే, అబ్దుల్ కలాం లా అప్పుడప్పుడూ సంస్కృత శ్లోకాలు వల్లెవేస్తూ ఉండాలి.

ఇదీ సంగతి. మరి ఈ రెండు ఎక్స్పెక్టేషన్ల మధ్య పొందుకుదిరేదెలా..?

To Be continued..

మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

2 Replies to “ముస్లిం నాయకత్వం#1”

Leave a Reply

Your email address will not be published.