ముస్లిం మహిళ డ్రెస్సు – ఎందుకు వివాదాస్పదం..?

చాలా మంది ముస్లిం మహిళలు రెలీజియసే గానీ, అందరి వేషధారణా ఒకే రకంగా ఉండదు. కొందరు ఫేస్ కూడా కవర్ చేసుకుంటారు. కొందరు ఫేస్ తప్ప, పై నుండీ కిందికి ఉండే బురఖా+హెడ్ స్క్రాఫ్ ధరిస్తారు, కొందరు ఓన్లీ తలపై స్క్రాఫ్ లాంటిది చుట్టుకుని మామూలు పంజాబీ డ్రస్సుల్నే వదులుగా ఉండేలా ధరిస్తారు. కొందరు జీన్స్+టాప్స్+హెడ్ స్క్రాప్స్ కూడా ధరిస్తారు. కొందరు ఫ్యాషన్ దుస్తులు ధరిస్తారు.

ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్..?

ఇస్లాం లో ఉన్న పంచ సూత్రాలు ఏమిటి – అనే ప్రశ్న చిన్నప్పుడు అందరూ క్లాస్ పుస్తకాల్లో చదివే ఉంటారు.

దీనికి సమాధానం –
1. కలిమా పై నమ్మకం. ( సృష్టికర్త, ఆయన పంపిన ప్రవక్తలు, మరణానంతర జీవితం – వీటన్నిటీ నమ్మడాన్నే కలిమా అంటారు).
2. ఐదు పూటలా నమాజ్.
3. రంజాన్ నెలలో ఉపవాసం.
4. జకాత్ – ఏడాది సంపాదన-ఖర్చులు పోగా, మిగులు లో కనీసం 2.5% దాన ధర్మాలకు ఇచ్చేయడం.
5. అవకాశం ఉన్నవారు, జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కా యాత్ర చేయడం.

ప్రతి ముస్లిమూ, స్త్రీలైనా, పురుషులైనా, ఫాలో అవ్వాల్సిన కనీస సూత్రాలు ఇవి.

కానీ, బట్ –

“ఈ రోజుల్లో ఇంకా మరణానంతర జీవితం” ఏందిరా బై అవన్నీ నేను నమ్మను – అని చెప్పే ముస్లింలూ-
రంజాన్ కూ, బక్రీద్ కూ, ఇంకా అప్పుడప్పుడూ, శుక్రవారాలకూ తప్ప మిగతా సమయాల్లో నమాజుకు రాని ముస్లింలూ – మనకు చాలా తరచుగా తారసపడుతుంటారు.

అలాంటి ముస్లింలను, పై పంచ సూత్రాలు ఫాలో అయ్యే ఇతర ముస్లింలు ఏం చేస్తారు?
నువ్వు ముస్లింవి కాదని వెలేస్తారా? బలవంతంగా ఎత్తుకెళ్ళి మసీదులో పడేస్తారా? నువ్వు మా ఇంటికి రావద్దు పో అంటారా?

అలా ఏమీ ఉండదు. అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే – నమ్మకం అనేది మనసులో నుండీ రావాలి. ఆఫీస్ నుండి వస్తూ,వస్తూ దారిలో ఓ మసీదు నుండీ అజా వినగానే, అక్కడ బైక్ ఆపి, మసీదులోకెల్లి నమాజ్ చదువుకొని వచ్చానంటే – అది నాకూ-సృష్టికర్తకూ ఉన్న అండర్స్టాండింగ్ తప్ప, దీన్లో మూడో వ్యక్తికి ఎలాంటి ప్రమేయమూ లేదూ,ఉండదు. అట్లే, ఆఫీస్ లో క్లైంట్ తో అర్జేంట్ మీటింగ్ ఉందంటే- ఆ పూటకు చేయవలసిన నమాజ్ ని ఓ అరగంట వాయిదా వేసుకుని మీటింగ్ తర్వాత చేసుకుంటా. దీనికి నేను ఎవరి దగ్గరా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే – అది నాకూ-సృష్టికర్తకూ మాత్రమే ఉన్న ఈక్వేషన్.

అతి ముఖ్యమైన పంచ సూత్రాల విషయంలోనే – ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. మరి “స్త్రీల బట్టల” సంగతి ఏంటి. స్త్రీ బట్టల విషయం – ఈ పంచ సూత్రాల్లో ఎందుకు లేదు..? ఎందుకు లేదంటే – అదంత ఇంపార్టెంట్ విషయం కాదు కాబట్టి. – సింపుల్.

ముస్లిలకు పెళ్ళి,చావు,వ్యాపారం,తిండి – ఇలా చాలా విషయాల గురించి ఖురాన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని సలహా రూపకంలో ఉంటాయి. కొన్ని ‘అస్సలు దాని జోలికి పోవద్దు’ అని ఉంటాయి. కొన్ని – ‘జస్ట్ అలోవ్డ్’.. అన్నట్లు ఉంటాయి. ఉదాహరణకు – పెళ్ళి విషయంలో – “అందరు భార్యలతో న్యాయంగా,సమానంగా వ్యవహరించ గలనంటే – నలుగురి వరకూ చేసుకో , కానీ, ఒక్క భార్యనే కలిగి ఉండటం నీకు మంచిది” -అని ఉంటుంది. అట్లే, “ఎట్టి పరిస్థితుల్లోనూ, వడ్డీ సొమ్ము తినకు” అని కరాఖండీ గా ఉంటుంది. ఆల్కహాల్ విషయంలో కూడా ఇంతే.

వస్త్రధారణ విషయంలో స్త్రీలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరాఖండీ గా, ఇంత పొడవు ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేమీ లేవు. ‘హిజాబ్’, ‘ఖమర్’ వంటి అరేబియన్ సంస్కృతితో సంబంధం ఉన్న పదాలు ఈ సూరాలో ఉన్నాయి. సంస్కృతి ఎప్పటికీ కాలాన్నీ, ప్రాంతాన్నీ బట్టి మారుతుంటుంది కాబట్టి, ఈ పదాల అర్థం విషయంలో కూడా ఖురాన్ పండితుల మధ్య బేధాభిప్రాయాలున్నాయి. బహుశా, ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవడం వల్లో, లేక, మహిళలకు సాధ్యమైనంత చాయిస్ ఉండాలనో- సృష్టికర్త 2.5% జకాత్ చెల్లించాలని చెప్పినట్లు ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పలేదేమో.

మొత్తానికి – చాలా మంది మహిళలు రెలిజియస్ ఐనప్పటికీ- ఒకే రకమైన వస్త్రధారణ ఎందుకు లేదంటే – Its as per their CHOICE, and COMFORT. వస్త్రధారణ భక్తికి బెంచ్ మార్క్ కాదు. భక్తి అనేది సృష్టికర్తకూ – ఆ పర్సన్ కూ( స్త్రీ ఐనా/పురుషుడైనా) సంబంధించిన బైలేటరల్ రిలేషన్. దీనిలో మూడో పర్సన్ జోక్యానికి ఆస్కారం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని కొందరు పురుషాహంకార ముస్లింలు, సోషల్ మీడియాలో – హిజాబ్ ధరించని ముస్లిం స్త్రీలపై, సానియా మీర్జా గౌనుపై, సైఫ్ అలీ ఖాన్ కూతురి బికినీపై, చీర కట్టుకున్న బెంగాల్ యంపీపై, అడ్డమైన కామెంట్లూ చేస్తూ – ఇస్లాం ని బోనులో నిలబెడుతుంటారు. ఇతర మహిళలకి ఇస్లాం ని బోధించడం తమ జన్మహక్కులా భావించి, ఆ మూర్ఖత్వంలో -” పరస్తీని తేరిపార చూడకుండా నీ చూపుల్ని కిందకు దించుకో’ (ఖురాన్ 24:30) అనే ఖురాన్ ఆదేశాన్ని గాలికొదిలేస్తుంటారు.

సినిమాల్లో,టీవీల్లో, చివరికి అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ లో కూడా , అందమైన స్త్రీ శరీర ఒంపుల్ని, చూసీ, చూసీ అలవాటై ఉన్న కళ్ళకూ, ‘పురుషులతో ఆకర్షింపబడాలని ప్రతీ స్త్రీ కోరుకుంటుందని’ బ్రెయిన్ వాష్ చేయబడ్డ జనాలకూ – ఒక్కసారిగా నిండు బట్టలతో ఉన్న స్త్రీ కనపడగానే – పాపం ఇస్లాం పేరుతో ఈమెను తొక్కేస్తున్నారనే ఫీలింగ్ తన్నుకొస్తుంటుంది. స్త్రీలకు కూడా ‘ఫ్రీ విల్’ అనేది ఒకటుంటుందనే విషయం కూడా గుర్తించనంత స్త్రీ జనోద్ధారకులు వీళ్ళు.

ఇలాంటి వారందరి వల్లా – ముస్లిం మహిళ డ్రస్సు – ఓ వివాదాస్పదాంశం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published.