షేక్ అహ్మద్ దీదాద్ – ద లెజెండ్!!

నెల్సన్ మండేలా – 1994 మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అదే నెల చివర్లో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. అక్కడ మండేలాను కలిసిన సౌదీ మంత్రులు,అధికారులూ అందరూ ఓ ప్రశ్న మాత్రం కశ్చితంగా అడుగుతున్నారు. అది – “మీదేశంలో మా అహ్మద్ దీదాద్ ఎలా ఉన్నారు, మీరు ఆయన్ని కలిశారా” అని. తమ దేశంలో పెట్టుబడులు పెట్టమని అడగటానికి ఈ సంపన్న అరబ్ దేశానికి వస్తే, ఇక్కడి అరబ్బులందరూ ఓ సౌత్ ఆఫ్రికన్ వ్యక్తి పేరును కలవరిస్తుండటం నెల్సన్ మండేలాకు వింతగా అనిపించింది. వెంటనే అక్కడి నుండీ సౌత్ ఆఫ్రికాలోని అహ్మద్ దీదాద్ ఇంటికి ఫోన్ చేసి, “మిస్టర్ దీదాద్, ఇక్కడ ఎవర్ని కదిపినా, మీపేరునే కలవరిస్తున్నారు. మీరెంత గొప్పవారో ఇక్కడకొచ్చాకే తెలిసింది. నేను మన దేశానికి రాగానే అర్జంటుగా మనం ఓ సారి కలుద్దాం” అని చెప్పారు.

*******************
షేక్ అహ్మద్ దీదాద్ 1918 లో,సూరత్ లో(గుజరాత్ ) జన్మించారు. 9 సంవత్సరాల వయసులో, తండ్రితో కలిసి సౌత్ ఆఫ్రికాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి టైలర్. వెళ్ళిన కొత్తలో పని బాగానే దొరికింది.దాంతో అహ్మద్ దీదాద్ ని అక్కడి స్కూల్లో జాయిన్ చేశారు. చదువుల్లో చాలా చురుగ్గా ఉన్నప్పటికీ, హైస్కూల్లో ఉన్నప్పుడు, తండ్రికి పని దొరక్కపోవడం వల్ల, అహ్మద్ దీదాద్ చదువు మానేసి ఓ స్టోర్ లో పనికి చేరాల్సి వచ్చింది.

ఆ స్టోర్ డర్బన్ సిటీకి 30KM ల దూరంలో, ‘ఆడమ్‌స్ మిషన్ కాలేజ్’ కి ఎదురుగా ఉంది. అది మామూలు కాలేజ్ కాదు. అక్కడ క్రైస్తవేతరుల్ని క్రిష్టియానిటీకి వైపుకు ఎలా ఆకర్షించాలనే విషయం గురించి యువ పాస్టర్లకు శిక్షణ ఇస్తుంటారు. ముస్లింలకు,హిందువులకు తమ సొంత మతంపై అయిష్టత, అపనమ్మకం కలిగించేలా ఎలా మాట్లాడాలి, ఏ ప్రశ్నల్ని వారికి సంధించాలి – ఇలాంటి అంశాల గురించి ట్రైనింగ్ ఇస్తుంటారు. అవన్నీ నేర్చుకున్న యువ పాస్టర్లు, ఎదురుగా ఉన్న స్టోర్ లో, తన పని తాను చేసుకుంటున్న అహ్మద్ దీదాద్ దగ్గరికొచ్చి, ” మీ మతం ఖడ్గం తో వ్యాప్తి చెందిందని నీకు తెలుసా? మీ ప్రవక్త అంతమంది మహిళని ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు?” అంటూ ప్రశ్నించేవారు. ఆ యువ పాస్టర్లు, తాము నేర్చుకున్న విషయాల్ని తనపై ప్రయోగించి, తనను ‘గినియా పిగ్’ లాగా వాడుకున్నారని అహ్మద్ దీదాద్ చెప్పుకొచ్చారు.

మదరసాల గడప తొక్కని మెజారిటీ ముస్లింలలాగే, అహ్మద్ దీదాద్ కు కూడా, ఇస్లాం గురించి పొడి,పోడి నాలెడ్జే తప్ప లోతుగా ఏమీ తెలియదు. పాస్టర్లు చెప్తున్న విషయాలు విని, అహ్మద్ దీదాద్ కు మనసులో అనేక ప్రశ్నలు ముసురుకున్నాయి. తన మతం గురించి ఒకింత అవమానంగా కూడా ఫీలవ్వడం మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో, ఓ రోజు తన ఓనర్, తమ స్టోర్ బేస్మెంట్ లో ఉన్న గదిలోని పాత పుస్తకాల్ని తొలగించి దానిని శుభ్రం చేయమని ఆదేశించాడు. ఆ పాత పుస్తకాల్ని శుభ్రం చేస్తున్న దీదాద్ చూపు, ఓ పుస్తకం పై పడింది. ఆ పుస్తకం పేరు – ఇజ్హారుల్ హక్.( సత్యం ఆవిష్కరించబడింది)

రహ్మతుల్లా కైరానవీ అనే ఇస్లామిక్ స్కాలర్ ఈ పుస్తకం రాశారు. బ్రిటీష్ ఇండియాలో, ఇస్లాం ని బద్నాం చేస్తూ క్రైస్తవ మిషనరీలు చేస్తున్న ప్రచారానికి సమాధానంగా ఆయన ఈ పుస్తకం అరబిక్ లో రాశారు. అనంతరం ఇంగ్లీష్,ఉర్దూ,టర్కిష్,బెంగాలీ లలోకి అనువాదమైంది. దీనిలో ఇస్లాం ని వివరించడంతో పాటూ, క్రైస్తవుల వాదనల్లోని వివిధలోపాల్ని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది.

ఏకబిగిన ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివిన దీదాద్ కి అప్పటి వరకూ తన మనసులో ముసురుకున్న అణుమానాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. అనంతరం కొన్ని రోజుల పాటు, బైబిల్, ఖురాన్ లని అక్షరం కూడా వదలకుండా క్షుణ్ణంగా చదివేశాడు. క్రైస్తవ పాస్టర్లకు ఎదురుప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. చివరికి ఈయన్ని కన్‌ఫ్యూజ్ చేయడం అటుంచి, ఈయనతో మాట్లాడిన పాస్టర్లందరూ కన్‌ఫ్యూజ్ అవ్వడం మొదలైంది. తన స్నేహితులతో కలిసి ‘ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్'(IPCI) అనే సంస్థను స్థాపించాడు. తాను శోధించి తెలుసుకున్న విషయాల గురించి పాంప్లేట్లు, బుక్లెట్లు ప్రచురించడం, ఓపెన్ మీటింగ్లు పెట్టి క్రైస్తవుల్ని ఆహ్వానించి ఎవరు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారో అడగమని ఛాలెంజ్ చేసేవాడు.

సింపుల్,పవర్ఫుల్ ఇంగ్లీష్, ఖురాన్,బైబిల్ వాక్యాల్ని అక్కడికక్కడే చాప్టర్ నంబర్,పేజ్ నంబర్ లతో సహా కోట్ చేస్తూ వివరించడం, ఎక్కడా లాజిక్ మిస్సవకుండా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా ఉదాహరణలతో వివరించడం – వీటన్నిటివల్లా ఆఫ్రికా మొత్తంలో అహ్మద్ దీదాద్ పేరు మారుమోగింది.

చిన్నా,చితకా పాస్టర్లతో చర్చల వల్ల లాభం లేదని, Floyd Clark, Anis Shorrosh, Stanley Sjoberg, Erik Bock, Robert Douglas వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్రిష్టియన్ ఎవాంజెలిస్టులను డిబేట్లకు ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అప్పుడే కొత్తగా టీవీ, వీసీఆర్ వీడియో క్యాసెట్లు పాపులర్ అవుతుండటంతో, అహ్మద్ దీదాత్ ఇచ్చిన అనేక ఉపన్యాసాల,డిబేట్ల వీడియో క్యాసెట్లు ఇస్లామిక్ దేశాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటిలో చాలావరకూ యూటూబ్ లో ఇప్పటికీ ఉన్నాయి.

అహ్మద్ దీదాద్ చేసిన డిబేట్లన్నిట్లోకీ అత్యంత కీలకమైంది – జిమ్మీ స్వాగర్ట్ తో చేసిన డిబేట్. జిమ్మీ స్వాగర్ట్ అమెరికన్ ఎవాంజెలిస్ట్ లందర్లోకెల్లా అగ్రగన్యుడు. ఈయనకు సొంత టీవీ నెట్వర్క్ ఉంది. ఎనభై,తొంబై దశకాల్లో, ఇంట్లో టీవీలో ఈయన ప్రోగ్రాం ప్లే అవని అమెరికన్ కుటుంబం లేదనడం అతిశయోక్తి కాదు. 78 చానెల్ల ద్వారా, సుమారు 100 దేశాల్లో ఈయన బైబిల్ ప్రసంగాలు ప్రసారం అయ్యేవి. (అనంతరం రెండు సార్లు వ్యభిచారిణులతో లాడ్జిల్లో పట్టుబడటం వల్ల, ఈయన ప్రాభవం కొంత తగ్గింది. )

అలాంటి జిమ్మీ స్వాగర్ట్ తన కెరీర్ అత్యంత టాప్ లో ఉన్న పరిస్థితుల్లో, జిమ్మీ స్వాగర్ట్ సొంత ఊరు లూసియానాలో, యూనివర్సిటీ ఆఫ్ లూసియానా ప్రాంగణంలో, ఈజ్ బైబిల్ గాడ్స్ వర్డ్( Is Bible God’s Word?) – అనే టాపిక్ పైన షేక్ అహ్మద్ దీదాద్ కీ, జిమ్మీ స్వాగర్ట్ కి డిబేట్ జరిగింది. ఈ మూడు గంటల డిబేట్ ఇంకా యూటూబ్ లో ఉంది. అది చూసి, ఎవరు ఏం,ఎలా మాట్లాడరనేది, ఎవరికి వారు ఓ అంచనాకు రావొచ్చు. ఈ డిబేట్ తర్వాత అహ్మద్ దీదాత్ పేరు అరబ్ దేశాల్లో మారుమోగిపోయింది. సౌదీ ప్రభుత్వం ఏకంగా ఆయనకు ‘కింగ్ ఫైజల్’ అవార్డు ప్రకటించింది.

*************
1987లో, బొంబాయి లో అహ్మద్ దీదాద్ ఓ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని మంత్రముగ్ధుడై విన్న ఓ యువ యంబీబియస్ డాక్టర్, నేరుగా తన తల్లిదండ్రుల వద్దకెళ్ళి,- “మీరు నన్ను శరీరాలకు వైద్యం చేసే డాక్టర్ ని చేశారు. కానీ, నాకు అహ్మద్ దీదాద్ లా, మనసులకు వైద్యం చేసే డాక్టర్ అవ్వాలనుంది, దయచేసి నాకు అనుమతినివ్వమని” వేడుకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాకు వెళ్ళి, అహ్మద్ దీదాద్ దగ్గర ఖురాన్, బైబిల్ ల శిక్షణ తీసుకున్నాడు. ఆ యువకుడే – అనంతరం లక్షలాదిమందికి ఇస్లాం బోధించి ముస్లింలుగా మారడంలో కీలకపాత్ర పోషించిన జకీర్ నాయక్.

*************
అప్రతిహతంగా కొనసాగిన అహ్మద్ దీదాత్ దావా ప్రయత్నాలకు, 1997లో బ్రేక్ పడింది. ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్నప్పుడు, గుండెకు వచ్చిన స్ట్రోక్ కారణంగా అతని మెడనుండీ క్రిందిభాగం అచేతనమైపోయింది. సౌదీ రాజు తన స్పెషల్ మెడికల్ జెట్ ఫ్లైట్ ని పంపి, దీదాత్ ను కింగ్ ఫైజల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. మొదట్లో పది రోజుల కంటే ఎక్కువ బతికే అవకాశంలేదని డాక్టర్లు తేల్చారు. కానీ, అహ్మద్ దీదాద్ మరో 8ఏళ్ళు బతికి 2005లో పరమపదించారు. ఈ 8ఏళ్ళ కాలం కేవలం మంచానికే పరిమితమైనా, తాను అప్పటికే రాసిన వందలాది పుస్తకాలు, వీడియో క్యాసెట్లు తన తరుపున మాట్లాడి లక్షలాది మందికి స్వాంతన చేకూర్చాయి. మాట పడిపోయినా, కను రెప్పల్ని బ్లింక్ చేసే ఓ ప్రత్యేకపద్దతి ద్వారా కమ్యూనికేట్ చేసేవారు. తను మధ్యలో వదిలేసిన పనిని తన శిష్యుడు జకీర్ నాయక్ పీస్ టీవీ,ఇంటర్నెట్ ద్వారా మరింత ముందుకు తీసుకువెల్తున్న విషయాన్ని కళ్ళారా చూసి ఆనందించారు. తనను పరామర్శించడానికి వచ్చిన జకీర్ నాయక్ తో – “బేటా, నేను 40ఏళ్ళలో సాధించిన దానిని నువ్వు కేవలం నాలుగేళ్ళలో సాధించావ్.” అని మెచ్చుకున్నారు. దానికి ప్రతిగా జకీర్ నాయక్ – “అంకుల్, మీ యొక్క నలభై ఏళ్ళ కృషివల్లే నేను నాలుగేళ్ళ లో ఈ మాత్రం సాధించగలిగాను, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేకుంటే, ఏ బిల్డింగ్ కూడా నిలవదు కదా. మీరే నా లాంటి ఎంతో మందికి సుస్థిరమైన ఫౌండేషన్ వేశారు” అని తన కృతఙతను వ్యక్తం చేశాడు.

అరబిక్ మాట్లాడలేని, ఏనాడూ మదరసాలో చదవని, కనీసం గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయని, ఇండియా/సౌథ్ ఆఫ్రికా లాంటి పేద దేశానికి చెందిన ఓ సాధారణ యువకుడు, కేవలం తనకు ఇస్లాం పై గల ప్రేమ,నేర్చుకోవాలనే కుతూహలం, సొంత తెలివితేటల కారణంగా ఓ మొత్తం ముస్లిం తరాన్నే ప్రభావితం చేశాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. షేక్ అహ్మద్ దీదాద్ ముస్లింలకు ఇచ్చిన ముఖ్య సందేశం – “ISLAM will win with or without you, but without ISLAM you will get lost and loose”

శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.