సెక్యులరిజం-ముస్లిం వోట్-ఓవైసీ- Part-1

“సెక్యులరిజం-ముస్లిం వోట్-ఓవైసీ” – అనే అంశం మీద ఓ వ్యాసం రాయాలని కొన్ని రోజులనుండి అనుకుంటున్నా గానీ, టైం దొరక్క అది అవ్వట్లేదు. వీలు చూసుకుని రాస్తా. ఆలోపు, ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి.

ముంబై అల్లర్ల గురించి జస్టిస్ శ్రీక్రిష్ణ గారు, మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టు ఏ చెత్త బుట్టలో ఉంది? మహారాష్ట్ర ను సుమారు 15 ఏళ్ళ పాటు ఏలిన సెక్యులర్ చాంపియన్ అనబడే కాంగ్రెస్ పార్టీ – ఈ రిపోర్టును ఎందుకు బయటికి తీయలేదు. అమాయక ముస్లింల చావుకు బాధ్యులుగా జస్టిస్ శ్రీక్రిష్ణ గారు తేల్చిన అనేకమంది పోలీస్ ఉన్నతాధికారులపై విచారణలు లేకపోగా, వారికి ప్రమోషన్లు కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. ఎందుకు?

బీహార్ లోని భాగల్పూర్ లో, ముస్లిం ల ఊచకోతలకు పాల్పడిన వారిని ఎంతమందిని లాలూ ప్రసాద్ యాదవ్ విచారించి శిక్షించాడు?

బాబ్రీ మసీదు కూల్చివేతలో, అసలు ఆ వివాదం పెద్దది కావడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత?

నితీష్ కుమార్ ఇప్పుడు సెక్యులరా కాదా?

2014 ఎలక్షన్లలో, CBN, మోడీతో చేతులు కలిపారని, AP ముస్లింలు చాలా వరకూ జగన్ కే వోటు వేశారు. CBN మైనారిటీ శాఖ కూడా ముస్లింలకు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. రేపు 2019 ఎన్నికల్లో జగన్-BJPతో పొత్తు పెట్టుకుంటే, ముస్లింలు ఎవరికి ఓటేస్తారు? నిన్నటి సెక్యులర్ అయిన జగన్ కా, నేటి సెక్యులర్ అయిన CBN కా?

రాష్ట్రంలో రెడ్లపార్టీ ఏది? చౌదరీల పార్టీ ఏది? కాపుల పార్టీ ఏది? UPలో బహుజనులపార్టీ ఏది? యాదవుల పార్టీ ఏది?
పక్కనున్న కర్ణాటకలో ఏది ఎవరి పార్టీ? హిందువులని ఉద్దరిస్తామని చెప్పుకునే పార్టి ఏది?
సెక్యులరిజాన్ని ఎవరు మోయాలి?

=========
ముస్లింలపట్ల ఏమిటీ సవతి తల్లి ప్రేమ, ఎందుకీ వివక్ష అని పార్లమెంట్లో, ప్రభుత్వాన్ని నిలదీసిన అడిగిన ఒకే ఒక్క నాయకుడు ఎవరు ?
“అవును నేను ముస్లిం నే, ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తూ, ఖురాన్ ని గుండెల్లో నింపుకుని, భారత రాజ్యాంగానికి కట్టుబడి జీవించే ముస్లిం నే. అలాగే జీవిస్తాను, అలాగే చస్తాను” – అని ఏ టీవీ స్టూడియోలో అయినా, ఎవరి ముందైనా ధైర్యంగా చెప్పగలిగిన ఆ ఒకే ఒక్క నాయకుడు ఎవరు..?
MIM హెడ్క్వార్టర్ అయిన దారుస్సలాం కి, వివిధ పనులపై వచ్చి, ఎలాంటి వివక్షలకూ గురికాకుండా, తమ ముస్లిం MLAల ద్వారా పనులు చేయించుకుని వెల్లే పాతబస్తీ హిందూ ఓటర్ల గురించి ఎంతమందికి తెలుసు?
=========
అన్నట్లు అక్బరుద్దీన్ ఓవైసీ(చిన్న ఓవైసీ) స్పీచుల కేసు ఎక్కడి దాకా వచ్చింది?ఆ స్పీచులు ఇచ్చినందుకు ఆయన రెండు నెలలు జైల్లో గడిపి బెయిల్ పై బయటికి వచ్చారు. ఇంతకూ ఆ కేసు విచారణ ఎందాకా వచ్చింది? ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? ఎందుకు అది ముందుకు కదలట్లేదు? MIM పార్టీ ఎక్కడా అధికారంలో లేదు, మరి ఆ కేసు పురోగతిని అడ్డుకుంటున్నదెవరు?

ఆలోచించండి..
ఫుట్ బాల్ మ్యాచ్ లో మీకు ఎవరిలా ఉండటం ఇష్టం? ఫుట్ బాల్ లాగానా? ఆటగాడిలాగానా?

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.