హయ సోఫియా – ఎర్డోగాన్ రివర్స్ కమాలిజం!!!

ప్రస్తుతం మ్యూజియం గా ఉన్న హాయ సోఫియా నిర్మాణాన్ని మసీదుగా మార్చడం సరైందా,కాదా?1935 లో, అప్పటివరకూ నమాజులు చదువుతున్న మసీదును, ముస్తఫా కమాల్ అటాటుర్క్ మ్యూజియం గా మార్చడం సరైందా,కాదా?1453లో, కాన్స్టాంటినోపుల్ ని జయించిన టుర్కులు, అప్పటిదాకా ఉన్న చర్చిని మసీదుగా మార్చడం సరైందా? కాదా? 1204 లో, నాలుగవ క్రూసేడ్ సంధర్భంగా, రోమన్ కేథలిక్ క్రిష్టియన్లు, అప్పటిదాకా ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చ్ గా ఉన్న ఈ నిర్మాణంపై దాడి చేసి, దానిని రోమన్ కేధలిక్ చర్చ్ గా మార్చడం సరైందా,కాదా?వీటన్నిటికీ అవుననిగానీ,కాదని గానీ ఏదో ఓ సమాధానం ఇవ్వొచ్చు.

దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకునే లాజిక్కులు కూడా ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే, స్పెయిన్, గ్రీస్,ఇజ్రాయిల్ ల్లోని వివిధ మసీదుల ఉదాహరణలు తవ్వితీసి, ‘అన్ని మతాలూ అంతే’ అనే కంక్లూజన్ కు తీసుకుని రావొచ్చు..కానీ, ప్రాక్టికల్ గా చూస్తే – ఇప్పటివరకూ అది మ్యూజియం గా ఉంది కాబట్టి, ఆ చుట్టుపక్కల నివస్తిస్తున్న ముస్లిం లెవ్వరూ నమాజ్ చదవకుండా ఉండరు. ఇప్పుడు అది మసీదుగా మారింది కాబట్టి, కొత్తగా నమాజ్ చదవడం మొదలుపెట్టేవారూ ఉండరు. ఆ రకంగా, ముస్లింలకు దాని వల్ల స్పెషల్ గా వచ్చే ప్రయోజనమేమీలేదు.అది ఇప్పుడు ఎలాగూ మ్యూజియం లా ఉంది కాబట్టి, దానిని మసీదుగా మార్చడం వల్ల క్రైస్తవులకు వచ్చే నష్టం కూడా ఏమీలేదు. మ్యూజియం గా ఉన్నప్పుడు, దాన్లోకి వెళ్ళాలంటే టికెట్ కొని వెళ్ళాలి. ఆ రకంగా టర్కీకి ఈ దీని వల్ల చాలా ఆదాయం వచ్చేది.కానీ, మసీదులకు టిక్కెట్లు ఉండవు, నమాజ్ చదివే కొద్ది నిమిషాలు తప్ప, మిగతా సమయాల్లో ఎవరైనా లోపలికి వెల్లొచ్చు. ఆ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే, ఇంటర్నేషనల్ టూరిస్టులకు, అది మ్యూజియం గా ఉన్నప్పుడు దానిని చూడాలనేంత క్యూరియాసిటీ, మసీదుగా ఉన్నప్పుడు ఉండకపోవచ్చు. ఓవరాల్ గా చూస్తే, మ్యూజియం ని మసీద్ గా మార్చడం వల్ల, కలిగే ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చాలా తక్కువ. కానీ, సింబాలికల్ గా చూస్తే, ముస్తఫా కమాల్ అటాటుర్క్ చేసిన అనేక పనుల్ని రివర్స్ చేసే చర్యల్లో ఇదీ ఒకటి అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ముస్తఫా కమాల్, మంచోడా,చెడ్డోడా అనేది మరో ఆసక్తికర అంశం. మంచోడనేవాల్లున్నారు, చేడ్డోడనేవాల్లూ ఉన్నారు. ముస్లిం పేరు పెట్టుకున్న సీక్రెట్ యూదుడనేవాల్లూ ఉన్నారు. మొదటి ప్రపంచయుద్దంలో రష్యాకు అత్యంత కీలకమైన గెలిపోలీ అనే నౌకామార్గాన్ని, ఆరు నెలలపాటు విజయవంతంగా డిఫెండ్ చేసి, బ్రిటన్,ఫ్రాన్స్ సేనలను మట్టికరిపించిన యుద్దవీరుడనే ఇమేజ్ తో, టర్కీ అద్యక్షుడిగా ఎన్నికైన ముస్తఫా కమాల్ అటాటుర్క్, టర్కీ నుండీ ఇస్లాం ఆనవాల్లను సమూలంగా చెరిపేయడానికి, చేయాల్సిందంతా చేశాడు. ఖలీఫాను దేశ బహిష్కారం చేశాడు, మదరసాలను మూసేయించాడు, ముస్లిం పురుషులు గడ్డం,టోపీ ధరించడం, మహిళలు బురఖా/హెడ్స్క్రాఫ్ ధరించడాన్ని నిషేధించాడు. ఇలాంటి పనులన్నిటికీ ‘కమాలిజం’ అనే ముద్దుపేరు పెట్టుకుని, యూరప్ సమాజం చప్పట్లు కొట్టింది. ముస్తఫా కమాల్ ని మాడ్రన్, ప్రోగ్రెసివ్ ముస్లిం గా కీర్తించింది. సహజంగా, సెక్యులర్ దేశాల్లో, రాజ్యాంగ పరిరక్షణ కోర్టుల చేతిలో ఉంటుంది. కానీ, ముస్తఫా కమాల్ మాత్రం, వెరైటీగా దానిని సైన్యం చేతిలో పెట్టాడు. ఫలితంగా, ముస్తఫా కమాల్ అనంతర పాలకులు, ఏ మాత్రం ప్రో-ఇస్లామిక్ పనులు చేసినా, అక్కడి సైన్యం జోక్యం చేసుకుని తిరుగుబాటుచేయడమో, ప్రభుత్వాల్ని కూల్చడమో చేస్తూ వస్తుంది. ఇలా ఇప్పటికి నాలుగు సార్లు జరిగింది. ఈ రకమైన అపరిమిత సైన్యం అధికారాలకు చెక్ పెడ్తూనే, ముస్తఫా కమాల్ చేసిన పనుల్ని రివర్స్ చేస్తూ వస్తున్న క్రెడిట్, ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కి దక్కుతుంది. 2018 లో, టర్కీ లో కెల్లా అతి పెద్ద మసీదును ఎర్డోగాన్ ప్రారంభించాడు. మహిళల బట్టలు, పురుషుల టోపీ,గెడ్డాలకు సంబంధించిన ఆంక్షలన్నీ తొలగించబడ్డాయి. మరీ ముఖ్యంగా, రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న జెనోసైడ్ కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలంగా వినిపించిన గొంతు ఎర్డోగన్ ది మాత్రమే. పాకిస్తాన్ – మలేషియా- ఇండోనేషియా వంటీ నాన్-అరబ్ ముస్లిం దేశాలతో కలిసి, సౌదీ ఆధ్వర్యం లోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్ కి పోటీగా, మరో ముస్లిం దేశాల సమాఖ్యను ఏర్పాటు చేసే ఎర్డోగాన్ ప్రయత్నాల్ని, సౌదీ,యూఏయీ లాంటి అరబ్ దేశాలు ఒకింత అసౌకర్యంతో గమనిస్తున్నాయి. దీనివల్ల, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలగురించి,అరబ్ దేశాలు అయిష్టంగానైనా అప్పుడప్పుడూ స్టేట్మెంట్లివ్వాల్సిన పరిస్థితిని ఎర్డోగాన్ కల్పిస్తున్నాడు. ఇదంతా చూసి, ఎర్డోగాన్ కేవలం మతరాజకీయాలు మాత్రమే చేస్తున్నాడని చెప్పడానికి లేదు. గత 15-20 ఏళ్ళుగా, టర్కీ చాలా రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. ప్రజారోగ్యం, విద్య, టెక్నాలజీ, రీసెర్చ్ వంటి అంశాల్లో ఎర్డోగాన్ అనేక విప్లవాత్మక మార్పుల్ని ప్రవేశపెట్టాడు. ఇటీవల కరోనా ని ఎదుర్కోవడం లో, ఈ విషయాలన్నీ చక్కగా నిరూపించబడ్డాయి. టర్కీ యొక్క రక్షణ రంగం, టర్కీలో కరోనా కేసులు మొదలైన రెండువారాల్లోనే దేశీయంగా అత్యాధునిక వెంటిలేటర్లను తయారీకి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు టర్కీ, ప్రపంచంలో సుమారు 30 దేశాలకు వెంటిలేటర్లను ఎగుమతి చేస్తుంది. కేవలం నలభై రోజుల్లో, రెండు అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణాలను పూర్తిచేసి, తక్కువ మరణాలతో కరోనాని జయించిన దేశాల సరసన చేరింది. పూర్తి దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఎలక్ట్రిక్ కార్లు, అత్యాధునిక ద్రోన్ యుద్ధ పరికరాలూ – ఇటీవల టెక్నాలజీ రంగంలో టర్కీ సాధించిన పురోగతికి నిదర్శనం. కమాలిజానికి వ్యతిరేకంగా వెల్తున్నందుకు, ఎర్డోగాన్ ని పదవీచ్యుతున్ని చేయడానికి టర్కీ మిలిటరీలోని ఓ గ్రూప్ 2015లో చేసిన తిరుగుబాటుని, మిలిట్రీలోని ఇతర గ్రూపులు, మరియు టర్కీ ప్రజలూ సమ్యుక్తంగా ప్రతిఘటించడంతో, ఆ తిరుగుబాటు విఫలమైంది. సుమారు 300 మంది మరణించారు, మరో 2000మంది గాయపడ్డారు. ఆ రకంగా టర్కీ రాజకీయాల్లో ఎర్డోగాన్ స్థానం మరింత సుస్థిరమైందని చెప్పొచ్చు. ఆధునికత-సాంప్రదాయకతలతో జోడు గుర్రాల సవారీ చేస్తున్న ఎర్డోగాన్ ఆధ్వర్యంలో టర్కీ భవితవ్యం ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.