ఇంతకీ అల్లా ఏం చేస్తున్నట్లు!!!

ఇంతకీ అల్లా ఏం చేస్తున్నట్లు!!!
===================

“ఇన్ని జరుగుతుంటే – అల్లా ఏం చేస్తున్నట్లు!!”
“ముస్లింలు అన్ని కష్టాలు పడుతుంటే – అల్లా ఎందుకు కాపాడట్లేదు!!”
“యూదులు అంతగా బలపడి పాలస్తీనియుల్ని చంపేస్తుంటే అల్లా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు!!.”
“ముస్లిం లను కాపాడలేనప్పుడు – ఇక అల్లా ఉండి ఏం లాభం!!”

ఇవీ రొటీన్ గా చాలా మంది అడిగే ప్రశ్నలు. ఇలా అడిగేవారిలో ముస్లింల సంఖ్య కూడా తక్కువేం కాదు.

మిగతా మతాల సంగతేమోగానీ, ఈ రకమైన తార్కిక ఆలోచనను/ ప్రశ్నించడాన్నీ ఇస్లాం మొదటినుండీ ఎంకరేజ్ చేస్తుంది. తమ మతం గురించి ఓ బహిరంగ మీటింగ్ పెట్టి వివరించి, ప్రేక్షకుల్లో ఎవరు ఏ ప్రశ్న అయినా సరే అడగండి అంటూ వారికి ఓ మైకు అందుబాటులో ఉంచి, ముస్లింలు కానివారికి ప్రశ్నలడగడంలో ప్రాధాన్యాలివ్వడం అనేది చాలామంది ముస్లిం స్కాలర్లు, మతాధిపతులు ఎప్పట్నుండో చేస్తున్నారు. యూటూబ్ లో ఇలాంటి , నాస్తికులు, ముస్లిమేతరుల క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన వేలకొద్దీ వీడియోలు ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో, అచ్చమైన తెలుగులో ప్రసంగించి, ఎవరికి ఏ అణుమానమున్నా, అదెలాంటిదైనా సరే బహిరంగంగానే అడగమని ఆహ్వానించేవారు కూడా చాలా మంది ఉన్నారు.

సరే ఇప్పుడు, పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.

ఈ సమాధానం మేథమేటిక్స్ బ్యాక్ గ్రౌండ్ వారికి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే, మేథమేటిక్స్ లో ఓ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, మధ్య మధ్యలో చాలా ఫార్ములాస్ ని ఉపయోగిస్తూ పోతాం. ఇది కూడా అలాగే.

ఖురాన్ ప్రకారం పై ప్రశ్నకు సమాధానం చూద్దాం. దానికంటే ముందు -ఖురాన్ ప్రకారం ఎందుకు అని ఎవరైనా ప్రశ్నించొచ్చు. ఎందుకంటే, ఇస్లాం ప్రకారం, అది మనిషికి గైడెన్స్ ఇవ్వడం కోసం సృష్టికర్త పంపిన పుస్తకం కాబట్టి.

సృష్టికర్తే పంపాడని ఎలా చెప్పడం?

ఎలా అంటే, దానిలోని వివిధ అంశాలు కలిపి విమర్శనాత్మకంగా విష్లేశిస్తే, అది ఓ మానవమాత్రుడు రాసిన పుస్తకం అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదని అర్థమవుతుంది కాబట్టి.

సో, అలా ఖురాన్ ప్రకారం – మనిషి జీవితానికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్(ఫార్ములాస్) అనేవి ఉంటాయి. ముందుగా అవేంటో చూద్దాం –

1. మనిషి జీవితం మృత్యువుతో అంతమవదు. మనిషికి ఇహలోకంతో పాటు, పరలోకం కూడా ఉంటుంది. మృత్యువు కేవలం ఇహలోకం నుండి, పరలోకానికి మారే ప్రక్రియమాత్రమే.

2. ఇహ లోక జీవితం కేవలం తాత్కాలికమైంది, దానికి నిర్ణీత గడువు ఉంటుంది. పరలోక జీవితానికి గడువంటూ లేదు.

3. మరణం అనేది ఓ సహజ ప్రక్రియే తప్ప, అది శిక్ష కాదు. పరీక్ష హాల్లో విద్యార్థి పరీక్ష రాస్తున్నప్పుడు, సమయం అయిపోతే ఇన్విజిలేటర్ ఆ విద్యార్థినుండీ పేపర్ లాక్కుంటాడు. దానర్థం, ఇన్విజిలేటర్ ఆ విద్యార్థిని శిక్షించినట్లు కాదుకదా. ఆ పేపర్ దిద్ది, ఫలితాలు వచ్చాక, ఆ రాసిన మ్యాటర్ బట్టి ఆనందమో,బాధో తేలుతుంది.

4. ఈ జీవితం అచ్చంగా ఓ పరీక్ష లాంటిది. ఈ పరీక్ష బుద్ది, ఆలోచనా గ్ఞానం ఉన్న ప్రతి మానవునికీ ఆ వ్యక్తికి ఉన్న బుద్ధి స్థాయిలోనే ఉంటుంది. ఉదాహరణకు చాలా మంది చిన్నపిల్లలు కూడా వివిధ కారణాల వల్ల చనిపోతుంటారు. వారు చిన్న పిల్లలు కావడం వల్ల, వారికి విచక్షణాగ్ఞానం లేకపోవడం వల్ల వారికి ఎలాంటి ప్రశ్నలూ ఉండవు. ( నేను మహా తెలివైనవాన్ననీ, ఓ వెయ్యి రూపాయలు ఖర్చుచేసే వస్తువైనా, ఓ నాలుగ్గంటలు బేరాలాడి, నలభై రివ్యూలు చదివాకే కొంటాననే ప్రభుద్దులూ .. కాస్తంత జాగ్రత్త, అంతిమ దినం నాడు మీ తెలివే మీపాలిట శాపం కావొచ్చు. )

5. అల్లా అంత్యంత కరుణామయుడు, దయామయుడు, ప్రేమించేవాడు, క్షమాగుణం కలవాడు. ఎంతగా అంటే – తనను వదిలి, తాను సృష్టించిన ఇతర మానవుల్నీ, ఆ మానవులు సృష్ఠించిన విగ్రహాల్నీ పూజించేవారినీ, దేవుడు లేడూ, గీవుడు లేడూ అని స్టేట్మెంట్లు ఇచ్చేవారినీ కూడా అల్లా ప్రేమిస్తాడు. సొంత బిడ్డ ఎంతపెద్ద తప్పు చేసినా, తల్లి మనసు ఆ బిడ్డను ద్వేషించదు కదా,అట్లే, తల్లి ప్రేమకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ప్రేమించే అల్లా కూడా తాను సృష్టించిన జీవుల్ని ప్రేమిస్తూనే ఉంటాడు.

6. ఖురాన్ లో ఇవ్వబడిన అనేక నిర్వచనాల ప్రకారం అల్లా – సర్వ గ్ఞాని. కేవలం ‘నేను ముస్లిం ని ‘, అని చెప్పినంత మాత్రాన, సర్టిఫికేట్ లో ముస్లిం అని రాసుకున్నంత మాత్రాన, ఆ వ్యక్తి తప్పుల్ని ఉపేక్షించడమో, అతనికి కన్సెషన్ లు ఇవ్వడమో ఉండదు. అట్లే అల్లా యొక్క మరో పేరు – పరిపూర్ణ న్యాయాధినేత. అంటే,అంతిమ దినం నాడు ప్రతి ఒక్కరికీ, అతని మంచి పనులకి మంచి, చెడు పనులకి చెడు తప్పక జరుగుతుంది, అది ఎంత చిన్నదైనా సరే. ఆ వ్యక్తి ఎవరైనా సరే.

7. ఈ జీవితం కేవలం ఓ పరీక్ష మాత్రమే. పేదరికం-సిరి సంపద, అధిక సంతానం-సంతాన లేమి, గౌరవం-అవమానం, కష్టం-సుఖం, రోగం-ఆరోగ్యం ఇవన్నీ పరీక్షలే. ఓ వ్యక్తికి మంచి జరిగితే – అది రెండు కారణాల వల్ల కావచ్చు. 1- అది అల్లా అతని సుగుణాలకు ఇచ్చిన ప్రతిఫలం(రివార్డ్) కావచ్చు. లేదా.2. అతన్ని మంచి స్థానంలో ఉంచి, అల్లా అతనికి పెట్టిన పరీక్ష కావచ్చు. ( ఆ మంచివల్ల వచ్చిన సౌకర్యాలు,సౌఖ్యాల్ని అతను ఎలా వినియోగించుకున్నాడు అనే పరీక్ష).

అట్లే, ఓ వ్యక్తికి చెడు జరిగితే – అది రెండు కారణాల వల్ల కావచ్చు. 1. అది అల్లా అతని దుర్గుణాలకు ఇచ్చిన శిక్ష కావచ్చు. లేదా. 2- అతన్ని కష్టమైన పరిస్థితుల్లో పెట్టి, అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూసే పరీక్ష కావచ్చు.

మొత్తానికి – మంచైనా-చెడైనా, జయమైనా-పరాజయమైనా, సంపదైనా-పేదరికమైనా అది దేవుడు పెట్టే పరీక్ష కావడానికి 50% అవకాశం ఉంది. కాబట్టి అది పూర్తిగా తన ప్రతిభ వల్ల వచ్చిన మంచి అనుకుని విర్రవీగడమో, అతిగా పొంగిపోవడమో చేయరాదు. అట్లే, అది పూర్తిగా తన అసమర్థత/చేతగానితనం వల్ల కలిగిన చెడు అనుకుని కుంగిపోవడమో, దేవుడు లేడనీ/తనని పట్టించుకోవడం లేదనీ నిరాశ చెందకూడదు. దేవునిపై నమ్మకముంచి, మనిషి తాను సరైనదనుకున్నపనిని చేసుకుంటూ పోతుండాలి.

ఇవన్నీ ముస్లింలకు బాగా తెలిసిన , ఖురాన్, ప్రవక్త బోధనల్లో చెప్పబడిన ఇస్లామిక్ బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్స్పెట్స్ ఆధారంగా, పైగ అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ చూద్దాం.

ఇన్ని జరుగుతుంటే – అల్లా ఏం చేస్తున్నట్లు.

ముస్లింలు అన్ని కష్టాలు పడుతుంటే – అల్లా ఎందుకు కాపాడట్లేదు.
యూదులు అంతగా బలపడి పాలస్తీనియుల్ని చంపేస్తుంటే అల్లా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు.
ముస్లిం లను కాపాడలేనప్పుడు – ఇక అల్లా ఉండి ఏం లాభం.
వీటిలో చాలా వరకూ ప్రశ్నలకు సమాధానం ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది.

ఇహలోకం – పరలోకం లను నమ్మడం అనేది విశ్వాసంలో ఓ భాగం. అందుకే,చాలా సార్లు, అత్యంత దుష్టులు, చెడుకార్యాలు చేసేవారు కూడా, ఈ భూమిపై విలాసవంతంగా బతికి, పోలీసులు,ప్రభుత్వాలతో సెల్యూట్లు కొట్టించుకునీ, సుఖంగా తనువు చాలిస్తారు. పైకి చెప్పుకోరు గానీ,   కొందరు  నాస్తికులకీ, సరైన విశ్వాసం లేనివారికీ ఇది చాలా సార్లు నిరుత్సాహాన్ని, అయోమయాన్నీ,గందరగోళాన్నీ కలిగిస్తుంటుంది. దీనిని ఎలా అన్వయించుకోవాలో తెలీక వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ, ఖురాన్ ని నమ్మే వారికి మాత్రం ఇది ఎలాంటి నిరుత్సాహం, అయోమయం సృష్టించదు. ఎందుకంటే – మానవ న్యాయవ్యవస్థని తప్పించుకున్నా, సృష్టికర్త దగ్గరమాత్రం వీరికి సరైన శిక్ష పడుతుందనే అచంచల విశ్వాసం వల్ల.

కేవలం ‘నేను ముస్లిం నే’ అన్నంతనే – విఠలా చార్య సినిమాలోలాగా అల్లా ప్రత్యక్షమై ముస్లింలందరినీ కాపాడితే, మరుక్షణమే ముస్లిమేతరులందరూ ముస్లింలుగా మారిపోరా? అసలు అంతదాకా ఎందుకు, అల్లా జనాలనందరినీ ముస్లిం కుటుంబాల్లోనే పుట్టిస్తే అసలు ముస్లిమేతరుడనేవారే ఎవరూ ఉండరు కదా? కాబట్టి , ఈ రకంగా జరగాలని కోరుకోవడం, ఇలా జరగట్లేదు కాబట్టి, అల్లా( సృష్ఠికర్త ) లేడని తీర్మానించడం – అర్థరహితం .

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.