భారత ఉపఖండానికి వైశ్రాయ్ గా ఉన్నవారిలో, హత్య చేయబడ్డ ఏకైక వైశ్రాయ్ ఎవరు?
దీనికి సమాధానం – లార్డ్ మయో. ఇది సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో ఇప్పటికే అనేక సార్లు వచ్చిన ఇంపార్టెంట్ బిట్- అని కోచింగ్ సెంటర్లలో చెప్తుంటారు.ఎవరు చంపారు, ఎందుకు చంపారు వంటి వివరాలలోకి మాత్రం ఎవరూ వెల్లరు. ఒకవేళ ఎవరైనా డౌట్ అడిగినా, ఏవో వ్యక్తిగత కారణాలతో ఎవరో చంపేశారులెమ్మని దానిని దాటవేస్తారు.
భారత ఉపఖండం అంటే, ఇప్పటి పాక్,ఇండియా,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్,నేపాల్ వంటి అన్ని ప్రాంతాలతో కలిపి అని అర్థం. ఇంతపెద్ద భూభాగానికి వైశ్రాయ్ అంటే, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో రాణి, ప్రధానమంత్రి తర్వాత మూడవ ప్రముఖ వ్యక్తి. అంతటి శక్తివంతమైన వ్యక్తి హత్యను ఓ మామూలు విషయంగా చరిత్ర పుటల్లో నొక్కిపెట్టడం ఓ మిస్టరీ. ఈ మిష్టరీని చేదించడానికి ఈ అంశం గురించి – ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ – డాక్టర్ హెలెన్ జేంస్ 2009లో పరిశోధన చేసింది. ఆమె చేసిన పరిశోధణ అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. తన పరిశొధనా పత్రానికి ఆమె ఎంచుకున్న టైటిల్ – లార్డ్ మయో హత్య – మొట్టమొదటి జీహాద్? (THE ASSASSINATION OF LORD MAYO: THE ‘FIRST’ JIHAD?)
వైశ్రాయ్ మాయోను హత్య చేసిన వ్యక్తి – షేర్ అలీ అఫ్రీది. ఇతను మొదట్లో బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా పనిచేశాడు. తరువాత, ఓ హత్యకు సంబంధించిన కేసులో బ్రిటీష్ ప్రభుత్వం ఇతన్ని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ దీవుల్లోని కాలాపానీ జైల్ కి తరలించింది.ఆ హత్య కేసులో తాను నిర్దోషినని షేర్ అలీ చెప్పుకున్నాడు. తనకు బ్రిటీష్ అధికారులు అన్యాయంగా శిక్ష విధించారని భావించి, బ్రిటిష్ వారిపై కక్ష్య గట్టాడు. దాని ఫలితంగానే, 1872లో అండమాన్ జైల్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన లార్డ్ మయోని కత్తితో పొడిచి చంపేశాడు.” – ఇదీ బ్రిటీష్ అధికారిక రికార్డుల్లో మయో హత్య గురించి నమోదు కాబడి ఉన్న అంశం.
కానీ, తనకు శిక్ష విధించింది బ్రిటీష్ జడ్జిలు, న్యాయవాదులే తప్ప, వైశ్రాయ్ కాదు. ఆమాత్రం తేడా కూడా తెలుసుకోకుండా షేర్ అలీ, వైశ్రాయ్ ని చంపేశాడా అనేది సమాధానం లేని ప్రశ్న. దీనికి సమాధానం కనుక్కొనే ప్రయత్నం – డాక్టర్ హెలెన్ జేంస్ చేసింది. దానికి ఆమె, షేర్ అలీ తో పాటు,ఆ సమయంలో, జైల్లో వేరే ఖైదీలు ఎవరెవరు ఉండేవారు, ఎవరితో షేర్ అలీ సన్నిహితంగా ఉండేవాడు అనే అంశాల మీద ఫోకస్ చేసింది.
భారత స్వాతంత్రోద్యమంలో జీహాద్!!
జీహాద్ అంటే అదేదో చెడ్డపని అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, జీహాద్ అంటే -“మంచి కై చేసే పోరాటం”. అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా చేసే ప్రతిఘటనే జీహాద్. భారత ఉపఖండంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటి జీహాద్ కి పిలుపునిచ్చిన వ్యక్తి – టిప్పు సుల్తాన్.
మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంగా చరిత్ర పుస్తకాల్లో చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటుకు బీజం వేసింది- 1857 మే నెలలో యు.పీ లోని ముజఫర్ నగర్ లో, థానా భవన్ అనే ప్రాంతంలో, హాజీ ఇందాదుల్లా బృందానికి, బ్రిటీష్ వారికి మధ్య జరిగిన జీహాదే. ఇలా బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా భారత ఉపఖండంలోనే కాకుండా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వంటి అనేక ప్రాంతాల్లో అక్కడి ముస్లింలు జీహాద్ ప్రకటించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట్లు చేశారు.
లార్డ్ మయో హత్యకు ఒక సంవత్సరం ముందు, అంటే 1871లో, అబ్దుల్లా అనే వ్యక్తి, తన ఇద్దరు అనుచరులతో కలిసి బ్రిటిష్ వాడైన అప్పటి కలకత్తా ప్రధాన జడ్జి -నార్మన్ ని హత్య చేశారు. ఆ నేరానికి గానూ వీరు ముగ్గురికీ యావజ్జీవ శిక్ష విధించి వారిని కూడా అండమాన్ జైలుకు తరలించారు. అక్కడే, వీరికీ, షేర్ అలీకి పరిచయం కలిగింది. బ్రిటీష్ పాలనలో జరుగుతున్న దారుణాల గురించీ, దానికి వ్యతిరేకంగా ముస్లింలు పోరాడాల్సిన అవసరం గురించీ అబ్ధుల్లా చెప్పిన విషయాలు షేర్ అలీపై బలమైన ప్రభావం కలిగించాయి. దానితో, చిన్నా, చితకా బ్రిటీష్ అధికారుల్ని కాకుండా, ఏకంగా వైశ్రాయ్ నే చంపేసి బ్రిటీష్ ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక చేయాలని షేర్ అలీ తీర్మానించుకున్నాడు. దానికి అణుగునంగానే ప్రణాళికలు రూపొందించి, అమలుపరిచాడు.
మయో హత్యపై నియమింపబడిన ఎంక్వైరీ కమీషన్, కేవలం వ్యక్తిగత కక్షతోనే షేర్ అలీ మయోని చంపేశాడని తీర్మానించి, ఆ తర్వాతి నెలలోనే అతన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉరి తీశారు.
దీనికి కారణాలుగా, హెలెన్ జేంస్ రెండు అంశాల్ని ప్రస్తావించింది. అవి –
1. విచారణ సమయంలో తాను ఒక్కడినే,ఒంటరిగానే ఈ పని చేశాననీ, తనతో పాటు ఎవరూ దీనిలో పాలుపంచుకోలేదని, షేర్ అలీ పదే,పదే చెప్పాడు. దీనికి కారణం – ఇతర ముస్లింల ప్రాణాలను కాపాడాలని అలా చెప్పిఉండొచ్చు.
2. తాను ఆక్రమించుకున్న వివిధ దేశాల్లో, ముస్లింల నుండీ వస్తున్న ఈ హింసాత్మక తిరుగుబాటు, అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వానికి ఓ ప్రధాన సమస్యగా మారింది. అలాంటి పరిస్థితుల్లో, జీహాదీ ముస్లింలు ఏకంగా ఓ వైస్రాయ్ నే చంపేశారనే వార్త, ఇతర ప్రాంతాల్లోని ముస్లింలకు కూడా ఓ ఉత్ప్రేరకంగా పనిచేసి మరిన్ని దాడులకు పురిగొల్పుతుందని బ్రిటీష్ వారు భయపడ్డారు. అందుకే, తూతూ మంత్రంగా విచారణ పూర్తిచేసి, షేర్ అలీ గురించి బయటి ప్రపంచానికి తెలీకుండా జాగ్రత్తపడ్డారు.
తన వాదనకు ఆధారంగా హెలెన్ జేంస్ వెలికి తీసిన మరో అంశం – మయో హత్య జరిగిన మరుసటి రోజు -షేర్ అలీ గురించి అక్కడి అధికారులు పంపిన అఫీషియల్ రిపోర్ట్లో, ‘జీహాద్ ‘ అనే పదం, అనేక సార్లు ప్రస్తావించబడింది. కానీ,ఆశ్చర్యకరంగా ఫైనల్ రిపోర్ట్ లో నుండీ మాత్రం ఆ పదం తొలగించబడింది.
విచారణ మొత్తం పూర్తయ్యి, చివరిగా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అని జడ్జి అడిగినప్పుడు, దానికి షేర్ అలీ ఇచ్చిన సమాధానం – “ఇక్కడ నేను చెప్పేదీ ఏమీ లేదు. మీకు తెలిసిన సాక్ష్యాధారాల ప్రకారం, మీరు ఏ శిక్ష కావాలంటే అది విధించుకోండి. నేను క్షమాభిక్ష కూడా అడగను. కానీ, అంతిమ దినం నాడు మరో విచారణ ఉంటుంది. అక్కడ నేనేమి చెప్తానో మీరే వింటారు”
షేర్ అలీ లాంటి ఎందరో వీరుల పోరాటాలు,త్యాగాల వల్ల భారత దేశం స్వాతంత్ర్యాన్ని సాధించింది. కానీ, స్వాతంత్ర్య పోరాటంలో ఇసుమంతైనా పాల్గొనకుండా, బ్రిటీష్ వారికి అపాలజీ లెటర్లు రాసి, వారికి ఊడిగం చేసిన కొన్ని దిక్కుమాలిన,దగుల్బాజీ శక్తుల చేతుల్లో ఇప్పుడు దేశం బందీ అయ్యింది. వీరి బారినుండీ దేశాన్ని కాపాడుకోవడానికి భారతీయులందరూ మరోసారి సమాయత్తం కావలసి ఉంది. షేర్ అలీ లాంటి వారి త్యాగాల్ని స్మరించుకుని, -‘దేశభక్తి అంటే ఇదీ’ అని చాటాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ అత్యంత విశాదకర అంశం ఏమిటంటే, ఈ షేర్ అలీ గురించి ఇప్పటి జనరేషన్ భారతీయులెవ్వరికీ పెద్దగా తెలీదు. కానీ, ఇదే అండమాన్ జైల్ నుండీ బ్రిటీష్ వారికి ఆరు సార్లు క్షమాభిక్ష పిటీషన్లు పెట్టుకుని, వారికి విధేయుడిగా ఉంటానని ప్రమాణాలు చేసి బయటకు వచ్చి, 1947 వరకూ బ్రిటీష్ వారి నుండీ పెన్షన్ స్వీకరించుకున్న ఓ వ్యక్తి మాత్రం ‘వీర్ ‘ గా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడు. ఈయనకు ఊరూరా విగ్రహాలూ, అభిమానులూ.. ఇదీ నేటి భారతం.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in