అమ్ముల పొదిలోని ఆఖరు ప్రశ్న!!
========================
పోస్ట్ గురించి – బ్రీఫ్ గా..
—————–
కత్తి మహేష్, బాబూ గోగినేని, కంచ ఐలయ్యా, .. మొదలగువారు.. మీరు హిందూ మతాన్ని విమర్శించినంతగా ఇస్లాం, క్రిష్టియానిటీలను ఎందుకు విమర్శించరు అనే ప్రశ్నకు తడబడతారు, డిఫెన్సివ్ ఆన్సర్ ఇస్తారు.
ఈ స్టేట్మెంట్ తప్పనిపిస్తే, ఇక్కడితో చదవడం ఆపేయండి. . మీతో పెద్దగా డిస్కషన్ అవసరం లేదు.(So, that you won’t be wasting your time, my time too).
ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తే – ఎందుకు తడబడతారు అనేది ప్రశ్న. దానికి సమాధానమే ఆ పోస్ట్.
నాకు తెలిసి, రాం గోపాల్ వర్మ ఒక్కడే ఆ ప్రశ్నకు గతంలో ఓ సారి తడుముకోకుండా సమాధానం చెప్పాడు. మీరు రాముడిని విమర్శించినట్లుగా, జీసస్, అల్లాలను ఎందుకు విమర్శించరు అని ప్రశ్నిస్తే – దానికి ఆర్జీవీ ఇచ్చిన సమాధానం – జీసస్ నేను విమర్శించాను అన్నాడు.
ఏమని , ఎప్పుడు – అంటే..?
“తనను తాను శిలువ నుండీ కాపాడుకోలేని దేవుడు , భక్తుల్ని ఎలా కాపాడగలడు – అని రాశాను అట్లే మజిల్స్ తో బాగా బలంగా ఉన్న దేవుడే నాకు కావాలని రాశాను – అన్నాడు.”
(దీనిని ఏ క్రైస్తవ వ్యక్తి కూడా అఫెన్సివ్ గా తీసుకుంటాడని నేననుకోను, ఎందుకంటే అది జస్ట్ ఇంటర్‌ప్రిటేషన్. )
ఇక అల్లా గురించి అని అడిగితే – దానికి ఆర్జీవీ ఇచ్చిన సమాధానం –
“లుక్.. ఇప్పుడు.. ఎవరో కొందరు మనుషులు చేసిన దానికి, అల్లాను ఎలా నిందిస్తా” – అన్నాడు.
అదీ పాయింటు.
ఆ వీడియో యూటూబ్‌లో ఉంటుంది, కావాలంటే చూస్కోండి.
నేను బేసికల్ గా రాసింది దీనిగురించి.
అల్లా ఓ మనిషి కాదు. అతన్ని/ఆమెను/దానిని తిట్టడానికి, విమర్శించడానికి స్కోప్ లేదు. అందుకే, అల్లాను ఎంతగా తిట్టినా , ఏ ముస్లిమూ అస్సలు ఫీల్ కాడని రాశాను( అస్సలు తిట్టే చాన్సే లేదనే నమ్మకంతో). దీనికి ఏ ముస్లిం కూడా అభ్యంతర పెట్టలేదు. కానీ, కొందరు ముస్లిమేతర మిత్రులు మాత్రం ఈ ఒక్క వాక్యాన్ని బయటికి తీసి, ‘ముస్లింలు తెగ ఫీల్ అవుతారు ‘ అని డిక్లరేషన్ ఇచ్చారు. ముస్లింల నమ్మకం గురించి, ముస్లింల కంటే తమకే ఎక్కువ తెలుసనే కాన్ ఫిడెన్స్ కాబోలు.
ఇక రెండో పార్ట్. ప్రవక్తను విమర్శించడం/తిట్టడం.
ఏ ఒక్కరూ విమర్శించరూ, తిట్టరూ అని రాయలేదు. ప్రవక్తను తిట్టినా ముస్లింలు ఎంజాయ్ చేస్తారు- అనీ రాయలేదు. కొందరు మాత్రం ఇవి రాసినట్లు ఫీలైపోయి కామెంట్లు రాశారు. ప్రోగ్రాం డ్ రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి.
ఓ వ్యక్తిగా, ఆయన చేసిన పనుల్ని, వాస్తవాల ఆధారంగా, ఖురాన్ మొత్తాన్ని పరిగణలోకి ( అక్కడో వాక్యం, అక్కడొఓవాక్యం కాకుండా..) తీసుకుని చూస్తే, ఆయన్ని పెద్దగా విమర్శించే స్కోప్ ఉండదని రాశాను. (నిజమైన)హేతువాదులు అలా అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, ఆలోచించే మాట్లాడుతారు కాబట్టి ప్రవక్తను ఎక్కువగా విమర్శించరనీ/తిట్టరనీ రాశాను.
రాయంది వదిలేసి, రాసింది మాత్రమే మరో సారి చదవమని మనవి.
———-
ప్రస్తుత వివాదం గురించి కత్తి మహేష్ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నాడు. అన్ని ప్రశ్నలకూ ఓపికగా, లాజికల్‌గా సమాధానాలు ఇస్తూ పోతుంటాడు. వారు అవే ప్రశ్నల్ని తిప్పి,తిప్పి అడుగుతుంటారు. ఆయన అదే సమాధానాన్ని మరింత వివరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రకంగా ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చి, వారి ప్రశ్నలన్నీ ఐపోతాయి. కానీ, ఇంటర్వ్యూ చేయాల్సిన సమయం ఇంకా మిగిలే ఉంటుంది. పైగా, ఆడియన్స్ కి, కత్తి డిబేట్ గెలుస్తున్న ఇంప్రెషన్ కలగకూడదు.. అప్పుడు.. అప్పుడు తీస్తారు తమ అమ్ములపొదిలోని ఆఖరి ప్రశ్నను –
“మీరు హేతువాది అయితే అన్ని మతాల్నీ సమానంగా చూడాలి. అన్ని మతాల్నీ సమానంగా విమర్శించాలి. కానీ, ఇస్లాం, క్రిష్టియన్ మతాల్ని విమర్శించకుండా, కేవలం ఒక్క హిందూ మతాన్నే ఎందుకు విమర్శిస్తుంటారు. అంటే, హిందువులైతే ఎంత విమర్శించినా ఏమీ అనరనా? మిగతా మతాల జోలికెల్తే చంపేస్తారనే భయమా? వాళ్ళ దగ్గరినుండీ వచ్చే ఫండ్స్ ఆగిపోతాయనా.. ?” – ఇలా అమ్ములపొదిలో అప్పటిదాకా దాచుకున్న ప్రశ్నలన్నీ చకచకా బయటికి వచ్చేస్తాయి.
ఈ ప్రశ్నల శరపరంపరని కత్తి ఒక్కరే కాదు. బాబు గోగినేని, రంగనాయకమ్మ, ఐలయ్యా.. ఇలా ప్రతి ఒక్కరూ లెక్కలేనన్ని సార్లు ఫేస్ చేశారు. ఇకపై కూడా చేస్తుంటారు.
మిగతా ప్రశ్నల్ని చాలా కాన్ ఫిడెంట్ గా, ఫ్రెంట్ ఫుట్ పై ఫేస్ చేసినవీరు, ఈ ప్రశ్న దగ్గర మాత్రం డిఫెన్స్‌లో పడిపోతారు.
అప్పటివరకూ వారివైపు నడుస్తున్న డిబేట్ ని , ఈ ఒక్క యాంగిల్ తలకిందులు చేస్తుంది. ఆ డిబేట్ ఫాలో అయ్యే వీక్షకులకి కూడా, ఈ ప్రశ్న ఓ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా, డెసిసివ్ ఫ్యాక్టర్ గా మారిపోతుంది. ఈ ప్రశ్నలోని ఆత్మస్తుతి-పరనింద ఎఫెక్ట్ అలాంటిది మరి.
ఈ ప్రశ్నకు హేతువాదులందరూ తడబడతానికి కారణం – వారు ఈ ప్రశ్నలోని హేతుబద్ధతని ప్రశ్నించకుండా, మిగతా అన్ని ప్రశ్నల్లాగే దీనిని కూడా ఆన్సర్ చేయాలని ప్రయత్నించడం.. ప్రశ్నను మరోసారి చూస్తే -“మీరు హేతువాది అయితే అన్ని మతాల్నీ సమానంగా చూడాలి. అన్ని మతాల్నీ సమానంగా విమర్శించాలి.” – ఈ పార్ట్ లోనే అసలు ట్రిక్ ఉంది. హేతువాది తనకు అసంబద్ధంగా అనిపించిన ప్రతి అంశాన్నీ ప్రశ్నిస్తాడు తప్ప, టైం టేబుల్ వేసుకుని, ఈరోజు హిందూ మతాన్ని, రేపు ఇస్లాం నీ, ఎల్లుండి క్రిష్టియానిటీని విమర్శించాలని అనుకోడు. ఏ రెండు మతాలూ సమానం కానప్పుడు, దేనిపంధా దానికి సపరేట్గా ఉన్నప్పుడు, ఇక సమానంగా విమర్శించడం ఏంటి? అలా చేయాలని అడగడం, ఆశించడంలోనే అసలుసిసలు అమాయకత్వం, అగ్ఞానం ఉన్నాయి.
సరే, ఈ ప్రశ్నను మరింతగా విశ్లేషించే ముందు, అసలు వీరు ఇస్లాం ని ఎందుకు అంతగా విమర్శించరు అనే అంశాన్ని చూద్దాం. చూడటమేంటి..ఎవరో ఎందుకు విమర్శించరు అనే బదులు, మనమే డైరెక్ట్ గా విమర్శిద్దాం.
ఇస్లాంలో దేవున్ని అల్లా అంటారు. సో, ఇస్లాం ని తిట్టడానికి/విమర్శించడానికి సులువైన మార్గం అల్లాని తిట్టడం. కానీ, ఇక్కడే ఓ చిక్కుంది. ‘అల్లా అంటే ఇదీ’ అని ఎక్కడా స్పష్టంగా లేదు. అల్లా ఓ పురుషుడైతే, అతన్ని పురుషుల్ని తిట్టే పదాల్తో పచ్చిగా తిడితే సరిపోద్ది. పోనీ అల్లా స్త్రీ ఐతే, స్త్రీలని కించపరిచే పదాల్తో ఆమెని తిడితే సరిపోయేది. కానీ, అల్లా అనే పదం ఓ స్త్రీకి చెందిందీ కాదూ, పురుషునికీ చెందిందీ కాదు. అదసలు ఓ వ్యక్తి/మానవుడే కాదు. ‘అల్లా లాంటిది ఇంకేదీ లేదు’- అని ఖురాన్లో ఉంది. అంటే, అల్లా అంటే అదిగో అలా ఉంటుంది అని చెప్పే అవకాశమే లేదు, ఎందుకంటే, మరో దానితో కంపేర్ చేయగలుగుతున్నామంటేనే అది అల్లా కాదు అని తేలిపోయిందన్నట్లు. తెలుగులో అల్లాను సృష్టికర్త అని పిలవచ్చు. సృష్టికర్త అంటే కేవలం ముస్లింలను పుట్టించినవాడు అని కాదు. ఈ సృస్టిలోని సమస్త మానవుల్ని,( హిందువులు, క్రైస్తవులు,నాస్తికులు..ఇలా అందరినీ) సమస్త ప్రాణకోటినీ, విశ్వాంతరాలనూ సృష్టించిన వాడు అని. ఇప్పుడు ఆ సృష్టికర్తని ఏమని తిట్టాలి..? పనికిమాలినోడు, చేతకానోడు, చెడ్డోడు.. వీటిలో ఏదో ఒక దానితో తిట్టామనుకుందాం. తిడితే మాత్రం ఏమవుద్ది..? అసలు తిట్టంటే ఎలా ఉండాల? తిట్టు వినగానే ఎదుటోడికి ఎక్కడో కాలాలి. బీపీ రైజైపోవాలి. తాండ్రాపాపారాయుడులో కృష్ణమ్రాజులాగా నోట్లో పళ్ళు పట,పటా కొరకాల.
కానీ, అల్లాను ఎంత పచ్చి బూతులు తిట్టినా, ఏ ముస్లిం కి కూడా చీమ కుట్టినట్టైనా ఉండదు. ఎందుకంటే, అల్లాపై తమకెంత హక్కు ఉందో, సమస్త మానవులకీ, ప్రతి ఇతర మానవునికీ కూడా అంతే హక్కుందని వారికి తెలుసు కాబట్టి. అందుకే అల్లాని ఎవరైనా తిడితే, ఆ తిట్టేవారిపై సానుభూతి కలుగుతుంది తప్ప, వారిపై ఎవరికీ కోపం రాదు. ఎవరూ అల్లాను డిఫెండ్ చేయాలని ప్రయత్నించరు.
సో, అల్లాను తిట్టే ఆప్షన్ వర్కవుట్ అవ్వదు.
ఇప్పుడు, ఇక ఇస్లాం లో తరచుగా వినబడే మరో పేరు – మహమ్మద్ ప్రవక్త. ఈయనను తిడితే కొంత ప్రయోజనం ఉండొచ్చు. ప్రవక్తను తిట్టే అవకాశాల్ని చూద్దాం.
ముస్లింల నమ్మకం ప్రకారం – ప్రవక్త కేవలం ఓ మామూలు మానవుడు. సృషికర్త మానవాలికి తన సందేశం(ఖురాన్) ఇవ్వడానికి ఓ మధ్యవర్తిగా ఈయనను ఎంచుకున్నాడు. ఆ బాధ్యతను ఈయన చక్కగా నిర్వర్తించి, ఆ సందేశాన్ని తన జీవితకాలంలో ఆచరించి చూపారు.
మనుషులన్నాక, ఏదో ఓ పని చేస్తుంటారు. వారు చేశారని చెప్పే పనుల్లో, ఏదో ఓ లొసుగుని బయటికి తీసి దానిని విమర్శించడమో, తిట్టడమో చేయొచ్చు. ప్రవక్త కూడా చాలా పనులు చేశారు. వాటిలో కొన్ని పనుల్ని బట్టి ఆయనని విమర్శించడమో, తిట్టడమో చేస్తే సరి.
ఉదాహరణకి :
1. ఆయన చాలా పెళ్ళిల్లు చేసుకున్నారు. కాబట్టి ఆయన్ని స్త్రీలోలుడు అని తిట్టొచ్చు. కానీ, దీనిలో ఓ చిక్కుంది. అదేమంటే – ఆయన మొదటిసారి 25 సంవత్సరాల వయసులో, ఆయనకంటే వయసులో చాలా సంవత్సరాలు పెద్దావిడని, అప్పటికే పెళ్ళికూడా అయి విధవరాలైన మహిళను చేసుకున్నారు. ఆమె వృద్ధాప్యంలో,అనారోగ్యంతో మరణించేవరకూ ప్రవక్త మరోపెళ్ళిచేసుకోలేదు. ఒక్కొక్కరు అనేక మంది భార్యలను కలిగిఉండటం అనేది సర్వసాధారణమైన ఆరోజుల్లో, ఇదో అసాధారణ విషయమనే చెప్పొచ్చు. వీరి అన్యోన్య దాంపత్యం పాతికేళ్ళపాటు కొనసాగింది. ఆవిడ మరణించిన తర్వాత ప్రవక్త పెళ్ళిచేసుకున్న వారిలో చాలామంది విధవలే ఉన్నారు. ఈ వివాహాల్ని పరిశీలిస్తే, – వివిధ తెగలమధ్య బంధుత్వాల్ని కలుపుకొని, యుద్ధాలను నివారించడం అనే ఓ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఆయన చేసుకున్న వివాహాలే ఎక్కువని ఏవరికైనా ఈజీగా అర్థమవుతుంది.
ఈ నిజాలు తెలిసినోళ్ళెవరూ ప్రవక్తను స్త్రీలోలుడని అనలేరు.
2. ఆయన కొన్ని యుద్దాలు చేశారు. కొందర్ని చంపమని ఆర్డర్స్ ఇచ్చిఉన్నారు. కాబట్టీ ఆయన్ని హింసావాదిగా, రక్తపిపాసిగా పిలవచ్చు.
దీనిలోనూ ఓ చిక్కుంది. అదేంటో చూద్దాం.
ప్రవక్తను ఇలా రక్తపిపాసిగా పిలుస్తూ – ప్రముఖ రాజకీయ విష్లేశకుడు అరున్ షౌరీ అనేక వ్యాసాలూ, ఏకంగా ఓ పుస్తకమే రాశాడు. దానిపేరు – ద వరల్డ్ ఆఫ్ ఫత్వాస్.
అరుణ్ షౌరీ ఇస్లాం గురించి రాసిన ప్రతిసారీ – ఖురాన్ ముస్లిమేతరుల్ని చంపమని ఎలా ఆదేశిస్తుందో చూడండి అంటూ – కొన్ని ఖురాన్ వాక్యాలను ఉటంకిస్తాడు. – అవి – చాప్టర్ 9, వాక్యం – 5,7,8,9.
అన్నట్లు ఇవి 5 వాక్యం నుండీ ఎందుకు మొదలు పెట్టాడు, 1 నుండీ ఎందుకు కాదు?
ఎందుకంటే చాప్టర్ 9, 1 వ వాక్యం నుండీ చదివితే, అవి ముస్లిమేతరులందరి గురించీ కాదనీ, ముస్లింలతో సంధి ఒప్పందాన్ని ఉల్లఘించిన ప్రవక్త కాలం నాటి, మక్కా వాసులగురించి మాత్రమే అనీ ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి 1-4 సూరాల్ని వదిలేసి ఆయన డైరెక్టుగా 5 కి వెల్తారు. అప్పుడు కూడా, 6వ వాక్యం గురించి రాయడు. ఎందుకు..? ఎందుకంటే – 6వ వాక్యంలో – “వారు యుద్ధాన్ని విరమించి శరణుకోరితే, వారితో మీరు తగువులాడకండీ, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి రక్షణ కల్పించండీ” – అని ఉంటుంది కాబట్టి.
ఇస్లాం ని హింసతో ముడిపెట్టేవారు చాలా మంది చేసే పని ఇదే.. అక్కడక్కడా కొన్ని వాక్యాల్ని ఎత్తుకొచ్చి వాటిని కోట్ చేయడం. కానీ, ఆ వాక్యాల వెనకున్న సమయం,సంధర్భం తెలిసిన వారెవరూ అలాంటీ పనికి పూనుకోరు.
3. స్త్రీలను అణచివేయడం :
ఇక ప్రవక్తను నిందించడానికి పనికొచ్చే మరో సులువైన అంశం – స్త్రీలను తొక్కేశారు అని. దీనికి పెద్దగా ఆధారాలూ వెతకనక్కర్లేదు. ముస్లిం మహిళలు నిండుగా కప్పుకునే బురఖా, మొగోడు నల్గుర్ని చేసుకోవచ్చు, స్త్రీ మాత్రం ఒక్కర్నే చేసుకోవాలనే నియమం. ఇవి చాలు.
కానీ, నచ్చని పెళ్ళి వద్దని చెప్పే హక్కు, విడాకుల హక్కూ, పునర్వివాహ హక్కు, చదువుకునే హక్కు, ఆస్తి హక్కు ఇలాంటి హక్కుల్ని సాధించడానికి ఇతర సమాజాల్లోని మహిళలు చాలా పోరాటాలు,ఉద్యమాలు చేయాల్సొచ్చింది. ఇవేవీ లేకుండానే, కనీసం ఓ 10 శతాబ్ధాలకు ముందే, అంటే వెయ్యేల్లకు ముందే, ఇస్లాం స్త్రీలకు ఈ హక్కులన్నీ ఇచ్చిందని తెలిసిన వారెవ్వరూ ప్రవకపై స్త్రీలను అణచివేశారనే నిందను మోపలేరు.
4. ఇక చివరి అంశం. “వాల్లను విమర్శిస్తే సంపేత్తర్రా బాబోయ్..” అనే విమర్శ.
ఇస్లాం ని, ప్రవక్తని తిరస్కరిస్తే బ్లాస్ఫెమీ చట్టాల కింద తీవ్ర దండనలు, మరణ శిక్షలూ కూడా విధించే కఠిన చట్టాలు కొన్ని ఇస్లామిక్ దేశాల్లో ఉన్న మాట నిజమే. కానీ ఈ చట్టాలన్నీ కొందరు వ్యక్తుల పైత్యపు ఇంటర్‌ప్రటేషన్, మరియు వారివారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం వచ్చిన చట్టాలే తప్ప, ఖురాన్లో గానీ, ప్రవక్త బోధనల్లోంచి గానీ వచ్చినవి కావు. ఖురాన్, ప్రవక్త బోధనల్లో అలాంటి సూచనలు ఉండిఉంటే అన్ని ముస్లిం సమాజాలూ, అన్ని కాలాల్లోనూ వీటిని ఫాలో అయి ఉండేవారు.
-> ఖురాన్ వ్యక్తులతో డైరెక్ట్‌గా సంభాషించి, వారిని తెలివిగా కన్విన్స్ చేయాలని చూస్తుంది. “నువ్వు ఆలోచించవా?, నీకు ఇది అర్థమవడంలేదా?, ఇది ఇలాకాక మరేవిధంగానైనా ఉండే అవకాశం ఉందా?” – ఇలాంటి వాక్యాలు ఖురాన్లో అనేక మార్లు వస్తుంటాయి. ఇన్ని రకాలుగా చెప్పి కూడా, చివరికి ఇంకా కన్విన్స్ అవ్వకుంటే, “నువ్వు అంతిమ దినం నాడు చాలా పశ్చాత్తాప్ప పడతావ్” – అని చెప్పి వదిలేస్తుంది తప్ప, ఆ వ్యక్తుల్ని ఎలాగైనా సరే కన్విన్స్ చేయమని గానీ, బలవంత పెట్టమని గానీ, ప్రవక్తను, ముస్లింలను, ఎక్కడా ఆదేశించలేదు.
-> కొన్ని దశాబ్దాల క్రితం వరకూ, స్త్రీల వస్త్రధారణపై ఇరాన్లో ఎలాంటి ఆంక్షలూ లేవు. అసలు అలాంటి ఆంక్షలు విధించే ఓ రోజు ఒకటి వస్తుందని కూడా అప్పటి ఇరాన్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు అక్కడ తలపై బట్ట కప్పుకోకుండా బయట మహిళలు తిరగడం నిషిద్దం. ఈ మార్పు ఇస్లాం వల్ల వచ్చిందా? అంటే, ముప్పై ఏళ్ళ క్రితం వరకూ ఒకప్పటి ఖలీఫా స్థానమైన ఇరానియన్లకు ఇస్లాం గురించి తెలియక, ఈ మధ్యనే తెలుసుకున్నారా?
-> మొన్నటి వరకూ సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలు నడపడం నిషిద్దం. కానీ, ఇటీవలే సౌదీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అంటే, వారికి ఇప్పుడు ఇస్లాం గురించి కొత్తగా తెలిసిందనా.
-> ఒకప్పటి అట్టోమాన్ సామ్రాజ్యానికి కేంద్ర స్థానమైన టర్కీ, గత 15, 20 సంవత్సరాలుగా రాజ్యం-మతం విషయంలో అనేక మార్పులకు గురౌతూ వస్తుంది. ఇదంతా ఇస్లాం వల్లే జరిగినట్లా.
-> మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మొన్నటి వరకూ పేదరికంలో మునిగిఉండింది. కాని,ప్రస్తుతం ఆసియాలో కెల్లా అత్యధిక ఆర్థిక వృద్ధిరేటు, మానవాభివృద్ధిలో భారత్ కంటే ముందంజలో ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. దీనికి ఇస్లామే కారణమా?
-> గడాఫీ బతికున్నప్పుడు ఆఫ్రికా ఖండంలో కెల్లా లిబియా అత్యంత అభివృద్ధి చెందిన దేశం. ఇప్పుడది కుక్కలు చింపిన విస్తరాకుగా మారింది, చివరికి బానిసల వ్యాపారం చేసే ఇండస్ట్రీగా మారింది. దీని వెనక ఇస్లాం ఉందా?
ఈ ఉదాహరణలన్నిటినీ పరిశిలిస్తే ఏం అర్థమవుతంది? ముస్లింలు మెజారిటీలుగా ఉన్న సమాజాలు,దేశాలు చేసే ప్రతిపనీ, అక్కడ జరిగే ప్రతి సంఘటన వెనక ఇస్లామే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడి అనేక స్థానిక రాజకీయాలు, సాంస్కృతిక కారణాలుంటాయి. వీటికి అదనంగా చమురు, ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు కూడా ఇప్పుడు తోడయ్యాయి.
అయినప్పటికీ, గత శతాబ్ధకాలంగా, ప్రపంచవ్యాప్తంగా, అత్యంత విమర్శలకూ, ఖండనలకూ గురైన మతమేదైనా ఉందంటే అది -ఇస్లామే. ఇస్లాం ని విమర్శిస్తూ, లెక్కలేనన్ని పుస్తకాలూ, వ్యాసాలూ, వార్తలూ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి,ఇప్పటికీ వస్తున్నాయి. వీటన్నిటికీ స్పందిస్తూ కూర్చుంటే తమకు పూటగడవదని తెలిసిన ముస్లింలు వీటిని ఇగ్నోర్ చేసి, తమ బతుకులేవో తాము బతుకుతుంటారు. ముస్లింల వయొలెంట్ రియాక్షన్ కి గురైన సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్ లాంటి వారిని వేల్ల మీద లెక్కపెట్టొచ్చు.
ప్రపంచ జనాభాలో 25% ఉండి, గత 1400 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న ఓ భావజాలాన్ని, ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు, సమాజాల ఆధారంగానో, ఓ 50-100 సంవత్సరాలలో జరిగిన సంఘటనల ఆధారంగానో జడ్జ్ చేయాలని ప్రయత్నించడం – హేతువాద నియమాల ప్రకారం అవివేకం మాత్రమే. అందుకే చాలా మంది హేతువాదులు అలాంటి పని చేయరు.
ఇక క్రిష్టియానిటీ విషయానికి వస్తే – అనేక క్రైస్తవ సంస్థలు దేశంలోని లక్షలాది గ్రామాల్లో, విద్య,వైద్య రంగాల్లో నిస్వార్థ సేవలందిస్తున్నాయి. ఈ స్కూల్లూ,కాలేజీల్లో చదివిన క్రైస్తవేతరుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. వీరందరూ మతం మారితేనే వీరికి అక్కడ చదువు చెప్తున్నారా? మతం మారితేనే వైద్యం చేస్తున్నారా? బలవంత మతమార్పిడి ఎలాగూ చట్ట వ్యతిరేకమే. ఇక కేవలం కొన్ని వేల రూపాయలకు ఆశపడి ఓ వ్యక్తి మతం మారాడంటే , ఇక్కడ ఆ వ్యక్తి పేదరికాన్ని చూసి జాలి కలగాలి తప్ప, క్రైస్తవ సంఘాలపై ఆక్రోషం వెల్లగక్కడమంటే, మన ఆలోచనల్లోనే ఏదోలోపం ఉన్నట్లు. అయినా కొన్ని వేల రూపాయలకు ఆశపడి మతం మారిన వ్యక్తి ఎన్నిరోజులు ఆ మతం పై నిలబడతాడు? ఆ పైసలు ఖర్చైపోగానే, ఆ దేవున్ని కూడా మర్చిపోడా? ఇదసలు చర్చించాల్సిన అంశమేనా?
మత ప్రచారానికి ఆరాటపడే కొద్దిమంది ప్రచారకుల్ని సాకుగా చూపి, మొత్తం క్రిష్టియానిటీని వేలెత్తి చూపడం, హేతువాద ప్రాధమిక నియమాలకే వ్యతిరేకం. అందుకే ఏ హేతువాదీ ఆ పని చేయడు.
పైన పేర్కొన్న కారణాలవల్ల చాలా మంది హేతువాదులు/నాస్తికులూ ఇస్లాం, క్రిష్టియానిటీలను పెద్దగా విమర్శించరు. ఈ మతాల్లోని కొన్ని అంశాల్నీ, ఈ మాతాల్ని ఫాలోఅవుతున్నామని చెప్పే కొందరు వ్యక్తుల చర్యల్ని విమర్శించినా.. ముస్లింలూ, క్రిష్టియన్లు వాటిని అంతగా పట్టించుకోరు. ఎందుకంటే ముస్లింలందరూ ఉత్తములని ఏ ముస్లిమూ, క్రిస్టియన్లందరూ పవిత్రులని ఏ క్రిష్టియనూ క్లైం చేయడు కాబట్టి. అందుకే, ఆ విమర్శలు కూడా అంతగా పాపులర్ అవ్వవు.
వివిధ మతాల గురించి ఏ మాత్రం ప్రాధమిక అవగాహనా లేనివాళ్ళూ, పూర్తి అవగాహన ఉండీ కూడా తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేటందుకు మతాన్ని వాడుకోవాలనుకునేవారూ , టివీ యాంకర్లు గా, వక్తలుగా వస్తుండటంతో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కొన్ని విచ్చిన్నకర శక్తులకు కావలసింది అదే. ప్రజలు వీరిపట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in