ఇస్లాంపై మంగోలుల దాడి – పరిణామాలు!!

ఇస్లాంపై మంగోలుల దాడి – పరిణామాలు!!
============================

గత రెండు దశాబ్దాలుగా అమెరికా, దానికి తొత్తుగా వ్యవహరించే ఐక్యరాజ్యసమితి, ఇస్లాంపై అప్రకటిత యుద్ధాన్ని అమలు చేస్తున్నాయి. అవి తొమ్మిది ముస్లిం దేశాలపై బాంబుల వర్షం కురిపించి, కొన్ని లక్షల మంది అమాయక ముస్లింలను చంపేశాయి. ఓ రకంగా ఇది ఇస్లాం కి గడ్డు కాలం. ఇది గడ్డు కాలమే కానీ, “అత్యంత గడ్డు కాలం” మాత్రం కాదు. 13 వ శతాబ్ధంలో ఇస్లాం ఎదుర్కొన్న గడ్డుకాలానికి ఇది అస్సలు ఏ మాత్రం దరిదాపుల్లో కూడా రాదు. ఇస్లాం చరిత్రలో, ఇస్లాం కి అత్యంత నష్టం కలిగించిన వ్యక్తి మంగోల్ రాజు చెంగిజ్ ఖాన్.

ఎవరీ చెంగిజ్ ఖాన్?
పేరు చూసి చాలా మంది ఇతన్ని ముస్లిం అనుకుంటారు. కానీ, ఇతను ముస్లిం కాదు. అప్పటికి ఖాన్ లకు, ఇంకా ఇస్లాం పరిచయం అవ్వలేదు. ఇతను మొదట్లో, సంచార జీవనం సాగించే అనేక మంగోల్ తెగల్లో, ఓ చిన్న తెగనాయకుడు. కానీ, ప్రపంచాన్ని జయించడమే లక్ష్యంగా అనేక తెగల్ని ఒక్కటి చేసి, మంగోల్ తెగలన్నిటికీ తిరుగులేని నాయకుడయ్యాడు. ఇక అప్పటినుండీ ఒక రాజ్యం తర్వాత, ఇంకో రాజ్యంపై దండెత్తుతూ, అన్నిటినీ అప్రతిహతంగా జయించుకుంటూ వెళ్ళాడు. చైనా మొత్తం, ఆసియా, యూరప్ లలో చాలా భాగం ఇతని ఆధీనంలోకి వచ్చాయి. ఇతర రాజులకూ, మంగోల్ రాజులకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం – మంగోలులు జయించిన ఏ రాజ్యాన్ని అయినా సరే, పూర్తిగా నేలమట్టం చేయంది వదలరు. అక్కడ నాగరికత నామరూపాల్లేకుండా చేయడం, విలువైన వస్తువుల్ని, బంగారాన్నీ దోచుకోవడం, పురుషులందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపేయడం, అందమైన పడుచు యువతుల్ని ఎత్తుకెల్లడం.. ఇదే వారికి తెలిసింది తప్ప, ఓ చోట స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం, పరిపాలన సాగించడం పట్ల వారికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.

క్వారజ్మియన్ సామ్రాజ్యం
1220లో, చెంగిజ్ ఖాన్ చైనాను జయించేనాటికి, ప్రస్తుత ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్,తుర్కెమిస్తాన్ ప్రాంతాలు క్వారజ్మియన్ ముస్లిం రాజుల పాలనలో ఉన్నాయి. ఆ ప్రాంతాల ఐశ్వర్యం, సంపదల గురించి విన్న చెంగీజ్ ఖాన్, మొదటివిడతగా వారితో వ్యాపార సంబంధాలు నెరపాలని, ఓ వర్తక బృందాన్ని ఆ రాజు – అల్లా ఉద్దీన్ మొహమ్మద్ తో చర్చలకు పంపాడు. ఆ బృందంలో గూఢాచారులు ఉన్నారని అణుమానించిన అల్లా ఉద్దీన్ మొహమ్మద్ ఆ వర్తకుల్ని చంపేశాడు. ఇది విని కోపంతో రగిలిపోయిన చెంగీజ్ ఖాన్, లక్ష మంది సైన్యంతో క్వారిజ్మియన్ సామ్రాజ్యంపైకి దండెత్తి, ఆ రాజ్యంలోని మసీదులు, మదరసాలూ, నిర్మాణాలన్నిటినీ పూర్తిగా నేలమట్టం చేశాడు.మంగోలులు అక్కడి ప్రధాన నగరాలైన సమర్ఖండ్, బుఖారా, ఉర్గెంచ్ లను నామరూపాలు లేకుండా చేశారు. అక్కడి నిర్వాసితుల్లోని పురుషులందర్నీ చంపేయడానికి మంగోలులు చాలా శ్రమపడాల్సి వచ్చిందని చరిత్రకారులు రాసిఉన్నారు. ఒక్కో మంగోల్ సైనికునికీ, రోజుకు కనీసం 24 మంది పురుషుల్ని చంపాలనేది టార్గేట్ గా పెట్టారట. ఇది ప్రపంచ చరిత్రలో జరిగిన అత్యంత పాశవిక దండయాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. కొన్ని అంచనాల ప్రకారం కనీసం 10 లక్షలమంది చంపబడ్డారు. ఈ రకంగా క్వారజ్మియన్ రాజ్యాన్ని నేలమట్టం చేశాక, ఇక మంగోలుల తదుపరి లక్ష్యం ఇరాక్, జెరూసలేం, మక్కా,మదీనాలు.

ఇంతలో, చైనాలో తలెత్తిన కొన్ని తిరుగుబాట్లను అణచివేయడానికి, చెంగీజ్ ఖాన్ చైనాకు పయనమయ్యాడు. 1227లో అక్కడే చనిపోయాడు. చెంగీజ్ ఖాన్ మరణానంతరం అతని రాజ్యం నాలుగు భాగాలుగా విడగొట్టబడి, నలుగురు మనవల్లకు పంచబడింది.
1. బెర్కే ఖాన్ ( ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్ ప్రాంతం)
2. హులగూ ఖాన్ ( క్వారజ్మియన్ ప్రాంతం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ )
3. ముబారక్ షా ఖాన్ ( కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజ్కిస్తాన్, మధ్య రష్యా ప్రాంతం)
4. కుబ్లై ఖాన్ ( చైనా, మంగోలియా ప్రాంతం)

తన తాత అసంపూర్ణంగా వదిలేసిన ముస్లిం రాజ్యాల జైత్రయాత్రను పూర్తిచేయాలనే లక్ష్యంతో హులగూ ఖాన్ 1258లో, అప్పటి ప్రపంచంలోని మేటి రాజ్యాల్లో ఒకటైన అబ్బాసిద్ రాజ్యంపైకి దండెత్తాడు. దాని రాజధాని బాగ్దాద్ ని కూకటి వేల్లతో పెకిలించాడు. అనేక లైబ్రరీలను, మద్రసాలనూ తగలబెట్టాడు. వాటిలోని లక్షలాది పుస్తకాల్ని టైగ్రిస్ నదిలో పడెస్తే, ఆపుస్తకాల సిరా నీటిలో కరిగి, నది నీరు మొత్తం కొన్ని వారాల పాటు నల్లగా మారిపోయిందని చరిత్రకారులు రాశారు. హులగూ ఖాన్ చేసిన మరో దారుణం – అప్పటి ఇస్లాం ఖలీఫా అయిన అల్ ముస్తాసిం నే చంపేశాడు. ఐదు నుండీ పది లక్షల మందివరకూ ఈ దాడిలో చనిపోయారు. ఆ శవాల దుర్గంధం భరించలేక హులగూ ఖాన్ కొన్నాల్లు రాజ్యం వదిలి దూరంగా వెల్లిపోయాడట.
సాక్ష్యాత్తూ ఖలీఫానే చంపబడ్డాక, ఇస్లాం లో ఇంక మిగిలింది మక్కా,మదీనాలే.

కానీ, దానికి కొద్ది సంవత్సరాలముందే, అంటే 1252లో, చరిత్రలో ఎప్పుడూ జరగని ఓ అద్భుతం జరిగింది.

సహజంగా గెలిచిన రాజ్యాల/రాజుల మతం-సంస్కృతి వర్థిల్లుతుంది. ఓడిన వారి మతం-సంస్కృతి నశిస్తుంది/కనుమరుగవుతుంది. కానీ, మొదటిసారి దీనికి విరుద్ధంగా జరిగింది.

చెంగిజ్ ఖాన్ వారసుల్లో ఒకడైన బెర్కే ఖాన్, తన రాజ్యంగుండా ప్రయాణిస్తున్న కొందరు వర్తకుల్ని అటకాయించాడు. వారు ఎక్కడినుండీ వస్తున్నారని ప్రశ్నించగా, సమ్ర్ఖండ్ నుండీ అని వారు జవాబిచ్చారు. తన తాత నామరూపాల్లేకుండా చేసిన నగరంలో ఇంకా జనసంచారం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. అల్లా దయతో తాము బతికి బయటపడ్డామని చెప్పడంతో, ఈ అల్లా ఎవరూ అని బెర్కే ఖాన్ ప్రశ్నించాడు. ఆ రకంగా వారితో ఇస్లాం గురించి కొన్ని రోజులపాటు చర్చించిన మీదట బెర్కే ఖాన్ ఇస్లాం మతం స్వీకరించాడు. ఓ బలవంతుడైన రాజు, తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే బలహీన ప్రజల మతాన్ని తనదిగా చేసుకున్నాడు.

1258లో తన సోదరుడు హులగూ ఖాన్, బాగ్దాద్ పై చేసిన దాడి, అతను చేసిన దారుణాలూ, బెర్కే ఖాన్ ని తీవ్రంగా కలచివేశాయి. హులగూ ఖాన్ తదుపరి జెరూసలేం, మక్కా, మదీనా లపై దాడిచేసే అవకాశం ఉందని భావించిన బెర్కే ఖాన్, ఈజిప్ట్ ని పాలించే మరో ముస్లిం రాజవంశం అయిన -ముంలూక్ లతో చేతులు కలిపి, తన సొంత సోదరుడైన హులగూపైకే యుద్ధానికిదిగి, అతన్ని నిలువరించాడు. హులగూ తర్వాత రాజైన ఘజన్ ఖాన్ ఇస్లాం స్వీకరించడంతో వీరి వైరం ముగిసింది.
తన సోదరుడి ద్వారా ఇస్లాం గురించి తెలుసుకున్న, మధ్య రష్యా పాలకుడు- ముబారక్ షా కూడా ఇస్లాం స్వీకరించాడు. ఆ రకంగా చెంగింజ్ ఖాన్ మరణించిన మూడు దశాబ్ధాల్లోనే, తన నలుగురు వారసుల్లో,ముగ్గురు ఇస్లాం లోకి మారిపోయారు. వీరి తర్వాతి తరాలవారే మొఘల్ పాలకులుగా ఇండియాలోకి అడుగుపెట్టారు.
ఇస్లామిక్ రాజ్యాలపై మంగోలుల దాడులగురించి – THE LAND CONQUERED ITS CONQUERORS అని ఓ ప్రముఖ చరిత్రకారుడు వర్ణించాడు.

మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

One Reply to “ఇస్లాంపై మంగోలుల దాడి – పరిణామాలు!!”

Leave a Reply

Your email address will not be published.