ఇస్లాం గురించి వివరించిన లెక్కల ప్రొఫెసర్ – జెఫ్రీ లాంగ్


స్థలం : University of San Francisco, USA
కాలం : 1982

Dr Jeffrey Lang – మ్యాధమ్యాటిక్స్ ప్రొఫెసర్ – క్లాస్ తర్వాత, స్టాఫ్ క్వార్టర్స్ లో తనకు కేటాయించిన గదికి వచ్చాడు. ఆ గదికి అతనెప్పుడూ తాలం వేయడు. ఎందుకంటే, ఆ తాలం చెవి ఎక్కడో పోగొట్టుకోవడం, ఆఫీస్ రూం కెల్లి డూప్లికేట్ కీ తెచ్చుకోవడం చాలా సార్లు జరిగింది. ఎందుకొచ్చిన గొడవలెమ్మని , దానికి తాళం వేయడమే మానేశాడు. పైగా, స్టూడెంట్స్ అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు కన్వీనియంట్ గా ఉంటుందని, తాను రూం లో లేకున్నా కూడా వెయిట్ చేయకుండా, అక్కడున్న ర్యాక్ లో అసైన్మెంట్స్ పేపర్లు పెట్టేసి వెళ్ళమని చెప్పాడు. అలా ఆరోజు క్లాస్ నుండీ వచ్చిన జఫ్రీ ల్యాంగ్ కు, ఆ ర్యాక్ లో పేపర్లపైన ఓ పుస్తకం కనబడింది. ఏంటా ఈ పుస్తకం అని దానిని చేతిలోకి తీసుకుని చూశాడు. అదేంటో అర్థమైంది. ఎవరు పెట్టి ఉంటారో కూడా అర్థమైంది. “కుర్ర కుంకల్లారా, ఏదో క్యాజువల్ గా రెండు ప్రశ్నలెయ్యగానే, నాకే ఎర వెయ్యాలని చూస్తున్నారా.. నేనెంత ముదుర్నో మీకు తెలీద్రోయ్, నన్ను భరించలేక చర్చి వాల్లే నన్ను తరిమేశారు”- అని మనసులో అనుకుని, ఆ పుస్తకాన్ని పక్కన పడేశాడు.

Purdue University – అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటి. జెఫ్రీ ల్యాంగ్ ఆ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అతని తల్లి క్యాధలిక్ క్రిష్టియన్. నర్సుగా పని చేసేది. ఇతరులకు సేవ చేయడం అనేది కేవలం ఓ ఉద్యోగం లా కాకుండా – అదో పవిత్ర కార్యంలా, మనసుపెట్టి, అంకిత భావంతో పనిచేసేది. అందుకే, చుట్టుపక్కల వారు, బంధుమిత్రులు ఆమె గురించి ఎప్పుడూ చాలా గొప్పగా చెప్తుండేవారు. అతని తండ్రి మాత్రం చాలా తేడాగా ఉండేవాడు. మిగతా సమయాల్లో నార్మల్ గానే ఉండేవాడు గానీ, చీకటి పడిందంటే మాత్రం – ఫుల్లుగా తాగేసి రాక్షసుడిలా మారేవాడు. పిల్లల్ని, భార్యని పలు రకాలుగా హింసించేవాడు. ఇది దాదాపు ప్రతి రాత్రీ జరిగేది. ఇదంతా చూస్తూ పెరిగిన జెఫ్రీ ల్యాంగ్ కి – తన తల్లి, అంత మంచిదై ఉండీ, అందరికీ అన్ని సేవలు చేస్తుండీ కూడా, ఎందుకు ఇన్ని బాధలు పడాల్సి వస్తుందనేది అర్థం కాకుండా ఉండేది. అట్లే, అప్పట్లో జరిగిన వియత్నాం యుద్ధం, దానిలో అనేక మంది అమాయకులు,పిల్లలు చనిపోవడం.. ఇవన్నీ జెఫ్రీ ల్యాంగ్ మనసులో కొన్ని బేసిక్ ప్రశ్నలు/సందేహాలూ రేకెత్తించాయి.

ఈ ప్రపంచంలో ఇంత అరాచకం ఎందుకుంది?
దేవుడేగనక ఉంటే, అతను జనాల్ని ఎందుకు ఇంత సఫరింగ్ కి గురిచేస్తాడు?
ఈ ప్రశ్నలకు చర్చ్ లో సమాధానం దొరకలేదు. చివరికి ఈ ప్రశ్నలే, 18 సంవత్సరాల జెఫ్రీ ల్యాంగ్ ని నాస్తికునిగా ( అథెయిస్ట్) గా డిక్లేర్ చేసుకునేలా చేశాయి.

**********************
ఆరోజు తన రూంలో జెఫ్రీ ల్యాంగ్ ఖాలీగా కూర్చుని ఉన్నాడు. టీవీలో అన్నీ చెత్త ప్రోగ్రాములేవస్తున్నాయి. కొత్తగా చదవడానికి పుస్తకాలు కూడా ఏమీ లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా, ఆ పుస్తకం కనబడింది. అసైన్మెంట్ పేపర్ల ర్యాక్ లో, విద్యార్థులు ఉంచిన పుస్తకం. సరే, ఇదైతే తొందరగా నిద్రలోకి జారిపోవచ్చు అనుకుని దానిని చేతిలోకి తీసుకున్నాడు.

ENGLISH INTERPRETATION OF HOLY QURAN – అని కవర్ పేజ్ పై రాసి ఉంది.

మొదటి చాప్టర్ : అనంత కరుణామయుడైన అల్లా పేరుమీద. ఓ అంతిమ దినానికి ప్రభువా, నేను నిన్నే ఆరాధిస్తాను, నిన్నే అబ్యర్థిస్తాను, నాకు, నిన్ను నిరాకరించి భ్రష్టుపట్టిన వారి మార్గం కాకుండా, సన్మార్గం, రుజుమార్గం చూపించు. ఆమీన్.

ఇది చదవగానే, అబ్బో, ఈ పుస్తకం రాసినాయనెవరో మాంచి తెలివైనోడిలా ఉన్నాడే. నాకు తెలీకుండానే, నాతో ప్రార్థన చేయించేశాడు – అనుకున్నాడు.

ఇక రెండో చాప్టర్ – అల్ బఖరా.. దాన్లో కూడా యధాలాపంగా ఒక్కో వాక్యం చదువుకుంటూ వెల్తుంటే.. అతని కళ్ళు 30 వ వాక్యం దగ్గర ఆగాయి.

-“భూమిమీద మనిషిని సృష్టించబోతున్నావా? అది కూడా, అవినీతి,అక్రమం, రక్తపాతం వంటి పనులు చేయలగ మనిషిని? ఎందుకు? ఎందుకు అలాంటి మనిషిని సృష్టించబోతున్నావ్”- అని దేవదూతలు ప్రశ్నించారు.

ఇది చదవగానే జెఫ్రీ ల్యాంగ్ కి కరెంట్ షాక్ కొట్టినట్లైంది. ఎందుకంటే, అదే ఎగ్జాక్ట్ గా అతని ప్రశ్న. మనసుపెట్టి ఆలోచించగలిగే వారందరి ప్రశ్న. మానవ జాతి ఆలోచనా పరంపరలోనే అత్యంత ముఖ్యమైన,సంక్లిష్టమైన ప్రశ్న.

ఈ పుస్తకం రాసినాయన తెలివైనోడని అప్పటివరకూ అనుకున్నాడు గానీ, పాపం వెర్రిబాగులోడిలా గున్నాడు. లేకుంటే, అలాంటి సమాధానం లేని ప్రశ్న గురించి ఎవరైనా మాట్లాడుతారా? పోనీ మాట్లాడినా, లోపలి పేజీల్లో, ఏదో చెప్పీ-చెప్పనట్లు, మమ అనిపించేటట్లు ఉండాలి కానీ, ఇలా ఇంత స్పష్టంగా గోడకు కొట్టినట్లు, పుస్తకం ప్రారంభం లోనే చెబితే ఎలా అనిపించింది – జఫ్రీ లాంగ్ కి.

కానీ, అసలు ఇలాంటి ఓ ప్రశ్నను అక్నాలెడ్జ్ చేయడం, దానిని చర్చకు పెట్టడం అనేదే – ఆస్తికత్వం తరుపున చూస్తే, గొప్ప సాహసోపేత విషయంగా కూడా అనిపించింది. ఇంతకూ – ఈ ప్రశ్నకు సమాధానం ఏముందో కనుక్కోవాలనే ఆసక్తి మొదలైంది. ఎంతైనా , తనను సంవత్సరాల తరబడి వెంటాడిన ప్రశ్న కదా. అప్పటి దాకా ఏదో ఆశా మాషీగా చదువుతున్నోడు కాస్తా, అలర్టై- ప్రతి పదాన్నీ విశ్లేషించి చదవడం మొదలుపెట్టాడు. ఆ చదవడం కొన్ని వారాలు, నెలలపాటు కొనసాగింది.
అతను చదివేది, మిగతా అన్నిపుస్తకాల లాగా, ఏవో కొన్ని అక్షరాలు ప్రింట్ చేసి ఉన్న పుస్తకం కాదని అర్థమైంది. ఆ పుస్తకం ఆరిజిన్ కి కారణమైన వ్యక్తి – ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర పుస్తకాల్ని ముందేసుకుని మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టాడు. అంతిమంగా, అతని అన్ని ప్రశ్నలకీ సమాధానం దొరికినట్లైంది.

************************

తన థాట్ ప్రాసెస్ ని ఖురాన్ ఎలా మార్చేసింది – అనే అంశం గురించి జెఫ్రీ ల్యాంగ్ అనేక ప్రసంగాలు ఇచ్చారు. ఇవి యూటూబ్ లో అనేకం ఉన్నాయి. అవేవీ మత ప్రసంగాల్లా ఉండవు. ఓ మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కి బ్లాక్ బోర్డ్ మీద మ్యాథ్స్ ఫార్ములాలు వివరిస్తున్నట్లుగనే ఉంటుంది. ఇంటెలెక్ట్, ఛాయిస్, హ్యూమన్ సఫరింగ్, ఇవన్నీ ఎలా పార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ క్రియేషన్.. ఖురాన్ వీటి గురించి ఎక్కడెక్కడ, ఏమేం చెప్తుంది లాంటి విషయాలు శ్రోతల్ని, ముఖ్యంగా ముస్లింలను కట్టిపడేస్తాయి. ఎందుకంటే – తాము మసీదుల్లో వినే ప్రసంగాల్లో, ఎవరూ ఖురాన్ ని ఇలా లాజికల్ గా అనలైజ్ చేయడం చూసి ఉండరు కాబట్టి. 1980-2000 కాలంలో జెఫ్రీ లాంగ్ అనేక ప్రసంగాలు ఇచ్చారు. అవన్నీ ఆడియన్స్ తో కిక్కిరిసి పోయేవి. ఆయన వివిధ అంశాలపై చేసిన ప్రసంగాల్లో, ఖురాన్ ఏ చాప్టర్ లో, ఏ వాక్యం లో ఏమని చెప్తుంది, ‘మీరు ఆలోచించరా’, ‘మీకు అర్థం కావడం లేదా’, ‘తెలివిని ఉపయోగించరా’, వంటి లాజిక్,రేషనాలిటీకి సంబంధించిన వివిధ చర్చలు, ఖురాన్ లో ఎక్కడెక్కడ, ఎన్నెన్నిసార్లు వచ్చాయి.. ఇలాంటివన్నీ అంకెలు, గణాంకలతో సహా వివరించాడు. ఇంటర్నెట్ అందుబాటులో లేని, కంప్యూటర్ సెర్చ్ ఇంజన్లు అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆరోజుల్లో, ఆయన ఇంత సమాచారాన్ని, ఎలా సేకరించగలిగాడన్నది ఓ అంతు చిక్కని ప్రశ్న.

ఆయన రాసిన పుస్తకాలు –
1.Even Angels Ask: A Journey to Islam in America
2.Struggling To Surrender
3.Losing My Religion: A Call For Help
ఈ పుస్తకాలు, ప్రసంగాలూ కొన్ని వేలమందిని ఇస్లాం వైపుకు నడిపించడమే కాకుండా, లక్షలాది ముస్లింలకు కూడా – ఇస్లాం ని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహకరించాయి. ఇంకా చేస్తున్నాయి.

One Reply to “ఇస్లాం గురించి వివరించిన లెక్కల ప్రొఫెసర్ – జెఫ్రీ లాంగ్”

Leave a Reply

Your email address will not be published.