చదువుకున్న ముస్లింల డైలమా!!
========================
“రేయ్.. మసీద్ వాళ్ళు వచ్చారు, త్వరగా నిద్ర లేచి వెళ్ళు”!!
ఆదివారం పొద్దున, మాంచి నిద్దర్లో ఉండగా, ఈ మాటలు చెవిన పడ్డాయంటే, ఇక ఆరోజుకి మనం దొరికిపోయామని అర్థం. మా వూరి మసీదులో ప్రతి ఆదివారం ఉదయం ‘స్టూడెంట్స్ ఇజ్తిమా’ ఉంటుంది. మసీదు పక్కకి రాకుండా, బలాదూర్ గా తిరిగే ముస్లిం కుర్రాలందర్నీ ఇళ్ళిళ్ళూ తిరిగి పోగేసి, ఓ రెండు, మూడు గంటల పాటు ఇస్లాం గురించి, ప్రవక్త గురించీ బోధించే కార్యక్రమం అది. ఈ విషయం గుర్తున్న కుర్రోళ్ళు, మసీదువారు రాకముందే నిద్రలేచి పొలం గెట్లమీదికో, కాలేజీ గ్రౌండ్లోకో పారిపోయేవారు. గుర్తులేనోల్లు మాత్రం ఆరోజుకి వారికి సరెండర్ అయిపోవడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. అలా వారికి నేను కూడా చాలా సార్లు పట్టుబడటం జరిగింది.
“ఒరే అబ్బాయిలూ! ఈ జీవితం కేవలం ఒక పరీక్ష లాంటిది. ఇది తాత్కాలికమైనది. మనం ఈ జీవితంలో చేసే పనుల్ని బట్టి, మరణానంతరం మంచి పనులు చేసినవారిని స్వర్గంలోనూ, చెడు పనులు చేసిన వారిని నరకంలోనూ పడేస్తారు. నరకంలో తీవ్రమైన శిక్షలుంటాయి. ఎన్ని తప్పులు చేస్తే అన్ని సార్లు మంటల్లో వేసి కాలుస్తారు. ఒక సారి చర్మం కాలి బూడిద కాగానే, కొత్త చర్మం మల్లీ పుట్టించబడుతుంది. అలా ప్రతి తప్పుకూ శిక్ష ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనికీ లెక్క చెప్పాల్సి ఉంటుందనే విషయం మరవకూడదు” – ఇలా పాపం ఆ ముల్లా గారు కళ్ళు మూసుకుని చెప్పుకుంటూపోతుంటే, అది వింటున్న మా ఆలోచనలు మాత్రం మరోలా ఉండేవి.
“ఓసోస్.. ఇదంతా మేము ఆల్రెడీ ‘యముడికి మొగుడు’ సినిమాలో చూసేశాం, దాంట్లో చిరంజీవి యముడ్ని భలే ఆటపట్టించాడు. అందులోని, పాటలూ, డ్యాన్సులూ కూడా ఎంత బాగుంటాయో. పాపం ఈ పెద్దాయన అవేమీ చూడకుండా చాలా మిస్సవుతున్నాడు” అని ఆయన మీద సానుభూతి ఫీలయ్యేవాల్లం.
“మనందరం అల్లా సృష్టించిన తొలిజంట అయిన ఆదం-హువ్వా ల సంతానం. మనకు ఉండాల్సిన మొట్ట మొదటి లక్ష్యం – ప్రవక్త యొక్క అడుగుజాడల్లో నడిచి సాధ్యమైనంత పుణ్యం మూటగట్టుకోవడం, అంతే తప్ప, డబ్బు సంపాదనో,డాక్టర్లు,ఇంజనీర్లై సమాజం దృష్ఠిలో గొప్ప వారుగా కీర్తింపబడటమో కాదు” -ఆయన ఇలా చెప్పుకుంటూ పోతుంటే, నాకు మాత్రం అంతకు ముందు క్లాసులో విన్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, అమీబా-ఏక కణ జీవి-కోతి-చింపాంజీ- ఏప్-వంగినడిచే మానవుడు-నిటారుగా నడిచే మానవుడు ల డయాగ్రం గుర్తొచ్చి -“పాపం ఈయన చదివిన మదరసాలో ఇంకా సిలబస్ అప్డేట్ చేసినట్లు లేదు” అనిపించేది.
అలా ఏలాగోలా వారి సూక్తుల్ని కొన్ని గంటల పాటు భరించాక, చివర్లో మాకు ఇష్ఠమైన కార్యక్రమం ఒకటి ఉండేది. అది లడ్డు-బూందీ పంపకం. అసలు మధ్యలోనే వెల్లిపోకుండా, చివరి వరకూ చాలా మందిని కూరోబెట్టేది ఇదే అని నా నమ్మకం. అలా ఒకానొక ఆదివారం నాడు, ఆ బూంది తినేసి, మసీదులోని మట్టి బానలో ప్లాస్టిక్ గ్లాసు ముంచుకొని, స్కూల్లో తాగినట్లుగా, పైనుంచి ఎత్తి నోట్లో పోసుకుంటుండుగా, వెనక నుండి వచ్చిన ఇమాం గారు మెల్లాగా నా వీపు చరిచి – “ప్రవక్త ఏం చెప్పారో తెలీదా? నీళ్ళు తాగేటప్పుడు, గ్లాసుని పెదాలకి అతికించుకుని తాగాలి, నీముందు తాగిన వ్యక్తి ఎవరైనా సరే, నువ్వు నోటికి తగిలించుకునే తాగాలి. మనుషుల్లో పెద్ద,చిన్న అనే తేడాలు ఉండవు, ఇంకెప్పుడు ఇలా పైకి ఎత్తి పోసుకుని తాగకు” అని మందలించారు. నాకు వెంటనే అంబేద్కర్ గారి గురించి చదివిన పాఠం గుర్తుకు వచ్చింది. ఆయన స్కూల్లో నీళ్ళు తాగే విషయంలో అనుభవించిన అవమానం, నీళ్ళు ఎత్తి పోసే ప్యూన్ ఆరోజు స్కూలుకి రాకపోతే, ఆయన రోజంతా ఎలా దప్పికతోనే ఉండాల్సి వచ్చేదో గుర్తొచ్చి, ఇలాంటి సామాజిక దురాచారాన్ని 14 శతాబ్దాలకి పూర్వమే నిర్మూలించిన మహమ్మద్ ప్రవక్త మీద మొదటిసారి కొండంత గౌరవం కలిగింది.
* * *
ఓ వ్యక్తి ఆలోచనా విధానాన్ని, అతను చదివిన చదువులు, అతని చుట్టూ ఉన్న సమాజం చాలా వరకు ప్రభావితం చేస్తాయి. మన సైన్స్ ఆధారిత విద్యావ్యవస్థ, జనాల్ని నవ్వించడం/ఏమార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న టి.వి.సినిమా లాంటి ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ, డబ్బు, పరపతి, హోదా వంటివే నిజమైన విజయానికి చిహ్నాలుగా గుర్తించే మన సమాజం, ఇవన్నీ కలిసి మతం అంటే, మనం ఏరోజు కొత్త బట్టలు తొడుక్కోవాలో,ఏ రోజు పిండి వంటలు/పలావు వండుకోవాలో చెప్పే సాధనంగా మాత్రమే మతాన్ని పరిమితం చేసేశాయి. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. కటిక పేదరికం వల్ల చిన్నప్పటినుండి మదరసాల్లో కేవలం మత విద్యకే పరిమితమైన కొంతమంది ముస్లింలకు తప్ప, సెక్యులర్ ఎడుకేషన్(ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ) చదివిన చాలా మంది ముస్లింలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఇలాంటి సమాజంలో వ్యక్తులకు ఉండే ప్రాధామ్యాలు – మంచి ఉద్యోగం/వ్యాపారం, ఆస్తులు, పలుకుబడి, ప్రయోజకులైన పిల్లలు మొదలైనవి. వీరి ఆలోచనలు చాలా వరకూ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దేవుడు, మతం వంటివి పూజారులు,ఫాదర్లు,ఇమాంలు వంటి వారు తెలుసుకోవలసిన అంశాలని, వీటితో తమకేం పెద్దగా అవసరం లేదనీ వీరు భావిస్తారు. మరీ అంతగా అవసరమనుకుంటే, బాగా ఫేమస్ అయిన పుణ్క్యక్షేత్రాలు, దర్గాల దగ్గరకెల్లి, ‘ నువ్వు నాకు ఇది చేసిపెడితే, నేను నీకు అది ఇస్తా ‘అని దేవుడితో డీల్ కుదుర్చుకుంటారు. ఇంతకు మించి, దేవుడి గురించీ,మతం గురించీ ఎక్కువగా ఆలోచించే అవసరం గానీ, ఆసక్తి గానీ చాలా మందికి ఉండదు. వీరికి మతం అనేది కేవలం ఓ సాంఘిక గుర్తింపుగా మాత్రమే ఉండి, దాని ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు గానీ, దాని ద్వారా వచ్చే కష్టనష్టాలు గానీ ఏమీ ఉండవు. ఈ చివరి వాక్యం మిగతా మతస్తులందరికీ వర్తిస్తుంది గానీ, ముస్లింల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది.
ప్రస్తుత సమాజంలో ముస్లిం గా ఉండటం అనేది చాలా రిస్కీ వ్యవహారం. కేవలం ముస్లిం పేరు చూసి చాలా విషయాలు డిక్లేర్ చేయబడ్తాయి. ఆ పేరు ఒక్కటి చాలు ఎదుటి వ్యక్తిలో అనేక ఫీలింగ్స్ ని కలుగ జేయడానికి. ఆ పేరు చూసి కొన్ని దేశాలు వీసా నిరాకరిస్తాయి. ఆ పేరుగల వారు ఎక్కువ మంది ఉండే దేశాల్ని ఉత్తిపుణ్యానికే బాంబుల దిబ్బగా మార్చేసినా, మిగతా ప్రపంచానికి అదేమంత పెద్ద విషయంగా అనిపించదు. ముస్లిం పేరు చూసి, అప్పటి వరకూ ఇల్లు అద్దెకిస్తానని చెప్పిన హౌస్ ఓనర్ కి, వాళ్ళ ఆవిడ ఇంకొకరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్న విషయం గుర్తుకు వస్తుంది. ఆ పేరు చూసి పోలీసులు కొన్ని కేసులు డిసైడ్ చేసేస్తారు. ఆ పేరు చూసి, అరెస్టు చేసిన వారిని ‘టెర్రరిస్టులు’ అని పిలవాలో, ‘నిందితులు’ అని పిలవాలో మీడియా డిసైడ్ చేస్తుంది. మొన్నటికి మొన్న జైల్లో 12 సంవత్సరాలు గడిపిన ఇద్దరు నిందితుల్ని ఓ ఢిల్లీ కోర్టు, నిర్దోషులుగా విడుదల చేసింది. విడుదలైన వారి ఫేసుల్లో ఆనందం చూస్తుంటే, మొన్నామధ్య, మధ్య ప్రదేశ్ లో , అంతకు ముందు తెలంగాణలో, పోలీసుల ‘హీరోచిత’ ఎన్ కౌంటర్లో చనిపోయిన అండర్ ట్రైలర్స్ పరిస్థితి తమకు రానందుకు వారు తెగ ఆనందపడుతున్నట్లుంది. అన్నట్లు చనిపోయిన వారి పేర్లు ముస్లింలవి అయితే,జరిగింది ‘ఎన్ కౌంటరా’ లేక, ‘ఫేక్ ఎన్ కౌంటరా’ అనే విషయం అంతగా ఇంపార్టెంట్ కాదనేది తెలిసిందే. ముస్లిం పేరు ‘బాధితుడిదా’, ‘నిందితుడిదా’ అనేదాన్ని బట్టి, నేరం యొక్క తీవ్రత మారుతుంది. ఇవన్నీ కేవలం ముస్లిం పేరు చూశాకే… ఆ పేరు గల వ్యక్తి ఇస్లాం ని ఆచరించే నిజమైన ముస్లిమా, లేక మిగతా అందర్లానే ప్రాపంచిక విషయాలకై తపించే ‘ఉత్త ముస్లిమా’ అనేది కూడా ఎవరూ చూడరు. వార్తల్ని,సమాజాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించే వారికి, పైన చెప్పిన విషయాలన్నీ రెగ్యులర్ ట్రెండే తప్ప, ఏదో కాకతాలీయంగా జరిగిన ఒకటి రెండు సంఘటనలు కావని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అసలు ఇంతకీ, ఇన్ని ప్రత్యేక ‘ఫెసిలిటీస్’ ముస్లింలకే ఎందుకున్నాయనేది అసలైన ప్రశ్న. ఈ ప్రశ్న ముందుగా తట్టేది -ఇస్లాం ని ఫాలో అవ్వని కేవలం ముస్లిం పేర్లు గల వ్యక్తులకే. ముస్లింలకు వ్యతిరేకంగా ఇన్ని దారుణాలు జరుగుతుంటే, ఈ దాడివాలా (గడ్డం) ముస్లింలు, తమకేం పట్టనట్లు, ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని వీరు అసహనానికి గురవుతుంటారు. మరోవైపు తాము మిగతా అందర్లాంటి వారిమే అయినా, తమ పట్ల సమాజం ఎందుకు ఇంత వివక్షాపూరితంగా ఉందనే అణుమానం వీరిని తొలుస్తుంటుంది. దానికి మిగతా సమాజం నుండి వినిపించే రెడీమేడ్ సమాధానాలు “మీ మతం చాలా ప్రమాదకరమైనది”, ” మీ ఖురాన్ లోని వాక్యాలు చదివి టెర్రరిస్టులు పుట్టుకొస్తున్నారు”, “కాలానికి తగ్గట్లుగా మీ మతం అప్డేట్ అవ్వట్లేదు” ఇలా ఉంటాయి.
ఇస్లాం గురించి వీరికి ఉన్న కొద్దిపాటి పరిగ్ఞానం, మెయిన్ స్ట్రీం మీడియాలో ఓ పద్దతి ప్రకారం జరుగుతున్న వన్ సైడ్ న్యారేషన్ ఫలితంగా, ఇస్లాం పై ఉన్న ఈ అపవాదులు నిజమేనేమో అనే అణుమానం కూడా వీరికి కలుగుతుంది. దీనితో, అర్జంటుగా ఇస్లాంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని వీరు ఫీలైపోతుంటారు. తమకున్న క్రియేటివ్ ఐడియాస్ తో, ఈ దిశలో సాటి ముస్లింలకు ఏదైనా సేవ చేద్దామని ప్రయత్నిస్తే, సాంప్రదాయక ముస్లిం నాయకులు, ఉలేమాలు మాత్రం వీరి ఆలోచనలకు ఎలాంటి విలువా ఇవ్వకపోగా, ‘ముందు అయిదు పూటలా నమాజ్ చదవండి’, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుదాం అని రివర్స్ బ్రెయిన్ వాష్ కి దిగుతారు. దీనితో అటు ముస్లిం ఐడెంటిటీతో సమాధాన పడలేక,ఇటు మెయిన్ స్ట్రీం ఇస్లాం తో కలిసి నడవలేక, వీరు మరింత ఫ్రస్టేషన్ కి గురవుతుంటారు. ఈ ఫ్రస్టేషన్ని, డిసప్పాయింట్మెంట్ ని కొందరు కవితలు,కథలు,వ్యాసాలు రాసి, వాటిని అచ్చు రూపంలో చూసుకుని స్వాంతన పొందుతుండగా, చాలా మంది ముస్లిం విద్యావంతులు మాత్రం దీనిని సైలెంట్గా భరిస్తున్నారు.
కొందరు ముస్లిం మత పెద్దలు ఇస్లాం ని మరీ సంకుచిత దృష్ఠితో విశ్లేషిస్తూ, దానికి చెడ్డ పేరు తెస్తున్నారనేది కాదనలేని నిజం. ఉదాహరణకి, పంది మాంసం తినడాన్ని నిషేధించిన ఖురాన్ గ్రంధం, గత్యంతరం లేని పరిస్థితిలో దానిని తినొచ్చని కూడా చెప్తుంది. అట్లే, మహమ్మద్ ప్రవక్త, మదీనాలో ఉన్నప్పుడు ఆయనతో చర్చల కొరకు నజ్రత్ అనే ప్రాంతం నుండి 60 మంది క్రైస్తవ మత పెద్దలు వచ్చారు. చర్చలు జరుగుతుండగా, వారు ప్రార్థన చేసుకోవటానికి స్థలం కావాలని అడగగా, ప్రవక్త వారిని మసీదులోనే, వారి మతాచారం ప్రకారం ప్రార్థన చేసుకోనిచ్చారని హదీసుల్లో గ్రంధస్థం చేయబడి ఉంది. ప్రవక్త ఇతర మతాల పట్ల అత్యంత సహన భావం ప్రదర్శించిన ఇలాంటి దృష్టాంతాలు అనేకం మనకు కనిపిస్తాయి. మతానికి సంకుచితార్థాలు తీస్తున్న కొంత మంది మత పెద్దల నుండి మతాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. కానీ దాని కంటే ముందు, ఇస్లాంలోని సార్వజనీన, విశాల భావాల్ని అర్థం చేసుకుని, ఆచరణలో చూపాల్సి ఉంటుంది.
“These mountains that you are carrying, you were only supposed to climb.” – అని ఇంగ్లీష్ లో ఓ ప్రముఖ నానుడి.ఇస్లాం గురించి తెలియాలంటే, కేవలం మెయిన్ స్ట్రీం మీడియా చెప్పే అసత్యాలు,అర్థ సత్యాలు అది హైలైట్ చేసే ఒకరిద్దరు ముసలి ముల్లాల ఫత్వాల దగ్గరే ఆగిపోకుండా, ప్రవక్త బోధనల గురించి, ఖురాన్ పుట్టుపూర్వోత్తరాల గురించి, ప్రపంచ రాజకీయాలు, చరిత్ర గురించీ పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా స్టడీ చేసిన అనేకమంది, ముస్లింలు, ముస్లిమేతరులు కూడా, ఇస్లాం ద్వారా అపరిమిత శాంతిని పొందిన దృష్టాంతాలు అనేకం మనకు కనిపిస్తాయి. ప్రస్తుత సమాచార సాంకేతిక యుగంలో, ఇదేమంత కష్టమైన పని కూడా కాదు. ఎలాంటి సమాచారమైనా కేవలం ఒక్క మౌస్ క్లిక్ దూరంలో ఉన్న గూగుల్ యుగంలో, మన ఐడెండిటీ గురించి మనమే డైలమాలో ఉండటం అంత మంచిది కాదు.
-మహమ్మద్ హనీఫ్.యస్.
shukravaram.in
Asalamu walekumu manchi msg chala baga vivirana echaru
Waalaikum Assalam. Thank you