పులి – జింక
కొన్నేళ్ళక్రితం మాట. ఓ రోజు బాగా బోర్ కొడుతుంటే, కాసేపు బయట తిరిగొద్దామని బయలుదేరాను.కోఠీలో ఫుట్పాత్ పై నడుస్తుండగా ఆ పక్కనే ఉన్న పుస్తకాల దుకాణంలోని ఓ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ పోస్టర్ పై భాగంలో ఈ వాక్యం రాసి ఉంది – ” అడవిలో ప్రతి ఉదయం ఓ జింక నిద్రలేస్తూనే తన పరుగు మొదలుపెడుతుంది. అది పులి కన్నా వేగంగా పరిగెత్తాలి. లేకుంటే పులికి ఆహారమవుతుంది”.
దాని కింద పరిగెడుతున్న ఓ జింక బొమ్మ, దానికింద ఇంకో వాక్యం ఉంది. -“అడవిలో ప్రతి ఉదయం ఓ పులి నిద్ర లేస్తూనే తన పరుగు మొదలుపెడుతుంది. అది జింక కన్నా వేగంగా పరిగెత్తాలి. లేకుంటే ఆకలి చావు చస్తుంది.”
దానికింద, పరిగెడుతున్న పులిబొమ్మ ఉంది.
ఇక చివర్న, పెద్ద అక్షరాల్తో మరో వాక్యం ఉంది -” పులైనా, జింకైనా.. ప్రాణంతో ఉండాలంటే పరిగెత్తాల్సిందే”
ఈ పోస్టర్ చూడగానే, ఏదో కొత్త జీవిత సత్యం తెలిసినట్లనిపించింది. పులికి జింకకు ఏం తేడాలేదు. బతకడానికి రెండూ పరిగెత్తాల్సిందే అనే కాన్సెప్ట్ నాకు చాలా గొప్పగా అనిపించింది. అప్పటి దాకా ఉన్న నిరాశ, నిస్పృహల స్థానంలోనే ఓ కొత్త శక్తి, ఉత్సాహం ఆవరించాయి. వెంటనే ఆ పోస్టర్ తీసుకెల్లి రూంలో గోడకి అతికించాను.రెండు రోజులు చాలా ఉత్సాహంగా గడిచాయి. ఈ రెండు రోజుల్లో, ఆ పోస్టర్ ని చాలాసార్లు తన్మయత్వంతో చూశాను. కానీ, సడెన్ గా ఓ రోజు, ఆ పోస్టర్లోని లాజిక్ లో ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది.
పులి, జింక రెండూ పరిగెడుతూనే ఉంటాయి. కానీ ఓ పరుగులో పులి ఓడిపోతే ఏమవుతుంది? ఏమీ అవదు. కాసేపటి తర్వాత ఆ పులి మరో జింక వెంట పడుతుంది. అదే పరుగులో జింక ఓడిపోతే? ఇక జింకకి అదే ఆఖరి పరుగు. మరోసారి పరిగెత్తడానికి అది ప్రాణాలతో ఉండదు. బతకడానికి పులికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాని జింకకి కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఉంది. ‘రెండూ జంతువులే, బతక డానికి రెండూ పరిగెత్త వలసిందే’ అనే కాన్సెప్ట్ కేవలం ఓ రకమైన భ్రమ. పరిగెత్తడానికి రెండింటికీ నాలుగు కాల్లైతే ఉన్నాయి కానీ, పులికి అదనంగా నోట్లో కోరలు, కాళ్ళకి గోర్లు ఉన్నాయి. అడవిలోని జింకలన్నీ కలిసినా, ఒక్క పులిని కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే, ప్రకృతి అలా డిసైడ్ చేసింది మరి.
జంతువుల సంగతి సరే, మరి మానవుల సంగతి ఏంటి? “మానవులందరూ సమానమే, మనుషులందరికీ కష్టాలు వస్తుంటాయి, కష్టపడి పనిచేసే వారికే విజయం వరిస్తుంది”- ఇలాంటివన్నీ తరచుగా వింటుంటాం.
ఓ రిక్షా తోలుకునే వ్యక్తి కొడుక్కి ఏ గుండె జబ్బొ వస్తే, ఆపిల్లవాడు బతికే అవకాశం ఎంత? అతని రిక్షా, వారు నివసించే పూరిగుడిసె అన్నీ అమ్ముకున్నా, గుండె జబ్బు నయం చేసుకోవడానికి కావలసిన డబ్బు సమకూరదు. సహజంగా, అతని బంధువులు, చుట్టుపక్కల వారుకూడా పేదవారే ఉంటారు కాబట్టి, అందరు కలిసినా ఆ పిల్లాడ్ని బతికించుకోవడం అసాద్యం. అదే, ఓ ధనవంతుడి కొడుక్కి గుండె జబ్బు వస్తే, అతను బతికే అవకాశం ఎక్కువ. అంటే, ఇక్కడ ‘డబ్బే ‘ అవకాశం. ఆ డబ్బు సంపాదించడం కోసం కొందరు జీవితకాలమంతా కష్టపడాలి. కానీ కొందరికి మాత్రం, పుట్టుకతోనే కోట్లాది డబ్బు వంశపారంపర్యంగా సమకూరుతుంది. అట్లే, ఓ ప్రభుత్వోద్యోగమో, కాలేజీ సీటో, లేక ప్రభుత్వ కాంట్రాక్టో కావాలంటే ప్రభుత్వంలో ఉండే వారితో పరిచయం అవసరం అవుతుంది. కొన్ని కులాలకి, కుటుంబాలకీ రాజకీయం ఇంట్లో పెంపుకుడు కుక్క లాంటిది. . కొన్ని కులాలు పాలకులుగా ఉండగా, మిగతా చాలా కులాలు, జాతులు మాత్రం పాలితులు గానే మిగిలిపోతారు. పలుకుబడి, రాజకీయ అధికారం కూడా అనేక అవకాశాల్ని సృష్ఠిస్తుంది. బాగా కష్ట పడ్డవారినే విజయం వరిస్తుందంటారు. కానీ, ఎండలో రోజంతా కష్టపడ్డ ఓ శ్రామికుడు మహా ఐతే రోజుకు 400 రూపాయలు సంపాదించగలడు, కానీ కొందరు ఏ.సి లో కూర్చుని, మౌస్ ద్వారా కాపీ, పేస్ట్ లు చేసి కూడా వేలకు వేలు సంపాదించేవారు ఉన్నారు. ఇదే పని అమెరికాలో చేస్తూ, వేల కొద్దీ డాలర్లు సంపాదించేవారూ ఉన్నారు.
పులికి కోరలు,గోర్లు పుట్టుకతో వచ్చినవి. వీటి గురించి జింక చేయగలిగిందేమీ లేదు. కానీ, సృష్టికర్త మానవులందరినీ సమానులుగానే సృష్ఠించాడు. అయినప్పటికీ డబ్బు, పలుకుబడి, రాజకీయాధికారం లాంటివి కేవలం కొన్ని కులాలు,వర్గాలకే పరిమితం కావడం అనేది మానవుడు నిర్మించుకున్న వ్యవస్థ లోపం వల్ల ఏర్పడింది. ఏ వర్గంలో, ఏ ప్రాంతంలో పుట్టాలనే విషయాన్ని మనం నిర్ణయించుకోలేము. కానీ, చనిపోయేనాటికి, వ్యక్తిగతంగానూ, మరియు వర్గ పరంగానూ మన విలువను మనం పెంచుకోగలగాలి, కనీసం ఆ దిశగా ప్రయత్నించాలి. దీనినే ఇంగ్లీష్ లో వ్యాల్యూ యాడ్ అంటారు. దీని కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవల్సి ఉంటుంది. ఉదాహరణకు, వ్యక్తిగతంగా ఎలాంటి చెడు అలవాట్లకూ గురికాకుండా, విద్యా పరంగానో, వాణిజ్యపరంగానో ఎదుగుదలకి ప్రయత్నించడం. రాజకీయంగా.. మనతో సాంస్కృతిక, భావసారూప్యత కలిగిన అన్ని వర్గాలనీ కూడగట్టి ఓ రాజకీయ శక్తిగా ఎదిగేలా ప్రయత్నించడం మొదలైనవి. మానవ వికాసానికి కావలసిన వనరులు పరిమితంగా ఉన్నచోట, సహజంగానే, ప్రతి వ్యక్తి/వర్గం ఇతర వ్యక్తులు/వర్గాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఇక్కడ వర్గం అనేది కులం/మతం/రాష్ట్రం/దేశం వీటిలో ఏదైనా కావచ్చు. మన వెనుకబాటుతనానికి ఇతరుల్ని నిందిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు. డార్విన్ చెప్పినట్లు, జాతుల మధ్య వనరుల కోసం నిరంతరం పోటీ ఉంటుంది. పనికొచ్చే లక్షణాలు, ప్రభావశీల గుణాలు కలిగినవారు మాత్రమే గెలిచి నిలుస్తారు, ఇతరులు క్రమంగా అంతరించిపోతారు. ఇది వ్యక్తులకైనా, వర్గాలకైనా సమానంగా వర్తిస్తుంది.
కావున, మనుషులందరూ సమానమేననే భక్తి ప్రవచనాలు వింటూ కళ్ళు మూసుకుని కూర్చోకుండా, ఆ మనుషుల్లోనూ పులులూ, జింకలూ ఉన్నాయని గుర్తించడం చాలా అవసరం. మన పుట్టుకను మనం ఎలాగూ మార్చలేం. కానీ ఉన్న కొద్దిపాటి వనరుల్నీ సంఘటితం చేసుకుని, సమర్థవంతంగా పోరాడితే పులుల్ని కాస్తైనా నిలువరించగలం. ప్రపంచంలో ఏ పులీ, తన కోరల్ని తనకు తానుగా స్వచ్చందంగా వదులుకోదు. సహజంగా పులులు ఆకలైనప్పుడు మాత్రమే వేటాడతాయి. కానీ, జింకకు పరిగెత్తేంత/ప్రతిఘటించేంత సీన్ లేదని తెలిస్తే, గోర్లకు జిలపుట్టినప్పుడూ, ఎర్ర రంగుతో హోలీ ఆడుకోవాలనుకున్నప్పుడూ కూడా వేటాడతాయి. బి అలర్ట్ అండ్ కేర్ ఫుల్ బ్రో.
-మహమ్మద్ హనీఫ్.