నాలాంటి ఓ ముస్లిం, ప్రవక్తను కీర్తిస్తూ నాలుగు వ్యాసాలు రాయగానే ప్రవక్త గౌరవం పెరగిపోయిందనుకోవడం ఎంత హాస్యాస్పదమో, ఓ ముస్లిమేతరుడు ప్రవక్తను దూషిస్తూ/విమర్శిస్తూ ఏదో రాయగానే ఆయన గౌరవానికి భంగం కలుగుతుందనుకోవడం కూడా అంతే హాస్యాస్పదం. దేవదూత నుండీ సందేశం రావడం.. అనేవిషయాన్ని పక్కన పెట్టి,
కేవలం ఓ మానవ మాత్రుడిగా మహమ్మద్ ప్రవక్త సాధించిన విజయాల్ని అనలైజ్ చేసినా – హ్యూమన్ హిస్టరీలో ఆయనతో పోల్చదగ్గ వ్యక్తి మరొకరు లేరు. ఈ విషయం Michael H. Hart, Thomas Carlyle.. ఇంకా అనేక ముస్లిమేతర చరిత్ర కారులే తమ పరిశోధనలద్వారా నిర్ధారించారు. దేవదూత సందేశాన్ని నమ్మే బిలీవింగ్ ముస్లింలు- ప్రవక్త గౌరవం గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, ఆ బాధ్యత స్వయంగా సృష్టికర్తే తనపై వేసుకున్నాడు. “Indeed, We are sufficient for you against the mockers” – ఖురాన్ 15:95. విషయం ఇంత స్పష్టంగా ఉన్నా,బెంగులూర్ లో ఎవరో అనామకుడు రాసిన ఫేస్ బుక్ పోస్టు కారణంగా గుడ్డి ఆవేశాలకు లోనై, అంత రాద్ధాంతం చేశారంటే, ఇది ఏ రకంగా ప్రవక్త గౌరవాన్ని కాపాడటమో ముస్లింలు ఆలోచించుకోవాలి. దీనిలో రాజకీయ కుట్రలు, కుయుక్తులు ఎన్నైనా ఉండొచ్చుగాక, జరిగిన నష్టం మాత్రం ప్రధానంగా ముస్లింలకే. పోలీసు కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు యువకులూ పాతికేల్ల లోపు వారే. అరెస్టులు చేయబడ్డవారు కొన్ని సంవత్సరాలపాటు ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిఉంటుంది. చట్టాన్ని అతిక్రమించినవారు ముస్లింలైనా,వేరే ఎవరైనా వారందరినీ చట్టప్రకారం శిక్షించాల్సిందే. ఇస్లాం/ప్రవక్త లపై ప్రేమ పేరుతో, ప్రవక్త భోధనలకు పూర్తి వ్యతిరేకమైన పనులు చేయడం, రాజకీయ ప్రత్యర్థుల ట్రాప్ లో పడి, అమాయకంగా బలైపోవడం – ఈ రెండు అంశాల గురించీ ప్రతి ముస్లిం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.