“కట్నం అడిగేవాడు గాడిద”- అనే స్లోగన్ వినే ఉంటారు. అలాంటి గాడిదల గురించే మాట్లాడేది. ఒకప్పుడు నేను కూడా అలాంటి గాడిదనే, అంటే కట్నం తీసుకునే పెళ్ళి చేసుకున్నాను. అప్పట్లో ఇస్లాం గురించి ఎలాంటి అవగాహాన లేకపోవడంతో, “అదనపు కట్నం కోసం పీడిస్తే తప్పుగానీ, పెళ్ళికి ముందు బేరసారాల్లో ఇచ్చింది పుచ్చుకుంటే ఏం తప్పులేదనే”- సొసైటీ స్టాండర్డ్ నే ఫాలో అయిపోయా.
అహ్మద్ దీదాద్,జకీర్ నాయక్, గ్యారీ మిల్లర్, జెఫ్రీ ల్యాంగ్ వంటివారి స్పీచులు విని- ఇస్లాం,ప్రవక్త బోధనల గురించి తెలుసుకుని బిలీవర్ గా మారిన తర్వాత నేను చేసిన మొదటిపని, తీసుకున్న కట్నం డబ్బుల్ని మా అత్త,మామలకు వెనక్కి ఇచ్చేయడం. తీసుకోవడానికి వారు ఒప్పుకోలేదుగానీ, “ప్రవక్త పేరును నా పేరులో పెట్టుకుని, ఆయన చెప్పినదానికి పూర్తి విరుద్దంగా ఓ పని చేసిన విషయం డైజస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. అన్ని పనుల్నీ గతంలోకెళ్ళి కరెక్ట్ చేయలేం, కానీ దీన్ని మాత్రం చేయగలను కదా” – అని వారిని బలవంత పెట్టి వెనక్కి ఇచ్చేశాను.
“అంటే ఆడికి మీరొక్కరే ప్రవక్త ఫాలోవరా, మేము కాఫీర్లమా.. నేను కూడా మా అత్తోల్ల నుండీ తీసుకున్న కట్నం వెనక్కి ఇస్తా” అని- మా పెద్ద బామ్మర్ది కూడా వాళ్ళ అత్తోల్లకు వెనక్కి ఇచ్చేశాడు. మా అన్న – ఆర్థికంగా కష్టాల్లో ఉన్న అత్తింటివారికి, తాను తీసుకున్న కట్నం డబ్బులకంటే ఎక్కువే రిటర్న్ ఇచ్చి సాయం చేశాడు. మా చిన్న బామ్మర్ది, ప్రభుత్వోద్యోగం చేస్తూ కూడా, పైసా కట్నం తీసుకోకుండా చక్కగా మెహర్ చెళ్ళించి ప్రవక్త మార్గం లో పెళ్ళిచేసుకున్నాడు. పెళ్ళీడుకు వచ్చి ఉన్న మా అక్కకొడుకులు,అన్నోల్ల కొడుకుల్లో ఒక్కరు కూడా కట్నం తీసుకోరని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. వారికి ఇస్లాం గురించి ఆ మాత్రం అవగాహన ఉందనే అనుకుంటున్నాను. పొరబాటున వారు తీసుకోవాలని టెంప్ట్ అయినా, వారితో ఉన్న చనువుకొద్దీ ఇది తప్పని చెప్పి, వారిని నిలువరించే ప్రయత్నం తప్పక చేస్తాను.
ఆ రకంగా, మా ఇంట్లోని అబ్బాయిల పెళ్ళి విషయంలో టెన్షన్ లేదు గానీ, అమ్మాయిల పెళ్ళి విషయంలో కొందరు ముస్లిం అబ్బాయిల తండ్రుల వైఖరి చాలా నిరుత్సాహంగా, ఇరిటేటింగ్ గా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ చేస్తూ, నెలకు దాదాపు లక్ష సంపాదిస్తున్న మా అన్న కూతురుకి సంబంధాలు చూస్తుంటే, కొందరు వెధవలు పాతిక లక్షలు+ముప్పై,నలబై తులాలు కట్నం కావాలని సిగ్గులేకుండా డైరెక్ట్ గానే అడుగుతున్నారు. అన్ని విషయాలు కుదిరి, ఎంతోకొంత ఇవ్వండని అడిగి తీసుకుని సైలెంట్ గా పెళ్ళి చేసుకోవడం ఓ పద్దతి.లేదూ- “మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వారికి పెళ్ళి చేయాలంటే కట్నం ఇవ్వక తప్పట్లేదు కాబట్టి, మా అబ్బాయిలకు తీసుకుంటాం” – అనడం ఇంకో పద్దతి.
ఈ రెండూ కాకుండా, ఓ వైపు -“మాది తోపు ఫ్యామిలీ, మాకు ఫుల్లుగా ఆస్తులున్నాయి, అబ్బాయి మీద బాద్యతలేమీ లేవు” – అని డబ్బా కొట్టుకుంటూనే – ఇన్ని లక్షలు-ఇన్ని తులాలు ఇస్తామంటేనే మిగతా విషయాలు మాట్లాడదామని, కట్నం దగ్గరినుండే డిస్కషన్ స్టార్ట్ చేయడం దారుణం. అలాంటోల్లు ముస్లిం లు గా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఇటీవల ఇలాంటోల్లు చాలా మంది తగిలారని మా అన్న చెప్తుంటే విని షాక్ అయ్యాను.
కొందరు ఏజెంట్లు,(పెళ్ళిల్ల పేరయ్య, మీడీయేటర్ లు) లక్షకు వెయ్యి, రెండువేల చొప్పున కమీషన్ తీసుకుంటూ, కట్నం ఎంత ఎక్కువైతే వారి కమీషన్ కూడా అంతెక్కువ వస్తుందనే కక్కుర్తితో, వారే అబ్బాయిల పేరెంట్స్ తరుపున ఈ తతంగం నడిపిస్తున్నట్లుగా కూడా ఉంది.
ఏదేమైనా, అమ్మాయిల నుండీ లక్షల్లక్షలు తీసుకుని, దాన్లో నుండీ 1,2 లక్షలు మెహర్ చెళ్ళిస్తున్నట్లు నికానామా లో రాసి నిఖా చేసుకోవడం – ప్రవక్త బోధనలకు పూర్తి వ్యతిరేకమే కాక, ఇస్లాం ని అపహాస్యం చేయడమే అవుతుంది.
గతంలో, స్త్రీ-పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థ, భార్య-భర్తల మధ్య ఆర్థిక విభజన,భార్య-భర్తల హక్కులు,బాధ్యతలు- వంటి విషయాల గురించిన ఇస్లామిక్ సమాచారం ముస్లింలకు తెలియవనుకుంటే అర్థముంది. కానీ ఇంటర్నెట్,యూటూబ్ లు అందరికీ అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే, ముస్లిం మతపెద్దలు, ముస్లిం ఆలోచనాపరులు, నాయకులు వీటికి అడ్డుకట్టవేయాల్సిన మార్గాలగురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.