ఒక సిద్ధాంతం, లేదా , ఓ వ్యక్తి ఎలాంటివాడో తెలియాలంటే -అతనికి అపరిమిత అధికారం కట్టబెడితే, ఆ అధికారాన్ని ఎలా వినియోగిస్తున్నాడనేదాన్ని బట్టి అతను/(అతను నమ్మే సిద్ధాంతం) ఎలాంటిదో తెలిసిపోతుంది.
ఇస్లామిక్ చరిత్రలో అనేక సామ్రజ్యాలు వందల ఏళ్ళు పాలించాయి గానీ, పుట్టుక ఆధారంగా ఒక సమూహానికి చెందిన ప్రజల్ని టార్గెట్ చేసి వారిని అణచివేతకు గురి చేసిన దృష్టాంతం ఎక్కడా లేదు. ముస్లిమేతరులు జిజియా పన్ను చెళ్ళించాలనే నియమం షరియాలో ఉన్నమాట నిజమే. రాజ్యాధినేత యుద్ధ ప్రకటన చేయగానే పురుషులందరూ ఆయుధం ధరించి సైన్యంలో చేరాలనే నియమం కేవలం ముస్లిం పురుషులకు మాత్రమే వర్తిస్తుందనే నియమాన్ని కలిపి చూస్తే, జిజియా పన్ను, ప్రొటెక్షన్ పన్ను మాత్రమేననే విషయం అర్థమవుతుంది.
ఇస్లామిక్ రాజ్యాలలో వందల ఏళ్ళపాటు సుఖశాంతులతో బతికిన యూదుల చరిత్రే దీనికి సాక్ష్యం.
David J Wasserstein, Thomas Loren Friedman లాంటి సమకాలీన యూదు విద్యావేత్తలే ఈ విషయాన్ని ధృవీకరించిన విషయం గత వ్యాసంలో ఆధారాలతో సహా రాశాను.
“పుట్టుక ఆధారంగా ఎవరినీ ద్వేషించకపోవడం” – అనే దానికి సైద్ధాంతిక పునాది ఖురాన్ లో, మరియు ప్రవక్త బోధనల్లో సుస్పష్టంగా ఉంది.
“మానవజాతిని మేమే సృష్టించాము.వారి ఆత్మలు వారితో చెప్పే ముచ్చట్లు కూడా మాకు తెలుసు. మేము వారి మెడనరం(Jugular Vein) కంటే దగ్గరగా ఉన్నాము.”ఖురాన్ 50:16
ఈ వాక్యం మొత్తం మానవజాతి గురించే తప్ప, కేవలం ముస్లింల గురించి కాదు. ఎవరిపట్లనైనా అన్యాయంగా ప్రవర్తిస్తే, అతను ఎంత బలహీనుడు,అశక్తుడైనప్పటికీ అంతిమదినాన అతని(ఆమె) తరుపున అల్లానే వకాల్తా పుచ్చుకుంటాడనేది బేసిక్ ఇస్లామిక్ కాన్స్పెట్. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ,అందరితో న్యాయంగా వ్యవహరించమనే వాక్యాలు దాదాపుగా ఖురాన్ యొక్క ప్రతిపేజీలోనూ కనిపిస్తాయి.
Piers Morgan-పేరెన్నిక గన్న బ్రిటీష్ జర్నలిస్ట్. UK,USA ప్రెసిడెంట్లను ఇంటర్వ్యూ చేసిన ఘనచరిత్ర ఉంది. గత వారం, ఇజ్రాయెల్-పాలస్తీన గురించి కొందరు ముస్లిం ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూల్లో ఒక్క విషయాన్ని స్పష్టంగా గమనించొచ్చు. అది- హమాస్ దాడిలో సివిలియన్ పౌరులు చనిపోవడాన్ని ఖండించే విషయంలో – ముస్లిం వక్తలు ఎలాంటి తడబాటు లేకుండా ఖండించగా, ఇజ్రాయెల్ దాడిలో వందలాది పాలస్తీనియన్ పిల్లలు చనిపోవడాన్ని ఖండించే విషయంలో మాత్రం అటు పీర్స్ మోర్గాన్ కానీ, అతని ఇతర ప్రో-ఇజ్రాయెల్ గెస్ట్ లకు గానీ ఒక్కరికి కూడా నోరు పెగలదు. “తమ కళ్ళతో చూసి, చెవులతో విని కూడా నమ్మరు. వారి కళ్ళు గుడ్డివి కావు, వారి మనసులే గుడ్డివి”.(22:46)