ఇది కూడా చాలామందికి తెలియని విషయం – యూదుల స్వర్ణయుగం అని ఒకటి ఉంది. గూగుల్ లో గోల్డెన్ ఏజ్ ఆఫ్ జ్యూస్(Golden age of jews) , అని కొడితే వస్తుంది. అది 8-12 శతాబ్ధాల మధ్య స్పెయిన్ లో. ఆ కాలంలో, స్పెయిన్ లో యూదుల వ్యాపారం, సంస్కృతి, మత స్వేచ్చ, సమాజంలో వారి ప్రాబల్యం.. వంటి వన్నీ గొప్పగా వెలుగొందాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ కాలంలో స్పెయిన్ పాలకులు ఎవరు..?
అప్పటి స్పెయిన్ పాలకులు – ఉమయ్యద్ వంశ రాజులు. ముస్లింలు. అప్పటి స్పెయిన్ పేరు కూడా – అల్-ఆండలూస్. ఇదొక్కటే కాదు.. యూరప్ లో నాజీలు యూదుల్ని తరిమి,తరిమి చంపుతున్నప్పుడు – ఆ పక్కనున్న అట్టోమాన్ సుల్తాన్ల పాలనలో యూదులు సుఖ,శాంతులతో బతికేవారు. 1917 ఆగస్ట్ లో, బ్రిటన్ క్యాబినేట్లో -‘పాలస్తీనాలో యూదులకు ఓ ప్రత్యేక దేశం స్థాపించాలా- వద్దా ‘ అనే అంశం మీద చర్చ జరిగింది. ఈ క్యాబినేట్లో ఉన్న ఏకైక యూదు సభ్యుడు – ఎడ్విన్ స్యామ్యుల్ మాంటెగు. ( తర్వాత మన దేశానికి సంబంధించిన మాంటెగూ- చేంస్ ఫర్డ్ సంస్కరణలని ప్రవేశపెట్టింది ఈయనే). ఈ మాంటేగూ అనే ఆయన – పాలస్తీనాలో యూదు రాజ్యం స్థాపించడం అనేది పరమ దుర్మార్గమైన ఆలోచన అనీ, చరిత్రలో ఇప్పటివరకూ ముస్లింలు-యూదుల మధ్య పెద్దగా వైరం లేకుండా సఖ్యతతో కలిసిమెలిసి ఉంటున్నారనీ, అలాంటి సఖ్యతని ఇది శత్రుత్వంలా మార్చుతుందనీ చెప్పి- ఆ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించాడు.అయినప్పటికీ పాలస్తీనాలో ఇజ్రాయిల్ రాజ్యం స్థాపించబడింది. ఆ తర్వాత ఏం జరిగిందో, జరుగుతుందో మనం రోజూ చూస్తూనే ఉన్నాం.
మహమ్మద్ హనీఫ్