లయన్ + టైగర్ = లైగర్, ట్యాగ్ లైన్ -“సాలా క్రాస్ బ్రీడ్.”
ఇంతకంటే పవర్ఫుల్ టైటిల్ ఇంకోటి ఉండదు.పూరి జగన్నాద్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా, దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో త్వరలో రాబోతున్న సినిమా టైటిల్ ఇది.
తెరమీద పవర్ఫుల్ క్యారెక్టర్లను సృష్టించడంలో పూరి జగన్నాద్ ప్రతిభ అందరికీ తెలిసిందే. కాకపోతే, రియల్ లైఫ్ లో “పవర్” అనగానే గుర్తొచ్చే పేర్లు – బాక్సింగ్ ఛాంపియన్లు మహమ్మద్ అలీ, మైక్ టైసన్. లైగర్ లో మైక్ టైసన్ కూడా నటించడం మరో ఆసక్తికర అంశం.
జనరల్ గా, కేవలం సినిమాల్లో మాత్రమే ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు మనం చూస్తుంటాం. కానీ, అలీ-టైసన్ ల రియల్ లైఫ్ లో కూడా, ఇలాంటి రియల్ సన్నివేశం ఒకటి ఉంది.
ఏనాడూ ఓటమి ఎరగని మహమ్మద్ అలీ, ఒక్క మ్యాచ్ లో మాత్రం చిత్తుగా ఓడిపోయాడు. ఆ మ్యాచ్ ని టీవీలో చూసిన, అప్పటి టినేజీ కుర్రాడు టైసన్, తన ఆరాధ్యదైవమైన అలీని చావబాదిన వాన్ని అదే బాక్సింగ్ రింగ్ లో, చితక్కొట్టి ఓడించి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేశాడు, చివరికి అన్నంత పనీ చేశాడు.
1980 అక్టోబర్ లో, మహమ్మద్ అలీ – ల్యారీ హోంస్ ల మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. నిజానికి అలీ అప్పటికే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. దానికి రెండేళ్ళ ముందు ఎలాంటి మ్యాచులూ ఆడలేదు. మరో వైపు ల్యారీ హోంస్ కొత్తగా రింగ్ లోకి అడుగుపెట్టి, ఫ్రెష్ గా హెవీవైట్ చాంపియన్షిప్ గెలిచిన యువకుడు. అప్పటికే ఆరోగ్యం సరిగా లేని అలీ ఆ మ్యాచ్ లో తలపడి ఉండాల్సింది కాదని చాలా మంది అభిప్రాయం. కానీ, ఆ మ్యాచ్ లో ఆఫర్ చేసిన భారీ ప్రైజ్ మనీకి ఆశపడి అలీ దీనికి ఒప్పుకున్నాడని అంటుంటారు. ఆ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. ల్యారీ హోంస్ అలీపై పిడిగుద్దుల వర్షం కురిపించగా, అలీ చేతుల్ని అడ్డంపెట్టుకుని డిఫెన్స్ చేసుకోవడం తప్ప, కనీసం ఎదురుదాడికి ప్రయత్నం కూడా చేయలేదు. అలాగని తొందర్లోనే ఓటమిని ఒప్పుకుని సరెండర్ కూడా అవ్వలేదు. ఆ భయంకర పంచ్ లను స్వీకరిస్తూ అలాగే నిల్చున్నాడు. అలీని అలాంటి పరిస్థితుల్లో చూసి కోట్లాది మంది అభిమానులు కన్నీళ్ళపర్యంతం అయ్యారు. చివరికి హ్యారీ లోంస్ సైతం మ్యాచ్ అనంతరం అలీని తాను అలా కొట్టినందుకు పశ్చాత్తాప పడ్డాడని అంటుంటారు.
ఎక్కడో దూరంలో, ఆ మ్యాచ్ ని టీవీలో చూస్తున్న 14ఏళ్ళ టీనేజ్ కుర్రాడు, తననే ఎవరో అలా కొడుతున్నట్లు ఫీలై పోయి వల,వలా ఏడుస్తున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం కొన్ని గంటలవరకూ అలా ఏడుస్తూనే ఉన్నాడు. అతన్ని శాంతపరచడానికి, అతని బాక్సింగ్ ట్రైనర్ అలీకి ఫోన్ చేశాడు. అలీ కి కూడా కెరీర్ తొలినాళ్ళలో బాక్సింగ్ నేర్పింది ఈ ట్రైనరే.
మ్యాచ్ గురించి అలీతో, రొటీన్ గా కొన్ని విషయాలు మాట్లాడిన ట్రైనర్ – నా స్టూడెంట్ నీతో మాట్లాడతాడంట, అని ఫోన్ టైసన్ కి ఇచ్చాడు.
“నిన్ను కొట్టినవాన్ని నేను వదలిపెట్టను” – టైసన్ ఏడుస్తూనే, స్థిరంగా చెప్పాడు.
సరిగ్గా ఎనిమిదేళ్ళ తర్వాత, ల్యారీ హోంస్ కి టైసన్ కి మధ్య మ్యాచ్ జరిగింది. బాక్సింగ్ చరిత్రలో అతిపెద్ద ఫైట్ గా దానిని పబ్లిసైజ్ చేశారు. వీడియో ప్రసార హక్కులు రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. సహజంగా ఆటగాల్లు మ్యాచ్ కి ముందు, “ఈ మ్యాచ్ ఎలా గెలవాలి” అని ఆలోచిస్తుంటారు. కానీ, టైసన్ ఆలోచన మాత్రం – “ఆ రోజు ఇతను అలీని ఎలా కొట్టాడు, దానికంటే దారుణంగా ఇతన్ని ఎలా కొట్టాలనే.”
పైగా, ఆ మ్యాచ్ చూడటానికి, అప్పటికి రిటైర్మెంట్ ప్రకటించి ఉన్న అలీ కూడా స్వయంగా స్టేడియం కి వచ్చాడు. మ్యాచ్ కి ముందు రింగ్ లోకి వెళ్ళి, “ఆరోజు నాకిచ్చిన మాట గుర్తుంది కదా, గెట్ హిమ్ ఫార్ మి” – అని టైసన్ చెవిలో చెప్పిన విషయం, టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఇక ఆ మ్యాచ్ లో టైసన్ చెలరేగిపోయాడు. మూడుసార్లు టైసన్ బలమైన పంచ్ లకు,ల్యారీ హోంస్ నేల కతుక్కుని పోయాడు. మ్యాచ్ ఇంకొంత సేపు నడిస్తే ల్యారీ హోంస్ ప్రాణాలకు ప్రమాదమని భావించిన మ్యాచ్ రెఫరీలు, టైసన్ ని విజేతగా ప్రకటించారు.
తనకు ఇచ్చిన మెడల్ ని సగర్వంగా అలీకి అందించాడు, టైసన్.
తన కెరీర్ మొత్తం, ఎమోషన్స్ ని అదుపుచేసుకోలేని మానసిక సమస్యలతో సతమతమైన టైసన్, అలీ అడుగుజాడల్లోనే నడిచి ఇస్లాం ని స్వీకరించి ముస్లిం గా మారాడు. ప్రస్తుతం ప్రశాంత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.
-మహమ్మద్ హనీఫ్.
శుక్రవారం.ఇన్