విజయాలు- ముసుగు ఫోటోలు – ప్రోగ్రామ్‌డ్ రియాక్షన్లు

గత వారం రోజుల్లో, మూడు ఇంట్రెస్టింగ్ వార్తలు కనిపించాయి.

1.Najlaa S. Al-Radadi అనే సౌదీ అరేబియా ప్రొఫెసర్, నానో టెక్నాలజీ లో అనేక పరిశోధనలు చేసింది. మూడు పేటెంట్లు తన పేరుమీద రిజిస్టర్ చేసుకుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లకు ఇచ్చే స్కాలర్షిప్ వరుసగా రెండో సంవత్సరం ఈమెకు దక్కింది. క్యాన్సర్ సంబంధ పరిశోధనలో ఆమె చేసిన పరిశోధనకు గుర్తుగా ఒక మెడికల్ వర్సిటీ ఆమెను మొమెంటోతో సత్కరించిన ఫోటో వార్త నెట్ లో వైరల్ అయింది.


2.పాకిస్తాన్ లో ఓ మహిళా పైలట్ సొంతంగా విమానాన్ని నడిపి రికార్డ్ సృష్టించింది.


3.సౌదీ అరేబియా లో, 10 మంది కొడుకులు+9మంది కూతుర్లు గల ఒక తల్లి, మెడిసిన్ లో డాక్టరేట్ కంప్లీట్ చేసింది. అంటే, 19మంది పిల్లల్ను కంటూ, ఆల్రెడీ పుట్టిన పిల్లల ఆలనా పాలనా చూస్తూనే, ప్యారలల్ గా ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివింది.


ఈ మూడింటిలో కామన్ విషయం ఏమంటే – ఈ ఫీట్లు సాధించిన ముగ్గురు మహిళలూ పూర్తి బుర్ఖా/నికాబ్ తో ఉండటం. అంటే, ముఖం కూడా కనిపించకుండా పైనుండి కింది దాకా బట్టలు ధరించడం.

First thing first.. ఇవి చూసి నాకేమీ 1% కూడా ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే, ప్రొఫెసర్ కావడం, పరిశోధనలు చేయడం, విమానం నడపడం, డాక్టరేట్ సాధించడం.. వీటికి బురఖా,నికాబ్ ఏ రకంగానూ అడ్డుకాదు. ఎవరైనా ఓ వ్యక్తి ఒంటికాలితో కొండేక్కితే, అది స్పెషల్ గా చెప్పుకోవాల్సిన ఘనత. అంతే తప్ప, అతను నైక్ బట్టలు ధరించాడా, లేక పూమా ధరించాడా, ఒత్తి చెడ్డి-బనీన్ వేసుకుని ఎక్కాడా – ఇవేవీ పెద్ద మ్యాటర్ కావు కదా. అలాగే,పైన చెప్పిన మూడు ఘనతలూ ఓ మహిళ బురఖా ధరించి చేయొచ్చు, జీన్స్,షార్ట్స్ తొడుక్కుని కూడా చేయొచ్చు. దాన్లో బట్టల కంట్రిబ్యూషన్ ఏమీ లేదు. కానీ,బట్..అయితే..

బురఖా పేరెత్తగానే – అది అణచివేతకు ప్రతిరూపమని, మహిళలకు దాంతో అన్యాయం జరిగిపోతుందనీ, వారిని తొక్కేస్తున్నారనీ – కొందరు సోకాల్డ్ ఉద్దరిస్టు,లిబరల్-పెమినిస్టు,సంక సంస్కర్తలకు ఎమోషన్ తన్నుకుంటూ వచ్చేత్తది.. వారి పైత్యపు రాతలకు బాగా చార్జ్ అయిపోయిఉన్న ముస్లింలు – పైన ఉదాహరణల్లో చెప్పిన అమ్మాయిల సక్సెస్ న్యూస్లు-పోస్టులను షేర్ చేసి – “చూడండ్రా – బురఖా ఏ రకంగా అభివృద్ధికి అడ్డంకో చెప్పండ్రా” అని అడుగుతారు. అప్పుడు ఈ సంక సంస్కర్తలు కొంచెం వెనక్కి తగ్గి- “అబ్బే, ఆటంకం అని మేమెక్కడన్నాం.. కాకపోతే, వారిని అలాంటి బట్టలే వేసుకోవాలి అని బలవంతం చేయకూడదు” – అంటారు.

ఇప్పుడు డిస్కషన్ రెండో లెవెల్, లేక రెండో స్టేజ్ లోకి ఎంటరవుదాం. మినిమం డిగ్రీ స్థాయి అంటారు కదా.. అలా, ఇదొక లెవల్ డిస్కషన్ అన్నట్టు.
“మమ్ములని బలవంతం చేయబట్టే వేసుకుంటున్నాం”- అని ఎంతమంది ముస్లింలు మహిళలు మీ ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు? ఒకామె లజ్జా అని పుస్తకంలో ఏదో రాసింది, ఇంకొందరు కవయిత్రులు “చంద్రునికి లేని ముసుగు నాకెందుకు” అంటూ ఏవో కవితలు కూడా రాసేశారనుకుందాం. ఇప్పుడు వారే ముస్లిం మహిళలందరికీ ప్రతిరూపమని, రిప్రెసెంటటివ్స్ అని ఎవరు చెప్పారు? నువ్వు సర్వే ఏమైనా చేశావా? ఎంతమందిని శాంపిల్ కింద కన్సిడర్ చేశావ్, ఎంతమంది అవునని చెప్పారు, ఎంతమంది కాదని చెప్పారు. ఇలా అడిగితే, అట్టాంటి సర్వేలు,గిర్వేలు లేవ్.. ఇరాన్ లో ఏం జరుగుతుందో తెల్దా – అంటారు.

“సుమారు 50పైగా ఉన్న ముస్లిం మెజారిటీ దేశాల్లో ఇరాన్ ఒకటి. మిగతా ఏదేశంలోనూ లేంది ఇరాన్ లో మాత్రమే హిజాబ్ ఎందుకు ఇష్యూ అయింది. అమెరికన్ మీడియాకు ఇరాన్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్. టర్కీ లో అక్కడి ప్రభుత్వం ఒకప్పుడు హిజాబ్ ని బ్యాన్ చేస్తే అక్కడి మహిళలే ఉద్యమాలు చేసి, హిజాబ్ హక్కును పునరుద్ధరించుకున్న విషయం నీకు తెలీదా అంటే, మెమ్మే-బెబ్బే అనేది సమాధానం.ఇప్పుడు డిస్కషన్ లో మూడో స్టేజ్, డిగ్రీ కూడా కాదు, పీజీ లెవెల్ –

“బలవంతం చేయకూడదు” – అనేది కూడా ఒక రూల్, ఒక ఆదర్శం. “సృష్టికర్త అంటూ ఎవరూ లేరు, అంతా గాలివాటంగా, అర్థంపర్థం లేకుండా ఎలాగో పుట్టాం-ఎలాగో చస్తం, ఇంతకు మించి జీవితానికి అర్థం లేదు” – అనుకుంటే అది నీ చాయిస్. కానీ, జివితానికి అర్థమంటూ ఉందని అనిపిస్తే, సృష్టికర్త అంటూ ఒకరున్నారని ఫీల్ అయితే, ఖురాన్ దైవగ్రంధమని నమ్మకం కుదిరితే -దాని ప్రకారం – ” స్త్రీ-పురుషులు సరూపాలేగానీ సర్వసమానాలు కాదు. ఒకరు ఎక్కువ,ఒకరుతక్కువ కాదు. పరస్త్రీ నీ తేరిపార చూడకుండా చూపుల్ని అదుపులో పెట్టుకోమని పురుషులకు, ఇతరుల అటెన్షన్ కి గురికాకుండా నిండుగా బట్టలు కప్పుకోమని మహిళలకు చెప్తే – అది బలవంతం చేయడం అవుద్దా. అది కూడా జస్ట్ మరో ఆదర్శమే కదా.

ఈ రెండు రూల్స్, లేదా ఈ రెండు ఆదర్శాల్లో ఒకటి మంచిదని,గొప్పదని, అందరికీ ఆచరణయోగ్యమైందనీ ఎవరు చెప్పారు, ఎవరు డిక్లేర్ చేశారు..?

పోనీ, “బలవంతం పెట్టకూడదు” – అనే రూల్ నమ్మేవాల్లలో, ఎంతమంది ఫ్రాన్స్,స్విట్జర్ల్యాండ్ లాంటి దేశాలు కాలేజీ,యూనివర్సిటీల్లో హిజాబ్ బ్యాన్ చేసినప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడారు? అలా మాట్లాడినవారు పట్టుమని పదిమంది కూడా దొరకరు. అదీ హిపోక్రసీ అంటే, తెలుగులో – ఆదర్శాల దివాలాకోరుతనం.

రెహ్మాన్ కు ఇద్దరు కూతుర్లు. ఒకమ్మాయి ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తుంది. మరో అమ్మాయి పూర్తి బుర్ఖాతో ఉంటుంది.దీని గురించి రెహ్మాన్ చెప్పిన విషయం- “బట్టలగురించి నేనెవరికీ ఏమీ చెప్పలేదు. వారి వారి ఇష్టం ప్రకారం వారు వేసుకుంటారు. మొగోల్లకు గనక అలాంటి ఆప్షన్ ఉండిఉంటే- అందరికంటే ముందు నేను బురఖా ధరించి ఉండేవాన్ని. ఎవరికంటా పడకుండా అనానిమస్ గా ఉండటంలో చాలా సౌకర్యం ఉంది”- అని చెప్పాడు. ఒకానొక టైమ్ లో డోనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు. నాది కూడా ఇదే ఫీలింగ్. మొన్న యూరప్ లో కొన్ని నగరాలు “నోప్యాంట్స్ డే” – అని సెలబ్రేట్ చేసుకున్నాయంట. దానికి ఆదరణ క్రమంగా పెరుగుతుందంట. కల్చర్ పేరుతో, ట్రెండింగ్ పేరుతో ఎవరెన్ని వేషాలైనా వేసుకోనీ- నేను మాత్రం పురుషులు మొలనుండీ మోకాల్ల వరకూ కశ్చితంగా బట్టలు ధరించాలనే ఖురాన్ ఆదేశాన్నే ఫాలో అవుతా. చూసేటోల్లు, “చక్కగా చెడ్డీలేసుకుని బయట తిరిగే వీని స్వేచ్చను హరించి, వీళ్ళావిడ వీన్ని తొక్కేస్తుంది పాపం” – అని గుండెలుబాదుకున్నా.. డోంట్ కేర్.

ఫోటో అంటే చూపించేది,చూపించుకునేది.
ముసుగు అంటే దాచేది,దాచుకునేది. “నేను ఎలా ఉంటే నీకెందుకు” -అనే స్టేట్మెంట్ అది.
కొందరు ముసుగువేసుకుని తమ మొమెంటోతో ఫోటో దిగుతే దాని అర్థం – “నా ముఖాన్ని,రూపాన్ని కాకుండా- నేను సాధించిన విజయాన్ని మాత్రమే చూడు బే” – అనే దబాయింపు.. అందుకే కొందరికి నచ్చదు.
ఆవురావురుమని బిర్యానీ తింటున్నప్పుడు పంటికింద రాయిపడిన ఫీలింగ్.. పాపం..

Leave a Reply

Your email address will not be published.