1997 కెన్యా-సోమాలియాలలో అధికారంకోసం, వివిధ తెగలకు చెందిన సాయుధ దళాల మధ్య అంతర్యుద్ధం జరిగింది. దీనిలో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది తమ సొంత ఇండ్లనూ,ఊర్లనూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు.
అలాంటి హింసాత్మక పరిస్థితుల్లో, ఓ మహిళ తన పసిబిడ్డను సంకలో మోస్తూ, మిగతా ఇద్దరు కూతుర్లతో కలిసి 12రోజులపాటు నడుస్తూ, కెన్యా-సోమాలియా బార్డర్ లోని, ఐక్యరాజ్యసమితి వారు నిర్వహిస్తున్న కకుమా శరణార్థి శిబిరానికి చేరుకుంది.
మరోమార్గం గుండా బయలుదేరిన ఆమె భర్తకూడా తమదగ్గరికి వస్తాడేమోనని వారు అక్కడే 6 సంవత్సరాలపాటు ఎదురుచూశారు, అతని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, ఇక అతను చనిపోయి ఉంటాడని ఆశలు వదులుకున్నారు.
అంతర్యుద్ధం కారణంగా తనలాగా తన కూతుల్ల బతుకులు నాశనం కాకూడదని ఆశించిన ఆ తల్లి, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ రీసెటిల్మెంట్ పాలసీలో భాగంగా, తన ముగ్గురు కూతుర్లను తీసుకుని అమెరికాకు చేరుకుంది. ఆమె గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం -ఆమె ప్రాక్టీసింగ్ ముస్లిం. ఆ ముగ్గురు కూతుర్లలో చిన్న కూతురు పేరు – హలీమా ఎడెన్.
హలీమా ఎడెన్ ప్రాధమిక విధ్యాభ్యాసం అమెరికాలోని మినెసోటా లో మొదలైంది. హలీమా ఎడెన్ తల్లి, ముగ్గురు కూతుర్లనూ హిజాబ్ తోనే స్కూలుకు పంపించేది. క్లాసులో ఇతర పిల్లలు, ఆమెకు తలపై వెంట్రుకలు లేవనీ, చర్మ వ్యాధి ఉందనీ, దానిని దాయడానికే హిజాబ్ కప్పుకుంటుందనీ కామెంట్లతో వేధించేవారు. వారివేధింపుల్ని భరించలేక, కొన్నాల్లు హిజాబ్ తీసేసింది.కానీ, హిజాబ్లో ఉంటేనే తాను తనలా ఉండగలననీ, ఇతరులకోసం తన ఐడెంటిటీని ఎందుకు మార్చుకోవాలని అనిపించడంతో మళ్ళీ హిజాబ్ ధరించడం మొదలుపెట్టింది.
హైస్కూల్ కి వచ్చాక, ముగ్గురు కూతుర్లను పెంచడానికి తల్లి పడుతున్న కష్టం చూసి, ఓ హాస్పిటల్ ని శుభ్రం చేసే పార్ట్-టైమ్ పనికి కుదిరింది. ఆ డబ్బుతో తన స్కూల్ ఫీజు,పుస్తకాలు కొనుక్కునేది. హైస్కూల్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, తమ మినెసోటా కాలేజ్ అందాల పోటీలు జరిగాయి. ప్రైజ్ మనీ ఎక్కువగా ఉండటంతో, హలీమా ఎడేన్ కూడా వాటిలో పోటీపడాలనుకుంది. ‘హిజాబ్ తీసేస్తేనే గెలుస్తావని’ అందరూ చెప్తున్నా, “గెలవనీ-గెలవకపోనీ, హిజాబ్ మాత్రం తిసేసే ప్రసక్తే లేదని”, ఆమె హిజాబ్ తోనే ర్యాంప్ పై నడిచింది. బికినీ పోటిల్లో కూడా శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే బుర్కినీ ధరించి పాల్గొంది.
ఆ అందాల పోటీల్లో గెలవలేకపోయినప్పటికీ, ఆమె డేరింగ్ నేచర్ కీ, కాన్‌ఫిడెన్స్ కీ న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. మొదటి హిజాబీ మాడల్ గా ఆమె ఫోటోలు పత్రికల హెడ్లైన్స్ లో వచ్చాయి. IMG Fashions అనేది ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ లో ఒకటి. తమ బ్రాండ్ తరుపన మాడలింగ్ చేయమని IMG, హలీమా కు కబురుపెట్టింది. IMG లాంటి బ్రాండ్ నుండీ పిలుపొస్తే, మాడలింగ్ లో ఉన్న ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ, హలీమా ఎడెన్ నేను చెప్పిన కండిషన్లకు ఒప్పుకుంటేనే, కాంట్రాక్టుకు సైన్ చేస్తానని తెగేసి చెప్పింది.
అవి -1.ఎట్టిపరిస్థితుల్లోనూ నేను హిజాబ్ తీయను గాక తీయను.
2.ఫ్యాషన్ షోల్లో బట్టలు మార్చుకోవడానికి నాకంటూ ప్రత్యేకంగా గది కానీ, పరదాలు కట్టిన టెంట్ గానీ ఉండాలి. స్త్రీపురుషుల కామన్ హాల్స్ లో, స్టేజీ వెనకాల బట్టలు మార్చుకునే టైపు పనులు నేను చేయను. ఇవీ హలీమా పెట్టిన కండీషన్లు.
IMG వీటికి ఒప్పుకోవడంతో హలీమా ఫ్యాషన్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ఆమె ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లకు పనిచేసింది, అనేక దేశాల్లో ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. ప్రముఖ మ్యాగ్జైన్ ల కవర్ పేజీలపై ఆమె ఫోటోలు వచ్చాయి. యూనిసెఫ్ కి అంబాసిడర్ గా కూడా నియమించబడింది.
మోడలింగ్ కెరీర్ పీక్ లో నడుస్తున్నప్పుడే, ఆమెలో ఓ అంతర్మధనం మొదలైంది. పేరుకు హిజాబీ మాడల్ గా, హిజాబ్ తోనే ఆమె ఫ్యాషన్ షోల్లో పాల్గొంటున్నప్పటికీ, తాను హిజాబ్ విషయంలో క్రమంగా కాంప్రమైజ్ అవుతున్నాననే విషయం ఆమెకు అర్థమైంది. తాను తొడిగే బట్టలకు మ్యాచ్ అయ్యే విధంగా హిజాబ్ ను డిజైన్ చేసే ఫ్యాన్షన్ కంపెనీలు, తమ ఇష్టం వచ్చినట్లు హిజాబ్ సైజ్ ని కుదిస్తూ వస్తున్నారనీ, ఆ డబ్బులకు ఆశపడి తను వారికి నో చెప్పలేని స్థితికి వస్తున్నానని ఆమెకు అర్థమవ్వసాగింది. ఈ షోల వల్ల సమయానికి నమాజ్ కూడా చేయలేకపోవడం ఆమెను నిరుత్సాహపరిచేది. చాలా సార్లు హోటల్ కెళ్ళి ఏడ్చేసేది.
మరో పక్క, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఇతర ముస్లిం అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించి ఫ్యాషన్ షోల్లో పాల్గొనడం ప్రారంభమైంది. మాడలింగ్ కెరీర్ లో మత్తు,మద్యపానం, అక్రమ సంబంధాలు లాంటివి ఏ రేంజ్ లో ఉంటాయో, ఏ మాత్రం ఏమారుపాటుగా ఉన్నా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో, పూర్తి అవగాహణ ఉండటం వల్ల, ఆ అమ్మాయిల భవిష్యత్తు ఏమైపోతుందోననే బెంగ, ఆ పాపం తనకే చుట్టుకుంటుందేమోననే ఆందోళన ఆమెలో మొదలైంది.
ఈ అంతర్మధనం కారణంగా,2020 లో, తన మతాన్ని, తన హిజాబ్ నీ కాంప్రమైజ్ చేసుకుని ఈ రంగంలో కొనసాగడం తన వల్ల కాదని, దీనికి పర్మనెంట్ గా గుడ్ బై చెప్తున్నాననీ ఆమె ప్రకటించింది. అంతగా డబ్బులు అవసరమైతే మెక్డొనాల్డ్స్ లో పనికి కుదురుతాను తప్ప, ఎన్ని మిలియన్ల డాలర్లిచ్చినా ఫ్యాషన్ షోల్లో మాత్రం పాల్గొనబోనని, అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ లకు దూరంగా, మోదానిస అనే టర్కిష్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.
********
హలీమా ఎడెన్ గురించి చదివినప్పుడు, నాకు ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం -ఆమె ఇస్లాం/హిజాబ్ లతో ఇంతలా ఎలా కనెక్ట్ కాగలిగింది -అనేది. ఇంట్లో పురుషులు ఫోర్స్ చేసి హిజాబ్ వేయించారనుకోవడానికి, ఆమె జీవితంలో పురుషులే లేరు. చుట్టూ సమాజం,బంధువుల ప్రెజర్ వల్ల ఆమె ఇలా చేసిందనుకోవడానికి, ఆమె ఉంటున్నది అమెరికాలో. మరి కారణం ఏమై ఉండొచ్చు..?
నాకు రెండు కారణాలు తోస్తున్నాయి.1. ఫ్యాషన్ కి గుడ్ బై చెప్పింతర్వాత బీబీసీ ప్రతినిధి ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఇంటర్వ్యూవర్ తో ఆమె చెప్పిన మొదటిమాట – నేను ఇప్పటివరకూ చేసిన ఇంటర్వ్యూల్లో కెల్లా, నేను ఎక్కువ సౌకర్యవంతంగా ఫీల్ అయిన ఇంటర్వ్యూ ఇదే అని. ఎందుకలా చెప్పిందంటే – అంతకు ముందు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే, ఆమె స్పాన్సర్ చేసే బ్రాండ్స్ యొక్క ఇమేజెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటికోసం గంటలతరబడి రెడీ అవ్వాల్సి ఉంటుంది. రకరకాలు, అవుట్-ఫిట్లు, మేకప్ లతోనే కెమెరా ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఎవర్నీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆమె సింపుల్గా ఓ హెడ్స్ర్కాఫ్, పెద్ద గౌన్ లాంటిది వేసుకుని ఇంటర్వ్యూ కొచ్చిందంట. సో, మొదటి కారణం – ఇతరులో,మార్కెట్ శక్తులో నిర్దేషించే ప్రమాణాల ప్రకారం కాకుండా, మనకోసం,మనకు నచ్చినట్లు,సృష్టికర్తకు నచ్చినట్లు బతకడంలో ఉన్న సౌకర్యం.
2. ఇక రెండోది – సృష్టికర్త ప్రతి వ్యక్తికీ పుట్టుకతో ఇచ్చే ఫిత్రా, నేచురల్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు. దీని కారణంగా ప్రతివ్యక్తీ పుట్టుకతోనే కొన్ని మోరల్ వ్యాల్యూస్ కలిగిఉంటాడు. ఇస్లామిక్ వ్యాల్యూస్ చాలా వరకూ ఈ ఫిత్రా కు కొహరెంట్ గా ఉండటంతో, ఇస్లాం పట్ల ఏ కొంచెం అవగాహన ఉన్నా, దానిని ఓన్ చేసుకోవడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇస్లాం అన్ని ఖండాలకూ,దేశాలకూ వ్యాపించడానికి ప్రధాన కారణం ఇదే. UK,US,Europe,ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఇస్లామిక్ కన్వర్షన్లు పెరుగుతుండటానికి కూడా ఇదే ప్రధాన కారణం.
-మహమ్మద్ హనీఫ్
BBC Interview:
https://www.bbc.com/news/stories-55653029?fbclid=IwAR15ig-SKsHe9A3ZGPvcBNkt3j6nfXWZ4LmdVqTS2AvpCc60GNK6UKEQrdA