టిప్పు తిప్పలు!!

టిప్పు సుల్తాన్ గురించి గతంలో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఆర్టికల్.

టిప్పు తిప్పలు!!
==========
టిప్పు సుల్తాన్ మంచోడా, చెడ్డోడా? దేశభక్తుడా, దేశద్రోహియా?
రెండవ ప్రశ్న సులువుగా అనిపిస్తుంది కాబట్టి, అక్కడ నుండి మొదలుపెడదాం . టిప్పు దేశభక్తుడా?, దేశద్రోహా? లక్కీగా, దేశభక్తిని కొలవడానికి మనదగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి.అవి- ‘ఏదేమైనా సరే కాశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో అంతర్భాగమే ‘ అని వాదించేవాడు దేశభక్తుడు, మరో వాదన వినిపిస్తే దేశద్రోహి. కళ్ళు మూసుకుని గట్టిగా వందేమాతరం పాడేవాడు దేశభక్తుడు, అందులో అర్థాలూ,లాజిక్కులూ వెతికేవాడు దేశద్రోహి. పాకిస్తాన్, చైనాలు మనకు శత్రు దేశాలు కాబట్టి, వాటిని బండబూతులు తిడితే కొండంత దేశభక్తి ఉన్నట్లు, లేదంటే వాడు దేశద్రోహి అన్నట్లు. ఇవన్నీ ప్రస్తుతం వాడుకలో ఉన్న దేశభక్తి కొలమానాలు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు చిక్కేంటంటే, ఈ కొలమానలేవీ టిప్పూ కాలంలో అందుబాటులో లేవు. అప్పటికి వందేమాతరం రాయలేదు. కాశ్మీర్ సమస్య ఇంకా పుట్టలేదు. పాకిస్తాన్ అనే పదమే లేదు. అసలు అప్పట్లో దేశమనేదే లేదు..ఉన్నదల్లా కొన్ని రాజ్యాలు మాత్రమే. టిప్పు తన జీవితకాలమంతా, బ్రిటీష్ వారితోనూ మరియు వారితో చేతులు కలిపి తన రాజ్యాన్ని కబళించాలని చూసిన మరాఠా,నిజాం నవాబులతోనూ పోరాడుతూనే గడిపాడు. కాబట్టి టిప్పూ దేశభక్తుడా, కాదా అనే ప్రశ్నే అర్థరహితం.

సరే ఇక మొదటి ప్రశ్న చూద్దాం. టిప్పూ మంచోడా చెడ్డోడా? టిప్పూ విషయం కాసేపు పక్కన పెట్టి, మనకు బాగా తెలిసిన కొందరు మంచోల్లు, చెడ్డోల్ల లిస్టు చూద్దాం. సోనియా గాంధీ మంచిదా, చెడ్డదా? నరేంద్ర మోడి మంచోడా చెడ్డోడా? వై.యస్.ఆర్ మంచోడా,చెడ్డోడా? చంద్రబాబు,కేసీఆర్ మంచోల్లా,చెడ్డోల్లా? వీరందరూ మనకాలానికి చెందిన వారు. మనం వీరిని ప్రత్యక్షంగా,టీ.వీల్లో చూశాం.వీరి మాటల్ని విన్నాం, వీరు చేసిన పనుల్నీ చూశాం. అయినప్పటికీ వీరు మంచోల్లా, చెడ్డోల్లా అనేవిషయం మీద ఓ పది మందితో చర్చాగోష్ఠి లాంటిది పెడితే అందరూ వాదులాడుకోవడం మినహా, ఏకాభిప్రాయానికి రావడం అసాధ్యం. అలాంటిది, ఓ 200 సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి మంచోడా చెడ్డోడా అనే విషయంలో అందరూ ఓ ఏకాభిప్రాయానికి రావడం సాధ్యమయ్యే పనేనా? ఎదుటి వ్యక్తి మంచోడా, చెడ్డోడా అనే నిర్ధారణకు రావడం రెండు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. 1. మంచి, చెడులకు మనం ఇచ్చుకున్న నిర్వచనం. 2. ఆ ఎదుటి వ్యక్తికి సంబంధించి మన దగ్గర ఉన్న, లేక మనం నిజమని నమ్ముతున్న సమాచారం. ఒక్కోసారి మొదటి అంశం, రెండో అంశాన్ని కూడా చాలా వరకూ ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి, మనం ఓ వ్యక్తి చెడ్డోడని అప్పటికే ఫిక్స్ అయిపోయి ఉంటే, అతని మంచితనాన్ని చూపే రుజువులు ఎన్ని ఉన్నా, మనం వాటిని ఓ పట్టాన నమ్మం. అసలు ఇవన్నీ నిజమైనవేనని గ్యారెంటీ ఏంటి? అని డిటెక్టివ్ లా ఆలోచిస్తాం. అదే ఆ వ్యక్తి చెడును చూపించే అంశాలు ఎవరైనా చెప్తే, వాటిని ఇట్టే నమ్మాలనిపిస్తుంది. పైగా ఆ అంశాల్ని పదిమందితోనూ పంచుకోవాలనిపిస్తుంది. ఇది అందరు మానవులకూ వర్తించే సహజ మానవ నైజం.
ప్రస్తుత అంశానికి వస్తే, అసలు టిప్పు గుణగణాల గురించి చర్చ ఎందుకు మొదలైంది అని తెలుసుకోవడం అవసరం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మాటల్లో చెప్పాలంటే, “చరిత్రను, అప్పటి కాలమాన పరిస్థుతులన్నిటినీ బేరీజు వేసుకుంటూ సాపేక్షంగా విశ్లేషించాలి తప్ప, కులం,మతం,భాష వంటి ఏ ఒక్క అంశం ఆధారంగానో విశ్లేషించటం అర్థరహితం. 1857 సిపాయిల తిరుగుబాటులో, హిందూ,ముస్లింల ఐక్యతకు బిత్తరపోయిన బ్రిటీష్ వారు, ఆ ఐక్యతను చెడగొట్టడానికి పన్నిన తెలివైన పన్నాగమే ‘విభజించి పాలించు సిద్దాంతం. అప్పటినుండే భారత చరిత్రను మతం కోణంలో విశ్లేషించడం మొదలైంది.”
1947లో స్వతంత్ర్యం సిద్ధించి, సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటినుండీ, ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా పెట్టుకున్న కొన్ని రాజకీయ పార్టీలకు చరిత్ర మాంచి ముడిసరకుగా మారింది.
ఎలాంటి సమాచారాన్ని అయినా అత్యంత వేగంతో చెలామనీ చేయగలిగే ప్రస్తుత సోషల్ నెట్వర్కింగ్ యుగంలో, చరిత్ర గురించిన అసత్యాలు,అర్థ సత్యాలు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయి. “చరిత్ర గురించి నీకేమనిపిస్తే అది రాసి ఫేస్ బుక్కులో ఓ పోస్టు పడేయ్, పోయేదేముంది, మహా ఐతే 4లైకులు, షేర్లు చేస్తారు.” ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. చరిత్ర మీద భిన్నాభిప్రాయాలు, భిన్న వాదనలు గతంలోనూ ఉండేవి. కానీ, ఆ వాదనల్ని తెరపైకి తేవడానికి కాస్తో,కూస్తో చారిత్రక పరిశోధనలు చేసి ఓ పుస్తక రూపంలోనో, రీసెర్చ్ పేపర్ రూపంలోనో అచ్చేయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవేమీ అవసరం లేవు. 500 రూపాయల్తో ఓ వెబ్సైట్ రిజిస్టర్ చేసి, మనకు తోచింది రాసుకోవచ్చు, ఆధారలకింద మరో నాలుగు తలాతోకలేని వెబ్సైట్ లింకుల్ని ఇవ్వొచ్చు. ఎవరైనా నిజమైన చరిత్రకారుడు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే, అసలు నువ్వు చెప్పేది నిజమని గ్యారెంటీ ఏమిటి? నువ్వు చూశొచ్చావా, అని దబాయించొచ్చు.
‘చరిత్రదేముంది, చింపేస్తే చిరిగిపోద్ది’ అని ఓ ప్రముఖ సినిమా డైలాగ్. కానీ అలాంటి చరిత్రను ఉపయోగించి ప్రజల ఓట్లు కొల్లగొట్టొచ్చనే అలోచన రాజకీయ పార్టీలకు రావడమే అసలు విషాదం. గుజరాత్ నరమేధం, ముజఫర్ నగర్ అల్లర్లు, బాబ్రీ, దాద్రీ వీటి గురించి ఆన్లైన్లో ఎక్కడ చర్చ జరిగినా, ఆ రాజు అప్పట్లో మా వాల్లను అంత మందిని చంపాడు కదా, మా గుళ్ళను కూల్చాడు కదా, ఇప్పుడు ఒక్క దానికే మీకు అంతలా బాధనిపిస్తే మరి గతంలో జరిగిన దానికి ఏం సమధానం చెప్తావ్ అని కొందరు వాదనలకు దిగుతారు. అంటే ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న చెడుని తక్కువచేసి చూపడానికి గతంలో జరిగిన, జరిగిందని చెప్పబడుతున్న చెడుఘటనల్ని జనాలకు అస్తమానం గుర్తు చేయడం వీరి రాజకీయంలో ప్రధాన భాగం. ఈ మత వాద రాజకీయ పార్టీలవైఖరి ఇలా ఉండగా, వీరికి వ్యతిరేకంగా నికార్సైన సెక్యులర్ రాజకీయం నెరుపుతున్నామని ప్రగల్బాలు పలికే పార్టీల వైఖరి మరోలా ఉంటుంది. నిజానిజాల్తో సంబంధం లేకుండా, అప్పటి రాజుల గురించి గొప్పగా మాట్లాడి, వారి ఉత్సవాలు జరిపించి, వాటి ద్వారా ఆ సామాజిక వర్గాలను ఏదో ఉద్దరించినట్లు వీరు ఫీలై పోతుంటారు.
చరిత్రను తెలుసుకోలేని వారు, దానిని తిరిగి అనుభవిస్తారు అని ఓ గ్రీకు నానుడి. కానీ అస్తమానం చరిత్ర గురించి వాదులాడుకునే సమాజాలు, మంచి భవిష్యత్తును నిర్మించుకోలేవనేది కామన్ సెన్స్ ఉన్నవారికి ఎవరికైనా అర్థమయ్యే విషయం. కావున, చరిత్రకు సంబంధించిన విషయాల్ని చరిత్రకారులకు వదిలేసి, రాజకీయ పార్టీలు ప్రజల దైనందిన సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

– మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

2 Replies to “టిప్పు తిప్పలు!!”

Leave a Reply

Your email address will not be published.