ప్రపంచం తటస్థులమయం!!

ప్రపంచం తటస్థులమయం!!
==========================
“రూం లో బంధించి కొడితే, పిల్లైనా తిరగబడుతుంది”

దీనిలో ఎవరికీ ఎలాంటి అణుమానం లేదు. ఆ పిల్లిపై అందరూ బోలెడంత సానుభూతి కురిపిస్తారు.ఆ పిల్లి తిరగబడటమే న్యాయమని కూడా తేల్చేస్తారు.

ఇప్పుడు ఆ పిల్లి పేరు – సలీం అనో, రహీం అనో పెడితే?

ఆ పిల్లి జీహాదీ పిల్లవుతుంది. దాని తిరుగుబాటు కాస్తా, ఆత్మాహుతి దాడి లా మారిపోతుంది. దాని హింసా ప్రవృత్తికి కారణం ఖురాన్ బోధనలే అని బల్ల గుద్ది వాదిస్తారు.
ఇదే జరుగుతుంది ఇప్పుడు.

ఎక్కువ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోనక్కర్లేదు. తాళపత్ర గ్రంధాలు తిరగేసి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.

70 ఏళ్ళ ముందు ఇజ్రాయిల్ అనే దేశం లేదు. ఉన్నదంతా పాలస్తీనా నే. . ఇప్పుడు వారికి జరూసలేం కూడా కట్టబెట్టాలని ప్రపంచ పోలీసు -కంపు గాడు ఫర్మానా జారీ చేశాడు. నాజీల చేతిలో కుక్క చావు చచ్చిన జాతి అని సానుభూతితో అక్కడ తలదాచుకొమ్మని కొంత జాగా ఇచ్చారు. ఇప్పుడు తాము తలదాచుకోవడానికి కనీసం కొంత జాగా మిగల్చమని పాలస్తీనియన్లు పోరాడుతున్నారు. అసలు దానిని పోరాటమనొచ్చా? యుద్దట్యాంకుని రాయితో కొడితే అది పోరాటమెలా అవ్తుంది.రాయితో కొడితే హింసాత్మక పోరాటమనే అనాల్రా బై. మనం తటస్థంగా ఉండాలి కదా.

ఇరాక్,లిబియా, సిరియా.. ఒకప్పుడు బాగా బతికిన దేశాలు. ఇప్పుడు వల్లకాడులా తయారయ్యాయి.ఎవరి వల్ల? అయినా, ఇరాక్ లో తాము చేసిన చిన్న పొరబాటుకు టోనీ బ్లెయిరు క్షమాపణ చెప్పేశాడు కదా. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడ్తావ్. మిగతా దేశాల్లో చేసిందానికి కూడా ఎప్పుడో ఒకప్పుడు చెప్తార్లే. కాస్తంత తటస్థంగా ఉండాలి బ్రో.

అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు?
ఈ GK ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసి నవ్వుకోపోండి.

అన్నట్లు ఆ ఏడుపుగొట్టు రోహింగ్యాల గురించి ఇప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకేం మాట్లాడ్తారు. మొన్న బర్మా ఆర్మీ ప్రపంచ మీడియాను తీసుకెల్లి – కొన్ని శవాలతో పరేడ్ చేయించారు కదా. తమను ముస్లిం-జీహాదీ తీవ్రవాదులే చంపేశాయని ఆ శవాలన్నీ మరణ వాంగ్మూలం ఇచ్చేశాయి. తటస్థతకు మారుపేరైన మీడియా దానిని యధాతధంగా ప్రసారం చేసింది. నేరం రెండు వైపులా ఉందని మన తటస్థ ఫేస్ బుక్కు జడ్జీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానించేశారాయె.
కాబట్టి రోహింగ్యా శరణార్థులూ, మీ చావు శోకాలు వినే ఓపికా, తీరికా ఇక్కడెవరికీ లేదుగాని, పోండి, సైలెంటుగా వెళ్ళి ఆ శాంతియుత బౌద్ధ కపోతాల చేత సామూహిక మాన భంగాలు చేయించుకోండి.

మొన్న రాజస్థాన్ లో చంపబడ్డ వ్యక్తికి న్యాయం చేయాలని శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న 10 మంది ముస్లిం యువకుల్ని ప్రభుత్వం తీసుకెల్లి బొక్కలో వేసింది. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారని అడిగితే -వివిధ మత వర్గాల మధ్య చిచ్హు పెట్టే కుట్ర సెక్షన్ల కింద అని చెప్పారు.
అట్లే ఆ చంపేసిన హంతకులు గారికి మద్దతుగా లక్షలకొద్ది నిధుల సేకరణ చేస్తూ, న్యాయస్థానం పై తమ జండా ఎగురవేసిన వారిని కూడా అదుపులోకి తీసుకుని రాచమర్యాదలతో ఆదరిస్తున్నారట. ఎంత గొప్ప తటస్థ వైఖరో కదా?

ఇప్పుడు ప్రపంచం తటస్థులమయం. పాపం ఆ హద్దునీ, ఈ హద్దునీ బేరీజు వేసుకుని సరిగ్గా మధ్యలో తమ స్టాండ్ ని గీసుకోవడం ఈ తటస్థులందరికీ తలకు మించినపనవ్తుంది.

తెగింపు,కండబలం ఉన్నోడు మాత్రం, ఆ హద్దుల్ని తన ఇష్టం వచ్హ్చినట్లు చెరిపేస్తూ, గీస్తూ పోతుంటాడు. కానీ,ఈ బలమనేది ఎప్పుడూ ఒక్కరి దగ్గరే ఉండదు. ఇది ఎప్పుడూ చేతులు మారుతుంటుంది. ఎంత మంది రాజులు పోలేదు.ఎన్ని రాజ్యాలు పోలేదు. పైకి తటస్థుడిగా కనిపిస్తున్న మానవుడు కూడా, నడిచేది మాత్రం ఆ బలవంతుడు నిర్దేశించిన నియమాల ఆధారంగానే.

-మహమ్మద్ హనీఫ్.
12/17/2017

Leave a Reply

Your email address will not be published.