1983లో వచ్చిన చిరంజీవి ఖైదీ సినిమా ఓ బ్లాక్ బస్టర్. ట్రెండ్ సెట్టర్. అందులో సూర్యం ఏ తప్పూ చేయని అమాయకుడు. కానీ వాళ్ళ ఊరి జమీందారూ,సర్పంచూ కలిసి సూర్యం నాన్నను అన్యాయంగా చంపేశారు. సూర్యం కష్టపడి పెంచుకున్న అరటితోటను, పంట కాపుకొచ్చే సమయానికి తగలబెట్టేశారు. అతని అక్కను చెరచబోతే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇన్ని చేసికూడా జమీందారూ,సర్పంచూ తమ డబ్బు,అధికారం,పలుకుబడి ఉపయోగించుకుని ఎలాంటి శిక్షా అనుభవించకుండా నిక్షేపంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పూకారం తినే సగటు మానవుడు ఎవరైనా ఏం చేయాలి? తనకు న్యాయమనిపించిందీ, తాను చేయగలిగిందీ చేసేయాలి. సూర్యం ఇదే చేశాడు. జమీందారునూ, సర్పంచునూ చంపేశాడు. ‘నా తండ్రి చావుకు కారణమైన వాడెవడో తెలిసికూడా, వాడు నా కళ్ళముందే తిరుగుతున్నాకూడా, ఏమీ చేయలేని పిరికివాడిగా తలొంచుకుని బ్రతకమంటావా?’ అని సూర్యం హీరోయిన్ ని ఆవేశంగా ప్రశ్నిస్తాడు. తెలుగు ప్రజలందరూ సూర్యం ఆవేశంలో తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు. సర్పంచూ, జమీందార్ల హత్యను స్వాగతించారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇదే సినిమా కన్నడలో కూడా సూపర్ హిట్ అయింది. ఇలాంటి సినిమా అప్పుడైనా, ఇప్పుడైనా, ఎక్కడైనా సూపర్ హిట్ అవ్తుంది. ఎందుకంటే, న్యాయాన్ని కోరుకోవడం, అన్యాయాన్ని సహించలేకపోవడం అనేవి మనిషి స్వాభావిక లక్షణాలు. బేసిక్ ఇన్స్టింక్ట్స్. తనకు మాత్రమే కాకుండా, ఎదుటి వ్యక్తికి కూడా న్యాయం జరగాలనీ, అన్యాయం జరగకూడదనీ సగటు మనిషి ఆశిస్తాడు.
కానీ, ఐడెంటిటీ అనేది పిక్చర్ లో కొచ్చాక – ఈ ప్రాధమిక సూత్రం గతి తప్పుతుంది.
***************************
మనుషులు తమ తమ మానసిక,భౌతిక స్థితిగతుల్ని బట్టి కొన్నిటితో ఎక్కువగానూ, కొన్నిటితో తక్కువగానూ తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ఢిల్లీలో, ఓ బస్ లో, సినిమాకు వెల్లి వస్తున్న అమ్మాయి రేప్ కి గురైంది అనేవిషయంతో, దాదాపు సిటీల్లో నివసిస్తున్న ప్రతిఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు. ఎందుకంటే – అలా సినిమాలకు, తమ ఇంట్లో అమ్మాయిలు,తమ అక్కో,చెల్లో వెళ్ళి వస్తుంటారు. వారికే గనక ఈ సంఘటన జరిగితే అనే ఊహ వీరిని నిలువనీయలేదు. తండోపతండాలుగా అందరూ కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. అలాంటిదే మరో కౄరమైన రేప్ బస్తర్ అడవుల్లో, ఓ ఆదివాసీ మహిళకి జరిగిందని తెలిసినా వీరెవరూ అంతగా ఉలిక్కి పడరు. ఎందుకంటే ఆ బస్తర్ ఎక్కడుందో తెలీదు, ఆమె అక్కడికి ఎందుకెల్లీందో తెలీదు, అయినా మన ఇంట్లో ఆడోల్లు అసలు బస్తర్ అడవుల్లో కెల్లే ఛాన్సే లేదు , కాబట్టి అదసలు ఓ సమస్యే అని కూడా చాలమందికి అనిపించదు.
గుజరాత్ అల్లర్లలో, ముజఫర్నగర్లో వందల సంఖ్యలో ముస్లిం మహిళలు దారుణమైన అత్యాచారాలకి గురయ్యారని తెలిసినా, ఆ కొవ్వొత్తులు పట్టుకున్న చాలామందిలో చలనం ఉండదు. ఎందుకంటే వారు ముస్లింలు, మనం కాదు కదా. అదే గనక ఘోరీ సైన్యం 1000 సంవత్సరాల క్రితం మన స్త్రీలపై అఘాయిత్యాలకి పాల్పడ్డారని తెలిస్తే మాత్రం పల్స్ రేటు పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ -‘మన ‘ అని ఉంది కదా.
*****************
న్యాయం వైపుకు మొగ్గు చూపడం, అన్యాయాన్ని నిరసించడం – మనిషికి పుట్టుకతో వచ్చే ప్రకృతిసిద్ధమైన సహజ స్వభావం. ఓ మనిషి యొక్క ఐడెంటిటీ ఈ బేసిక్ ఇన్స్టింక్ట్ ని కలుషితం చేసి, అన్యాయం వైపుకు మొగ్గు చూపేలా చేసిందంటే – ఆ ఐడెంటిటీ, దాని వెనకున్న భావజాలం ప్రకృతివిరుద్ధమైనవని, చెడ్డవని, మనిషి మనుగడకు వ్యతిరేకమైనవనీ అర్థం.
“ఓ విశ్వాసులారా!! న్యాయం వైపు స్థిరంగా నిలబడండి. ఆ న్యాయం మీకు,మీ తల్లిదండ్రులకు, బంధువులకూ నష్టం కలిగించేదైనా సరే, న్యాయం వైపు మాత్రమే నిలబడండి. పేదవారైనా, ధనవంతులైనా.. మీ వ్యక్తిగత పక్షపాతాలతో అన్యాయం పక్షం వహించి సృష్టికర్తకు వ్యతిరేకంగా వెల్లకండి.” -ఖురాన్ 4:135.
ఇంత స్పష్టమైన సందేశం తర్వాత కూడా – ఓ ముస్లిం వ్యక్తి ఎవరైనా, బాధిత ముస్లిమేతరునివైపున కాకుండా, కేవలం ముస్లిమనే కారణంతో – అన్యాయం చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తి వైపున పిలబడితే – అతను అల్లా కు వ్యతిరేకంగా వెల్తున్నట్లు. ఖురాన్ లో సృష్టికర్తకు ఇచ్చిన అట్రిబ్యూట్స్ లో – అల్ హకాం ( అంతిమ న్యాయ నిర్ణేత) అనే ఉంది తప్ప, ముస్లింల న్యాయ నిర్ణేత అని ఎక్కడా లేదు.
************
న్యాయం లేకుండా శాంతి అసాధ్యం. ఫాదర్ ఆఫ్ మాడరన్ పొలిటికల్ ఫిలాసఫీ గా పిలబడే నికోలో మాకియవెల్లీ చెప్పిన ఫేమస్ కొటేషన్ – ఓ వ్యక్తిని గాయ పరచేటప్పుడు(కీడు చేసేటప్పుడు), ఆ గాయం ఎంత తీవ్రంగా ఉండాలంటే, అతను మళ్ళీ లేచి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇక ఏ మాత్రమూ ఉండకూడదు. (If an injury is to be inflicted on an enemy, it is to be so severe, that the enemy’s retaliation need not be feared.) ఆధునిక రాజ్యాలూ/దేశాలూ.. దీనినే ఫాలో అవుతున్నాయి.
కానీ – వీల్లందరూ విస్మరిస్తున్న అంశం – ఆ వ్యక్తికి ఓ అన్నో తమ్ముడో ఉంటే..?
అందుకే – An Injustice somewhere is a threat to Justice everywhere.