About JP
=======
[Note : నేను ఒకప్పుడు లోక్ సత్తా మద్దతుదారున్ని. ఉత్తుత్తి మద్దతుదారుని కాదు. దానికి చాలా సార్లు డొనేషన్స్ కూడా ఇచ్చి ఉన్నాను. అతనికి మద్దతుగా చాలా సార్లు రాసి ఉన్నాను. కాబట్టి, JP అభిమానులు ఆయన గొప్పదనం గురించి ఇక్కడ బాకాలూదొద్దు. ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి అప్పుడు ఊదండి. ]
BJP మద్దతుదారుల్లో చాలా రకాలవారున్నారు. అది హిందువులకు,హిందూ మతానికి మంచిదని నమ్మి మద్దతిచ్చేవారు, అది వస్తే అచ్చేదిన్ తెస్తుందని నమ్మి మద్దతిచ్చేవారు, దానిలో తక్కువ అవినీతి ఉందని నమ్మేవారు.. ఇలా రకరకాలు.
ఇవన్నీ శుద్దతప్పుడు అభిప్రాయాలనీ, నిజానికి BJP, పై ఆశయాలన్నిటికీ పూర్తి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ అని, ఆ పార్టీని, దాని లోగుట్టులను కొన్ని సంవత్సరాలుగా లోతుగా గమనిస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు. దీనిని పూర్తి ఆధారాలతో నిరూపించగలను కూడా.( అఫ్ కోర్స్ వినే ఓపికా,తీరికా, నిజాల్ని ఒప్పుకునే లక్షణం ఎదుటి వ్యక్తికి ఉంటేనే అనుకోండి.).
ఐనప్పటికీ, నేను చదివిన విషయాలే అందరూ చదవాలనీ, నేను తెలుసుకున్న విషయాలే అందరూ తెలుసుకోవాలనీ రూలేం లేదు కాబట్టి – పైన రాసిన BJP మద్దతుదారులందరినీ నేను సహృదయంతో అర్థం చేసుకోగలను. వారితో నాకు ఎలాంటి పేచీ లేదు.
కానీ, BJPకి మద్దతిచ్చిన ఒక వ్యక్తిని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను. అది – JP. దేశ రాజకీయాలు, చరిత్ర వంటి అంశాల మీద పట్టున్న వ్యక్తిగా,సీనియర్ IAS అధికారిగా మోడీ దశాబ్ద కాలం పాటు గుజరాత్ CMగా ఏం చేశాడు, ఎలాంటి విధానాల్ని పాటించాడు అనే విషయం అతనికి తెలియకుండా ఉండే చాన్స్ లేదు. PM గా మోడీ ఇప్పుటి పనితీరుకు, గుజరాత్ CM గా ఉన్నప్పటి పనితీరుకు కూడా ఏమాత్రం తేడా కూడా లేదు.
అలాంటప్పుడు – ఏ ఉద్దేశ్యంతో JP మోడీకి ప్రధానిగా మద్దతిచ్చాడు. దీని వెనక జరిగిన గూడుపుఠానీలేంటి? గూడుపుఠానీలేమీ లేనప్పుడు – “నా అంచనాలు తప్పయ్యాయి, బుద్ది గడ్డి తిని అతనికి మద్దతిచ్చ్చాను, ఇప్పుడు నాకు బుద్దొచ్చ్చిందని JP లెంపలేసుకోవాలి.” – అలా చేయనంత వరకూ అతన్ని కూడా మోడీ కి పార్ట్నర్ ఇన్ క్రైం అనే భావించాల్సొస్తుంది.
గతంలో ఈ అంశం గురించి నేను రాసింది –
జె.పి.,పవన్ కళ్యాన్ లు ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా?
=======================================
తమ పార్టీకి తప్ప వేరే ఏ ఇతర పార్టీలకూ సిద్ధాంతాలు లేవనీ, ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించటానికే తమ పార్టీ పుట్టిందనీ, గంగాజలం లాంటి తమ పార్టీ ఏ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోదనీ ఇన్నాల్లూ నీతి వచనాలు ప్రవచిస్తూ వచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఇటీవల తనకు అకస్మాత్తుగా ఙ్నానోదయమైనట్లు భాజపా తో పొత్తుకు సిద్ధమని ప్రకటించేశారు. ఇక కమ్యూనిస్టు విప్లవ యోధుడు చేగువేరా బొమ్మతో జనసేనను ప్రకటించిన పవన్ కళ్యాన్, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేక భావజాలాలైన కమ్యూనలిజం, క్యాపిటలిజంలకు నిలువెత్తు రూపమైన మోడీ భజన చేయడం మొదలుపెట్టాడు. గుజరాత్లో వేల మంది అమాయకుల మృతికి కారకుడుగా మైనారిటీలు, సెక్యులరిస్టులూ విమర్శిస్తున్న నరేంద్ర మోడీకి దేశాన్నేలే అన్ని అర్హతలు ఉన్నాయని వీరిద్దరూ క్లీన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. భారత దేశ రాజ్యాంగం తనకు గీత, బైబిల్, ఖురాన్ లాంటివనే భారీ డైలాగుల్ని అలవోకగా వల్లెవేసే జె.పి,పవన్ లు , మోడీని వెనకేసుకొస్తున్నందుకు లౌకిక వాదుల క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
1. మీరు రాజకీయాలు కలుషితమైపోతున్నాయని, రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశిస్తున్నారనీ తెగ ఇదై పోతుంటారు. గుజరాత్ లో 97 మంది అమాయక స్త్రీలను, పిల్లల్ని నిర్దాక్షిన్యంగా చంపిన కేసులో మాయా కొందానికి కోర్టు 28 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ నేరం 2002 లో జరగ్గా, తీర్పు 2013లో వెలువడింది. 2007 లో ఈమెను మోడీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా నియమించాడు. అల్లర్లలో ఆమె పాత్ర ఉందనే విషయం తెలీని అఙ్నానం, అసమర్థత వల్ల మోడీ ఆమెను మంత్రిని చేశాడా లేక, ముస్లింలను చంపినందుకు ప్రతిఫలంగా ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడా? అవినీతి కంటే, అమాయకుల్ని చంపడం అనేది పెద్ద నేరమేమీ కాదని మీరు భావిస్తున్నారా?
2. మీరు బలమైన లోక్పాల్ వ్యవస్థ గురించి, అవినీతి గురించి TV స్టూడియోల్లో గంటలకొద్దీ మాట్లాడు తుంటారు. కానీ, మోడీ గుజరాత్ లో లోకాయుక్తను నియమించకుండా పదేళ్ళపాటు ఖాళీగా ఉంచాడు. చివరికి గుజరాత్ గవర్నర్ చొరవ తీసుకుని ఓ లోకాయుక్త ని నియమిస్తే, మోడీ ఆ నియామకానికి వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. అక్కడ చుక్కెదురవడంతో, కోట్ల కొద్దీ ప్రజాధనాన్ని ఫీజుగా చెల్లించి రాం జెఠ్మలానీ ని లాయర్ గా పెట్టుకుని సుప్రీం కోర్టుకి వెల్లాడు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో, విధిలేని పరిస్తితుల్లో హడావుడిగా గుజరాత్ లోకాయుక్త చట్టాన్ని సవరించి, తూ తూ మంత్రంగా లోకాయుక్త నియామకాన్ని కొన్ని నెలల క్రితం పూర్తి చేశాడు. ఇప్పుడు మీరు మోడీని సమర్థిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మోడీ విధానమే సరైనదని మీరు భావిస్తున్నారా?
3. భారత రాజ్యాంగ ఔన్నత్యం గురించి మీరు అనర్గళంగా ప్రసంగిస్తుంటారు. ఏవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని శిక్షించే అధికారం రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలకు ఇవ్వబదింది. కానీ మోడీ పాలనలోని గుజరాత్లో అనేకమంది మైనారిటీ యువకుల్ని కేవలం టెర్రరిస్టులనే అనుమానం మీద పోలీసులు కాల్చిచంపడం జరిగింది. మృతుల్లో కొందరికి టెర్రరిజం తో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే నిరూపించబడింది. మిగతా కేసులు కూడా వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. నకిలీ ఎంకౌంటర్ల అభియోగంపై సుమారు 20 మంది గుజరాత్ ఉన్నత స్థాయి పోలీసు అధికారులు సస్పెండ్ కావడమో జైలు శిక్ష అనుభవించడమో జరిగింది. గుజరాత్లో శాంతి భద్రతలు ఈ స్థాయిలో విఫలమవడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో బాటు హోం శాఖను కూడా వెలగబెడుతున్న మోడీ పాత్ర లేదంటారా?
4. మీరు టి.వి. చర్చల్లో ఏ విషయాన్ని ఐనా హేతుబద్ధంగా విశ్లేషిస్తుంటారు. అదే హేతుబద్ధత ఆధారంగా దీనికి సమాధానం చెప్పండి. ఓ విద్యార్థి 9వ తరగతివరకు ప్రతి ఏడూ మంచి మార్కులు సాధిస్తే, 10 వ తరగతిలో కూడా మంచి మార్కులే సాధిస్తాడు. ఆ మాత్రం దానికి కేవలం తనవల్లే అతనికి మంచి మార్కులు వచ్చాయని 10వ తరగతి టీచరు చాటింపు వేస్తే ఎలావుంటుంది? ఆ విద్యార్థి అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులు సాధించిన విషయం తెలీని అమాయకులు ఎవరైనా ఆ టీచర్ని నమ్మితే ఆది వేరే విషయం. కానీ, బ్రిటీష్ వారి కాలం నుండే గుజరాత్ పారిశ్రామికంగా ఇతర రాష్ట్రాల కన్నా ఏంతో అభివృద్ధి చెందిందనే విషయాన్ని సివిల్ సర్వీసెస్ పుస్తకాలలో చదువుకున్న మీరు కూడా మోడీ కారణంగానే గుజరాత్ అభివృద్ధి చెందిందనే నిర్ణయానికి ఎలా వచ్చారనేదే ఆశ్చర్యకరం. బాల బాలికల్లో పౌష్టికాహార లోపం, గ్రామీణ విద్య, వైద్యం లాంటి అనేక సంక్షేమ రంగాల్లో గుజరాత్ స్థాయి నానాటికీ దిగజారిపోతున్న విషయం మీ దృష్ఠికి రాలేదా? లేక అధిక పారిశ్రామికాభివృద్ధి ముందు, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కాదని మీ అభిప్రాయమా?
5.కొన్నేళ్ళక్రితం వచ్చిన ‘ఒకే ఒక్కడు ‘ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో టి.వి. వ్యాఖ్యాతగా పనిచేసే కధానాయకుడు, విలన్ పాత్రధారి అయిన రాజకీయనాయకుడ్ని కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానాలు చెప్పలేని ఆ రాజకీయ నాయకుడు ఆ ఇంటర్వూ మధ్యలోనే ఆపేసి స్టూడియో నుండి వెల్లిపోతాడు. ‘గుజరాత్ అల్లర్లలో అన్ని వేల మంది అమాయకులు మరణించినందుకు మీరు చింతిస్తున్నారా?’ అని విలేఖరి కరన్ ధాపర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని మోడీ, విలన్ రఘువరన్ లాగానే స్టూడియో నుండి హడావుడిగా వెల్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూటూబ్ లో ఉన్నాయి. గోధ్రా రైలు దహనంలో, అనంతరం జరిగిన అల్లర్లలో మరణించిన కొద్దిపాటి హిందువుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించటంలో ఏ మాత్రం ఆలస్యం చేయని మోడీ, అల్లర్లలో మరణించిన అమాయక ముస్లింల కుటుంబాలను మాత్రం ఇప్పటికీ కలవలేదు, వారికి కనీస సానుభూతిని కూడా ప్రకటించలేదు. మోడీ మతోన్మాదం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా మీలాంటి వారి కళ్ళకి అతను సెక్యులరిస్టుగా కనిపించడం విచారకరం. అమాయకుల చావుల విషయంలో, చనిపోయిన వారి మతాన్ని బట్టి, ఒక్కో మతానికి ఒక్కో రకంగా స్పందిస్తున్న మోడీ లాంటి మతోన్మాది భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే దేశానికి ఎలా ప్రధానిగా అర్హుడని మీరు భావిస్తున్నారు?
నిజానిజాలతో సంబంధం లేకుండా గోబెల్స్ ప్రాపగాండా సఫలీకృతం అవడం, వ్యక్తి పూజ, అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కావడం లాంటివి అంతిమంగా దేశాన్ని నియంత పాలనలోకి నెట్టేస్తాయనే విషయం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ తో నిరూపితమైంది. అప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి ఎందరో నాయకుల పోరాటాల ఫలితంగా మళ్ళీ దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. కానీ, అదే పేరు పెట్టుకున్న లోక్ సత్తా జె.పి మరో కాబోయే నియంత పాలనకి మంగళహారతులివ్వడం శోచనీయం. నిజానికి పైన అడిగిన ప్రశ్నలు, మోడీని డైరెక్టుగా అడగాలని, అతని నుండి సమాధానాలు రాబట్టాలని చాలా మంది జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు. కానీ, మోడీ ఇలాంటి వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడు. కేవలం తనకు అనుకూల వార్తలు రాసే మీడియాల్లోనే, అది కూడా తాను ముందుగా ఎంచుకున్న ప్రశ్నలకు మాత్రమే అందమైన సమాధానాలు ఇస్తారు. ఇక ఆ తర్వాత వందల కోట్లు చెల్లించి ఏర్పాటు చేసుకున్న ప్రాపగాండా ఏజెన్సీలు ఆ అందమైన సమాధానాల్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాయి.
ఈ వ్యూహం ఇప్పటిదాకా విజయవంతం కాబట్టే, మోడీ వస్తే ఏదో ఉద్ధరిస్తాడనే భ్రమలు అనేక మందిలో కనిపిస్తున్నాయి. కానీ, తాము అందరికంటే చాలా విభిన్నమైన వారమనీ, తమకు గొప్ప, గొప్ప విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయనీ ప్రగల్బాలు పలికే జె.పి, పవన్ కళ్యాన్ లాంటి వారైనా, మోడీ తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నలకు సమాధాన మివ్వాల్సిన అవసరం ఉంది.
పాపం – జె.పి, పి.కె.!!!!
===============
2004 లో, కేంద్రంలో UPA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సోనియా గాంధీ అధ్యక్షతన NATIONAL ADVISORY COUNCIL-NAC – జాతీయ సలహాదారుల సంఘం అనేదానిని ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు 10 మంది సభ్యులు ఉంటారు. వీరు చేయాల్సిన పని – దేశానికి, దేశప్రజలకు మంచి చేయడానికి ఏ ఏ పధకాలు అమలు చేయాలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం. ఈ పని చేసిపెట్టినందుకు ప్రభుత్వం వీరికి జీతభత్యాలు, కారు, ఇల్లు వంటి సౌకర్యాల్ని కల్పిస్తుంది. సరే ఇంతకీ ఆ పది మంది ఎవరు అనే అణుమానం మీకు రావచ్చు. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నోళ్ళకెవరికైనా, తట్టే సమాధానం – ఇలాంటి నామినేటెడ్ పోస్టులని ఎవరికో ఎందుకిస్తారు, తమ పార్టీ వారికి, తమ నమ్మిన బంటులకు ఇస్తారు అని. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఇలాంటి పోస్టులన్నిటినీ, ప్రతిభతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆర్.ఎస్.ఎస్. వారితో నింపేస్తున్న విషయం తెలిసిందే కదా. అఫ్కోర్స్, మన దేశంలో చాలా వరకూ సగటు రాజకీయాల స్థాయి ఇలాగే ఉంది లెండి.
అన్ని పార్టీలు, అందరు రాజకీయ నాయకులూ ఒక్కటే, అని మనోళ్ళూ చాలా సార్లు ఎక్స్ పర్ట్ జడ్గిమెంట్లు ఇస్తుంటారు గానీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లు, UPA1 ప్రభుత్వం ఏర్పడ్డాక, సగటు రాజకీయాల స్థాయిని దాటి , ఓ గొప్ప పని చేశారు. అది NAC సభ్యుల్ని పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభ, చిత్తశుద్ధి ఆధారంగా ఎంపిక చేయడం. వీరు ఎంపిక చేసిన ఆ పది మందీ, కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధం లేనివారు. పైపెచ్చు కాంగ్రెస్ ని వివిధ సంధర్భాల్లో విమర్శించిన వారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, సమాజంలో నిజమైన మార్పుకు కృషిచేసిన/చేస్తున్న వారు. వీరి పేర్లను ఓ సారి పరిశీలించండి, విషయం మీకే అర్థమవుతుంది. –
యోగేంద్ర యాదవ్ – సామాజిక విశ్లేషకుడు – అనంతరం ఆం ఆద్మీ పార్టీలో కీలక సభ్యుడు.
యం.యస్. స్వామినాధన్ – వ్యవసాయ శాస్త్రవేత్త
అరుణారాయ్ – ఈవిడ IAS జాబ్ కి రిజైన్ చేసి కార్మికులు, శ్రామికుల హక్కుల కోసం పోరాడారు.
ఇక మనందరికీ బాగా తెలిసిన పేరు – జయప్రకాశ్ నారాయణ. ఈయన గురించి దాదాపు అందరూ ఒప్పుకునే విషయాలు – సౌమ్యుడు, నెమ్మదస్తుడు- పాలనా పరమైన అంశాల్లో గట్టి పట్టున్న వ్యక్తి – అన్నిటికన్నా ముఖ్యంగా దివంగత NTRకి చాలా దగ్గరి వాడుగా పేరున్న వ్యక్తి.
మిగతా వారు కూడా ఇలాగే, హంగూ ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా బతుకుతూ వివిధ సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నవారే తప్ప కాంగ్రెస్ వారు మాత్రం కాదు.
ఇలాంటి ‘కాంగ్రెస్ తొత్తులు ‘ కాని వారందరినీ కమిటీలోకి సోనియా గాంధీ ఎందుకు తీసుకున్నారనేది ఆలోచించాల్సిన విషయం.
నాకు తెలిసినంతవరకూ, వీరైతే దేశానికి పనికొచ్చేలా సరైన సలహాలు ఇవ్వగలరు అనే ఏకైక కారణంతోనే వీరిని ఎంపిక చేశారు.
ఆ సలహాల్ని తీసుకోవడమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సోనియా, మన్మోహన్ సింగ్ ల నాయకత్వం చాలా వరకు ప్రయత్నించారు.
ఉదాహరణకు – స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పధకాల్లో కెల్లా గొప్ప పధకం ఏదంటే, ఠక్కున గుర్తొచ్చే పధకం – సమాచార హక్కు చట్టం. దీనిని NAC ప్రతిపాదించగా UPA తీసుకువచ్చింది. అట్లే మరో గొప్ప పధకం – గ్రామీన ఉపాధి హామీ పధకం, ఇది కూడా NAC ప్రతిపాదించిందే. వీటితో పాటు విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం.. ఇలాంటివన్నీ NAC బుర్రల్లో నుండి పుట్టుకొచ్చినవే.
కాంగ్రెస్ పార్టీతో ఏ మాత్రం సంబంధం లేనివారికి ఇంతటి పెద్ద పీట వేసి, వారి ఆలోచనల్ని కార్య రూపం దాల్చేలా చేయటంలో, ఈ దేశానికి నిజంగా మేలు చేయాలనే సోనియా గాంధీ యొక్క సంకల్పం క్లియర్ గా కనబడుతుంది. ఈ విషయం మనకంటే ఎక్కువగా JPకే తెలిసుండాలి. కానీ ఈ విషయాల గురించి JP ఎప్పుడూ నోరు మెదపలేదు. RTI చట్టానికి తానే డ్రాఫ్ట్ రచించానని అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు కానీ, తనకు అలాంటి అవకాశం కల్పించిన మన్మోహన్/సోనియాలకు ధన్యవాదాలు అని కనీసం ఒక్కసారి కూడా అనలేదు.
ఇక 2006లో, అప్పటి వరకూ సేవాసంస్థ గా ఉన్న లోక్ సత్తాని రాజకీయ పార్టీగా మార్చాక, JP, NAC కి రాజీనామా చేశారు.
“నేను ఇంకొకరికి సలహాలు ఇవ్వడమేమిటి, నేనే సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే నా పధకాలని నేనే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చనే ” పాజిటివ్ థింకింగ్ తో ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ 2009 ఎన్నికల్లో ఆయన తప్ప, ఆయన పార్టీ సభ్యులెవరూ గెలుపొందలేదు. డబ్బు,కులం,మతం వంటి వాటి ప్రస్తావనలేకుండా ఆయన ఒక్కడు గెలవడం కూడా చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. కూకట్ పల్లి MLAగా ఆయన పనితీరు చాలా గొప్పగా ఉందని కూకట్పల్లి ప్రజలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. తన పార్టీ విధానాలు మిగతా అన్నిపార్టీల విధానాల కంటే చాలా భిన్నమైనవని ఆయన చెప్పటమే కాకుండా ఆచరణలో చేసి చూపారు. కానీ, 2014 ఎన్నికలప్పటికి వచ్చేటప్పటికి తెరవెనుక ఎవరితో ఏ మంతనాలు నడిచాయోగానీ, కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకి తన మద్దతు ప్రకటించేసి వారితో కలిసి వేదికను పంచుకున్నాడు. వారి విధానాలు, తన విధానాలకంటే గొప్పవని JPకి కొత్తగా ఙ్గానోదయమైందో లేక, తాము అధికారంలోకి వస్తే, పెత్తనమంతా ఈయనచేతిలో పెట్టి, ఆయన చెప్పినట్లు వింటామని వారిద్దరూ ఈయనకు వాగ్దానాలేమైనా చేశారో మనకు తెలీదు. మొత్తానికి ఎన్నికల తర్వాత CBN CM గా, మోడీ PMగా ప్రామాణస్వీకారం చేసేశారు గానీ, మన JP మాత్రం ఉత్త JPగానే మిగిలిపోయారు.
ఈయనతో ఎలాంటి ఎన్నికల ఒప్పందాలూ లేకపోయినా, 2004లో సోనియాగాంధీ ఈయన నిజాయితీని,ప్రతిభని గుర్తించి ఈయనకి NACలో సముచితస్థానం కల్పించింది. కానీ ఈయనతో కలిసి ఒకేవేదికపైకెక్కి ఉపన్యాసాలు దంచిన మోడీ,CBNలు మాత్రం, ఈయనని దరిదాపులకు కూడా రానీలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి పాపం తేలుకుట్టిన దొంగలా, కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. CBN,మోడీలతో కలిసి ఎన్నికల్లో పోటిచేశాడు కాబట్టి, ఇప్పుడు వారిని విమర్శించలేడు. ప్రస్తుతం ఆయన అధికారపక్షమో, ప్రతిపక్షమో తెలీక మొత్తానికి రాజకీయాలనుండే శాశ్వతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఒన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే ఇదే!!
-మహమ్మద్ హనీఫ్.