అరె మామా, ఏక్ పెగ్ లా!!
==================
“అబ్బాయి చాలా మంచోడు. తాగడం, తిరగడం లాంటి చెడు అలవాట్లేమీ లేవు”
కొన్నేల్లక్రితం వరకూ, అంటే సుమారు ఓ 15-20 సంవత్సరాల క్రితం వరకూ, ఈ మాట పెళ్ళీడుకొచ్చిన అబ్బాయిల గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినబడేది. ఈ మధ్య కాలంలో తాగుడు చెడు వ్యసనాల లిస్టు నుండీ మాయమైపొయింది. ఇప్పుడు తాగి రోడ్లపై పడిపోతేనో, లేక ఎవరిపైనన్నా పడి ఏదైనా చేసి, గొడవలకు దిగితే మాత్రమే అది చెడ్డపని. అలా కాకుండా, నాలుగ్గోడల మధ్యనో, ఫ్రెండ్స్ తో కలిసో తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే అది అస్సలు ఇష్యూనే కాదు.
కేవలం ఒకే ఒక జనరేషన్లో ఎంత మార్పు..?
ఈ మార్పు ఎలా,ఎందుకు వచ్చిందనేది బుర్ర బద్దలుకొట్టుకుని ఆలోచించాల్సినంత రహస్యమేమీ కాదు. ఉద్యోగం వచ్చినా, అది ఊడిపోయినా, పాత మిత్రులు కలిసినా, కొత్త పరిచయాలు ఏర్పడినా, ఆనందమొచ్చినా, బాధొచ్చినా, పండగొచ్చినా, ఫంక్షన్ వచ్చినా.. మందేయాల్సిందేనని 10 సినిమాల్లో తొమ్మిది సినిమాల హీరోలు, ( ఇటీవల హీరోయిన్లు కూడా) ఊదరగొడుతున్నప్పుడు, అందంగా చేసి చూపిస్తున్నప్పుడు, దానికి కౌంటర్ గా ‘మందు తాగకూడదు’ అని చెప్పే బలమైన సిద్ధాంతమేదీ లేనప్పుడు, ఆ సినిమాలు చూస్తూ పెరిగిన జనరేషన్ అలా కాకుండా వేరేలా ఎందుకు ఆలోచిస్తారు.
అలాంటి సినిమాలు చూస్తూ పెరిగిన జెనరేషనే నాది కూడా. గతంలో చాలా పోస్టుల్లో రాసినట్లు, హైస్కూల్లో చదివిన డార్విన్ థియరీ వల్ల నేను నాస్తికున్నయ్యాను. కాబట్టి “మందు తాగడం ఎందుకు తప్పు” అనే ప్రశ్నకు అప్పట్లో నాదగ్గర సరైన కౌటర్ ఆర్గ్యుమెంట్ లేదు. నాకు ఇస్లాంపై గురి కుదరక ముందు, రాం గోపాల్ వర్మను చదవడం చాలా విషయాల్లో హెల్ప్ అయింది.అలా ఆర్జీవీ రచనల్తో పరిచయమైందే – ఆబ్జెక్టివిజం.
ఆల్కహాల్ – ఆబ్జెక్టివిజం:
——————————
ఆబ్జెక్టివిజం – అంటే, ఓ అంశం గురించి అప్పటికే ఉన్న ఫీలింగ్స్ నీ, ఎమోషన్స్ నీ పక్కన పెట్టి, కేవలం ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఆధారంగా విశ్లేషించడం.
అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం.
Movement Disorders – Motor Disorders : అని న్యూరాలజీ, సైకియాట్రీలలో కొన్ని రకాల జబ్బులున్నాయి. వీటికున్న అనేక సింప్టంస్ లో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే – శరీరంలోని కాల్లూ,చేతులు వంటి వివిధ అవయవాలపై పట్టు/నియంత్రణ లేకపోవడం. అప్రయత్నంగా అవి కదులుతుండటం, లేక మనకు కావలసిన విధంగా వాటిని సరిగ్గా కదపలేకపోవడం.
Gait abnormalities : అని ఆర్థోపెడిక్స్ లో ఇంకో రకం జబ్బు. దీని సింప్టంస్ ఏంటంటే – తిన్నగా నడవలేకపోవడం. నిలబడలేకపోవడం.
మెమొరీ లాస్ : తలకు గాయం కావడం వల్లో, మెదడు కణాలు తాత్కాలికంగా డీయాక్టివేట్ ఐపోవడం వల్లో గ్ఞాపక శక్తిని పర్మనెంట్‌గా కానీ, తాత్కాలికంగా, పాక్షికంగా గానీ కోల్పోవడం.
ఖర్మ కాలో, గ్రహచారం బాగలేకో చాలా మంది పైన చెప్పిన వివిధ జబ్బుల బారిన పడుతుంటారు. ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు చేసుకుంటూ, ఉస్సూరు మంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు.
ఇప్పుడు మళ్ళీ మన మందు విషయంలోకి వెల్దాం. తాగిన మందు శరీరంలోకెళ్ళి ఏం చేస్తుంది?
తాగిన ఆల్కహాల్ -కడుపు,చిన్న ప్రేవులు, లివర్ లలో జీర్ణం కాబడి, రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. ఇది మెదడుకు చేరినప్పుడు, – శరీరంలోని వివిధ భాగాలనుండి నిరంతరం వచ్చే సిగ్నల్స్ ని అందుకోవడం, వాటికి ఇన్స్ట్రక్షన్స్ ని పంపించడం అనే మెదడు యొక్క పనితనం నెమ్మదిస్తుంది. దీనివల్లే తాగిన వాల్లు తేడాగా బిహేవ్ చేస్తుంటారు. ఆ తేడా బిహేవియర్లో , పైన చెప్పిన వివిధ జబ్బు లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
ఖర్మకాలి, గ్రహచారం బాగలేక పైన చెప్పిన వ్యాధి లక్షణాలకు గురైతే దానిని అర్థం చేసుకోవచ్చు. కానీ, అన్నీ బాగుండి, మంచి స్థితిలో ఉన్న ఓ వ్యక్తి తనకు తానుగా, డబ్బు ఖర్చుపెట్టుకుని ఆ వ్యాధి లక్షణాలను కాసేపు ఫీల్ అవ్వాలను కోవడం – ఎం-దు-కు?
దీనికి మనసొసైటీ, సినిమాలు ఇచ్చే రెడీమేడ్ సమాధానాలు – తాగితే రిలీఫ్ ఉంటుందట. బాధల్ని మర్చిపోతారట.
వీరు చెప్పే ఆ రిలీఫ్ శరీరానికా, మనసుకా? శరీరం అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతి,నిద్ర రిలీఫ్ నిస్తాయి. మనసు గందరగోలంలో ఉన్నప్పుడు -దానికి ఆధ్యాత్మికత గానీ, లేక, ఏ విషయం వల్ల ఆ గందరగోలం ఏర్పడిందో దాని ఆబ్జెక్టివ్ అనలైసిస్ గానీ రిలీఫ్ నిస్తుంది. ఇవేవీ కాకుండా – కొంత ద్రావణం తాగి మెదడు కణాల్ని నెమ్మదింపచేస్తే వచ్చే రిలీఫ్ కూడా ఓ రిలీఫేనా?
ఇక బాధల్ని మర్చిపోవడం అంట. ఎంతసేపు మరచిపోతారు ఆబాధల్ని? తెల్లారేదాకా? ఆ తర్వాత? అసలు తాగుడు తీసుకొచ్చే కొత్త బాధల సంగతేంటి? ఆర్థిక నష్టాలు, వివాహ బంధాలు,మానవ సంబంధాలు విచ్చిన్నం కావడం, వాహన ప్రమాదాలు, ఇతర ప్రమాదాల సంగతేంటి?
అసలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర క్రైంస్ లలో, కేవలం ఆల్కహాల్ సేవించి వుండటం వల్ల జరిగే నేరాలే చాలా వరకూ ఉన్నాయనేది దాదాపు అన్ని క్రైం అనాలసిస్ రిపోర్ట్‌లూ ఆధారలతో సహా ఎప్పుడో నిరూపించేశాయి.
మొత్తమ్మీద, ఆబ్జెక్టివా, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, తాగడం వల్ల వచ్చే ప్రయోజనం ఇసుమంత కూడా లేదు. దానివల్ల కలిగే అనర్ధాలు, దుష్పరిణామాలు మాత్రం కోకొల్లలు. అయినా జనాలు ఎగబడి తాగుతున్నారంటే దానికి ఒకేఒక కారణం – బ్రెయిన్ వాషింగ్. తమకు తెలీకుండానే తమ సబ్ కాన్షస్ మైండ్స్ లో ఇంకి పోయేలా, ఓ పద్దతి ప్రకారం, పదే పదే చేయబడిన తిరుగులేని బ్రెయిన్ వాషింగ్.
ఆల్కహాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఓ మల్టీ బిలియన్ డాలర్ చీకటి ఆర్థిక వ్యవస్థ. చీకటి వ్యవస్థ అని ఎందుకంటున్నానంటే – దానివల్ల మానవాలికి కీడేతప్ప, ఇసుమంత కూడా మేలు లేదు కాబట్టి. “నా డబ్బుతో, నా ఇంట్లో నేను తాగి ప్రశాంతంగా పడుకుంటా, దీని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదుకదా”- అని అనుకోవచ్చేమో. కానీ, ఆల్కహాల్ పై మీరు ఖర్చు చేసే ప్రతిపైసా , ఆ చీకటి ఆర్థిక వ్యవస్థకు మిమ్మల్ని ఓ కన్స్యూమర్ ని చేస్తున్నాయి. కన్స్యూమర్ లేనిదే ప్రొడక్షన్ ఉండదు. ఆ రకంగా మీరు కూడా దానిలో భాగం పంచుకుంటున్నట్లు.
కాబట్టి బుర్రున్న వారు .. ఆలోచించండి. సమస్యలేమైనా ఉంటే, వాటికి ‘కొత్త సమస్యల్ని సృష్టించని పరిష్కార మార్గాల్ని’ శోధించండి. సెలబ్రేషన్స్ కి వేరే అర్థవంతమైన మార్గాల్ని ఎంచుకోండి. జబ్బులొచ్చినప్పుడు సింప్టంస్(Symptoms) ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. అవి ఇప్పటినుండే డబ్బులిచ్చిమరీ ప్రాక్టీస్ చేయడమెందుకు?
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in
Very good analytical objectivism. Difficulty isthat, this works only with those who got analytical brain and logical understanding.