అల్లా ఏం చేయట్లేదా..? – పార్ట్-2

అల్లా ఏం చేయట్లేదా..? – పార్ట్-2
==================

గత పోస్ట్ లో రాసినట్లు – “ఇన్ని జరుగుతుంటే అల్లా ఏం చేస్తున్నాడు” , అనేది చాలా మంది ఫేవరైట్ డైలాగ్. ఇదో ఫిక్షనల్, ఊహాజనిత కొచెన్. కాబట్టి దీనికి ఫిక్షనల్, ఊహాజనిత ఆన్సర్ మాత్రమే ఎవరైనా ఇవ్వగలరు. అదేంటో చూద్దాం.

1947లో భారత్ స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. 80 శాతం జనాభా పేదరికంలో మగ్గుతుండేది. ఆ పేదల్ని బీసీలు, యస్సీ, యస్టీ లుగా పంపకాలు చేశారు. ( అఫ్కోర్స్ టెక్నికల్ గా ఆ విభజన ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కాదు, కానీ, బ్రాడ్ గా చూస్తే ఇంచుమించు అలాగే ఉంటుంది.)

బీసీలు, యస్సీ లతో కలిసిమెలిసి ఉంటూ, వారి వృత్తులే చేసుకుంటూ, వారి పేదరికాన్నే అనుభవిస్తూ, ప్రతి గ్రామంలోనూ, వాడలోనూ ముస్లింలు కూడా ఉండేవారు. కానీ వీరిని మాత్రం ఓసీల్లో పడేశారు. బీసీ,యస్సీ,యస్టీలకు సంక్షేమ హాస్టల్లు, స్కాలర్షిప్పులు, సీట్లలో,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, భూపంపినీలు, వ్యవసాయ రుణాలు.. ముస్లింలకు మాత్రం ఇవేవీ ఇసుమంతైనా లేకపోగా చీత్కారాలు, వెక్కిరింతలు, నిందలు.

జనాభాలో 15% ప్రజల్ని, రాజ్యం ఇంత ప్రతికూల, కక్ష సాధింపు చర్యలకు గురిచేస్తే, ఇక ఆ వర్గం లేచి నిలబడటం, తన అస్థిత్వాన్ని కాపాడు కోవడం అనేది దాదాపు అసాధ్యం. కానీ భారతీయ ముస్లింలు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ అస్తిత్వాన్ని నిలుపుకుని మనుగడ సాగిస్తున్నారు. దానికి వీరికి అనుకూలిస్తున్నా అంశాలేమిటి?

ఇస్లామిక్ భావజాలం – గల్ఫ్ సంపద.

ఈ పోస్ట్ రాసే ముందు.. నా బంధువర్గంలో , నా కంటే ఓ 10-20 సంవత్సరాలు పెద్దవయసున్నోల్ల జీవితాలగురించి ఆలోచించాను. వారు ఏం చదివారు, ఏ వృత్తులు చేశారు. వారి కుటుంబాల పరిస్థితులు ఎలా మారుతూ వచ్చాయి అని. వీరందరిలో నాకు కనిపించిన కామన్ విషయం – గల్ఫ్. ఉపాధికోసం కనీసం ఇంటికొకరైనా గల్ఫ్ దేశాలకు వెళ్ళి, అక్కడి సంపదతో ఇక్కడి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచుకున్నారు. అంటే, ప్రభుత్వం వీరికి చూపిన మొండి చేయిని ఓ రకంగా గల్ఫ్ పూరించింది.( కాంపెన్సేట్ చేసింది). దీనికి ప్రధాన కారణం ఎందుకూ పనికి రాని అక్కడి ఎడారి భూముల క్రింద బయల్పడిన చమురు నిల్వలు. సహజంగా కాయాకష్టం చేసేవారు,చేతి వృత్తులవారూ ఓ మోస్తరు గానే సంపాదిస్తుంటారు. కానీ, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల(మద్యపానం వంటి దురలవాట్ల వలన) ఆ సంపాదించిన దానిని కూడబెట్టుకోవడమో, సరిగ్గా వినియోగించుకోవడమో చేయలేరు. కానీ, గల్ఫ్ దేశాల్లోని ఇస్లామిక్ సంస్కృతి, కఠిన చట్టాల వల్ల, కుటుంబాలకి దూరంగా ఉండి కూడా, వీరు సంపాదించిన ప్రతిపైసానీ కూడబెట్టి ఇండియాలోని కుటుంబాలకు పంపేవారు. ఈ రకంగా గల్ఫ్ సంపద వల్ల బాగుపడ్డ కుటుంబాలు, ఊర్లకు ఊర్లు, కాలనీలు, జిల్లాలు దేశంలో చాలా ఉన్నాయి. ఇలా బాగుపడ్డవారిలో అన్ని సామాజిక వర్గాల వారూ ఉన్నప్పటికీ – ప్రధాన లబ్ధిదారులు మాత్రం – ముస్లింలే.

ఇదంతా వ్యక్తిగత స్థాయిలో. ఇప్పుడు దేశాల స్థాయిలో చూద్దాం.

నమాజులు,ప్రార్థన వంటివి ఒట్టి టైంవేస్టు పనులనీ, సైన్సు పరిశొధనలే మానవ సమాజాల అభివృద్ధికి కీలకమైనవనీ చాలా మంది తీర్మానించేస్తుంటారు. సైన్సు పరిశొధనల వల్లే యూరప్,అమెరికా వంటి దేశాలు అభివృద్ధి చెందాయని చెప్తుంటారు. గత నాలుగైదు శతాబ్దాల చరిత్రను తిరగేస్తే, ఆధునిక సైన్సు పరిశొధనల్లో ముస్లిం సమాజాల పాత్ర నామమాత్రమే. కానీ, ఈ యూరోపియన్ ఆధునిక సైన్సు మూలాలు క్రీ.శ. 10-15 శతాభ్దాల మధ్య అనేక ముస్లిం సమాజాల్లోని శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఉందనే నిజం చాలా మందికి తెలీదు. అంతకు ముందటి గ్రీక్,రోమన్,భారతీయ సైన్స్ విగ్ఞానాన్ని ముస్లిం/అరబ్ శాస్త్రవేత్తలు మరింత ముందుకు తీసుకెల్లారు. అదే పరంపరను తరువాతి యూరోపియన్ సమాజం కొనసాగించింది. ఇప్పటి అమెరికన్ సమాజం దానినే ఆచరిస్తుంది.

ఆధునిక సౌకర్యాలు, ప్రజల జీవన ప్రమాణాలు పురోగమనానికి ప్రతీకలుగా భావిస్తే, గత 5, 6 శతాబ్దాలుగా, సైన్సులో ఎలాంటీ పరిశొధనలూ చేయనప్పటికీ, ఏ ఇతర దేశాలపై పడి దోచుకోనప్పటికీ, అనేక గల్ఫ్ దేశాలలో, యూరప్, అమెరికన్ దేశాలకు సరితూగేలా ఆధునిక జీవన ప్రమాణాలు, సిరిసంపదలూ ఎలా ఉన్నాయి?

తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికి రాని, అక్కడి ఎడారి భూముల కింద ఉన్న అపార చమురునిల్వల వల్ల. ఈ చమురు నిల్వలు అల్లా అనుగ్రహం వల్లే అని ఎందుకనుకోకూడదు?

మొత్తంగా చూస్తే, ‘అల్లా ఏం చేస్తున్నాడు ‘ అని అడిగే ప్రశ్న వెనక ఓ రకమైన ఫ్యూడల్( భూస్వామ్య) థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది. అంటే, దేవున్ని ఓ వ్యక్తిగా, కేవలం కొంత మంది ప్రజల రాజు/నాయకుడిగా భావిస్తూ పెరగడం వల్ల, ఆ ప్రజలు అన్ని కష్టాలు పడుతున్నా, ఎందుకు ఆ రాజు/నాయకుడు వారిని కాపాడటం లేదు అనే, ఓ అమాయక అణుమానంతో అలా ప్రశ్నిస్తుంటారు.

కానీ, అల్లా అంటే, ఓ వ్యక్తో, కేవలం కొంతమంది ప్రజల రాజో/నాయకుడో కాదు. ఈ సమస్త విశ్వాంతరాలనూ, సమస్త జీవరాశినీ సృష్టించిన వాడు. అల్లా అనుగ్రహం ప్రతి వ్యక్తికీ, వివిధ రూపాల్లో లభిస్తూనే ఉంటుంది. కానీ, తిరస్కారులకు అల్లా అనుగ్రం లేదని వాదించే సొడ్డు(Excuse ) ని వెతికి పట్టుకోవడం అంత కష్టమేమీ కాదు.

మొత్తం మీద చూస్తే, యూరప్ సమాజం సైన్సు మీద పరిశోధనలు చేసి ఓ ద్రావకం నుండి శక్తిని ఉత్పత్తి చేసే పరిగ్ఞానాన్ని కనుగొంది. అల్లా ఆ ద్రావకాన్ని ఈ పరిశోధనల్తో సంబంధం లేని కొందరు ఒంటెల్ని కాచుకునే అరబ్బు ముస్లింల పాదాల కింద నిక్షిప్త్తం చేశాడు. ఆ చమురు కోసం కొందరు చేస్తున్న కుటిల రాజకీయాలతో కొందరు ముస్లింల జీవితాలు నాశనం అయ్యాయి. కానీ అదే చమురు చాలా మంది ముస్లింలకు వరం లా మారింది.

ఈ చమురుకోసం ఇస్లాం ని, ముస్లింలనూ మానవజాతికి ఓ ఉపద్రవంగా నిలబెట్టే ప్రాపగాండా పనులు సోషల్ మీడియా లాంటి ఆధునిక సాంకేతిక పరిగ్ఞానంతో యుద్దప్రకారం జరుగుతున్నాయి. కానీ, ఇదే సోషల్ మీడియా ఆధారంగా, పాశ్చాత్య దేశాల్లోని అనేకులు సంపన్నులు,ఉన్నత విద్యావంతులు నాస్తికత్వంలోని డొల్లతనాన్ని, ఇస్లాంలోని యదార్థాన్ని అర్థం చేసుకుని ఇస్లాంలోకి వస్తున్నారు.

ఈ రకంగా సృష్టికర్త ఒక్కోసారి కేవలం బ్యాలెంగ్స్ యాక్ట్ మాత్రమే చేస్తాడు తప్ప, వీల్లు నా గ్రూపు వాల్లు నా గ్రూపు కాదు, అంటూ ఫ్యాక్షనిస్టులా ఏ ఒక్కరి పక్షమో వహించడు.

అంచేత, అల్లా ఏం చేశాడు, ఏం చేయలేదు అని ఆలోచించేకన్నా, మనం ఏం చేయగలం, ఏం చేస్తే మనకు శ్రేయస్కరమో ఆలోచించడం ఉత్తమం.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.