ఆదివారం పరీక్ష!!

పెళ్ళైన కొత్తలో తార్నాక లో ఉండేటోల్లం.ఆదివారం పొద్దున్న, బజారుకు పోయి మటన్ తెమ్మని మా ఆవిడ చెప్పిందంటే, ఇక అప్పటినుండీ నాకు టెన్షన్ స్టార్ట్ అన్నట్టు. ఒక్క పేజీచదవకున్నా, ఏ మాత్రం కంగారు పడకుండా బీటెక్ సెమిస్టర్ పరీక్షలు కూడా చాలా సార్లు రాశా గానీ, మటన్ షాప్ కెళ్ళి మటన్ తెచ్చే పరీక్ష మాత్రం నాకు ప్రతిసారీ టెన్షన్ కలిగించేది.

“ఈ సారైనా కొంచెం మంచి మటన్ తీసుకురా” – బైక్ తాళం తీసుకుని బయటికి వెల్లబోతుండగా, మా ఆవిడ వెనకనుండీ మూడోనంబర్ ప్రమాద సూచిక ఎగరేస్తుంది. ఊర్లో ఐతే, ప్రతిసారీ ఈ మటన్ తెచ్చే బాధ్యత మా నాన్నే చూసుకునేవారు. ఎప్పుడైనా సెలవులకు వెళ్ళినప్పుడు నేను తేవాల్సి వచ్చినా, అక్కడ నా చెడ్డీ దోస్తు -రఫీ మటన్ షాప్ ఉండేది. నా అదృష్టం కొద్దీ , అతనికి ఏడో తరగతి పరీక్షల్లో నా పేపర్ చూసి రాయనిచ్చిన విషయం గుర్తుంది. ఆ రకంగా అతనికి నేనంటే రెస్పెక్ట్ తో కూడిన లవ్వు. అతని షాప్ దగ్గరకు వెళ్ళగానే, “కైసా హే హనీఫ్, కబ్ ఆయా, కెత్తె కిలో హోనా” అని ఆప్యాయంగా అడిగి, మంచి మంచి ముక్కలు కోసి ఇచ్చేవాడు. (ఇన్సైడ్ మ్యాటర్ ఏమంటే, అతను అప్పటికే బడిమానేసిన ఆవారా పిల్లలతో కలిసి తిరుగుతుండేవాడు. కొంచెం రౌడీ టైపు అన్నట్లు. ఎగ్జామ్‌లో చూపీకుంటే, బయటికెళ్ళాక తంతాడేమోననే భయంతో చూపించేవాన్ని ?) కానీ హైదరాబాద్ లో అలా కాదు.ఎంత రెగ్యులర్ గా వెళ్ళే షాప్ ఐనా సరే, “ఫస్ట్ క్లాస్ కా గోష్ దాల్రావ్ భాయ్”, అంటూనే కిలో మటన్లో అరకిలో బోన్స్ వేసేస్తాడు. పోనీ బోన్ లెస్ ఇవ్వరా బాబూ అంటే, లూజ్-లూజ్ గా, ఫ్యాట్ తో నిండి ఉన్న ముక్కలు ఇస్తాడు. ఒకసారి ముక్కలు కొట్టాక, దాన్ని రిటన్ ఇచ్చే ఆప్షన్ ఎలాగూ ఉండదు. మంచి మాంసం ఇవ్వలేదని అతనితో గట్టిగా మాట్లాడదామంటే, మనకసలే ఎక్కడలేని మొహమాటమైపోయే.. ఒకటి,రెండు సార్లు ధైర్యం చేసి అడిగాను కూడా.”కిలో మటన్ లో పావ్ కిలో బోన్స్ ఉండాలి. ఏ షాప్ లో ఐనా ఇదే రూలు. మీకు కూడా అలాగే ఇచ్చాను. కావాలంటే చెక్ చేస్కోండి అంటాడు. బోన్స్ కి కండ అతుక్కుపోయి ఉంటుంది, కాబట్టి అది చెక్ చేసే అవకాశం లేదని తెలిసినా కూడా, అతనిచ్చే రెడీమేడ్ సమాధానం ఇదే. పైగా, వచ్చినోళ్ళందరికీ కేవలం మంచి,మంచి ముక్కలు కొట్టిస్తే.. ఆ మిగిలిన ఎముకలు అతను ఏం చేసుకోవాల, ఎలా బతకాలా – అనే కౌంటర్ థాట్ కూడా ఒకటి అప్పటికే మైండ్లోకి వచ్చేసి ఉంటుంది. ఇన్ని ఆలోచనల్తో మైండ్ బ్లాంక్ అయిఉండగా , అతనికి డబ్బులిచ్చి అతనిచ్చిన బ్లాక్ కవర్ తో, మోసపోయిన ఫీలింగ్ తో ఇంటికి రావడం తప్ప ఇక చేయగలిగేదేమీ ఉండదు. ఇక ఆ కవర్ ని కిచెన్ బండ మీద పెట్టినప్పటినుండీ, ఆ తర్వాతి క్షణాలు.. ఎగ్జామినర్ దానిని ఎప్పుడు ఎవాల్యువేట్ చేస్తుందో, ఏం కామెంట్లిస్తుందోనని బిక్కుబిక్కు మంటూ గడిచిపోతాయి. తీరా ఆమె చూడటం.. “ఫిర్ వైసాచ్ దియా. ఏక్ భీ అఛ్చ తిక్క నై హే, ఇంకో సారి మటన్ జోలికి వెల్లకూడదు. చక్కగా చికెన్ మాత్రమే తెచ్చుకోవాలి…” అని కంక్లూజివ్ కామెంట్లు ఇవ్వడం ప్రతిసారీ జరిగే రొటీన్ తంతు. ఇగ, ఈ కామెంట్లన్నీ ఐపోయాక, చివర్లో విన్నింగ్ షాట్ కామెంట్ వస్తుంది. అది – “ఐనా, నీ అమాయక ముఖం చూస్తే, ఆ షాప్ వాడికి కూడా ధైర్యం వస్తుందనుకుంటా, ఇతనికి ఏమిచ్చినా సైలెంట్ గా తీసుకుల్తాడులే అని, అందుకే ఇలాంటిది ఇస్తాడు”. ఈ మాట కూడా అనిపించుకున్న తర్వాత గానీ, నాకు ఎగ్జామ్ ఐపోయిన రిలీఫ్ దొరకదు. మార్చ్ తర్వాత సెప్టెంబర్ లా, ఈ సారి దూరంగా ఉన్న మరో మటన్ షాప్ లో తేవాలని ఫిక్స్ ఐపోవడంతో, నా ఆదివారం పరీక్ష ముగుస్తుంది. *********ఇదంతా, తార్నాక లో ఉన్నప్పుడే.. టోలీచౌకి కి షిఫ్ట్ ఐనప్పటినుండీ నాకు ఈ మటన్ పరీక్షల నుండీ విముక్తి కలిగింది. టోలిచౌకి లో ఎక్కడైనా రోడ్డుపై నిలబడి అటూ,ఇటూ చూస్తే… కళ్ళముందు ఏం కనిపించినా, లేకున్నా ఓ బీఫ్ షాప్ మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. బీఫ్ లో చాలా వరకూ బోన్ లేని గట్టి కండ మాత్రమే ఉంటుంది. దానిని కూడా నీట్ గా కేక్ లాగా కట్ చేసి ఇస్తారు. కాస్ట్ కూడా మటన్ లో సగం. కాబట్టి బీఫ్ కొనడానికి ఎలాంటి టెన్షనూ పడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా నేను హ్యాపీ, మా ఎగ్జామినర్ డబుల్ హ్యాపీ. ??

Leave a Reply

Your email address will not be published.