ఆయన ప్రవక్తే అని గ్యారెంటీ ఏమిటి?

చరిత్రలో కొన్ని ఊహాత్మక,కల్పిత పాత్రలుంటాయి. కొన్ని చారిత్రక, నిజజీవిత పాత్రలుంటాయి. ఉదాహరణకు ఏసుక్రీస్తు,బుద్దుడు,అశోకుడు.. వీరు చారిత్రక వ్యక్తులు. అంటే, ఈ భూమిపై ఓ పర్టికులర్ కాలంలో జీవించి, కొన్ని పనులు చేసి, అనంతరం మరణించిన వ్యక్తులు. అట్లే కొన్ని కల్పిత,ఊహాజనిత పాత్రలు కూడా మనకు తెలుసు. మహమ్మద్ ప్రవక్త(స), పైన చెప్పిన ఏసుక్రీస్తు, బుద్ధుడు, అశోకులలాగానే నిజంగా జీవించిన, వారి తరువాతి కాలానికి చెందిన వ్యక్తి.


ఈయన క్రీ.శ. 570-632 మధ్య అరేబియా ప్రాంతంలో జీవించారు. ప్రతివ్యక్తీ తనకు తోచిన ,తాను నిజమని నమ్మిన విషయాలను చెప్తుంటాడు, తాను మంచి అనుకున్న పనులను చేస్తుంటాడు. ఓ వ్యక్తి చెప్పిన విషయాలను అందరూ గుడ్డిగా నమ్మాలనీ, ఆచరించాలనీ లేదు. నువ్వు చెప్పేది నిజమనడానికి ఆధారం ఏంటి..? అనేది ప్రతి విషయంలోనూ, కనీస తెలివితేటలు కలిగిన ప్రతివ్యక్తీ అడగవలసిన ప్రశ్న. మహమ్మద్ ప్రవక్త(స) కాలంలో కూడా చాలామంది ప్రవక్తను ఈ ప్రశ్న డైరెక్ట్ గానే అడిగారు. ఆయన చెప్పిన సమాధానం, ఆయన చేసిన పనులతో చాలామంది కన్వీన్స్ అయ్యి, ఆయన అనుచరులుగా మారారు. కన్విన్స్ అవ్వకుండా, ఆయనను వ్యతిరేకించిన వారూ, ఆయనను దూషించిన వారూ, ఆయుధం చేతపట్టి, ఆయనతో తలపడిన వారూ ఉన్నారు.ప్రవక్త జీవితంలో జరిగిన ప్రతి సంఘటనా, ఆయన చేసిన ప్రతి పనీ, చెప్పిన ప్రతి మాటా – దాదాపుగా అన్నీ హదీసు గ్రంధాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగానే ఆయనను పొగుడుతూ,విమర్శిస్తూ, విశ్లేషిస్తూ.. ముస్లింలూ, ముస్లిం వ్యతిరేకులూ, తటస్థ విశ్లేషకులూ ఇప్పటికే లక్షలాది పుస్తకాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. మానవ చరిత్రలో ఏ ఇతర వ్యక్తి గురించీ ఇన్ని పుస్తకాలూ,విశ్లేషణలూ వచ్చి ఉండవు.ముస్లింలకు సంబంధించినంతవరకూ, “తన సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి, ఆచరించి చూపడానికీ సృష్టికర్త ఎంచుకున్న సాధారణ వ్యక్తే ముహమ్మద్(స)” అనే విషయంలో ఎలాంటి అణుమానం ఉండదు. చిన్నప్పటినుండీ మసీదుల్లో, తల్లిదండ్రుల ద్వారా వింటూ పెరిగిన, ప్రవక్తకు సంబంధించిన విషయాలు ఈ నమ్మకాన్ని సుస్థిరంగా తమ మనోఫలకంపై ముద్రించేలా చేస్తాయి. ఇక్కడ ‘సాధారణ వ్యక్తి ‘, ‘సృష్టికర్త ఎంచుకున్న ‘ అనేవి కీలకపదాలు. ఎందుకంటే, ప్రవక్త జీవితం మొత్తంలో ఈ రెండూ సమాంతరంగా కనిపిస్తాయి. ఓ సాధారణ వ్యక్తిగా మహమ్మద్ ప్రవక్తకి ఎదురైన సవాల్లు, ఆయన అనుభవించిన కష్టనష్టాలూ, ఆయన వ్యక్తిగత భయాలూ,సంకోచాలూ.. దీనికి సమాంతరంగా -సృష్టికర్త సహాయంతో ఆయన సాధించిన అఖండ విజయాలూ..ఇవి రెండూ ఆయన జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ ప్యారలల్ గా కనిపిస్తాయి. ఆ విజయాల తర్వాత కూడా ఆయన సాగించిన నిరాడంబర జీవితం, శత్రువులపట్ల ఆయన చూపిన క్షమాగుణం, సమాజంలోని పేదలూ,అనాధలపై ఆయన చూపిన జాలి,దయ – ప్రవక్త జీవితంలోని ఈ పార్శ్వాల గురించి తెలుసుకున్న ఎవరికైనా ఆయనపై కొండంత ప్రేమనూ, అపార గౌరవాన్నీ కలిగిస్తాయి.మహమ్మద్ ప్రవక్త(స) తనను తాను ఇతర మానవులకంటే గొప్పగా చూపించుకోవడానికి, తనకు దైవసందేశం వచ్చిందని అబద్ధం చెప్పారని కొందరు ఆయనను విమర్శిస్తుంటారు. కానీ, ఇది అర్థంలేని/తప్పుడు వాదన అని నిరూపించే ఎన్నో దృష్టాంతాలు ప్రవక్త జీవితంలో కనిపిస్తాయి.ఉదాహరణకు – ప్రవక్తకు చివరి సంతానం 60ఏళ్ళ వయసులో కలిగింది. క్రీ.శ 630లో మరియల్-క్విబ్తియా అనే భార్య ద్వారా కలిగింది. ఆ బాబు పేరు ఇబ్రహీం. ప్రవక్త తన కొడుకుని చాలా ముద్దుచేసేవారు. ఆ బాబుని ఎత్తుకుని మసీదుకు తీసుకొచ్చేవారు. ఆ బాబు 1.5 సంవత్సరాల వయసులో, 632 జనవరిలో, అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఈ మరణం ప్రవక్తను చాలా బాధించింది. కొడుకు మృతదేహాన్ని ఎత్తుకుని కంటతడి పెట్టిన ప్రవక్తను చూసి, ఆయన అనుచరులు కూడా బాధపడ్డారు. అదే సమయంలో అక్కడ సూర్య గ్రహణం సంభవించింది. ప్రవక్త శోకాన్ని చూసి, సృష్టికర్తే సూర్యున్ని దాచేశాడని, సూర్యుడి వెలుగుని హరించాడనీ, ఇది ప్రవక్త ప్రత్యేకతనూ,గొప్పతనాన్నీ సూచిస్తుందని కొందరు ప్రవక్త అనుచరులు అభివర్ణించారు. ఇది ఈనోటా, ఆనోటా పడి, అందరూ దీని గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన మహమ్మద్ ప్రవక్త(స), కుమారుడి ఖణన సంస్కారాలు పూర్తికాగానే, మదీనాలోని ముస్లింలందరినీ సమావేశపరచి – సూర్య,చంద్రులు సృష్టికర్త ఆదేశానుసారమే నడుచుకుంటాయితప్ప, భూమిమీద మనుషుల చావు-పుట్టుకలతో వాటికి సంబంధం లేదనీ, అలా సంబంధం ఉందని నమ్మడం, సృష్టికర్త అవతరింపజేసిన ఖురాన్ బోధనలకే విరుద్ధమనీ, ఇంకెప్పుడూ ఇలాంటి విషయాల్ని నమ్మొద్దనీ,ప్రచారం చేయొద్దనీ మందలించారు.తనను ఇతరులకంటే గొప్పగా చూపించుకోవడమే ప్రవక్త ధ్యేయమైతే, అసంకల్పితంగా అందివచ్చిన ఇలాంటి అవకాశాన్ని ఏ మానవుడైనా వదులుకుంటాడా? మహమ్మద్ ప్రవక్తపై వచ్చే ప్రతి విమర్శనూ, అపవాదునూ కొట్టివేసే ఇలాంటి దృష్టాంతాలు ఆయన జీవితంలోనే చాలా కనిపిస్తాయి. కానీ, కొందరు వాటిని చూడటానికి నిరాకరిస్తారు. ఈ సూర్యగ్రహణ దృష్టాంతం కూడా 1400 సంవత్సరాల నుండీ హదీసుల్లో నిక్షిప్తమై ఉంది. దీనిని ఆధునిక సైంటిఫిక్ ఎవిడెన్స్ ల ద్వారా కూడా కొంతవరకూ నిర్ధారించుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్సెస్ – అని గూగుల్ లో సెచ్ చేస్తే వచ్చే నాసా వెబ్సైట్ లో గడిచిన రెండువేల సంవత్సరాలలో సంభవించిన అన్ని సూర్యగ్రహణాల లిస్టూ,రాబోయే 3 వేల ఏళ్ళలో వచ్చే గ్రహణాల లిస్టూ, అవి కనిపించిన దేశాలతో సహా ఇచ్చి ఉన్నారు. వీటిలో, క్రీ.శ 632 జనవరిలో సౌదీ అరేబియా ప్రాంతంలో సంభవించిన సూర్య్రగ్రహణం గురించి కూడా ఉంది. దీనిని బట్టి ఇది నిజంగానే జరిగిన సంఘటన తప్ప, ఊహించి రాసిన కల్పిత కథ కాదని ఓ అంచనాకు రావొచ్చు.ఈ 21వ శతాబ్ధంలో కూడా, గ్రహాలు,నక్షత్రాల కదలికల ప్రభావం మనుషులపై ఉండదనీ, వీటిని నమ్మి మోసపోవద్దనీ, హేతువాదులు జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి నానాతిప్పలు పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఈ పని 14 శతాబ్ధాల క్రితమే మహమ్మద్ ప్రవక్త(స) విజయవంతంగా చేసేశారు. అందుకే ముస్లిం లెవ్వరూ ఇలాంటి వాటిని నమ్మరు.ఈ రకంగా ప్రవక్త జీవితాన్నీ,ఆయన బోధనలనూ, ఆయన సాధించిన విజయాలనూ, లాజికల్ గా విశ్లేషించిన ఎవరైనా, “సృష్టికర్త తన సందేశాన్ని జనాలకు చేరవేయడానికి, ఆచరించి చూపడానికీ ఎన్నుకున్న సాధారణ మానవుడే మహమ్మద్(స) అనే విషయం ఎలాంటి అణుమానమూ లేకుండా తేటతెల్లమవుతుంది.

Leave a Reply

Your email address will not be published.