ఆర్జీవీ Vs సగటు జీవి

ఆర్జీవీ Vs సగటు జీవి
================
“I inherit nothing. I stand at the end of no tradition. I may, perhaps, stand at the beginning of one” -ఇది అయాన్ ర్యాండ్ రాసిన ఫౌటెన్ హెడ్ పుస్తకంలోని ఓ వాక్యం. తాను అయాన్ ర్యాండ్ రచనల్తో ప్రభావితమయ్యానని ఆర్జీవీ అనేక సార్లు చెప్పి ఉన్నాడు. ఈ ప్రభావితం అనేది ఆర్జీవీ ప్రతి మాటలోనూ, అతని లైఫ్ స్టైల్ లోనూ మనకు కనిపిస్తుంటుంది.

మానవత్వం, మంచి,చెడు – ఇవి సగటు జనం అత్యంత విరివిగా వాడే పదాలు. ఈ పదాల అర్థాన్ని తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి.

మానవత్వం – అంటే రెండు అర్థాలు స్పురిస్తున్నాయి. అవి -1. మానవునికి ఉండే తత్వం. 2. మానవునికి ఉండాల్సిన తత్వం.

మానవునికి ఉండే తత్వం అనుకుంటే, అప్పుడు 60 లక్షల మందిని చంపిన హిట్లర్, గాంధీని చంపిన గాడ్సే, నిర్భయని రేప్ చేసిన వారు — వీరందరూ మానవులే. అంటే హత్యలు,రేపులు వంటివి కూడా మానవునికి ఉండే తత్వాలే. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓ మానవున్ని పట్టుకుని -నీకు మానవత్వం ఉందా అని అడగడం గానీ, ఫలానా వాడికి మానవత్వం లేదని చెప్పడం గానీ పూర్తి అర్థరహితం.

మానవునికి ఉండాల్సిన తత్వం అనుకుంటే – ఏది ఉండాల్సిన తత్వమో, ఏది ఉండకూడని తత్వమో ఎవరు నిర్ణయిస్తారు. అస్సలు ఎవరో నిర్ణయించిన దానికి నేను గానీ, ఇంకొకరు కానీ ఎందుకు కట్టుబడి ఉండాలి?

మంచి – చెడులు కూడా ఇలాంటి పదాలే. ఏది మంచి, ఏది చెడో ఎవరు డిఫైన్ చేయాలి? దానికి వేరే వారు ఎందుకు కట్టుబడి ఉండాలి?
ఇక్కడే, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం అనే పదాలు ఎంటరవుతాయి. ఎవడి పాటికి వాడు ప్రవర్తిస్తే అందరికీ ఇబ్బంది కాబట్టి, అందరం కలిసి కూర్చుని, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే కాదు అని ముందుగా ఓ రూల్ బుక్ లాంటిది రాసుకుని, ఆ రూల్స్ ని అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలుండాలో కూడా రాసుకున్నాం. 100 కోట్లమందీ కలిసి కూర్చోని మాట్లాడటం ప్రాక్టికల్ గా అవ్వదు కాబట్టి, మన ప్రతినిధుల్ని అసెంబ్లీ, పార్లమెంట్ అనే చోట్లకు పంపించి మన తరుపున వారిని చట్టాలు చేయమని పురమాయిస్తాం.

ఇప్పుడు ఓ వ్యక్తి చేసిన పని, ఆ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అనేదే కీలకం. ఒకవేళ లేకుంటే, Indian Penal Code(IPC) లోని వివిధ చట్టాల ప్రకారం అతన్ని శిక్షించే హక్కు,బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే మానవత్వం, మంచి-చెడు అనేవి అర్థం లేని పదాలు. ఎదుటివారిని నిందించడానికీ, తమ గురించి తాము డబ్బా కొట్టుకోవడానికే సగటు జీవులు వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ, ఆర్జీవీ నోటి నుండీ ఇలాంటి పదాలు ఎప్పుడూ రావు. తాను మంచోన్నని గానీ, ఫలానా వ్యక్తి మంచోడు,చెడ్డోడని గానీ, ఆర్జీవీ ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు. తాను చేసే పనుల్లో, చెప్పే మాటల్లో ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఉందని భావించిన వారు నిరభ్యంతరంగా తనపై చట్ట ప్రకారం కోర్టుల్లో కేసు వేసుకోవచ్చని అతను పద్దతిగా చెప్తూ ఉంటాడు.

ఈ క్లారిటీ లేని సగటు జీవులు, ఆర్జీవీ మాటలకు తరచుగా ఆవేశపడి పోతుంటారు. అతన్నో పిచ్చోడనో, ఉన్మాదనో – ఇలా రకరకాలుగా పిలుచుకుని త్రృప్తిపడుతుంటారు.

“నేను ఆర్జీవీ అభిమానిని కాదు”
—————————————-

ఆర్జీవీ చెప్పిన కాన్సెప్ట్ ని సరిగ్గా అర్థం చేసుకున్నవారెవరూ, నేను ఫలానా వారికి అభిమానిని అని చెప్పుకోరు. చివరికి ఆర్జీవీకి కూడా. That is called Individualism. ‘నేను ఆర్జీవీ అభిమానిని ‘ అని చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే – ‘ మొన్న కులతత్వం నశించాలి – అనే కాన్సెప్ట్ మీద అద్భుతంగా ప్రసంగించినాయన మా కులమే ‘ – అని చెప్పుకున్నట్లు.

అంచేత, నేను ఆర్జీవీ అభిమానిని కాను. కాకపోతే అతను చెప్పిన కాన్సెప్ట్, మనిషిని, సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నాకు సహకరించింది. కొన్ని సంఘర్షనల నుండీ, గందరగోళం నుండీ బయట పడేలా చేసింది. అది గత పోస్టులో రాశాను. అభిమానిని కాను అని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, ఆర్జీవీ ఓ వ్యక్తిగా చాలా చేస్తుంటాడు. -సినిమాలు తీయడం, వాటిని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో జన్నాల్లో పబ్లిసిటీ చేసి వృత్తిపరంగా లాభాలను పొందడం వంటివి. దీనికి అతనో ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తుంటాడు. కావాలనే కొన్ని వివాదాల్ని సృస్టిస్తుంటాడు. ఇదంతా అతని గేం ప్లాన్. అవన్నీ నాకు నచ్చాలనేం లేదు. నేను వాటన్నింటికీ వకాల్తా పుచ్చుకోను. అదీ సంగతి.

ఇంతటితో ఆర్జీవీ బాగోతం సమాప్తం. 🙂

-మహమ్మద్ హనీఫ్.యస్.

Leave a Reply

Your email address will not be published.