ఆసియా బీబీ కేసు – ఇస్లాం – వివిధ స్పందనలు!!!

ఆసియా బీబీ కేసు – ఇస్లాం – వివిధ స్పందనలు!!!
===========================

2009లో, పాకిస్తాన్ లో ఆసియా బీబీ అనే ఓ క్రైస్తవ మహిళ, ఇతర ముస్లిం మహిళలతో కలిసి పొలం పనులు చేసుకుంటున్నప్పుడు – ఓ ముంతలో నీరు తాగడం గురించి వారి మధ్య గొడవ జరిగింది. క్రైస్తవురాలైన ఆమె ముస్లిం లు తాగే ముంతతో నీళ్ళు తాగొద్దని ఆమెను వారించారనీ,అప్పుడు, మీ ప్రవక్త మీకు చెప్పింది ఇదేనా అని ఆమె వీరిని ప్రశ్నించిందనీ, దీనితో మాటా,మాటా పెరిగి గొడవ జరిగిందనీ, ఆ గొడవలో ఆమె ప్రవక్తని తిట్టిందనీ, ఆ ముస్లిం మహిళలందరూ ఆమెపై కేసు వేశారు.

తాను తిట్టలేదనీ, ఆ మహిళల్లో ఒకామె తన పక్కింట్లోనే ఉంటుందనీ, ఆమెతో తమకు స్థలం సరిహద్దు విషయంలో తగాదాలు ఉన్నాయనీ, ఆ పాతగొడవల్ని మనసులో పెట్టుకుని, తనని ఇలా ఇరికించిందనీ ఆమె వాపోతుంది.

ఇవన్నీ పట్టించుకోని స్థానిక కోర్టు ఆమెకు బ్లాస్ఫెమీ(దైవ దూషన) చట్టాల కింద్ర మరణ శిక్ష విధించింది. అక్కడి హైకోర్టు కూడా దానిని ధృవీకరించింది. సుప్రీం కోర్టు లో ఇప్పుడు విచారణ జరుగుతుంది.

హైకోర్టు తీర్పు తర్వాత, పంజాబ్ గవర్నర్ – సల్మాన్ తసీర్ మరియు , ప్రభుత్వం లోని క్రైస్తవ మంత్రి – షెహ్బాజ్ బట్టీలు ఆమెకు బహిరంగ మద్దతు తెలిపారు. బ్లాస్ఫెమీ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయనీ, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని వీరు పిలుపునిచ్చారు. దానికి ప్రతిగా వీరిద్దరూ హత్య చేయబడ్డారు. 2011లో సల్మాన్ తసీర్ ని అతని గన్ మేన్ – ముంతాజ్ ఖాద్రీ హత్య చేశాడు. ఆ నేరం చేసినందుకు ప్రభుత్వం ముంతాజ్ ఖాద్రీని 2016లో ఉరి తీసింది. షెహ్బాజ్ బట్టీని తామే చంపామని తాలిబన్లు ప్రకటించారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. తాలిబన్ల ఏరివేతలో భాగంగా కొన్ని వందల మంది తాలిబన్లను పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ఉరితీసింది.

వ్యక్తిగతంగా, ఓ ముస్లింగా నా అభిప్రాయం – ఇక్కడ జరిగిన అసలు క్రైం – ఆ మహిళని ముస్లింలతో సమానంగా నీరు తాగొద్దని వారించడం. మనుషులందరూ ఒకే జంట సంతానం అని ఖురాన్ అంత బలంగా చెప్తున్నా, చేసిన మంచి పనుల ఆధారంగా తప్ప, పుట్టుక ఆధారంగా ఏ ఒక్క వ్యక్తికీ, మరో వ్యక్తిపై ఆధిక్యత లేదని ప్రవక్త పదే,పదే చెప్పిఉన్నా, ఆ ముస్లిం మహిళలు ఆమెని తమతో సమానంగా నీరుతాగొద్దని వారించారంటే – అదీ ప్రవక్తకు, ఇస్లాం కీ అసలుసిసలు అవమానం. వారు అలా చేశారా, లేదా అనే విషయం మీద విచారణ జరగాలి, అలా చేసి ఉంటే దానికి వారిని శిక్షించాలి. ఆ క్రైస్తవ మహిళ ప్రవక్త గురించి ఏం చెప్పింది అనేది అసలు విషయమే కాదు. ఎమోషన్లో, గొడవలో నోరు జారి ఏదైనా మాట చెప్పి ఉన్నా, అదసలు పట్టించుకోవాల్సిన ఇష్యూ కాదు. పొలంలో కూలిపని చేసుకుని రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే ఓ బీదమహిళ మాటలతో, ప్రవక్తకూ, ఇస్లాం కూ అవమానం జరిగిపోతుందని భావించడమంత తెలివితక్కువ పని ఇంకోటి ఉండదు. సుప్రీం కోర్టు జడీలకైనా కాస్తంత మెదడు పనిచేసి ఆమెను నిర్దోషిగా వదిలివేస్తారని ఆశిస్తున్నాను.

కానీ, అక్కడ మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. “అంటే, ఆ పోలీసులకు, జడ్జిలకూ, ఆమెకు ఉరిశిక్ష విధించాల్సిందే అని ఊగిపోతున్న వారికీ ఇస్లాం గురించి తెలీదనా? వాల్లకి ఖురాన్,ప్రవక్త బోధనల గురించి తెలీదనా..?” -అని ఎవరైనా అడగొచ్చు. దీనికి డైరెక్ట్ సమాధానం నా దగ్గర లేదు. కాకపోతే, సల్మాన్ తసీర్ను చంపిన ముంతాజ్ ఖాద్రీని కొందరు హీరోగా పిలుస్తున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా 2016లో అతన్ని ఉరితీసి పడేసింది. గత నాలుగేళ్ళలో సుమారు 300 మంది తాలిబన్ తీవ్రవాదుల్ని ఉరితీసింది. అదీ ప్రజలతో ఎన్నికైన ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయవలసింది.

బంగ్లాదేశ్ లో, 2013 లో రాజీబ్ హైదర్ – అనే నాస్తిక రచయితని చంపిన కేసులో అక్కడి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2015లో ఇద్దరికి మరణ శిక్ష ప్రకటించింది, 2017లో హైకోర్టు దీనిని ధృవీకరించింది.

2016లో ఢాకాలో చంపబడిన లిబరల్, సెక్యులరిస్ట్ ప్రొఫెసర్ రెజవుల్ కరీం సిద్దిఖీ హత్యకేసులో మరో కోర్టు గతనెలలో ఇద్దరికి ఉరిశిక్షనూ, ముగ్గురికి యావజ్జీవ శిక్షనూ విధించింది.

ఆ క్రైంస్ గురించి మొదటి పేజీలో ప్రచురించే ఇంటర్నేషనల్ మీడియా,ఇలాంటి తీర్పుల్ని మాత్రం ప్రచురించదు.

థియరీ కీ, ప్రాక్టికల్స్ కీ, ఒక్కోసారి కొద్దిపాటి తేడాలు రావచ్చేమో గానీ, థియరీ బలంగా,సాలిడ్ గా ఉన్నప్పుడు, ప్రాక్టికల్ ఫలితాలు చాలాసార్లు దానికి అణుగునంగానే ఉంటాయి.

మన దేశంలో 97 మందిని దగ్గరుండి చంపించిన మాయా కొందానీ,బాబూ భజరంగీలు నేరం రుజువై కూడా, ట్యాక్స్ పేయర్ల డబ్బుతో చక్కగా వెజెటబుల్ బిర్యానీ తింటూ, కోరినప్పుడు బెయిల్ పై బయటికి వస్తున్నారు. మాబ్ లించింగ్ చేసిన వారికి ప్రభుత్వోద్యోగాలు వస్తున్నాయి. వారికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు, ముఖ్యమంత్రుల బహిరంగ మద్దతులూ.. ఇవన్నీ బహిరంగంగా రోజూ జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎవరి ఖాతాలో వేస్తారో, ఏ భావజాలానికి ఆపాదిస్తారో, ‘అన్నీ అంతే, అందరూ అంతే ‘ అంటూ ఎలాంటి కంక్లూజన్లు తీస్తారో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.