ఆ ఇద్దరు – కొన్ని ప్రశ్నలు!!

అతనో పోలీసు ఉన్నతాధికారి.ఐపీయస్. అమాయకులైన యువకుల్ని ఇళ్ళలోనుండీ ఎత్తుకెళ్ళి-చంపి పడేసి, వీరు మోడీని చంపడానికి వచ్చిన తీవ్రవాదులనీ, తాను ప్రాణాలకు తెగించి వారిని ఎంకౌంటర్ చేశాననీ, శవాలను మీడియా ముందు చూపించడం, ప్రమోషన్లు కొట్టడం ఇతని హాబీ.
ఆ రకంగా, అధికారికంగా 6 మందిని చంపేశాడు. అనధికారిక లెక్కల గురించి మాట్లాడకపోవడమే మేలు.
గీతా జోహ్రీ అనే మరో నిజాయితీ గల పోలీసాఫీసర్ ఇన్వెస్టిగేషన్ వల్ల, అప్పట్లో తెహల్కాలో పనిచేస్తున్న రాణా అయ్యూబ్ అనే జర్నలిస్టు చేసిన సాహసోపేత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వల్లా.. ఇతని నేరాలు ఒక్కొక్కటీ బయటపడ్డాయి. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉద్యోగం నుండీ సస్పెండ్ అయ్యి, కొన్నాల్లు జైల్లో కూడా ఉన్నాడు. 2014 తర్వాత కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండీ పరిస్థితి తల్లకిందులైంది.

అఫ్కోర్స్, జైల్లో ఉన్నప్పుడే, ఇతను మోడీ-అమిత్ షాలకు ఓ లవ్ లెటర్ కూడా రాశాడు. మర్యాదగా నాకు న్యాయం చేయకుంటే – తాను నోరు తెరవాల్సిఉంటుందనే చిన్న సందేశం కూడా ఇచ్చాడు. ఇదంతా మీడియాలోనూ వచ్చింది. ఇక అప్పటినుండీ చట్టం తనపని చక,చకా చేసేసింది. ఇతనికి వ్యతిరేకంగా ఉన్న ఒక్కొక్క సాక్ష్యమూ కనుమరుగైంది, సాక్ష్యమిచ్చే మనుషులు కూడా. చివరికి కోర్టులు కేసులు కొట్టేశాయి. సస్పెషన్ ఎత్తేశారు. రిటైరెమెంట్ కూడా ఐపోయింది. అతని సేవలకు గుర్తుగా గుజరాత్ ప్రభుత్వం, గత వారం అతనికి పోస్ట్-రిటైర్మెంట్-ప్రమోషన్ కూడా ప్రకటించింది. అంటే, రిటైర్మెంట్ కి ఆరేళ్ళ ముందు అతనికి ప్రమోషన్ వచ్చి ఉంటే ఎంత అదనపు జీతం వచ్చి ఉండేదో మొత్తం లెక్కకట్టి, అరియర్స్ కింద ఇప్పుడు చల్లిస్తారన్నమాట. ఆ రకంగా, అతని శేషజీవితం ఇప్పుడు సుఖంగా సాగిపోతుంది. ఆ వ్యక్తి – డీ.జీ వంజర.
***********
ఆ రెండో అతను కూడా పోలీసాఫీసరే. ఐపీయస్సే.
సబర్మతీ జైలు సూపరిండెంట్ గా పనిచేస్తున్నప్పుడు, ఖైదీల్లో నేరప్రవృత్తిని రూపుమాపి వారిలో పరివర్తన తేవడానికి అనేక విప్లమాత్మక పనులు చేపట్టాడు. ఇది ఖైదీల్లో కూడా చాలా మార్పు తీసుకువచ్చింది. ఇవన్నీ నచ్చని పై అధికారులు, అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ కి వ్యతిరేకంగా, ఖైదీలు కొన్ని రోజులపాటు జైల్లోనే నిరాహార దీక్ష చేశారు.

2002 గుజరాత్ మారణహోమం జరిగినప్పుడు అతను గుజరాత్ ఇంటెలిజెన్స్ విభాగం లో పనిచేస్తున్నాడు. గోధ్రా రైలు దహణం జరిగిన రోజు రాత్రి, మోడీ పోలీసు ఉన్నతాధికారులతో ఓ మీటింగ్ పెట్టాడనీ, ఎంతమంది ముస్లింలను చంపినా, ఎలాంటి చర్యలూ తీసుకోవద్దనే ఆదేశాలు ఇచ్చాడనీ – ఆ మీటింగ్లో తానుకూడా ఉన్నానని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. (ఇలాంటి మీటింగ్ ఒకటి జరిగిందనీ, మోడీ అలాంటి ఆదేశాలు ఇచ్చారనీ చెప్పిన మరో ప్రముఖ వ్యక్తి – గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్య. అతను ఈ మాట చెప్పిన కొన్ని రోజులకే, మార్నింగ్ వాక్ లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ వ్యక్తుల గుర్తులు ఇప్పటికీ ఎవరికీ తెలియవు. )
సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించాక, నీ దగ్గరున్న సాక్ష్యాలేవో, గుజరాత్ అల్లర్లను విచారిస్తున్న నానావతీ కమీషన్ వారికి ఇవ్వమని సుప్రీం కోర్టు ఆ అధికారిని సూచించింది. ఢిల్లీలో కమీషన్ ముందు హాజర్ కావడానికి రెండు రోజులు సెలవుపై వెళ్ళాడనే సాకును చూపుతూ, అతన్ని గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

సుమారు పాతికేళ్ళ క్రితం, అతను ఓ జిల్లా యస్పీగా ఉన్నప్పుడు,ఆ జిల్లాలోని ఒకానొక పోలీస్ స్టేషన్లో, మాదకద్రవ్యాల కేసులో ఓ నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత బెయిల్ పై విడుదల చేశారు. విడుదలైన పదిరోజులకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ పదిరోజులూ బయట నిక్షేపంగా తిరిగాడు. కాని, పోలీస్టేషన్లో, పోలీసులు పదిరోజుల ముందు కొట్టిన దెబ్బలవల్లే అతను మరణించాడనీ, దీనికి ఆ పోలీస్ స్టేషన్ యెస్సై, యస్పీ లదే బాధ్యత అనీ ఓ కేసు ఫైల్ అయింది.
ఇప్పుడు సడెన్ గా ఆ కేసు బయటకొచ్చింది. అతన్ని ఈ కేసు విషయంలో అరెస్టు చేశారు. ఇక్కడ కూడా చట్టం తనపని చక,చకా చేసేసింది. అతనికిి జీవిత ఖైదు విధించబడింది. ఇప్పటికి సుమారు ఒకటిన్నర సంవత్సరంగా అతను జైల్లో మగ్గుతున్నాడు. పై కోర్టులో కేసు నడుస్తుందిగానీ, కనీసం బెయిలు కూడా ఇవ్వడంలేదు. హై కోర్టులో చాలా మంది జడ్జీలు అతని బెయిల్ కేసు వినడానికి కూడా ఒప్పుకోకుండా, మా బెంచ్ కి వద్దంటే, మా బెంచ్ కి వద్దని తప్పించుకుంటున్నారు. అతనికి ఇంట్లో భార్య, ఓ కూతురు,కొడుకు ఉన్నారు. ఓ రోజు రాత్రి, హటాత్తుగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు బుల్డోజర్ తీసుకెల్లి వారి ఇంట్లోని కొంత భాగాన్ని కూల్చేశారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే – మీ ఇల్లు నిబంధనలకు వ్యతిరేకంగా కట్టబడింది, అందుకే కూల్చేస్తున్నాం అన్నారు. కనీసం, నోటీసులన్నా ఇవ్వాలి కదా అంటే – ఆల్రెడీ ఇచ్చేశాం – పోస్టల్ వారు మీకు డెలివరీ చేయకుంటే, మేమే చేస్తాం, వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇచ్చుకోండి అన్నారు.

“నేను మోడీ-మీటింగ్ గురించి చెప్పిన విషయం అబద్ధమనీ, మోడీ గొప్పోడనే”- ఒక్క స్టేట్మెంట్ ఇస్తే – బహుశా – చట్టం మళ్ళీ తనపని తాను చేసుకునే అవకాశం ఉంది. కానీ, అతనివ్వడు.
అతనే సంజీవ్ భట్.

***********
ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, థెయిస్టు,అథెయిస్టు,అగ్నాస్టు…లందరికీ –

ఇంకో పది,ఇరవై ఏళ్ళ తర్వాత – వంజరా, సంజీవ్ భట్.. ఇద్దరూ చనిపోయి, వారి వారి సమాధుల్లోకి షిఫ్ట్ ఐపోయి ఉండొచ్చు. ఈ ఇద్దర్లో ఎవరు సక్సెస్ఫుల్ అనే ప్రశ్నకు మీ సమాధానం ఏంటి?
నీతి,న్యాయం – అంటే ఏంటి, వాటికి మనం కట్టుబడి ఉండాలా? ఎందుకు కట్టుబడి ఉండాలని మీ పిల్లలు అడిగితే మీరేం సమాధానం చెప్తారు?
ఇంతకీ మీ పిల్లలు సంజీవ్ భట్ లా ఉండాలనుకుంటారా? వంజరా లానా?
ముస్లిం,క్రైస్తవులకు మాత్రమే ఓ ప్రశ్న – మరణానంతరం, జడ్జిమెంట్ డే రోజున, సంజీవ్ భట్ పరిస్థితి ఎలా ఉండొచ్చు?

One Reply to “ఆ ఇద్దరు – కొన్ని ప్రశ్నలు!!”

Leave a Reply

Your email address will not be published.