అప్పట్లో ‘క్షత్రియ పుత్రుడు’ అని కమల్ హాసన్ నటించిన ఓ సినిమా వచ్చింది. దీనిలో అతని పాత్ర ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టిన ఓ సౌమ్యుడు, విద్యావంతుడైన యువకుడి పాత్ర. ఫాక్షనిజం అంతమవ్వాలనీ, అందరూ కలిసిమెలసి ఉండాలనీ చివరివరకూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో క్లైమాక్స్ లో విలన్ని చంపేస్తాడు. చంపేసాక, తాను ఏదైతే చేయకూడదని సినిమా మొత్తం ప్రయత్నిస్తుంటాడో చివరికి అదే చేయడంతో, హృదయ విదారకంగా ఏడుస్తాడు. అప్పుడు ఆ ఊరు జనం వఛ్చి – ” అయ్యా, అతన్ని చంపి మంచి పని చేశారయ్యా, మీ వెనుక మేమంతా ఉన్నామయ్యా ” అని హీరోని ఎంకరేజ్ చేయాలని చూస్తారు. దానికి చిర్రెత్తుకొచ్చిన హీరో , ” రేయ్ , ఇంకేం మిగిలిందిరా.. పొండిరా.. పోయి వ్యవసాయం చేసుకోండ్రా.. పిల్లల్ని చదివించుకోండ్రా .. అని క్లాస్ పీకుతాడు.
ఈ మధ్య రాజకీయ చర్చలు చేసేవారిని చూసినప్పుడల్లా నాకు ఇదే గుర్తొస్తుంది.. ఇంకేం మిగిలి ఉందని ఇక్కడ చర్చించుకోవడానికి..?
2014 కు ముందు చెడు రాజకీయమంటే స్కాములు చేయడం, అస్మదీయులకు పదవులు కట్టబెట్టుకోవడమే. దాంట్లో కూడా, ఏమైనా ఆరోపణలు బయటకు రాగానే , ఆ చెడు రాజకీయ నాయకులు ఉలిక్కి పడేవారు. ఆయా పార్టీల పెద్దలు ఆ సదరు రాజకీయ నాయకుల్ని పదవులనుండి తప్పించడం, విచారణకు ఆదేశించడం వేగంగా జరిగిపోయేవి. ఒక్కోసారి అరెస్టులు కూడా జరిగేవి. అంతిమంగా వారికి శిక్షలు పడకపోవడం అనేది తరువాతి విషయం.
కానీ, 2014 తరువాత రాజకీయం , సమాజం సమూలంగా మారిపోయాయి.
** ఉత్తర ప్రదేశ్ లో ఆక్సిజన్ లేక సుమారు వందమంది పసిపిల్లలు చనిపోయారు. సదరు ముఖ్య మంత్రిగాని, ఆరోగ్య మంత్రి గాని రాజీనామా చేసింది లేదు. పిల్లల్ని కాపాడ్డానికి, ప్రయత్నించిన డాక్టర్ కి మాత్రం బెయిల్ కూడా దొరక్కుండా కొన్ని నెలల పాటు జైల్లో పడేసారు.
** అదే రాష్ట్రంలో , ఓ MLA నన్ను రేప్ చేసాడని ఓ మహిళ ఆరోపిస్తే , పోలీసులు ఆమె నాన్నని తీసుకెళ్లి లాకప్ డెత్ చేసేసారు. ఇక్కడ కూడా నాయకుల రాజీనామాలు లేవు.
** సాక్షాత్తూ ఓ సిబిఐ జడ్జి అనుమానాస్పదంగా చనిపోయాడు. అతని చావు పై వస్తున్న సందేహాలకు సమాధానం చెప్పే దిక్కులేదు.
** గుజరాత్లో మూడురోజుల పాటు ఎంతమంది ముస్లింలను చంపినా చూస్తూ ఉండండని , నరేంద్ర మోడీ పోలీసులకు చెప్పారని, ఆ మీటింగ్ లో తాము కూడా ఉన్నామనీ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఆరోపించారు. వారిలో ఒకరు గుజరాత్ మాజీ హోమ్ మంత్రి హరేన్ పాండ్యా. రెండు – ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్.
** ఈ ఆరోపణ చేసిన 7 నెలల తర్వాత హరేన్ పాండ్యా హత్య చేయబడ్డాడు. సంజీవ్ భట్ ఇప్పుడు గుజరాత్ జైల్లో ఉన్నాడు. అతనికి గత యాభై రోజులనుండి బెయిలు కూడా దొరకట్లేదు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం నాటి, ఓ డ్రగ్స్ కేసును తిరగతోడి అతన్ని జైలుకు పంపించారు.
** గుజరాత్ హోమ్ మంత్రి హరేన్ పాండ్యా ను ఎవరు చంపారో ఇప్పటికి తెలీదు. పోలీసులు ఆ కేసును విచారిస్తున్న తీరు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే – వారు కోర్టుకు సమర్పించిన పిస్తోలు, హరేన్ పాండ్యా శరీరం నుండి తీసిన బుల్లెట్లకు అసలు సంబంధమే లేదు. ఎవరిని కాపాడ్డానికి ఇలాంటి విచారణ చేస్తున్నారని అడిగే నాధుడే లేడు.
** ఇక సిబిఐ, సివిసి ల గురించి రాయడానికి ఈ ఫెసుబుక్కు గోడలు ఈ మూలకూ చాలవు. అవన్నీ దొంగల ముఠాలుగా మారిపోయాయి..
** ED అనేది ఎక్స్టార్షన్ డిపార్ట్మెంట్ గా మారిందని సాక్షాత్తూ సిబిఐ ఉన్నతాధికారే వ్యాఖ్యానించాడు.
** రాఫెల్ స్కామ్ గురించి , రిలయన్స్ కు ప్రత్యక్షంగా కొన్ని వందల కోట్లు దోచిపెట్టే భీమా యోజనా పధకాల గురించీ ఎవరికీ పెద్దగా పట్టింపులు లేవు.
** తమ సొంత డబ్బులకోసం ఏటియం ల ముందు రోజులతరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందనీ, అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్సులు లేకున్నా బ్యాంకులకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని 2014 కు ముందు ఎవరైనా చెబితే , జనాలు ఫక్కున నవ్వి ఉండేవారు.
ఇంతకు ముందు లాగా, ఇవేవి ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ లు కూడా కావు. వావ్.. కేవలం నాలుగేళ్లలో ఎంత మార్పు. మీడియా, పార్టీలు, ప్రజలు, కోర్టులు, వ్యవస్థలు అన్ని ఈ కొత్త వాతావరణానికి ఎంత గొప్పగా అలవాటు పడ్డాయి. . అడాప్తబిలిటీకి ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ ఎక్కడైనా ఉంటుందా. ఇన్ని మార్పుల అనంతరం కూడా, మనోళ్ల చర్చలు ఇంకా – ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా. వీళ్లిద్దరు పొత్తుపెట్టుకుంటారా, వాళ్లిద్దరూ పెట్టుకుంటారా.. వంటి అంశాల గురించే.
నాజీల గురించి చదివినప్పుడల్లా , నాకో అనుమానం వస్తుండేది – ఇన్ని దారుణాలు జరుగుతుంటే, జర్మన్ ప్రజలు ఎందుకు,ఎలా సైలెంట్గా ఉన్నారా అని. ఇప్పుడు ఆ అనుమానం అస్సలు లేదు.
కాకపొతే , నైతిక విలువలు, మంచి-చెడు, నీతి-న్యాయం లాంటి పదాల్ని వాడుతూ , ఇంకా కొందరు రాజకీయాల్ని, సమాజాన్ని తెగ విశ్లేషిస్తున్నారు. అలాంటోళ్లను చూసినప్పుడే – పోండి, పోయి వ్యవసాయం చేస్కోపోండి , అని చెప్పాలనిపిస్తుంది.
– మహమ్మద్ హనీఫ్
www.shukravaram.in