ఉపవాసాలు
——————–
’’ పవిత్ర ఖురాను అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైనవారు లేదా ప్రయాణంలో ఉన్నవారు, ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తిచెయ్యాలి.‘‘ (అల్ బఖర్ 185)
’’ మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు.‘‘(అల్ హుజురాత్ 13)
రమజాను మాసంలో ముస్లిములు తప్పనిసరిగా ఉపవాసాలు పాటించడానికి కారణమిది.
మనిషి ఎలా జీవితం గడపాలన్న దారి చూపించే దివ్యఖుర్ఆన్ మానవాళికి లభించినందుకు దేవునికి కృతజ్ఞతగా, దేవుని పట్ల భయభక్తులతో ఉపవాసాలు ఉంటారు. అందుకే ఎవరు చూడని ఏకాంతంలో ఉన్నప్పటికీ పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిగ్రహాన్ని పాటిస్తారు. దేవుడు చూస్తున్నాడన్న స్పృహ దీనికి కారణం.
దేవుడు చూస్తున్నాడు అన్న ఈ భయమే ప్రతి పనిలో ఉంటే, అందరిలో ఉంటే ఇక అవినీతి, నేరాలు, దుర్మార్గాలనేవి లేని అద్భుతమైన సుందర సమాజం మనముందుంటుంది.
ఉపవాసాలు పాటించడానికి ముఖ్యమైన కారణాలు ఇవి. భారతదేశంలో అయితే దాదాపు పధ్నాలుగు గంటల పాటు, ఇంగ్లాండు వంటి దేశాల్లో అయితే దాదాపు పద్ధెనిమిది గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్ధం చేసుకుని ఆదుకుంటాడు.
అన్నపానీయాలకు దూరంగా ఉండడమే కాదు, తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ నెలలో చాలా సాధారణంగా కనబడే దృశ్యం. మస్జిదుల్లో ఇతర ప్రదేశాల్లో ఉపవాస విరమణ అంటే ఇఫ్తార్ జరుగుతున్నప్పుడు చాలా మంది తమతో పాటు ఆహారపదార్థాలు తీసుకుని వస్తారు. చాలా మంది ఏమీ చేతుల్లో లేకుండానే వచ్చేస్తారు. తమ పక్కన ఉన్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరు పట్టించుకోరు. ఆహారం తన వద్ద ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి ముందు పెడతాడు. అవతలి వ్యక్తి కూడా నిస్సంకోచంగా తీసుకుని తింటాడు. తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటాడు. ఇలా పంచుకుని తినే అందమైన వాతావరణం మనకు రమజానులో చాలా సాధారణంగా కనబడుతుంది. ఇదే పద్ధతి మొత్తం సంవత్సరమంతా ఉంటే, ఆకలితో బాధపడే వారెవ్వరు సమాజంలో ఉండరు. అంతేకాదు, రమజాను మాసంలో అన్నదానాలు, ఇఫ్తార్ విందులు జరుగుతూనే ఉంటాయి. అందులో పేదలు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ పాల్గొనడం కూడా చూడవచ్చు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది.
పేదరిక నిర్మూలనకు ఏం చేయాలి? ఉత్పత్తి పెంచాలి, సంపదను పెంచాలన్నది కేపిటలిస్టు సూత్రం. ఉత్పత్తి పెంచడం, సంపదను పెంచడం వల్ల పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందా? పెరిగిన ఉత్పత్తి వల్ల లభించే సంపద కేవలం ఒక్క శాతం సంపన్నుల బొక్కసాల్లోకి చేరుకుంటే, మిగిలిన 99 శాతం నిరుపేదలుగా మిగిలిపోతున్నారు. పేదరిక నిర్మూలనకు ఇస్లామ్ ప్రతిపాదించే సూత్రం పంపిణీ. తన వద్ద ఉన్న సంపదలో పేదసాదలకు కూడా హక్కు ఉందని గుర్తించి వారి హక్కును వారికి ఇవ్వడం, ఒక బాధ్యతగా ఇవ్వడం. ఇదే పేదరిక నిర్మూలనకు తోడ్పడే ముఖ్యమైన పద్ధతి. ఉత్పత్తి పెంచడంతో పాటు సంపద పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు లేకపోతే పేదరికాన్ని పారదోలలేము. కేపిటలిస్టు విధానం మనిషి తన సంపదను దాచుకునేలా చేస్తుంది. అత్యాశను పెంచుతుంది. మానవసంబంధాలను తెంచుతుంది. కాని పంపిణీని ప్రోత్సహించే ఇస్లామీయ విధానం మనుషుల మధ్య ప్రేమను పెంచుతుంది.
ఆహారాన్ని పంచుకు తినే అద్భుతమైన అందమైన దృశ్యాలు రమజాన్ మాసంలో కనువిందు చేస్తాయి. మనిషి తన కడుపు నిండా తినరాదని కనీసం మూడింట ఒక వంతు కడుపు ఖాళీగా ఉండాలని ప్రవక్త బోధించిన మాటలు గాని, రమజానులో ఉపవాసాలు కాని కేవలం ఆరోగ్య నియమాలు కాదు, కేవలం సమానత్వానికి నిదర్శనాలు మాత్రమే కాదు, సానుభూతిని పెంచే సాధనాలు మాత్రమే కాదు. దేవుడు చూస్తున్నాడన్న బాధ్యతాభావంతో చేసే పనులివి. దేవుడు చూస్తున్నాడన్న బాధ్యతాభావం సంవత్సరమంతా, అందరిలో అన్ని పనుల్లో ఉంటే ఆ సమాజం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇస్లామ్ కోరే సమాజం అలాంటిది.
Writer can be reached at – [email protected]