“ఎంత సాధించావన్నది కాదు, ఎంత కోల్పోయావన్నదే ముఖ్యం”

మహమ్మద్ అలీ – ఈ పేరు వినగానే -“ప్రపంచం చూసిన అతి గొప్ప బాక్సర్” – అనే విషయం మీకు గుర్తొస్తే, మీకు అతని గురించి పూర్తిగా తెలీదని అర్థం. అతని గొప్పతనాన్ని – రింగ్ లో సాధించిన పతకాల ద్వారా కొలవలేం.

కొన్ని సంవత్సరాల పాటు అత్యంత కఠినమైన ప్రాక్టీస్ తర్వాత, 1964లో ప్రపంచ బాక్సింగ్ టైటిల్ సాధించాడు. 1965లో, వియత్నాం యుద్దం మొదలైంది. అందరు అమెరికన్ యువకుల్లాగా, ఇతన్ని కూడా సైన్యంలో చేరి, వియత్నాం యుద్దంలో పాల్గొనాలని ఆదేశించారు.”ఎవరివో ప్రయోజనాలకోసం, మనకేమాత్రం అపాయం చేయని, ఓ పేద దేశం మీద తాను బాంబులు వేయనని” తెగేసి చెప్పాడు. యుద్దంలో జాయిన్ అవ్వకుంటే- బాక్సింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు.
చేసుకొమ్మన్నాడు.
కేసు బుక్ చేస్తామన్నారు.
చేసుకొమ్మన్నాడు.
వాల్లు అన్నంతపనీ చేశారు. ఇతను ఏ మాత్రం లొంగలేదు.

నమ్మిన విలువల కోసం, ఎంతగానో ప్రాణం పెట్టి నేర్చుకున్న బాక్సింగ్ ని కూడా కాదనుకున్నాడు. తన కెరీర్ అత్యంత విలువైన పీక్ స్టేజ్ లో, నాలుగు సంవత్సరాల పాటు రింగ్ లోకి అడుగుపెట్టే అవకాశాన్ని త్యాగం చేసి, కోర్టుల చుట్టూ తిరిగాడు. కోర్టు తన బాక్సింగ్ లైసెన్స్ ని పుణరుద్ధరించిన తర్వాత, రింగ్ లో అడుగుపెట్టి, మళ్ళీ ప్రపంచ చాంపియన్షిప్ గెలిచాడు – అతని బాక్సింగ్ కంటే, అతని త్యాగానికే ప్రపంచం ఫిదా అయింది.

******************
కొందరికి కొన్ని అంశాలు కలిసొస్తాయి, వాటి వల్ల కొన్ని విజయాలు కూడా వరిస్తాయి.

వ్యక్తిగత శ్రమ + పుట్టుకతో వచ్చిన లక్షణాలు + ఐడెంటిటీ ద్వారా వచ్చే అనుకూలతలు = ఈ మూడింటి కలయికే చాలా వరకూ జయాపజయాల్ని నిర్దేశిస్తుంది. దీని ఆధారంగా చూస్తే, ఇప్పుడు దేశంలో సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్న చాలా మంది యొక్క యాక్చ్యువల్ సెల్ఫ్ వర్త్ ఎంతో ఎస్టిమేట్ చేయొచ్చు.

కానీ, నమ్మిన విలువల కోసం – సమాజం నిర్దేశించే సక్సెస్ ని కూడా పణంగా పెట్టేవారే – నిజమైన సెలబ్రిటీలు.

సినిమాలు రావేమోననే భయంతో, నోరుమూసుకుని కూర్చోలేను – అని చెప్పిన సిద్ధార్థ్,
మా సినిమా(దబాంగ్-3) వసూల్ల కంటే, దేశాన్ని రక్షించుకోవడానికి, ప్రజలు చేస్తున్న నిరసన పోరాటమే చాలా ముఖ్యమని చెప్పిన – సోనాక్షి సిన్‌హా,
కెరీర్ ని నాశనం చేసుకునే రిస్క్ ఉన్నా కూడా లెక్క చేయకుండా – విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న – ప్రకాశ్ రాజ్, స్వరా భాస్కర్, ఫర్హాన్ అక్తర్, అనురాగ్ కాశ్యాప్, .. వీరిదీ అసలైన విజయమంటే.
ఇంకా – క్రైస్తవ మహిళ-ఆసియా బీవీ తరుపున పోరాడి ప్రాణాలు కోల్పోయిన పాకిస్తాన్ గవర్నర్ -సల్మాన్ తసీర్, బ్లాస్ఫెమీ ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ జునైద్ హఫీజ్ కేసును వాదిస్తే ప్రాణాలకే ముప్పు అని తెలిసి కూడా – అతని తరుపున వాదించి చంపబడిన లాయర్ – రాషిద్ రెహ్మాన్,
ముంబై లో , టెర్రరిస్ట్ లనే ముద్రవేయబడి జైల్లలో మగ్గుతున్న – అనేక పేద ముస్లింల తరుపున , ఎలాంటి ఫీజు కూడా ఆశించకుండా వాదించి – 23 మందిని నిర్దోషులుగా విడిపించి, చివరికి తన ఆఫీసులోనే చంపబడిన – షాహిద్ ఆజ్మీ.. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.
వీరి విజయాన్ని కొలిచే,కొలమానాలూ – వీరి త్యాగాన్ని వెలకట్టే బెంచ్ మార్క్ లూ – సమాజం దగ్గర లేవు. అలాగని వీరి త్యాగం వృధా కాదు. అందరి అకౌంట్స్ సెటిల్ చేసే రోజు తప్పక వస్తుంది. అప్పటి వరకూ – హ్యాపీ టు బీ ఎ లూజర్..

Leave a Reply

Your email address will not be published.