ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివిజం

నేను చూసినంతమేరకు, సమాజంలో ఎక్కువమందికి శ్రవన్ పై కంటే, మారుతీ రావ్ పైనే ఎక్కువ సానుభూతి ఉంది. ఇందులో నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఏమీ లేదు. బహుశా దీనికి రివర్స్ లో జరిగి ఉంటేనే ఆశ్చర్యపోయి ఉండేవాడిని.
ఎందుకిలా.. అని కూడా నేనేమీ పెద్దగా బుర్రగీక్కోలేదు. ఎందుకంటే సమాధానం నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి.

సుమారు పదిహేనేళ్ళ క్రితం, నేను బీ.టెక్ లో ఉన్నప్పుడు, 2002 గుజరాత్ మారణహోమం లో అక్కడి ముస్లింలపై జరిగిన దారుణాలు ‘దిహిందూ’ పేపర్లో చదివి, రాత్రిల్లు నాకు నిద్ర పట్టేది కాదు. కానీ, నా చుట్టూ ఉన్నోల్లు మాత్రం ‘అన్ని న్యూసుల్లాగే ఇదీ ఓ న్యూసు, దీనిలో పెద్ద వింతేముంది’ అన్నట్లు లైట్ తీసుకోవడాన్ని చూసి -‘ఎందుకిలా ‘ అని అప్పట్లో బుర్ర బద్దలుకొట్టుకుని ఆలోచిస్తుండేవాడిని. పైగా, అవన్ని ఎవరి కనుసన్నల్లో జరిగాయో అతన్నే వికాస పురుషునిగా, దేశానికి కాబోయే ప్రధానిగా మీడియా ప్రొజెక్ట్ చేసే విధానం చూసి, చుట్టూ ఉన్న సమాజంపై ఫ్రస్టేషన్ , ఏహ్య భావం,ద్వేషం కూడా కలిగేది.
ఇలాంటిదే అక్రోశం, ఏహ్యభావం, మారుతీరావ్ మద్దతుదారులపై కొందరికి, ముఖ్యంగా దలితులకి కలుగుతుండటం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కూడా నార్మలే.

బీటెక్ లో నాకు కలిగిన ఫ్రస్టేషన్ ఎలా తగ్గిందో చూద్దాం.

ముస్లింలపై అన్నన్ని దారుణాలు ప్రభుత్వం,పోలీసుల కనుసన్నల్లోనే జరిగితే, ఈ మెజారిటీ జనాలు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? అలాగని వీరందరూ రేపులు,మర్డర్లను సమర్థించే చెడ్డమనుషులు కాదు. వీరికీ ఇల్లు,తల్లులు,చెల్లెల్లు,పిల్లలూ ఉన్నారు, వీరూ వారందరినీ ప్రేమిస్తుంటారు, మరలాంటప్పుడు ఇలాంటి తల్లులు,చెల్లెల్లు,పిల్లలకే గుజరాత్లో జరిగిన దారుణమైన అన్యాయం గురించి ఎందుకు ఏమాత్రం చలనం లేదు..?

దానికి సమాధానం – ఐడెంటిటీ!!
ప్రతిమనిషికీ, అతను పుట్టిపెరిగిన పరిస్థితులు, సమాజంపై అతని అవగాహన మేరకు , ‘నేను ఫలానా’ అనే ఐడెంటిటీ సబ్ కాన్షస్ మైండ్లో స్థిరపడిపోయిం ఉంటుంది. ఆ ఐడెంటిటీని తనదిగా ఓన్ చేసుకోవడం వల్ల, దానిపై అతనికి ఓ రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈ ఐడెంటిటీ అనేది కేవలం ఏ ఒక్క అంశం ఆధారంగానో ఉండాలనేం లేదు. భాష, ప్రాంతం, కులం, మతం,దేశం ఇలా వీటన్నిటీ గురించీ ఉండొచ్చు. ఉదాహరణకు కులానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఓ వ్యక్తి, ఇండియా ఫైనల్లో క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు, ఇండీయా టీంలో తమ కులపోల్లెవరూ లేనప్పటికీ. ఎందుకంటే, ఆ సమయానికి అతని కులం ఐడేంటిటీ కంటే, దేశభక్తి ఐడెంటిటీ ఎక్కువగా యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి. అట్లే, ఈ ఐడెంటిటీ ఆధారంగానే, కొందరికి కొన్ని విషయాలు ఎక్కువ తీవ్రమైనవిగానూ, కొన్ని విషయాలు తక్కువ తీవ్రమైనవిగానూ కనిపిస్తాయి. నల్లమల అడవుల్లో గిరిజన అమ్మాయి దారుణంగా రేప్ చేయబడిందనే వార్త ఎన్నిసార్లు విన్నా కలగని ఉలికి పాటు, ఒక్క నిర్భయ విషయంలోనే ఎందుకు కలిగిందంటే, ఆ సిటీ బస్సు, సినిమా కెల్లి రావడం వంటి విషయాలతో తమను తాము ఐడెంటీఫై చేసుకోవడమే.

మొత్తానికి, గుజరాత్ ముస్లింలపై జరిగిన ఊచకోతలూ, గ్యాంగ్ రేపులూ మిగతా మెజారిటీ ప్రజలను ఎందుకు కదిలించలేదంటే – అవి ‘ముస్లింలపై’ జరిగాయి కాబట్టి. పైగా ఆ ముస్లిం ఐడెంటిటీపై వీరిలో చాలామందికి ఓ రకమైన అపోహ,అణుమానం, భయం, తృనీకారం లాంటి నెగెటివ్ భావాలు చాలా ఉన్నాయి కాబట్టి.
ఈ టైపు అండర్స్టాండింగ్ కలిగిన తర్వాత, నా చుట్టూ ఉన్న సమాజం, జనాలపై నాకున్న అక్రోశం చాలా వరకూ తగ్గిపొఇంది . ‘వారు మాత్రం ఏం చేస్తారు,పాపం వారి మైండ్ అలా ప్రోగ్రాం చేయబడింది’ అనుకున్నాను.
కానీ, అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక సంఘటనల వల్ల నాకు అర్థమైనదేమంటే – ఈ రకమైన ముస్లింలపై నెగెటివ్ ఫీలింగ్ అనేది కేవలం భారత దేశానికే చెందిన అంశం కాదు. ఇది విశ్వవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ అని అర్థమైంది.

ఈ ఆలోచనలూ, కన్ ఫ్యూజన్లు, బాధలూ, భయాలూ, రియలైజేషన్లూ.. ఇలా నడుస్తున్నప్పుడే ఆర్జీవీ, ఆ వెనకాలే ఆబ్జెక్టివిజం ఎంటరయ్యాయి. గతంలో అనేక పోస్టుల్లో రాసినట్లు ఆబ్జెక్టివిజం కాన్సెప్టు, నాకు చాలా విషయాల్ని సింప్లిఫై చేసిచ్చింది.
ఈ ఐడెంటిటీ — ఆబ్జెక్టివిజం రెండు అంశాల్ని కలిపి కొడితే తేలిందేమంటే – ఐడెంటిటీల్లో రెండు రకాలుంటాయి
1. మార్చతగిన ఐడెంటిటీ.
2. మార్చలేని ఐడెంటిటీ.

ఉదాహరణకు మార్చలేని ఐడెంటిటి అంటే – శరీర ఎత్తు, శరీర రంగు, కోల ముక్కు, ఇలాంటివి. నాకు గనక కోల ముక్కు ఉండి, సమాజంలో కోల ముక్కు ఉన్నోల్లు అందంగా ఉండరనో, వారికి శార్ట్ టెంపర్ ఉంటుందనో, వారు మంచోల్లు కాదనో సమాజంలో ఎక్కువమంది అభిప్రాయమైతే- దానిని నేను చేయగలిగింది ఏమీ ఉండదు. నా కోలముక్కును బ్లేడుతో చెక్కుకుని పొట్టి ముక్కుగా మార్చుకోవడం అయ్యేపని కాదు కదా. కాబట్టి, ఎవరేమైనా అనుకోనీ అని ఆ కోలముక్కుతోనే జీవితాంతం గడపాల్సి ఉంటుంది.
మార్చతగిన ఐడెంటిటీ అంటే – ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నా, కాబట్టి ఇప్పుడు నాకున్న అనేక ఐడెంటిటీల్లో ఒకటి -హైదరాబాదీ అనే ఐడెంటిటీ. రేపు హైదరాబాద్ వదిలి బెంగలూర్ లో సెటిల్ అయితే , అప్పుడు నా ఐడెంటిటీ మారి – బెంగలూరియన్ అవుతుంది. అంటే నాకు హైదరాబాదీ గా ఉండాలా, లేక బెంగలూరియన్ గా ఉండాలా అనేవాటిలో ఏదో ఓ ఐడెంటిటీని చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. హైదరాబాదీ గా ఉండటంలో నాకు ఎక్కువ సౌకర్యం అనుకుంటే, హైదరాబాదీగా ఉంటా, లేదంటే బెంగలూరియన్ గా మారిపోతా.
ఈ రకంగా, మార్చలేని ఐడెంటీటీల విషయంలో ఎవరేమనుకుంటే నాకేం అని ఫిక్సైపోవడం,
మార్చ గలిగే ఐడెంటిటీల విషయంలో మనకు ఏది సౌకర్యం అంకుంటే ఆ ఐడెంటిటీకి షిఫ్ట్ ఐపోవడం – ఇదీ స్థూలంగా ఆబ్జెక్టివిజం అంటే.

ఈ క్లారిటీ వచ్చింతర్వాత – నా ముందు ఉండిన తరువాతి ప్రశ్న – మహమ్మద్ హనీఫ్ – ఈ పేరు, దీని నుండీ వచ్చిన ముస్లిం ఐడెంటిటి వల్ల నాకు మేలా, కీడా? ఏదెక్కువ? పెద్దగా మేలు లేని పక్షంలో ఈ ఐడెంటిటీని ఎందుకు మోయాలి? అర్జున్ రెడ్డీ అనో, నరసిమ్హ నాయుడనో పేరు మార్చుకుంటే సింపుల్ గా ఐపోద్ది కదా? మహా అంటే సర్టిఫికేట్స్ లో పేరు మార్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫీస్ ల చుట్టూ కొన్ని రోజులు తిరగాల్సి ఉంటుంది, కానీ జీవితాంతం ఈ ఇస్లాం/ముస్లిం గుదిబండను మోసే కంటే, ఇదే బెటర్ కదా? పైగా ఇస్లాం అంటే ఏంటో నాకు ఏ మాత్రం తెలీనప్పటికీ, మా పెద్దోల్లు ముస్లింలు కాబట్టి, నాకు ముస్లిం పేరు పెట్టి, నాకు ఈ ఐడెంటిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా నాకు పుట్టబోయే పిల్లలకు ఈ ఐడెంటిటీని తగిలించి వారు కూడా జీవితాంతం దీనితో బాధలు పడేలా ఎందుకు చేయాలి? ఈ థాట్ ప్రాసెస్ ఆధారంగా – ముస్లిం ఐడెంటిటీని వదిలేయాలని అప్పట్లో నిర్ణయించుకున్నాను. కాకపోతే, నీకు ఇస్లాం గురించి ఏం తెలుసని ఈ నిర్ణయం తీసుకున్నావని మా పెద్దోల్లు, అన్నలు,బంధువులు అడుగుతారు కదా, వారి నోల్లు మూయించాలంటే – “చూడండి ఇస్లాం ఎంత వేస్ట్ దో” అని చెప్పడానికి కొన్ని పాయింట్లు కావాలి, అలాంటి పాయింట్లు సేకరించే ప్రయత్నంలో భాగంగానే ఇస్లాం గురించీ,ప్రవక్త గురించీ స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఈ మొత్తం స్టడీ గురించీ,జర్నీ గురించీ ఇప్పటికే అనేక పోస్టుల్లో రాసిఉన్నాను. మొత్తానికి నా స్టడీవల్ల – ఒకప్పుడు కేవలం పేరుకే ముస్లిం గా ఉన్న నేను, ఖురాన్ ని, ప్రవక్త ని నమ్మే,ఆచరించే ముస్లింగా మారిపోయాను. ఇలా మారిపోయింతర్వాత, ‘ ముస్లిం గా బతకడంలోని బెనిఫిట్స్ తో కంపేర్ చేస్తే, ముస్లిం ఐడెంటిటీ ద్వారా కలిగే అసౌకర్యం, నష్టం అస్సలు లెక్కలోకి తీసుకునేవి కావని తెలిసొచ్చింది. అప్పటినుండీ, ఐడెంటిటీ కి సంబంధించిన రాజకీయాలూ,చర్చలూ, సంఘటనలూ నన్ను ఏమాత్రం బాధపెట్టడం గానీ, డిస్టర్బ్ చేయడం గానీ జరగలేదు. అబ్సల్యూట్ పీస్( శాంతి ) అన్నట్లు.

ఇదంతా ఎందుకు రాయాల్సొచ్చిందంటే, పాపం తమ ఐడెంటిటీతో కంఫ్యూజన్ లో ఉన్నోల్లు నాకు నిత్యం పదుల సంఖ్యలో తారసపడుతున్నారు. ఉదాహరణకు – “మాది దూదేకుల కులం, ముస్లింలు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని ఒకాయన వాపోతాడు.”
అరేభాయ్, దూదేకుల అనే ఐడెంటిటిని నువ్వు ఎందుకు క్యారీ చేస్తున్నావ్? దానివల్ల నీకు ప్రత్యేకంగా ఏమైనా బెనిఫిట్ ఉందా? అది ముస్లిం ఐడెంటిటీ కంటే ఏ రకంగా ప్రత్యేకమైంది? ఒక వేల ముస్లిం ఐడెంటిటీ కంటే దూదేకుల ఐడెంటిటీ లోనే నీకు ఎక్కువ సౌకర్యం ఉందనుకుంటే దానిని హాయిగా,సంతోషంగా తలెత్తి చాటి చెప్పు, నేను దూదేకులను, ఇలా ఉండటం నాకు చాలా కంఫర్ట్ గా ఉంది. – మీరు(ముస్లింలు) రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా నాకు పోయేదేం లేదు. రెస్పెక్ట్ ఇవ్వడమో,ఇవ్వకపోవడమా అనేది మీ సమస్య తప్ప , నా సమస్య కాదు – అని తెగేసి చెప్పు- అంతే తప్ప, దీనిలో మొహమాటపడాల్సింది,బాధపడాల్సింది ఏముంది?
“నేను మీలా కాదు, నేను ప్రత్యేకం. ప్రత్యేకంగానే ఉంటా. కానీ మీరు మాత్రం నన్ను మీలో కలుపుకోవాల” – ఇది ఏం వాదన భాయ్?
(నోట్ : నా సర్టిఫికేట్ లో షేక్ అని ఉంటుంది. అది కేవలం పేరులోని ఓ తోక తప్ప, మిగతా ముస్లిం లకంటే ఏ రకంగానూ ప్రత్యేకమైందని నాకు ఏనాడూ అనిపించలేదు, ఎవరూ చెప్పలేదు. పెళ్ళిచూపులప్పుడు – నాకు ఇస్లాం ని నమ్మి, ఆచరించే అమ్మాయి కావాలని చెప్పానే తప్ప, ఫలానా షేకులో, సయాద్లో కావలని చెప్పలేదు, ఎందుకంటే ఇవన్నీ ఏ రకంగానూ ప్రత్యేకమైనవనే ఫీలింగ్ ఎవరికీ లేదు కాబట్టి. చివరికి నేను చేసుకున్న అమ్మాయికి ఇంటిపేరులో సయ్యద్ ఉంది. అది కేవలం ఇంటి పేరే తప్ప, అంతకు మించి అదస్సలు పాయింటే అవ్వలేదు. మా ఇంట్లో, బంధువర్గంలో చాలా మంది ఇలాగే చేసుకున్నారు. సయ్యదా, పఠానా అనేది అస్సలు ఎప్పుడూ నోటీస్ చేయాల్సినంత అంశంగా కూడా ఎవరూ అనుకోలేదు)

గతంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా వ్యాసంలో రాసినట్లు ( టైటిల్ : నేను – మా జేజబ్బ – పాకిస్తాన్) మా జేజబ్బ ఐడెంటిటీ -దలిత్. ఇప్పుడు నా ఐడెంటిటి – ముస్లిం. ప్రతి ఐడెంటిటీనీ గుడ్డిగా మోయకుండా, అది మార్చుకోతగిన ఐడెంటిటీనా, మార్చుకోలేని ఐడెంటిటీనా, అని విశ్లేషించుకోవడం, ఒక వేల మార్చుకోలేని ఐడెంటిటీ ఐతే – ఆ ఐడెంటిటీలోని బెనిఫిట్స్ ని మ్యాగ్జిమైజ్ చేసుకొని, డ్రాబ్యాక్స్ ని మినిమైజ్ చేసుకోవడం,
ఒకవేల మార్చుకో తగిన ఐడెంటిటీ ఐతే, కీడు కలిగిస్తున్న ఐడెంటిటీని విసర్జించుకుని,వదిలించుకుని ముందుకు పోవడం ఇదే ఎవరైనా చేయవలసింది. ఇవేవీ చేయకుండా, నా ఐడెంటిటీని గౌరవించండి అని ఎదుటోల్లను వేడుకోవడం, అభ్యర్థించడం, ఆ ఐడెంటిటీల్ని అలాగే తర్వాతి తరాలకు బదలాయించడం వల్ల, ఎన్ని తరాలు మారినా, ఎప్పటికీ ఎలాంటి ఉపయోగమూ ఉండదు.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

One Reply to “ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివిజం”

Leave a Reply

Your email address will not be published.