కడప దర్గా – దేవుని ప్రసాదం – వందేమాతరం!!

కడప దర్గా – దేవుని ప్రసాదం – వందేమాతరం!!
============================
-“కడప పెద్ద దర్గాలో మొక్కుకుంటే కోర్కెలు తీరుతాయని, దేశంలో ఎక్కడెక్కడినుండో ప్రముఖులు వస్తున్నారు. అలాంటిది నువ్వు కడపలోనే ఉంటూ ఒక్కసారికూడా అక్కడికి వెళ్ళలేదా, అదేంటి?”
-“అది కేవలం ఒక లడ్డూ మాత్రమే, దానిని తినటం వల్ల వచ్చే నష్టం ఏంటి?”
-“దేశభక్తిని ప్రేరేపించేలా ఒక చిన్న వందేమాతరం గేయాన్ని పాడినంత మాత్రాన మీ మతానికి వచ్చే నష్టం ఏంటి?”

పైకి చూడటానికి సంబంధం లేని విషయాలుగా అనిపిస్తున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే – అది ఇస్లామిక్ తౌహీద్.తెలుగులో చెప్పాలంటే – ఏకేశ్వరోపాసన.

ఇస్లాంలో, ఈ సృష్టిని పుట్టించిన సృష్టికర్తను పూజించే విషయానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో, ఆ సృష్టికర్తను తప్ప, ఏ ఇతర మానవున్ని గానీ, మానవ నిర్మిత అంశాన్ని గానీ పూజింపకుండా ఉండే విషయానికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఖురాన్లో ఈ అంశం స్పష్టంగా, అనేక సార్లు చెప్పబడింది. దీనికి చక్కటి ఉదాహరణ – ముస్లింలు ఈ భూమిమీద అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తి -మహమ్మద్ ప్రవక్త. కానీ, ఏ ముస్లిం కూడా మహమ్మద్ ప్రవక్తని ఆరాధించడు.( పూజించడు). వరాలివ్వమని గానీ, కోర్కెలు తీర్చమని గానీ మహమ్మద్ ప్రవక్తని వేడుకోడు. ఎందుకంటే, మనిషికి ఏ చిన్న ఉపకారం చేయాలన్నా అది కేవలం సృష్టికర్త మాత్రమే చేయగలడు తప్ప, ఈ విషయంలో ప్రవక్త కూడా చేయగలిగేది ఏమీ లేదు. సృష్టికర్త చేరవేయమన్న మెసేజ్ ని( ఖురాన్ ) మానవులకి అందించడం, దానిని ప్రాక్టికల్గా ఆచరించి చూపడం వరకే ప్రవక్త పాత్ర పరిమితం తప్ప, అంతకు మించి ఆయనకు ఏ ఇతర శక్తులూ లేవు. ప్రవక్త సమాధి ఉన్న మదీనాను కొన్ని కోట్లమంది ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా సందర్శిస్తుంటారు. అక్కడికి వెళ్ళిన ముస్లింలు, ప్రవక్త సమాధికి సలాం చేస్తారు తప్ప, అంతకు మించి ప్రత్యేకంగా చేసేదేమీ ఉండదు. అక్కడ కూడా, మక్కా వైపుకు తిరిగి రోజూ ఐదు పూటలా నమాజ్ చేస్తారు. ప్రవక్త అడుగుజాడల్లో నడిచే అవకాశం కల్పించమని అల్లాను వేడుకుంటారు.

ఈ విధంగా, ఏకేశ్వరో పాసన చేయమని సుస్పష్టంగా చెప్పిన ఇస్లాం, అంతే స్పష్టంగా కేవలం సృష్టికర్తకే పరిమితమైన దైవత్వంలో వేరెవరికీ వాటా కల్పించవద్దనీ, అలా చేసిన వారు ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమార్హులు కారనీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. అంటే, మనిషికి ఏదైనా మంచి జరగాలంటే అది సృష్టికర్త వల్లనే సాధ్యమౌతుంది తప్ప, ఏ ముల్లానో,ఇమాం నో,వారి సమాధులవల్లో కాదనీ, చెట్టూ-పుట్టనో మొక్కుకోవడమో కాదనీ, పైగా అలా చేస్తే దానిని షిర్క్ (అతి పెద్ద పాపం)గా పరిగణింపబడుతుందనీ ఇస్లామిక్ తౌహీద్ చెప్తుంది. అందుకే, ముస్లింలు సత్కార్యాల పుణ్యాన్ని పొందడానికి ఎంతగా ప్రయత్నిస్తారో, షిర్క్ ద్వారా పాపం పొందకుండా ఉండాలని కూడా అంతే ప్రయత్నిస్తారు.

ఇప్పుడు పైన చెప్పిన 3 అంశాల గురించి చూద్దాం.
1. కడప దర్గా:
ఇక్కడికి వెళ్ళి మొక్కుకుంటే కోర్కెలు తీరుతాయని చాలా మంది భావిస్తున్నారు. వీరిలో ముస్లిమేతరులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇస్లామిక్ తౌహీద్ ప్రకారం ఇది షిర్క్ తప్ప మరేం కాదు.
ముస్లింలలో కొందరు దీనిని వసీలా గా పరిగనిస్తున్నారు. వసీలా అంటే వారధి/చేయూత. వీరి వాదన ఏమిటంటే – తాము ఆ దర్గా దగ్గరికి వెళ్ళినప్పటికీ, తాము వేడుకునేది అల్లాను మాత్రమేననీ, కాకపోతే, ఆ దర్గాలో సమాధి కాబడిన వ్యక్తి, అనేక మందికి ఇస్లాం బోధించి, అనేకమందిని ఇస్లాంలో చేర్పించిన సూఫీ సాధువులు కాబట్టి, వీరికి అల్లా దగ్గర కాస్త పలుకుబడి ఉంటుందనీ, ఆ పలుకుబడిని ఉపయోగించి, అల్లా వద్ద తమ కోర్కెలు నెరవేరేలా సిఫార్సు చేయమని అడగడానికే తాము దర్గా దగ్గరకు వెల్తున్నామనీ, ఇది షిర్క్ కిందికి రాదనీ వీరు వాదిస్తారు. మహమ్మద్ ప్రవక్త, అతని ప్రధాన అనుచరులకే లేని ఈ సిఫారసు పవర్స్ ఇతరులకి ఎలా వస్తాయని, చాలా మంది ముస్లింలు వీరిని విమర్శిస్తుంటారు.
మరికొందరు ముస్లింలైతే, తాము దర్గాకి వెళ్ళేది, అక్కడ సమాధి కాబడిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని అల్లాకు మొక్కుకోవడానికే తప్ప, తమ గురించి మొక్కుకోవడానికి కాదని వాదిస్తుంటారు.
నిజానిజాలు ఆ దేవుడికే ఎరుక.

2. దేవుని ప్రసాదం:
ఆఫీస్లో ఎవరో ఒకరు అప్పుడప్పుడూ ఏదో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం, అక్కడి నుండి ప్రసాదం తెచ్చి అందరికీ పంచి పెట్టడం తరచుగా జరిగేదే. కొందరు ముస్లింలు,
‘అది కేవలం స్వీటే కదా’ అనుకుని తినేస్తుంటే, కొందరు మాత్రం అది షిర్క్ అనుకుని, మేము తినమని కరాఖండీగా చెప్పేస్తారు. చాలా మంది మాత్రం తింటే ఏమవుతుందో, తినకుంటే సాటి హిందూ మిత్రులు,కొలీగ్ లు ఏమైనా అనుకుంటారేమో అనే సంధిగ్ధంలో ఉంటారు. దీనిని తినకూడదని చెప్పేవారి అభిప్రాయం ప్రకారం – ప్రసాదాన్ని దాదాపు అందరూ కళ్ళకద్దుకుని తింటారు, దీనిని బట్టి , అది కేవలం ఒక స్వీటు కాదనీ, దానిని తింటే ఏదో మంచి జరుగుతుందని భావించే తింటారనీ, కావున ఇది షిర్క్ అవుతుందనేది వీరి వాదన. మరి కొందరి లాజిక్ ప్రకారం ,దేశంలోని రైతులు చాలా మంది ముస్లిమేతరులే ఉన్నారు. వారు పంట వేసే టప్పుడు, అది కోసేటప్పుడు వారి వారి దైవాలనే మొక్కుకుంటుండవచ్చు. అవన్నీ మనం పట్టించుకోనప్పుడు ఇది కూడా అంత పట్టీంచుకోవాల్సిన అంశం కాదంటారు. కొందరు, ఇది కేవలం రుచి కోసం మాత్రమే తింటున్నాం తప్ప, ఏదో మంచి జరుగుతుందని తినట్లేదు కాబట్టి , ఇది షిర్క్ కిందికి రాదంటారు. మరింకొందరు మాత్రం – రైతు ఏమనుకుని పండించాడో మనకు తెలీదు కాబట్టి, అది షిర్క్ కాదనీ, కానీ ప్రసాదం ఇచ్చిన వ్యక్తి అది ప్రసాదం అని క్లియర్గానే చెప్పి ఇస్తున్నాడు కాబట్టి అది తినడం షిర్క్ అవ్తుందనీ వాదిస్తారు.

3. వందేమాతరం
వందేమాతరం పాడాల్సిందే అని పట్టుబట్టే వారిలో ఎంతమందికి దాని అర్థం తెలుసనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. చాలా మందికి తెలీదు, కానీ అది దేశభక్తికి చిహ్నంగా చిన్నప్పట్నుండీ చెప్తూ ఉండటంతో అది బ్రైన్లో అలా ఫిక్స్ ఐపోయిఉంటుంది. చాలా మంది ముస్లిములు కూడా ఇలా అనుకునే పాడుకుంటూ పోతుండేవారు, ఇంకా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ, కొందరు ముస్లింలు దీని బెంగాలీ మూలాల్లోకి వెళ్ళి – వందేమాతరం అనేది, దేశాన్ని కాళీ మాతగా భావించుకుని, ఆమెను వేడుకుంటున్నట్లుగా అర్థం వచ్చే గేయమనీ, అది పాడటం ఇస్లామిక్ తౌహీద్ ప్రకారం షిర్క్ కిందికి వస్తుందనీ వివరించారు. అప్పట్నుంచీ ముస్లింలు దీనిపై తమ అభ్యంతరం వెలిబుచ్చటం మొదలైంది. కానీ కొందరు మాత్రం, మనం ఎన్ని సినిమా పాటలు పాటడ్లేదు, అవన్నీ నిజాలు కాదు కద, అట్లే అర్థం తెలీకుండా ఏదో ఓ బెంగాలీ పాటకు 3 నిమిషాల పాటు పెదాలు కలిపినంత మాత్రాన మన తౌహీద్ కి ఏం నష్టం రాదని, పాడేస్తున్నారు.

ఈ మూడు అంశాల్లో చెప్పినట్లు.. ముస్లింలందరూ ఈ అంశాల్లో ఒకేరకమైన ఆలోచనలతో లేరు. కానీ, కొన్ని యాంగిల్స్ లో చూస్తే ఇవి ఇస్లాం యొక్క ఏకేశ్వరోపాసనతో కాన్ ఫ్లిక్ట్ అవ్తున్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత దేశ పౌరులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించడం అనేది రాజ్యంగం కల్పించిన ప్రాధమిక హక్కు. వ్యక్తుల మతాచారానికి విరుద్ధంగా ప్రవర్తించమని ఏ ఒక్కరిపై అయినా ఒత్తిడితెచ్చే అధికారం ఎవరికీ లేదు. చివరికి ప్రభుత్వానికి కూడా. కావున ఏ వ్యక్తి అయినా పైన పేర్కొన్న అంశాలని స్వచ్చందంగా ఆచరిస్తున్నంతవరకూ ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. కానీ, ఏవరైనా తాము వాటికి దూరంగా ఉంటామని నిర్ణయించుకుంటే, దానిని గౌరవించి వారిమానాన వారిని వదిలేయడం, దేశ రాజ్యాంగంపై గౌరవం ఉన్నవారు చేయాల్సిన పని.

ఇప్పుడొక లాజికల్ క్వశ్చన్: ( కామెంట్లలో , ఎవరో ఒకరు దీనిగురించి అడుగుతారని ఎక్స్ పెక్ట్ చేసి నేనే రాస్తున్నా)
ఈ షిర్క్ ని అతిపెద్ద నేరంగా పరిగణించే అంశం కొందరికి ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. భక్తులు తమ కోరికలు నెరవేరతాయేమోననే ఆశతో, ఏదో ఓ రాయి తగలక పోతుందా అనుకుని, ఓ బాబా దగ్గరికో,దర్గా దగ్గరికో వెల్తే, లేక ఓ లడ్డూ తింటే , సృష్టికర్త అంతగా ఫీల్ కావలసిన అవసరం ఏముంది. ఆయనకు అంతగా నచ్చకుంటే, వారి కోర్కెలు తీర్చకుండా ఆపేయవచ్చు. అంతే తప్ప, ‘నన్ను కాదని వీరి దగ్గరికి వెల్తావా’ అని ఆయన తెగ ఫీల్ కావలసినంత అవసరం ఏముంది? అంటే సృష్టి కర్త అంతటి ఇగోఇస్టా? అంత ఇన్ ఫీరియార్టీ కాంప్లెక్స్ తో ఉన్నాడా? మిగతా మతాలేవీ దీనిని అంతగా హైలైట్ చేయవు కదా? ఆ దేవుల్లకి, ఆ భక్తులకి ఎవరికీ లేని ఈ చిక్కుముల్లు కేవలం ముస్లిం లకే ఎందుకు? ఈ విషయంలో ఇతర దేవుళ్ళు బ్రాడ్ మైండెడ్ గానూ, ముస్లిం ల దేవుడు ఫక్తు న్యారో మైండెడ్ గానూ ఉన్నట్లు కనిపిస్తుంది కదా?

లాజిక్ ప్రకారం ఆలోచిస్తే, ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్నలా కనిపిస్తుంది. లాజికల్ ప్రశ్నలకు లాజికల్ సమాధానాలే ఇవ్వగలగాలి తప్ప, మతం గురించి ప్రశ్నించ కూడదని చెప్పడం గానీ, దబాయించడం గానీ చేస్తే ఆ మతం అక్కడే ఫెయిల్ అయినట్లు. ఇక ఈ ప్రశ్నకి సమాధానం ఓ ఉదాహరణని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు.
సపోజ్ ..మీకు సుగర్ వ్యాధి వచ్చిందనుకోండి. డాక్టర్-A దగ్గరికి వెళ్ళారు. ఆయన మందులు రాసి , ‘కేవలం ఇవే వాడండి, వేరే ఏ ఇతర మందూ-మాకులు వాడకండి. అలాగ్గానీ వాడితే షుగర్ ఇంకా ఎక్కువై , మీరు పోతారు,’- అని చెప్పాడు.
ఇప్పుడు ఇంకో డాక్టర్-B దగ్గరికి వెళ్ళారు. అతనూ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. కానీ, వీటితో పాటూ వేరే ఇతర
మందులూ,సూచనలూ ఫాలో అవ్వాలా,వద్దా అనేవిషయంలో మౌనం వహించాడనుకుందాం.

ఇప్పుడు, ‘నేను చెప్పేది మాత్రమే చేయండి, మిగతా ఎవరేం చెప్పినా ఫాలో కావద్దు’ అని చెప్పినందుకు డాక్టర్-Aని న్యారో మైండెడ్ గానూ, ఇతర మందుల గురించి ఏ విషయమూ చెప్పనందుకు డాక్టర్-Bని బ్రాడ్ మైండెడ్ గానూ డిక్లేర్ చేసేద్దామా? అలా చేస్తే అది కరెక్ట్ అవుద్దా?
In Short:
1. ఇస్లాం లో, సమస్థ లోకాల్ని సృష్టించిన సృష్టికర్తని గుర్తించడానికి/పూజించడానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఆ సృష్టికర్తని తప్ప వేరే ఏ ఇతర అంశానికీ దైవత్వం ఆపాదించకుండా/పూజించకుండా ఉండటానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది.
2. చాలా మంది ముస్లింలు దర్గాలకు వెల్లరు/ప్రసాదాలని తినరు/వందేమాతరం పాడరు. ఇదంతా వారి మతాన్ని ఆచరించడంలో భాగమే. దీనిని ఇతరుల ఆచారాల పట్ల గౌరవం లేకపోవడంగానో లేక దేశభక్తి లేకపోవడంగానో భావించకూడదు.

-మహమ్మద్ హనీఫ్
shukravaram.in

Leave a Reply

Your email address will not be published.