కత్తి మహేశ్

కత్తి మహేశ్
=========

నేను పెరియార్, అంబేద్కర్, రంగనాయకమ్మల రచనలు చదివి ఉన్నాను. వారు చేసిన విమర్శలు,కామెంట్లతో పోల్చితే కత్తి మహేశ్ చేసిన విమర్శలు 1% కూడా ఉండవు.

పోనీ, పుస్తకాలు ఎవరూ చదవరు, టీవీలు అందరూ చూస్తారు కాబట్టి ఈ వివాదం అనుకున్నా – రాంగోపాల్ వర్మ ఇదే టివీ స్టూడియోల్లో చేసిన కామెంట్లతో పోల్చితే, కత్తి మహేశ్ కామెంట్లు అస్సలు లెక్కలోకే రావు.

వివాదం అంతా ఆ ఒక్క పదం గురించే అని కొందరంటున్నారు. అదే పదం ఆర్జీవీ నోటినుండో, బాబూ గోగినేని నోటినుండో వచ్చి ఉంటే, ఇప్పుడు ఆవేశపడేవారికి ఆ పదం అంత చెడ్డగా అనిపించేది కాదు.

ఆర్జీవీ మీద దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు వేశారు. అవిప్పుడు ఏ డస్ట్ బిన్లో ఉన్నాయో ఎవరికీ తెలీదు. కానీ, కత్తి కేసులో మాత్రం విచారణలూ, పనిష్మెంటూ చకా,చకా జరిగిపోయాయి.

ఇదంతా గమనిస్తే అర్థమయ్యేది ఒక్కటే .

మన వ్యవస్థ బలవంతున్ని ఒకవిధంగా, బలహీనున్ని ఇంకో విధంగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ బలం అంటే కండబలం కాదు. కులం,మతం(మైనారిటీ/మెజారిటీ) డబ్బు. ఇవన్నీ బలానికి చిహ్నాలు. కత్తికి ఇవేవీ లేవు. అందుకే ఈ శిక్ష.

ఇదే పదం – మందక్రిష్ణ మాదిగ వంటి ఓ దలిత నాయకుడు ఎవరైనా ఉపయోగించి ఉన్నా – ఇలా శిక్షించేవారు కాదనుకుంటాను. ఎందుకంటే, అప్పుడు మందక్రిష్ణ, ప్రభుత్వానికి ఓ వ్యక్తిగా కాక, కొన్ని లక్షల ఓట్లుగా కనపడి ఉండేవారు కాబట్టి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నీవెనక ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కూడా ఓ బలమే. కానీ, కత్తి మహేష్ అప్పుడప్పుడూ అంబేద్కర్ వాదం వినిపించినప్పటికీ, దలిత్ పొలిటికల్ మూవ్ మెంట్స్ లో యాక్టివ్ పార్టిసిపేట్ గానీ, దలిత సంఘాలతో కలిసిపనిచేసింది గానీ నాకుతెలిసి పెద్దగా లేదు. అతను ఓ యాంగిల్ లో చూస్తే, ఆర్జీవీ లాగే ఇండివిడ్యూలిస్ట్(వ్యక్తివాది) లాగా కనిపిస్తాడు. వ్యక్తిగతంగా తన కున్న క్రియేటివిటీతో సినిమాల్లో సక్సెస్ సాధించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదే సమయంలో, తాను చూసొచ్చిన,నడిచొచ్చిన సమాజంలో, కులం పేరుతో జరుగుతున్న వివక్ష,కుట్రలపై ఆక్రోషం, ఆవేదన కూడా ఉన్నాయి. ఈ వైరుధ్యం, చాలా మంది బలహీన వర్గాల నుండి చదువుకుని పైకొచ్చిన వారిలో కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత కలల్ని సాధించుకోవాలనే కోరిక ఓ వైపు, తనలాంటి సామాజిక నేపధ్యం ఉన్నవారితో మమేకమై, వారితో కలిసి పోరాడాలనే ఆశయం మరోవైపు – ఈ రెండింటి మధ్య చాలా మంది ఊగిసలాడుతుంటారు.

కత్తి మహేశ్ , ఓ పదేళ్ళ ముందు, తాను గొప్ప డైరెక్టర్ గా తెలుగు ప్రజలందరికీ తెలిసేంత ఫేమస్ అవ్వాలని అనుకుని ఉంటాడు తప్ప, ఈ రకంగా తాను లైం లైట్లో కొస్తానని అస్సలు ఏమాత్రం ఊహించి ఉండడు. తాను క్యాజువల్ గా వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు, పవన్ కల్యాన్ విషయంలోగానీ, ఇప్పుడు ఈ విషయంలో గానీ ఇంత తీవ్ర వివాదానికి కారణమవుతాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండడు.

టివీ స్టూడియోల టీఆర్పీ మాయాజాలం, ఓ బలహీనున్ని కొట్టి తమ బలం నిరూపించుకోవాలనే కొందరి తాపత్రయం ఈ వివాదాలన్నిటికీ మూలం.

కత్తి వీటన్నిటికీ భయపడి, కుంగిపోయేంత పిరికివాడు కాదని నా నమ్మకం. దీని చట్టప్రకారం ఎదుర్కొని, చివరిదాకా పోరాడాలని ఆశిస్తున్నాను. అతని ఆర్థిక స్థితిగతుల గురించి నాకు తెలీదు. సన్నిహితులు, పరిచయస్తులు ఎవరైనా వీటిగురించి అతనితో సంప్రదించి – అవసరమైతే మంచి లాయర్లను పెట్టుకోవడానికి క్రౌడ్ ఫండింగ్ లాంటివి కూడా చేయాలి. కత్తికి ఇప్పుడు మద్దతు పలికే వారందరూ తమవంతుగా దానికి కంట్రిబ్యూట్ చేయాలి. ఇదేదో ఛారిటీకి చేస్తున్నట్లు కాకుండా, మనకు మనం చేసుకునే హెల్ప్ గానే భావించాలి. ఎందుకంటే, ఈ రోజు కత్తి, రేపు మీరో,నేనో, ఇంకెవరో.. ఎవరైనా కావొచ్చు.
An Injustice somewhere is a threat to Justice everywhere.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.