కాంగ్రెస్ , బిజేపీలు సమానమేనా!!

కాంగ్రెస్ , బిజేపీలు సమానమేనా!!
===========================

ఒరే సాంబా!! ఓ మాంచి తటస్థ స్టేట్మెంటు చెప్తా రాస్కోరా..

“కాంగ్రెస్ – బిజేపీలు రెండూ సమానమే”

రెండూ ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలిస్తాయి. పెట్టుబడి దారులకి పెద్ద పీట వేస్తాయి.గెలిచాక రెండూ క్విడ్ ప్రో క్యూలు, అవినీతి స్కాములూ చేస్తాయి. రెండూ కుల, మత సమీకరణల ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని లెక్కలేసుకుంటాయి.

హెన్స్ ప్రూవుడ్ దట్ – “కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు బి.జే.పీ. ”

వావ్.. అదిరింది గురువా.

అవును గురువా, దేశంలో ఈ అల్లరి మూకల అలగాజనం ఉన్నారే.. పొద్దునే చెడ్డీలేసుకుని కర్రసాములూ, ఆయుధ ట్రైనింగులూ ఇచ్చుకుంటూ తిరుగుతుంటారు. ముస్లింలు, క్రైస్తవులపై అస్తమానం విషం గక్కుతుంటారు.దేశాన్ని ప్రేమించడమంటే , మైనారిటీలను ద్వేషించడమే నన్నట్లు మాట్లాడుతుంటారు. ఆ సేన, ఈ సేన అంటూ వివిధ పేర్లతో వీరి మీద నిత్యం దాడులకు దిగుతుంటారు. మరి వీరందరూ ఏ పార్టి మద్దతుదారులు? వీరు ఏ పార్టీ తరుపున ప్రచారం చేస్తుంటారు. వీరిని ఏ పార్టీ అనేక పదవులిచ్చి ఆదుకుంటుంది?

పోనీ, వీరి లాగా, వీరికి పోటీగా కాంగ్రెస్ కు ప్రైవేట్ సైన్యం ఏమీ లేదుగా?

దేశంలో 20% జనాభాకి అసలు ఈ దేశంలో ఉండే హక్కే లేదని వాదించే వారిని వెనకేసుకొచ్చే బీజేపీ, కాంగ్రెస్ ఒకటే ఎలా అవుతాయి?

కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అని సూత్రీకరించే వారు, BJP వెనకున్న మత రాజకీయాల గురించి నిజంగానే తెలియని అమాయకులైనా అయ్యుంటారు. లేదా, ..’ అబ్బే తొక్కలో 20% జనాలు అసలు కన్సిడర్ చేయాల్సినంత పెద్ద విషయమే కాదు’ – అనుకునే వాల్లైనా అయ్యుంటారు.
అఫ్కోర్స్.. షాబానో కేసు, బాబ్రీ తలుపులు తెరవడం వంటి విషయాల్లో కాంగ్రెస్ కూడా మత రాజకీయాలు చేసింది.. కాకపోతే, ఓ వర్గాన్ని దువ్వి/మచ్చిక చేసుకుని వారి ఓట్లు పొందే ప్రయత్నానికి, తాము పెంచి పోషించే ప్రైవేట్ ఆర్మీలద్వారా ఓ వర్గాన్ని, మరో వర్గానికి వ్యతిరేకంగా అసత్యాలు, అర్థ సత్యాలతో రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందే ప్రయత్నానికి మధ్య చాలా తేడా ఉంది.

సరే , ఇక అవినీతి, పరిపాలన గురించి మాట్లాడుదాం.

పెట్టుబడి -> ఎన్నికలు -> గెలుపు -> క్విడ్ ప్రో క్యూ -> సంపాదన -> తదుపరి ఎన్నికల పెట్టుబడి.

ఇదొక వలయం. దేశంలో అధికారంలోకి రావాలనుకున్న ఏ పార్టీ అయినా ఈ వలయంలోకి రావాల్సిందే. నాకు తెలిసినంత వరకూ, కమ్యూనిస్టులు, ఢిల్లీలో ఆప్ తప్ప, ఏ ఇతర పార్టీ కూడా ఈ వలయంలోకి రాకుండా అధికారంలోకి రాలేదు. ఒక్కసారి, ఈ వలయంలోకి వచ్చాక, ఇక ఏ పార్టీ కూడా ఈ వలయాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేయదు. ఎందుకంటే, అది కూర్చున్న కొమ్మను నరుక్కోవడం లాంటిది.

కాకపోతే, సోనియా గాంధీ, దేశంలో మొట్ట మొదటిసారిగా ఈ వలయాన్ని బ్రేక్ చేయడానికి నిజాయితీగా ప్రయత్నించింది. దానిలో భాగమే, రాజకీయాలకు సంబంధంలేని సచ్చీలులతో NAC- National Advisory Council ని ఏర్పరచడమే కాకుండా, వారు ప్రతిపాదించిన సమాచార హక్కు చట్టాన్ని తేవడం. రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్నోల్లెవరికైనా RTI ఎంత గొప్ప చట్టమో, అధికార పార్టీకి ఎంత ప్రమాదకర చట్టమో తెలిసే ఉంటుంది. అయినా సోనియా గాంధీ దానిని తెచ్చింది. ఆమె పార్టీ దానికి తగిన మూల్యాన్ని 2014లో సమర్పించుకుంది.

మరో చట్టం -గ్రామీణ ఉపాధి హామీ చట్టం.
“పార్టీలు డబ్బున్నోల్లు, బలవంతుల పక్షమే వహించాలి. వారి ప్రయోజనాల కోసమే పని చేయాలి. లేకుంటే వాటికి మనుగడ ఉండదు.”

దేశంలో దాదాపు అన్ని పార్టీలు ఈ నియమాన్ని ఫాలో అవుతూ వచ్చాయి. కానీ, సోనియా గాంధీ దీనిని కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. దానిలో భాగమే ఈ ఉపాధి హామీ చట్టం. గ్రామీణ పేదల స్థితుగతుల గురించి ఏ కొంచెం సానుకూల అవగాహన ఉన్నోల్లకైనా, ఈ చట్టం తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి తెలిసే ఉంటుంది.
పేదలకు పనికొచ్చే ఇలాంటి పనులు బలిసినోల్లకు నచ్చవు.
ఈ చట్టానికి వ్యతిరేకంగా, బలిసినోల్ల నోటినుండి వెలువడిన కొన్ని మాటలు –
ఈ చట్టం రాబట్టి – ఊర్లో లేబర్ నాయాల్లందరికీ బాగా బలిసింది. ఇంతకు ముందు ‘రేయ్ రేపు పనికి రా ‘ అనగానే నోరు మూసుకుని పరిగెత్తుకొచ్చే లేబర్ గాల్లందరూ ‘ , ఇప్పుడు ‘ కూలీ ఎంతిస్తావ్ ‘ అని రొమ్ము విరిచి అడుగుతున్నారు.
–ఈ మాట బలిసినోల్ల నోటి నుండీ రాగా, నా చవులతో నేను చాలా సార్లు విన్నా. విన్నప్పుడల్లా మనసులో సోనియా గాంధీకి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నానో లెక్కలేదు.
అట్లే విద్యా హక్కు, ఆహార హక్కు వంటివి కూడా ఆ కోవలోకే వస్తాయి.

మొత్తమ్మీద చెప్పాలంటే, నా దృష్టిలో – కాంగ్రెస్,YSRCP,TDP,TRS,JDU,DMK,AIDMK,TMC etc.. వంటి పార్టిలన్నీ ఒకెత్తు.వీటి మీద ఆప్, కమ్యూనిస్టులు కొంచెం బెటర్.
కానీ BJP మాత్రం అస్సలు కన్సిడర్ చేయవలసిన ఆప్షనే కాదు. ఈ దేశంలో 20% మైనారిటీలు, దలితుల జీవితానికి విలువుందని భావించే వారెవరూ BJP ని ఒక ఆప్షన్ గా కన్సిడర్ చేయరు.

-మహమ్మద్ హనీఫ్.
12/17/2017.

Leave a Reply

Your email address will not be published.