కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం!!

కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం!!
=====================

ఎన్నికల్లో గెలవడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, తీరా గెలిచాక ఆ హామీల్ని గాలికొదిలేయడం- ఇది అన్ని పార్టీలు చేసేదే. ఈ విషయం జనాలకు కూడా బాగా తెలుసు కాబట్టి, ఈ హామీలు నెరవేర్చకపోవడం అనే అంశాన్ని అంత తీవ్రమైన విషయంగా పరిగనించకుండా, ఓ సారి ఈ పార్టీకి, ఇంకో సారి మరో పార్టీకి ఓట్లేసి గెలిపిస్తుంటారు. ఇది గత 60 ఏళ్ళుగా అందరికీ తెలిసిన రాజకీయమే.

కానీ, అంతకు ముందెన్నడూ జరగని, కేవలం గత నాలుగేళ్ళలోనే జరిగిన,జరుగుతున్న ఓ పరిణామమేటి?

అది మాబ్ లించింగ్..

అంటే – కొందరు గుమి కూడి, నిరాయుధులైన కొందరు వ్యక్తుల్ని, ఏదో ఓ వంకతో బహిరంగంగా కొట్టి చంపడం. ఆ కొట్టడంలో పైశాచికానందాన్ని పొంది దానిని సెల్ఫోనుల్లో వీడియోలు తీసుకోవడం. ఇది గత నాలుగేల్లలో ఒక సారి కాదు, రెండు సార్లు కాదు.. సుమారు యాభై సార్లు జరిగింది. మీడియాకెక్కకుండా, ఉత్తర భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో ఇంకెన్ని సార్లు జరిగిఉంటుంటో ఎవరైనా ఊహించుకోవచ్చు.

కొంతమంది దళితులు తప్ప, ఈ మాబ్ లించింగ్ బాధితులు దాదాపు అందరూ ముస్లిములే.

ముస్లింలపై జరుగుతున్న ఈ దాడులు – బీజేపీని నడిపించే విషపూరిత భావజాలం- 2014 ఎన్నికల్లో అది సాధించిన మెజారిటీ – వీటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా పెద్ద కష్టం కాదు.

ప్రతిపక్షంలోని పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని జనాలకు వివరించి, తామైతే ఇలా చేసేవారం కాదని వారిని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. 2019 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ వైఫల్యాల్ని వివరించే ఓ వీడియోని కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసింది. సుమారు 3 నిమిషాల పైబడి ఉన్న ఈవీడియోలో – 2014 ఎన్నికల్లో మోడీ ఎన్నికల ర్యాలీలలో పదే,పదే చెప్పికూడా, అమలు చేయకుండా వదిలేసిన వివిధ హామీలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఇలాంటి అనేక అంశాల గురించి చెప్పిన ఆ వీడియో ముస్లింలపై దాడుల గురించి మాత్రం కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. అమాయకులపై దాడుల గురించి ఓ చిన్న వాక్యం ఉంది గానీ, అప్పుడు కూడా ఉనా(గుజరాత్) లో దళిత యువకుల్ని జీపు కట్టేసి కొట్టిన దానిని చూపించారు తప్ప, నడిరోడ్డుపై రక్తమోడుతూ చనిపోయిన ఏ ఒక్క ముస్లిమ్ని కూడా చూపించలేదు.

ఎందుకు..?

ఎందుకో చూసే ముందు, కొన్ని సంవత్సరాల వెనక్కి వెల్దాం.

2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ, మోడీని ‘మౌత్ కా సౌదాగర్’ (మృత్యు బేహాలుడు, మృత్యు వ్యాపారి) అని పిలిచారు. 2002 గుజరాత్ అల్లర్లలో మోడీ ఉద్ద్యేశ్యపూర్వకంగా అమాయక ముస్లింలపై హత్యలు,అకృత్యాలను జరగనిచ్చారని చెప్తూ ఆ పదాన్ని ఉపయోగించారు.

“నేను చేయాల్సిందే చేశాను. ఆ మాత్రం దానికే సోనియా గాంధీ నన్ను మౌత్ కా సౌదాగర్ అంటుంది, మీరు సోనియాగాంధీకి బుద్ధి వచ్చేలా చెప్పండి – నేను మౌత్ కా సౌదాగర్ నా ” అని మోడీ ఆ తర్వాత ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ నాటకీయంగా అడుగుతూ వచ్చాడు. ఆ ఎన్నికల్లో మోడీ గెలిచాడు. సోనియా మోడీని మౌత్ కా సౌదాగర్ అని పిలవడాన్ని, మోడీ తనకు అనుకూలంగా వాడుకున్నారని, తమ సాటి గుజరాతీని అవమానించడం మెజారిటీ గుజరాతీలకు నచ్చలేదనీ, అందుకే ఆ వ్యాఖ్య తమకు తీవ్ర నష్టాన్ని కలగ జేసిందనీ – కాంగ్రెస్ లోని వృద్ధ జంబూక నాయకులు కొందరు విశ్లేషించారు.

2012లో గుజరాత్ అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. గతంలో చేసిన వ్యాఖ్యలకు బుద్దితెచ్చుకున్న సోనియా, ఈ సారి 2002 అల్లర్ల ప్రస్తావన ఏ మాత్రం చేయకుండా అత్యంత జాగ్రత్త వహించింది. వీటితో పాటే అక్కడ జరిగిన అసంఖ్యాక ముస్లిం యువకుల ఫేక్ ఎంకౌంటర్లు కూడా ఏ మాత్రం రాజకీయ అంశం కాకుండా పోయాయి.

నిజానికి, అప్పుడప్పుడే గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వివిధ క్రిమినల్ కేసులు, వివిధ దశల్ని దాటి గుజరాత్ హైకోర్టు, సుప్రీం కోర్టుల తలుపు తడుతున్నాయి. కాంగ్రెస్ అప్పుడు ఏం చేసి ఉండవచ్చు?

సీబీఐ, సిట్ లను మరింత అప్రమత్తం చేసి గుజరాత్ అల్లర్ల కేసులు పకడ్బంధీగా,త్వరితగతిన విచారణకు వచ్చేలా చేసి, అమాయకుల చావుల వెనక మోడీ పాత్రని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి, “కేవలం ఓ మతం వారైనంత మాత్రాన, అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటారా? ఇది ఏ రకమైన హిందూమతోద్ధరణ, ఏ రకమైన నాయకత్వం? ఇలాంటి వ్యక్తి మౌత్ కా సౌదాగర్ కాక మరేమిటి? అని ఈ వాదనను మరింత బలంగా ముందుకు తీసుకుని పోవలసింది. కానీ, అవేవీ చేయకుండా, సోనియా గాంధీ కాంగ్రెస్ వృద్ధ జంబూకాల సలహాల ప్రకారం, షార్ట్ కట్ లో ఎన్నికలు గెలవాలనుకుంది.

కేంద్రం లో అప్పటికి సుధీర్ఘంగా అధికారంలో ఉండి కూడా, అల్లర్ల విచారణా కేసులపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా, ఆ కేసుల్ని వాటి మానానికి వాటిని వదిలేసింది. దీనిని సరిగ్గా వినియోగించుకున్న మోడీ, లేని సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ని ఉన్నట్లు చెప్పుకుని, ఫేక్ గుజరాత్ మాడల్ ని మీడియా, కార్పోరేట్ పెద్దల సహకారంతో జనంలోకి తీసుకెళ్ళాడు.

ఈ రకంగా మోడీపై నుండీ 2002 అల్లర్ల రక్తపు మరకలు చెరిగిపోవడానికి, కాంగ్రెస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేయాల్సిందంతా చేసింది.

తమకు ఎదురుతిరిగాడనే అక్కసుతో, జగన్ ని జైలుకు పంపడంపై పెట్టిన శ్రధ్ధలో కనీసం ఓ పదోవంతు మోడీపై పెట్టి ఉన్నా, ఈ పాటికి మోడీ భవితవ్యం వేరేలా ఉండేది.

మైనారిటీల బాధలు, వారికి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడితే మెజారిటీలకు నచ్చదేమోననే మెజారిటీ అప్పీస్మెంట్ భావజాలం, కాంగ్రెస్ 2002 అల్లర్లను అటకెక్కించేలా చేసింది. ఇప్పుడు అదే భయంతో కాంగ్రెస్ గత నాలుగేల్లుగా ముస్లింలపై జరిగిన అనేక దాడుల గురించి మాట్లాడటానికి కూడా సంకోచిస్తుంది. ఈ రకంగా, కాంగ్రెస్ కి సెక్యులరిజం అనేది ఎన్నికల్లో ముస్లింల ఓట్లు కురిపించే సాధనమే తప్ప, అంతకు మించి మరేమీ కాదు. మెజారిటీ హిందువుల ఓట్లు పోతాయేమోననే అణుమానమొస్తే, మైనారిటీల ప్రాణాలు, సెక్యులరిజం సిద్ధాంతాలూ .. దానికి ఏ మాత్రం పనికిరానివౌతాయి. ఇది కాంగ్రెస్ ఒక్క పార్టికే కాదు. తె.దే.పా, తెరాసా, వైసీపీ, డి.యం.కే, జే.డీ.యూ, టీ.యం.సీ, యస్.పీ. అన్ని పార్టీలదీ ఇదే వైఖరి.

దేశంలోని 20 శాతం మైనారిటీలు, 80% హిందువుల మధ్య స్పష్టమైన విభజన తెచ్చి

1. ఎన్నికల్లో గెలవడం.
2. సెక్యులరిజం/మానవత్వం వంటి వాటికి కట్టుబడటం.

ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోమంటే దేశంలోని, దాదాపు అన్ని సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు మరో మాటలేకుండా ఒకటవ ఆప్షన్ నే ఎంచుకుంటాయి. కమ్యూనిస్టులు మాత్రమే దీనికి ఏకైక మినహాయింపు కావచ్చు.

అందుకే, ఈ రకమైన విభన తేవడం కోసం అహర్నిశలూ, దాని వివిధ ముసుగు సంఘాల ద్వారా బీజేపీ ప్రయత్నిస్తుంటుంది. ఆ సంఘాలను నిలువరించడానికి కాంగ్రెస్ కు ఓ స్పష్టమైన వ్యూహం గానీ, అసలు నిలువరించాలనే బలమైన కోరిక గానీ లేవు. ఇప్పుడు పార్లమెంటులో బీజేపీకి ఉన్నంత స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ కి వచ్చినా కూడా, ఆ సంఘాల్ని నిషేధించే పని గానీ, సెక్యులరిజాన్ని బలపరిచే పని గానీ, కాంగ్రెస్ చేయదు. ఎందుకంటే అది తనకు ప్రియారిటి అంశం కాదు కాబట్టి. అప్పుడప్పుడూ షాబానో కేసు లాంటి వ్యవహారాల్లో తల దూర్చి ఇటువైపుకూడా బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది. కానీ,అదే మెజారిటీ బీజేపీకి వస్తే, సెక్యులరిజం బెంచ్ మార్క్ ని ప్రతిసారీ బీజేపీ తగ్గిస్తూ వస్తుంటుంది. 2002 గుజరాత్లో దొరికిన అధికారంతో అది ముస్లింలపై దాడుల్ని, ముస్లిం యువకుల ఫేక్ ఎన్ కౌంటర్లనూ నార్మలైజ్ చేసింది. 2014లో దొరికిన అధికారంతో దేశ వ్యాప్తంగా మాబ్ లించింగ్ ని నార్మలైజ్ చేసింది. ఇప్పటిదాకా ఇదే జరిగింది. ముందు ముందు ఇదే జరగబోతుంది.

మరి దీనికి పరిష్కారం..? ఆలోచించండి.

– మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

One Reply to “కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం!!”

Leave a Reply

Your email address will not be published.