కొంచెం బాధ – కొంచెం ఆనందం!!

కొంచెం బాధ – కొంచెం ఆనందం!!
========================
మీకెప్పుడైనా ఒకే విషయం గురించి బాధ – ఆనందం, రెండూ కలిగాయా?
భారత దేశంలో ముస్లిం రాజుల పాలన గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఇవి రెండూ కలుగుతుంటాయి.
బాధ ఎందుకంటే –
“O Mankind! We have created you from a male and female, and made you into nations and tribes, that you may know one another. Verily, the most honorable of you in the sight of Allah is he who has most taqwa among of you” – Quran:49 : 13
(ఓ మానవులారా! మేము మీ అందర్నీ ఒకే జంట నుండీ పుట్టించాము. ఒకరినొకరు గుర్తించుకోవడం కోసమే మిమ్మల్ని వివిధ దేశాలు,తెగలుగా చేశాము. మీలో ఉత్తమ ఆలోచనలూ,నడవడిక కలవారే గొప్పవారు.(అంతే తప్ప, పుట్టుకతో కాదు). – ఖురాన్ 49:13
“O People! Your God is one; your father is one; no preference of an Arab neither over non-Arab nor of a non-Arab over an Arab or red over black or black over red except for the most righteous. Verily the most honored of you is the most righteous.” –
“ప్రజలారా! మీ అందరి దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఒక అరబ్ వ్యక్తికి అరబేతరునిపై గానీ, అరబేతరునికి అరబ్ వ్యక్తిపై గానీ, తెల్ల వారికి, నల్ల వారిపై గానీ, నల్లవారికి తెల్లవారిపై గానీ ఎలాంటి ఆధిక్యతా లేదు. కశ్చితంగా, మీలో మంచి గుణగణాలు ఉన్నవారే గొప్పవారు.” – మహమ్మద్ ప్రవక్త చివరి హజ్ ప్రసంగం.

ఈ రెండు అంశాల ద్వారా ఇస్లాం ‘మానవులందరూ సమానమే’ అనే అంశాన్ని సైధ్ధాంతికంగా నిర్ధారించింది. ఇక ప్రాక్టికల్గా కూడా, రోజుకు ఐదు సార్లు నీ పక్క నున్న వ్యక్తి ఎవరైనా సరే, అతనితో సరిసమానంగా భుజం-భుజం కలిపి నిలబడి నమాజు చేయమంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆచరణలో ఉంది. చివరికి మక్కాలో కూడా, అక్కడ రోడ్లను ఊడ్చే బంగ్లాదేస్ నుండి వచ్చిన ఓ పారిశుధ్య కార్మికుడైనా, అమెరికా నుండి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీరైనా, దుబాయ్ రాజకుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అయినా, అజా పిలుపు వినబడగానే అందరూ ఒకే వరసలో పక్క,పక్కనే నిలబడి నమాజ్ చేస్తారు. ఇది నిన్నో, మొన్నో మొదలైన విధానం కాదు. గత 1400 వందల సంవత్సరాల నుండి ఇస్లాం ఆచరణలో చేసి చూపెడుతున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం.

మరి ఈ విషయం గురించి బాధెందుకు?
భారత ఉపఖండంలో ముస్లిం రాజుల పాలన కాస్త అటు-ఇటుగా ఆరు-ఏడు శతాబ్ధాల పాటు నడిచింది. ఇన్ని శతాబ్ధాల ముస్లిం పాలన తర్వాత కూడా ఈ దేశంలో అంటరానితనం చెక్కుచెదరకుండా అలాగే ఉండింది. కేవలం పుట్టుక ఆధారంగా కొన్ని కోట్లమందిని ఊరి బయటికి నెట్టేసి, వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా వారి శ్రమను దోచుకుంటుంటే, ఈ ముస్లిం రాజులు ఏం చేస్తున్నారు? మనుషులందరూ సమానమే అని తమ ఖురాన్, ప్రవక్త బోధనలూ ఇంత స్పష్టంగా చెప్పి ఉన్నా, ఈ అంటరానితనాన్ని వీరు ఎందుకు కొనసాగనిచ్చారు?
ఇక మరో ముఖ్య విషయం – మహిళలు. ఇస్లాం ‘స్త్రీ-పురుషులు సరిసమానమే’ అనే యూరప్ తరహా పైత్యపు వాదనలు చేయదు కానీ, ఇద్దరూ సారూప్యాలనీ, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదనీ స్పష్టంగా బోధిస్తుంది. విద్య, ఆస్తిహక్కు,విడాకులు, వితంతు పునర్వివాహం ఇవన్నీ ముస్లిం మహిళలకు 1400 సంవత్సరాలనుండీ అమలులో ఉన్నాయి. అలాంటప్పుడు – సతీసహగమనం అనే దారుణమైన ఆచారాన్ని ఈ ముస్లిం రాజులు ఎలా కొనసాగనిచ్చారు? బ్రిటీష్ వారు వచ్చి 1829లో సతీ నిషేధ చట్టం అమలులోకి తెచ్చే వరకూ వీరు ఏం చేస్తున్నారు? ఆ బ్రిటీష్ వారే 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశారు. ఈ పని ముస్లిం రాజులు ఎందుకు చేయలేక పోయారు.
ఈ ప్రశ్నలన్నిటినీ బాబర్, అక్బర్,షాజహాన్, ఔరంగజేబ్.. లను నిలదీసి అడగాలనిపిస్తుంది. మీ రాజ్యంలో, ఖురాన్ బోధనలకు విరుద్ధంగా, జనాభాలో ఇంతమంది స్త్రీలు, దలిత బహుజనులు దారుణమైన వివక్షకు గురవుతుంటే, మీరు మాత్రం తాజ్ మహల్లు, ఎర్రకోటలు కట్టుకుంటూ ఎలా కులుకుతూ ఉన్నారా అడ్డగాడిదల్లారా అని కసి తీరా తిట్టాలని ఉంది.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా వివక్షకు గురవుతున్న దలిత సోదరుల్ని చూసినప్పుడల్లా, అప్పట్లో ఆ ముస్లిం రాజులు, కనీసం ఓ రెండు తరాలు ఇస్లాం బోధనల ప్రకారం పాలించి ఉంటే, ఇప్పుడు వీరు ఇన్ని బాధలు,అవమానాలు ఎదుర్కొనేవారు కాదు కదా అనిపిస్తుంటుంది.

ఒక్కోసారి ఇదే అంశం ఆనందం కలిగిస్తుంటుంది.
ఆనందం ఎందుకంటే –
గత నాలుగేల్లుగా దేశంలో ఎలాంటి పాలన నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఓ పర్టికులర్ తిండి తిన్నారనే నెపంతో జనాల్ని ఎలా వీధుల్లోకి లాగి చంపుతున్నారో చూస్తున్నాం. అధికార దర్పం ఎంతటి వికృతమైన పనులు చేయిస్తుందో చూస్తున్నాం. ఇదంతా ప్రజాస్వామ్యం, ఇండిపెండెంట్ జ్యుడిసియరీ వంటి వన్నీ చూస్తుండగానే. అలాంటిది, రాజరిక పాలనలో, రాజు మాట తప్ప వేరే ఏ ఇతర నియమాలు లేనికాలంలో కూడా, – ‘ఇతరుల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు ‘ అనే నియమాన్ని తమకు తాముగా విధించుకుని, దానిని నిష్టగా పాటించినందుకు(కొన్ని చదురుమదురు ఘటనలు మినహా), ఆ ముస్లిం రాజుల పాలన గురించి ఒక్కోసారి ఆనందం కూడా కలుగుతుంది.

నోట్ : చరిత్రను వివిధ రకాలుగా విశ్లేషించవచ్చు. ఏదో ఓ పర్టికలర్ అంశాన్ని పట్టుకుని మంచి-చెడులుగా, బ్లాక్ అండ్ వైట్ గా విభజించి చూడటం -సింగిల్ డైమెన్షల్ అనాలసిస్. అదంత మంచి పద్దతి కాదు. కానీ, బీజేపీ దాని అనుబంధ తోక సంఘాలూ,సేనలకు ఇది బాగా అలవాటైన విద్య. రాజుల పేర్లను బట్టి వారిని ముస్లిం రాజులు, హిందూ రాజులుగా విడగొట్టడం, ముస్లిం రాజులందరూ ఏవో దారుణాలు చేశారని అభూతకల్పనన్ల్ని, అసత్యాల్ని ప్రచారం చేసి తమ రాజకీయాలకు వాడుకోవడం – ఇది వీల్లు ఎప్పటినుండో అనుసరిస్తున్న వ్యూహం. దురదృష్టవశాత్తూ ఈ వ్యూహం చాలా సార్లు పనిచేసి, వీరి ప్రాభవం క్రమంగా పెరుగుతూ పోతుంది. వీరి సింగిల్ డైమెన్షనల్ హిస్టరీ అనాలసిస్ నే ముస్లింలకు అనుకూలంగా ఎలా విశ్లేషించొచ్చో చిన్న శాంపిల్ ఇది.

– మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

One Reply to “కొంచెం బాధ – కొంచెం ఆనందం!!”

Leave a Reply

Your email address will not be published.