గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!

గల్లీ ముస్లిం లీడర్లకు ఓ వినమ్రతాపూర్వక విన్నపం!!
============================

ఓటు అడగడానికి మీదగ్గరకొచ్చే ప్రతి లీడర్కీ తలపై టోపీ , భుజానికి ఎర్రటి చమ్కీల గుడ్డ పేలిక(అది ఎందుకు కడ్తారో నాకైతే తెలీదు) కట్టి, దానితో భీబత్సమైన మతసేవ+ దేశసేవ చేసినట్లు మీరు ఫీలైపోతున్నారు. ఆ వచ్చిన లీడర్ కూడా, కాసేపు అవి రెండూ ఒంటిపై ఉంచుకుని, ముస్లింల కోసం పెద్ద త్యాగం చేసినట్లు ఫీలైపోతున్నారు.

కొంచెం ఆలోచించండ్రా అయ్యా.. వాళ్ళు అవి పెట్టుకోవడం వల్ల ముస్లింలకు వచ్చే ఉపయోగం ఏంటి, పెట్టుకోకుంటే ముస్లింలకు వచ్చే నష్టం ఏంటి? మీ గల్లీ కొచ్చే లీడర్లతో, ఇలాంటి సిల్లీ ఫీట్లు చేయించకుండా, ” మాకు రిజర్వేషన్ లు ఎప్పుడిస్తావ్, మా పోరగాల్లకు సీట్లు, ఉద్యోగాలు ఎన్ని ఇప్పిస్తావ్” అని నిలదీసి అడగండి. అది చేయకుండా, మీరెప్పుడో అమావాస్యకూ,పున్నేనికి తొడూక్కునే టోపీలు వాల్ల నెత్తిన పెట్టి, అది చూసి తరించిపోవడం, బానిసత్వపు ఆలోచనా విధానం.

ఆ లీడర్లతో ఇలా చెప్పండి – ” అన్నా.. జూ కెళ్ళిన పిల్లోడు అక్కడి చింపాంజీల్ని ఇమిటేట్ చేసినట్లు, ముస్లిం గల్లీలకెళ్ళినప్పుడల్లా, నువ్వు ముస్లింలను ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్లు నువ్వుండు. నుదుటన విభూది రాసుకుంటావో, మెడలో సిలువేసుకుంటావో, నీ ఇష్టం. నువ్వు నీలానే, నీకు నచ్చినట్లే ఉండు. దాంతో మాకు సంబంధం లేదు. కాకపోతే, మాకు పనికొచ్చేపని ఏం చేస్తావో చెప్పు” – అని అడగండి.

అన్నట్లు, ఇతర లీడర్లకు టోపీ పెట్టి మురిసిపోతున్నారు, బాగుంది. సపోజ్, ఫర్ సపోజ్.. ఓ ముస్లిం లీడర్ ఎవరైనా ఓట్లడగటానికి హిందువులు, క్రిష్టియన్ల దగ్గరకెల్లి, వారిలానే నుదుటున బొట్టూ, శిలువా ధరిస్తే, వారి భజనల్లో, ప్రార్థనల్లో పాల్గొంటే, అప్పుడు దానిని కూడా రొటీన్ రాజకీయం లో భాగంగా భావించి లైట్ తీసుకోవాలి. కానీ, దానిని మాత్రం ముస్లింలు పెద్ద ఇష్యూ చేస్తారు. దానిని షిర్క్,గిర్క్ అని రకరకాల పేర్లతో, పాపం ఆ ముస్లిం లీడర్ కి ముస్లింల ఓట్లు కూడా పడనీకుండా చేస్తారు. ఏ.. మీకో న్యాయమూ, ఇతరులకో న్యాయమా? మత విశ్వాసాలూ, సెంటిమెంట్లూ మీకు మాత్రమే ఉంటాయా?

ఆ టోపీ కింద ఉండేదాన్ని కొంచెం వాడండి.

మహమ్మద్ హనీఫ్

-శుక్రవారం.డాట్కాం.

Leave a Reply

Your email address will not be published.