గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్


ఇది అందరూ వినే ఉంటారు.. .. గాంధీ స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఎగ్జాం రాస్తున్నప్పుడు.. డీఈవో ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు – స్కూల్ టీచర్ గాంధీని పక్కోడి పేపర్లో కాపీ కొట్టమని చెప్తే – గాంధీ కాపీ కొట్టకుండా, నాకు రాదని చెబితే – డీఈవో మెచ్చుకున్నాడనీ.. అంచేత, పిల్లలెవరూ పక్కోల్ల పేపర్లలో కాపీ కొట్టకూడదనీ… అలా మొదటిసారి గాంధీ గురించి విన్నట్లు గుర్తు.

ఆ తర్వాత , మా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రతీ ఆగస్టు 15, జనవరి 26 స్కూల్ ఫంక్షన్లలో, ఓ పక్క ఫక్షన్ తర్వాత పంచబోయే చాక్లెట్లను తలచుకుంటూనే, మరో పక్క ముసలి టీచర్లందరూ తన్మయత్వంతో గాంధీ,నెహ్రూ వంటీవారి స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్తుంటే – ఆసక్తిగా వినడం – ప్రతీ సంవత్సరం జరిగిన రొటీన్ తంతు. ఆ రకంగా – గాంధీ,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,,భగత్ సింగ్, సరోజినీనాయుడు,మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,టంగుటూరి ప్రకాశం పంతులు,చంద్రశేకర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు.. వీల్లల్లో ఎవరేం చేశారో ఎగ్జాక్ట్ గా తెలీకున్నా.. వీరందరూ మన తరుపున బ్రిటీషోల్లతో పోరాడి స్వాతంత్ర్యం సాధించారనీ, వీల్లందర్లోకి గాంధీ హీరోచితంగా పోరాడారు కాబట్టి ఆయన జాతిపిత అయ్యారనీ – నా పాఠశాల చదువు నాకు నేర్పించింది.

ఈ లిస్ట్ లో ఎక్కడా నాకు అంబేద్కర్ పేరు విన్నట్టు గుర్తులేదు. అట్లే మహమ్మదాలీ జిన్నా పేరు కూడా ఎక్కడా తగల్లేదు.

అన్నట్టు… అంబేద్కర్ పేరు మొదటి సారి విన్నది ఎప్పుడు..?

భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు..? అనే సోషల్ సబ్జెక్ట్ పాఠంలో వినుంటా.

తరువాత?

ఎంసెట్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు-
“మనం ఓసీ. మనకు ఫ్రీ సీటు రావాలంటే కనీసం 8 వేల లోపల ర్యాంకు రావాల. అదే ఆ మనోబు, బాలయ్య, కరుణాకరు లు క్వాలిఫై ఐతే చాలు, ఎంతర్యాంకొచ్చినా ఫ్రీ సీటు వస్తుంది.”
-అవునా, అదెలా వస్తుంది?
“అవును. వాల్లకి రిజర్వేషన్ ఉందంట. రాజ్యాంగంలో రాశారంట”
-అలా ఎవరు రాశారు?
“అంబేద్కర్ అంట. ఆయన రాశారు కాబట్టి, వాల్లోల్లందరికీ అలా ఫ్రీ గా అన్నీ వచ్చేటట్టు రాసుకున్నారంట.”
-ఇదీ మరీ అన్యాయం కాదా?
“అవున్రా.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి అన్యాయం లేదంట. అందుకే మన దేశం ఇలా వెనకబడి ఉందంట.”

– ఇలా క్లాస్లో ఓసీ(కొందరు బీసీలు కూడా ఉండేవారు) లందరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అంబేద్కర్ పేరు బాగా తెలిసింది.

అప్పట్లో నా క్లోజ్ దోస్తుల్లో ఒకడుండేవాడు. పొద్దున్నే లేచి , వాళ్ళ మామయ్యతో పాటు ఎక్కడికో వెళ్ళేవాడంట. అక్కడ కర్రసాము నేర్పించేవారంట, ఇంకా కబడ్డీ, హిందీ కూడా నేర్పించేవారంట. అక్కడ చెప్పే కొన్ని సంగతుల్ని నాకు చెప్పేవాడు – గాంధీ అంత మచోడేమీ కాదని, మొదటి సారి అతను చెప్పగా విన్నాను. గాంధీ లేకుంటే, మనకు స్వాతంత్రం ఇంకా చాలా ముందే వచ్చి ఉండేదనీ, మన దేశం ఏ దేశం మీదికి దాడి చేయలేదనీ.. అలా చేయని గొప్పదేశం ప్రపంచంలో మనదొక్కటేననీ.. ఇలాంటి వింత,వింత విషయాలు ఇంకా చాలా చెప్పేవాడు.

మొత్తానికి.. ఆ రకంగా ఇంటర్మీడియట్ ఐపోయేటప్పటికి, నేను స్కూలు పుస్తకాల్లో చదివిన విషయాలు, టీచర్లు చెప్పిన సంగతులు, ఇతరులు చాటుగా చెప్పుకునే కబుర్లు అన్నీ కలిసి, గాంధీని తిట్టే వ్యక్తులు కొందరున్నారని తెలిసినప్పటికీ, ఆయన ఓ మంచి వ్యక్తిగా, దేశానికి గొప్ప సేవ చేసిన నాయకునిగా, అంబేద్కర్ ని-కేవలం తన వర్గం వారికి రిజర్వేషన్లు ఇచ్చి, నాలాంటి పేద ఓసీ విద్యార్థులకు ద్రోహం చేసిన వ్యక్తిగా, నా మనసులో ఓ ఇంప్రెషన్ ని క్రియేట్ చేశాయి.

ఆ తర్వాత ఎంటర్ ది బీ.టెక్. మంచికో,చెడుకో గానీ, లైబ్రరీ కెల్లి చేతికందిన ప్రతి పుస్తకాన్నీ, పేపర్నీ చదవడం అనే అలవాటు అప్పుడే మొదలైంది. అంబేద్కర్, పెరియార్, కంచె ఐలయ్యల పుస్తకాలు, వ్యాసాలు.. ఇంగ్లీష్ నేర్చుకోవడంకోసం TheHindu, FrontLine వంటివి క్రమం తప్పకుండా చదవడం.. వీటి వల్ల చాలా విషయాలు తెలిశాయి. 2002లో జరిగిన గుజరాత్ నరమేధం, కోర్టుల క్లీన్ చిట్లు, వాటిపట్ల సమాజంలో వివిధ వర్గాల స్పందనలు, ఇన్ని దారుణాలు జరిగాక కూడా మోడీ ఎన్నికల్లో గెలవడం, .. అన్నీ నా మైండ్లో ఓ రకమైన కన్‌ఫ్యూజన్ నీ, ఐడెంటిటీ క్రైసిస్ నీ కలిగించాయి. – బాహుబళి సినిమాలో హీరో ‘నేనెవర్నీ ‘ అని గొంతు చించుకుని అరచినట్లు నేను అరవలేదు గానీ, మా నాన్న, ఇంకా మా బంధువుల్లోని పెద్ద వయసు వారి పక్కన కూర్చుని, వారి చిన్ననాటి సంగతులు, అడిగి తెలుసుకున్నప్పుడు, నా మూలాల గురించి, దేశంలో జరుగుతున్న రాజకీయం గురించీ ఓ స్పష్టత వచ్చింది. ( వాటి ఆధారంగా – గతంలో, “నేను – మా జేజబ్బ – పాకిస్తాన్” అనే వ్యాసం రాశాను. అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆసక్తి ఉన్నోల్లు shukravaram.in -లో చదవొచ్చు)

నేను కొత్తగా చదివిన పుస్తకాల వల్ల, చరిత్రలో గాంధీ పాత్రను కావాలనే కొందరు పెద్దది చేశారనీ, అంబేద్కర్ పాత్రను కుట్రపూరితంగానే చిన్నదిగా కుదించారనీ అర్థమైంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే – 2012 లో , కొన్ని నెలలు గ్రూప్స్ ఎగ్జాం కోసం, అశోక్ నగర్ లో చదువుకున్న చరిత్ర పాఠాలు, చరిత్రలో జరిగిన అనేక కుట్రల్ని కళ్ళముందుంచాయి. ద్విజాతి సిద్ధాంతం ఎందుకు ఎలా మొదలైందో, వందేమాతరం, ఆవు పేరిట ఉద్యమాలు ఎవరిలో ఎలాంటి అభద్రతాభావాల్ని కలిగించాయో, ఎవరు ఎవరి పక్షం వహించారో, ఎవరి ప్రయోజనాలకోసం ఎవరు పోరాడారో కూడా అర్థమైంది.

పూణా ఒప్పందం గురించి చదివినప్పుడు గాంధీ సిద్ధాంతంలోని కపటత్వం, అంబేద్కర్ దార్శనికత తెలిశాయి. తన జాతి ప్రజల జీవితాల్ని బాగుచేసే ఓ గొప్ప అవకాశాన్ని గాంధీ కౄరంగా తననుండీ దూరం చేస్తున్నాడని గ్రహించిన అంబేద్కర్, ఆ ఒప్పందానికి ఒప్పుకోకూడదని చివరి వరకూ చేసిన ప్రయత్నం, చివరికి వేరే గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి రావడం – ఇవన్నీ అంబేద్కర్ పై కొండంత గౌరవాన్ని కలిగించాయి.
అట్లే సరిహద్దు అవతల మనోళ్ళను లక్షలమందిని చంపారంట -అని చెప్పడమే గానీ, ఆపరేషన్ పోలో లనూ, జమ్మూలో అప్పటివరకూ మెజారిటీ గా ఉన్న ముస్లింలు, రాత్రికి రాత్రి మైనారిటీలుగా మారిన విషయాల గురించీ ఎందుకు మాట్లాడుకోరో కూడా అర్థమైంది.

ఇదంతా నాకు అర్థమైందీ, నేను తెలుసుకున్నదీ – గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాతే. కానీ, అసలు ట్రాజెడీ అక్కడే ఉంది. ఎందుకంటే – నాతో పాటు గ్రాడ్యుయేషన్ చేసినోల్లలో చాలామందికి స్పోర్ట్స్ పేజీ, సినిమా పేజీ తప్ప ఎడిటోరియల్ వ్యాసాలు,లోతైన విశ్లేషనలూ చదివే ఓపికా,తీరికా లేవు. గత 15-20 సంవత్సరాలలో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రమే చదివి గ్రాడ్యుయేట్లైన లక్షలాది మంది పరిస్థితి ఇదే. కేవలం సీ,జావా లాంటి టెక్నికల్ విద్యలతోనే వీరిజీవితాలు సెటిల్ అయ్యాయి. ఐదంకెల, ఆరంకెల జీతాలూ, విదేశీ ఆన్సైట్లు అన్నీ సమకూరాయి. వీటన్నిటితో వచ్చే ‘ ఏదో సాధించేశామనుకునే కాన్‌ఫిడ్నెస్, + ఫేస్ బుక్, వాట్సప్పులో ఐటీ సెల్ సర్కులేట్ చేసే తలాతోకలేని మెసేజీలతో వీరందరూ బీజేపీ ఐడియాలజీకి క్యారియర్స్ గా మారిపోయారు. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం.

మళ్ళీ గాంధీ – అంబేద్కర్ ల విషయానికి వస్తే –
పూణా ప్యాక్ట్ విషయంలో గాంధీ పాత్ర ఎలా ఉన్నప్పటికీ, తాను నమ్మిన కొన్ని సిద్ధాంతాలపై స్థిరంగా నిలబడినందుకు గాంధీని మెచ్చుకోవాలి. దీనికి ఉదాహరణ – సహాయ నిరాకరణ ఉద్యమంలో, చొరా-చౌరీ అనే ప్రాంతంలో, కొందరు బ్రిటీష్ సైనికుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి నిప్పెట్టారు. ఇది అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా భావించిన గాంధీ, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని అర్థాంతరంగా ఆపేశారు. స్వాతంత్ర్యం కంటే – అహింసా సిద్ధాంతమే ఇంపార్టెంట్ అనుకున్నారు. అట్లే, దేశ విభజన సమయంలో, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎంతగా వారించినా వినకుండా, కోల్కతాలో మతకలహాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ తగలబడుతున్న ఇండ్ల మధ్య కూర్చున్నారు. దానితో అల్లర్లు సద్దుమణిగాయి.

మింటో-మార్లే సంస్కరణలు – ముస్లింల కన్సాలిడేషన్ కి బీజాలు వేసి, అనంతరం పాకిస్తాన్,బంగ్లాదేశ్ ల ఏర్పాటుకు దోహదం చేశాయి. పూనా ప్యాక్ట్ జరగకపోయి ఉంటే, 1947లో, దలితులు తమ దేశంలో పూర్తి ఆత్మగౌరవంతో బతికేలా, మరో దలితస్థాన్ కూడా ఎర్పాటై ఉండేదేమో. గాంధీ ఒంటి చేత్తో, ఈ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. దలిత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశంలో గాంధీని విమర్శించడంలో, తిట్టడంలో కూడా పూర్తి న్యాయం ఉంది. కానీ, గాంధీ ముస్లింలకు మద్దతిచ్చి, హిందూ మతానికి అన్యాయం చేశాడనీ, పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడయ్యాడనీ, ఆయన్ని తిట్టే వారూ, ఆయన్ని చంపడానికి పధకాలు రచించిన వారూ, ఆయనే మరో దలితస్థాన్ ఏర్పడకుండా అడ్డుకున్నాడనే క్రెడిట్ మాత్రం ఆయనకు ఇవ్వరు. ఆ రకంగా గాంధీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. దీనికి ప్రధానంగా నిందించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దేశంలో అది ప్రవేశపెట్టిన లోపభూయిష్ట విద్యావిధానాన్ని.

అంబేద్కర్ గొప్పతనాన్ని, దలితులు అనుభవించిన, అనుభవిస్తున్న బాధల్ని, ఈ తరానికి అర్థమయ్యేలా వివరించడంలో,ఇతరుల్ని ఈ అంశం గురించి సెన్సిటైజ్ చేయడంలో, ప్రస్తుత విద్యావ్యవస్థ దారుణంగా విఫలమైంది. అట్లే, దేశ విభజన కేవలం ముస్లింలు మాత్రమే కూడ బలుక్కుని చేసిన పని కాదనీ, దానికి హిందూ మహాసభ కూడా తనవంతుగా చేయాల్సిందంతా చేసిందనీ, ప్రస్తుత తరానికి ఏ మాత్రం తెలీకుండా చేసింది. ఇవి రెండూ ఓ ఫెయిల్యూర్ ఐతే – ఈ రెండు అంశాల గురించీ కొన్ని సంఘాలు యదేచ్చగా అసత్యాల్నీ, అర్థసత్యాల్నీ సమాజంలో వ్యాపింపచేస్తూ విద్వేషాల్ని రెచ్చగొడుతుంటే – ఇన్నాల్లూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ – వాటిని వారించే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. అందుకే దేశం ప్రస్తుతం ఈ దుస్థితిలో ఉంది.

Leave a Reply

Your email address will not be published.