2014 లోక్ సభ ఎన్నికలకు ఒక నెల ముందు, ‘చరిత్ర పునరావృతం కాబోతుందా?’ – శీర్షికన రాసిన ఈ కింది వ్యాసం, యధాతధంగా ఆంద్ర జ్యోతిలో వచ్చింది. ఈ నాలుగేళ్ళలో జరిగిన, ఇప్పటికీ జరుగుతున్న అనేక దారుణాలు, భారత దేశంలో నాజీ-చరిత్ర పునరావృతం అవుతున్న సూచనల్ని స్పష్టంగానే కళ్ళముందు ఉంచుతున్నాయి.
ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ఈ దిశగా మరో మెట్టు కాబోతున్నాయి. నాలుగేళ్ళు కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని వెలగబెట్టిన మోడీ, ‘నేను చేసిన మంచి పని ఇదీ’ , అని చెప్పుకోదగ్గ పని ఒక్కటంటే ఒక్కటీ లేదు. అందుకే ఆయన అలాంటి ఏ ఒక్క పని గురించీ మాట్లాడటం లేదు. కానీ, చాలా ఇతర విషయాల గురించి మాత్రం మాట్లాడుతున్నాడు. టిప్పు సుల్తాన్ జయంతి, నెహ్రూ, రాహుల్ గాంధీ, ఇవీ ఆయన ప్రస్తావించే అంశాలు. ఇవి వినడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారంట. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయంట. అదెలా మెరుగు పడుతున్నాయో, ఆ జనం ఎందుకు ఎలా వస్తున్నారో, ఆ లాజిక్కులేమిటో దేవుడికే తెలియాలి. ఇన్నాల్లూ, భారతీయ సినిమాలు చూసేటప్పుడే లాజిక్కులు పక్కనపెట్టాలనేవాల్లు, ఇకపై భారత దేశ రాజకీయాలకు కూడా ఇది వర్తించబోతుందన్నమాట.
ఈ లాజిక్కులు అర్థం కాక బుర్ర గోక్కుంటున్న సీనియర్లు, సాక్షాత్తూ బీజేపీ లోనే చాలా మంది ఉన్నారు. కానీ మోడీ- అమిత్ షాలకు ఎదురెల్లే సాహసం చేయలేక మిన్నకుండిపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో గానీ, కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తే, వీరందరూ బయటికొచ్చి వీరిద్దరిపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఇది 2019 ఎన్నికలనాటికి అనూహ్య పరిణామాలకి దారితీసే అవకాశం కూడా ఉంది. కానీ, ఇలాంటి ప్రమాదం ఒకటి తమ ముందున్న విషయం అందరికంటే ఎక్కువగా మోడీ-అమిత్ షాలకు తెలుసు. అందుకే ఈ ఎన్నికల్ని గెలవటానికి వారు దేనికైనా సిద్ధపడ్తారు. నా అంచనా ప్రకారం – కర్ణాటక ఎన్నికల్లో బీజీపీ గెలవబోతుంది. అట్లే 2019లో కూడా. ఎందుకంటే – నాజీ యిజం ఓ సారి మొదలయ్యాక, మొత్తం సర్వ నాశనం చేయకుండా వదలదు. అది చరిత్ర చెప్పిన చేదు నిజం.
చరిత్ర పునరావృతం కాబోతుందా..?
=========================
1933 లో హిట్లర్ జర్మనీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే నాటికి యూరప్ లో యూదుల మొత్తం జనాభా 90 లక్షలు. యూదులపై విద్వేషం నరనరానా జీర్ణించుకున్న హిట్లర్ , వారికి వ్యతిరేకంగా ఓ పద్ధతి ప్రకారం సాగించిన నరమేధం వల్ల వారి జనాభా పదేళ్ళలో 30 లక్షలకి పడిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఘోరంగా ఓడిపోయి, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాక కానీ ఈ జనహననం ఆగలేదు. ‘నాజీ ‘ అనే పదానికి ఎప్పటికీ చెరగని రక్తపు మరకలు అంటించడమే కాక, రెండవ ప్రపంచ యుద్ధానికీ, తద్వారా కలిగిన అనంత ప్రాణ,ఆస్తి నష్టానికి ప్రపంచం ముందు జర్మనీని దోషిగా నిలబెట్టిన హిట్లర్, నిజానికి ఒకప్పుడు జర్మనీ ప్రజలకు అత్యంత ఆరాధ్యనీయుడు. సహజంగా రాచరిక వ్యవస్థల్లోనో, దొడ్డిదారుల్లో అధికారంలోకి వచ్చిన సైనిక నియంతల్లోనో కౄరులైన పాలకులుంటారు. కానీ, హిట్లర్ పూర్తి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన నేత. హిట్లర్ లాంటి రక్త పిపాసిని నాజీలు ఎందుకు ఓట్లేసి ఎన్నుకున్నారనే అంశం మీద అనేక పరిశోధనలు కూడా జరిగాయి.
1918 లో ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.అక్కడ నిరుద్యోగం, ఆకలి చావులు సర్వ సాధారణమైపోయాయి. సూపర్ ఇన్ ఫ్లేషన్ ఫలితంగా కనీస వస్తువుల ధరలు గంట గంటకూ పెరుగుతూ పోతుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో సుస్థిర పాలన, ఆర్థికాభివృద్ధిని అందిస్తాననే నినాదంతో హిట్లర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. సహజంగానే అధ్భుతమైన వక్త కావడంతో, దేశభక్తిని రంగరించి హిట్లర్ చేసే ఉపన్యాసాలను జనం మైమరచి వినేవారు. కమ్యూనిస్టులు, యూదులు వంటి మైనారిటీ నాజీయేతరుల పట్ల తన ఏహ్యభావాన్ని అనేక మార్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నప్పటికీ, ఆకలితో అలమటిస్తున్న నాజీలకు ఆర్థికాభివృద్ధి తప్ప మిగతా ఏ విషయాలు అంత ప్రముఖమైనవిగా అనిపించేవి కాదు. దీని ఫలితంగా హిట్లర్ లోని అవలక్షణాలను పెద్దగా పట్టించుకోని నాజీలు రెండు సార్లు అఖండ మెజారిటీతో జర్మనీ చాన్సలర్ గా గెలిపించారు.హిట్లర్ ఎన్నికల్లో గెలిచాక, బందులు, ధర్నాలను నిషేధించడం, కార్మిక సంఘాలను రద్దు చేయడం, సైనిక ఆయుధ కర్మాగారాలను భారీ ఎత్తున స్థాపించడం వంటి చర్యల వల్ల పారిశ్రామికాభివృద్దిని సాధించాడు గానీ, ఆ అభివృద్ధికి జర్మనీ ప్రజలు అసాధారణ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.
ఇక ప్రస్తుత భారత రాజకీయాలకు వస్తే, భారత ప్రధాన ప్రతిపక్షం తరపున బరిలో ఉన్న ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ని హిట్లర్తో పోల్చడం చాలా మంది పాఠకులకి నచ్చకపోవచ్చు. కానీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ హయాంలో జరిగిన అల్లర్లకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులు ఎవరనే విషయం లెక్కతేలకుండా మోడీని ప్రధాని పీఠం పై కూర్చోబెట్టడమంటే చరిత్రలో నాజీలు చేసిన పొరబాటునే ఇక్కడ కూడా పునరావృతం చేసినట్లు అవుతుంది. మోడీని ప్రధాని అభ్యర్థిగా సమర్థిస్తున్న వారి నుండి రెండు రకాల వాదనలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. అవి . 1. గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఏ మాత్రం లేదని వాదించేవారు. ఇప్పటిదాకా ఏ కోర్టూ మోడీ మీద ఆరోపణలను నిర్ధారించలేదనే విషయాన్ని వీరు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత లేకపోలేదు. కాకపోతే, వీరు మరికొన్ని హేతుబద్ధ ప్రశ్నలకు, కనీసం తమకు తాము జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. 59 మంది అమాయకుల్ని బలిగొన్న గోధ్రా రైలు దహణం ముమ్మాటికీ ఓ హేయమైన చర్యే. సమర్థుడైన, బలమైన నాయకుడనే వారు ఎవరైనా దీనిపై నిష్పాక్షిక,శీఘ్రతర విచారణ జరిగే ఏర్పాట్లు చేసి, బాధ్యులను గుర్తించి వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయగలగాలి. కానీ, గోధ్రా రైలు దహణం మీద విచారణకై మోడీ ప్రభుత్వం 2002 లో నియమించిన నానావతి కమీషన్ 12 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ విచారణను పూర్తి చేయలేదు. ఈ పన్నెండేల్ళు గుజరాత్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోడీ ఈ జాప్యానికి ఏం సమాధానం చెబుతారు. గోధ్రా రైలు దహణం చేసిన వారిని శిక్షించడం సంగతి అటుంచితే, రైలు దహనం అనంతరం గుజరాత్ మొత్తం మీద 3 రోజుల పాటు యదేచ్చ్చగా జరిగిన అల్లర్లలో, గుజరాత్ అధికారిక లెక్కల ప్రకారమే 1044 మంది అమాయక పౌరులు చంపబడ్డారు. గాయపడిన, కనిపించించకుండా పోయిన, నిరాశ్రయులైన వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. గుజరాత్ లాంటి చిన్నరాష్ట్రం లోనే, ఒక దుర్ఘటన తర్వాత శాంతి భద్రతల్ని అదుపు చేయలేని వ్యక్తి, నిత్యం నక్సలిజం, తీవ్రవాదం, మరియు వివిధ వేర్పాటు వాద ఉద్యమాలను ఎదుర్కొంటున్న భారత్ లాంటి సువిశాల దేశానికి ఏ విధంగా సమర్థ నాయకత్వాన్ని అందివ్వగలడు?
ఇక మత కలహాలు, మానవహక్కులు వంటి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ఆర్థికాభివృద్ధి నినాదంతో మోడీ ని సమర్థిస్తున్న మరో వర్గం దేశంలో క్రమంగా పెరుగుతుంది. వీరికి సంబంధించినంత వరకు, రైలు దహనంలో కొంతమంది హిందువులు మరణించారు, దానికి ప్రతిగా మరికొంతమంది ముస్లింలు చంపబడ్డారు. రెండింటికీ లెక్క సరిపోయింది. దీనిలో మోడీ పాత్ర ఉందా లేదా అనేది వీరికనవసరం. అసలు ఆ కేసుల గురించి విచారణలు కూడా కేవలం కాంగ్రెస్ కుట్రలే అంటారు వీరు. అక్కడ అమాయకులపై జరిగిన అనేక ఫేక్ ఎంకౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలు అసలు చర్చించు కోవలసిన అంశాలే కాదంటారు. మోడీ గుజరాత్ లో వేశాడంటున్న విశాలమైన రోడ్లు, పెద్ద, పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవే తమకు ముఖ్యమనే విషయాన్ని ఏ మాత్రం సంకోచం, మొహమాటం లేకుండా చెబుతారు. ఇలా చెప్పేవారు, మొదటి ప్రపంచయుద్ధానంతర నాజీల వలే ఉద్యోగం లేక నైరాశ్యంలో ఉన్న నిరుద్యోగులో, కటిక దారిధ్ర్యంలో ఉన్నవారో అయితే, మానవహక్కులు, సమన్యాయం వంటి అంశాలపై వీరి నిరాసక్తతను అర్థం చేసుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యావంతులు, అధిక జీతాలు తీసుకుంటున్న ఐ.టి. ఉద్యోగులు, ఆర్థిక సరళీకరణల ఫలితాల్ని అనుభవిస్తున్న ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఇలాంటి అభిప్రాయాల్ని కలిగి ఉండటం ఒకప్పటి నాజీలకన్నా ప్రమాదకరమైన ధోరణి. అందుకే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయపరిణామాలు, మైనారిటీల్లోని ఆలోచనాపరుల్ని, సెక్యులరిస్టుల్ని భీతావహుల్ని చేస్తున్నాయి.
ఇటీవలి ఒక సర్వేలో, ప్రస్తుత తరం నాజీలు హిట్లర్ కాలం నాటి తమ చరిత్ర గురించి పూర్తి అపరాధ భావంతో కుమిలిపోతున్నారని తేలింది. హిట్లర్ పార్టీ పేరైన ‘నాజీ ‘ , స్వస్తిక్ గుర్తు లాంటివి ఇప్పుడు అక్కడ పూర్తి నిషిధ్ధం. ఆర్యన్ జాతికే ప్రపంచంపై ఆధిపత్యం వహించే హక్కువుందని జీవితాంతం విర్ర వీగిన హిట్లర్, జర్మనీని వినాశనం వైపుకు పయనింపజేసి చివరికి తన పిస్తోలుతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోబెల్స్ ప్రచారం ఆధారంగా, హిట్లర్ నిర్మించిన ఊహల సౌధంలో విహరించిన నాజీలకు, నిజం కల్ల ముందు సాక్ష్యాత్కరించేటప్పటికి బూడిద, రక్తపు మరకలు తప్ప మరేం మిగల్లేదు. ఈ 21 వ. శతాబ్ధంలో మళ్ళీ చరిత్ర పునరావృతం కాబోతుందా..?
-మహమ్మద్ హనీఫ్. యస్.టి.
www.shukravaram.in