చివరకు మిగలనిది!!

చివరకు మిగలనిది!!
==============
“మనిషి జీవితానికి అస్సలు విలువ లేదు. అది గడ్డిపోచతో సమానం”- అని ఎవరైనా మతపెద్ద చెప్తే, మనోల్లు పళ్ళికలిస్తారు, ఎగతాలి చేస్తారు. కానీ ఇదే మాట కొన్ని దశాబ్దాలక్రితం బుచ్చిబాబు అనే రచయిత, తన ‘చివరకు మిగిలేది’ అనే నవలలో చెబితే, మనోల్లు, దానిని తెలుగులో వచ్చిన సీరియస్,గొప్పనవలల్లో ఒకటిగా నిలబెట్టారు.

ఇటీవల, ఆత్మహత్యల్ని నిరసిస్తూ/వ్యతిరేకిస్తూ/ఖండిస్తూ చాలా మంది రాస్తున్నారు. ఇలా రాయడం డెఫినిట్ గా మంచి పని, అభినందించాల్సినది.

కానీ కొన్నిసార్లు లాజిక్ మిస్సవుతోంది.

ఫలానా వ్యక్తి కూడా మొదట్లో ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత బాగా చదివి ఫరస్టు ర్యాంకు సాధించాడు, గంపల కొద్దీ మార్కులు సాధించాడు, కలెక్టర్ అయ్యాడు. లేకుంటే, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు,కంపెనీలు పెట్టాడు, కళాకారుడయ్యాడు,స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాడు, సెలెబ్రిటీ అయ్యాడు, తోపయ్యాడు.. ఇలా రాస్తున్నారు. ఇదంతా చదివితే – గొప్పోల్లూ, సెలబ్రిటీలు, సక్సెస్లూ సాధించడమే జీవిత పరమార్థం అన్నట్లుగా ఉంది. ఏ.. ఏదో ఒకటి ‘గొప్పగా ‘ చేస్తేనే, చుట్టుపక్కోల్లందరితో పొగిడించుకుంటేనే జీవితానికి అర్థమున్నట్లా?

సరిగ్గా ఇలాంటి ఆశలతోనే పేరెంట్స్ పిల్లలకు కష్టసాధ్యమైన టార్గెట్లు పెట్టడం, అవి అందుకోలేక పిల్లలు డిప్రెషన్ లకు గురికావడం జరుగుతుంది. వారి డిప్రెషన్లు దూరం చేయడానికి చెప్పే మాటల్లో కూడా తిప్పి,తిప్పి మళ్ళీ అవే ఎక్స్పెక్టేషన్లు కనిపిస్తున్నాయి.

“వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?” -అనే ప్రశ్నకు వారి దగ్గర సరైన సమాధానం లేకపోవడం దీనికి కారణం. మతం, దేవుడు, భక్తి, ఆత్మ, వంటి అంశాలు చర్చించేటప్పుడు – డార్విన్, స్టీఫెన్ హాకిన్స్ వంటి వారిని కోట్ చేస్తూ – “జీవితానికి ప్రత్యేకంగా అర్థమేమీ లేదు-కుక్క,నక్క,కోడి లాగే మనమూ బతుకుతున్నాం” , అని వాదించేవారు, ఆత్మహత్యల అంశం గురించి మాత్రం – “మనిషి జీవితం చాలా అమూల్యమైనది” అని భారీ డైలాగులు వల్లెవేస్తున్నారు.

“ఏం చేసినా-చేయకున్నా, ఏం సాధించినా-సాధించకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మంచి-చెడుల్లో ఎప్పటికీ మంచినే ఎన్నుకోండి, అది కష్టం-నష్టం కలిగించేదైనా. డబ్బు-హోదా-చదువులూ-ఉన్నతోద్యోగాలూ-పొజీషన్లూ.. ఇవి వస్తే మంచిది, రాకున్నా పోయేదేం లేదు. ఎందుకంటే – ఎక్కువ ప్రివిలైజెస్ ఉన్నోళ్ళపైనే ఎక్కువ బాధ్యతలుంటాయి, అన్నిటికీ లెక్కచెప్పాల్సి ఉంటుంది, ఈరోజు కాకుంటే, రేపైనా. మంచితనానికి ప్రతిఫలం తప్పక ఉంటుంది. ఇప్పుడు కాకుంటే, రేపైనా. ఇది చుట్టూ వున్న వ్యక్తులు గుర్తించి శాలువాలు కప్పినా, కప్పకపోయినా. ” -అనే విషయం, ముందు పెద్దోల్లు నమ్మాలి, ఆచరించాలి. అదే పిల్లలకి చెప్పాలి.

మహమ్మద్ హనీఫ్ .

www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.